అడ్వాణీ బ్లాగు బాణాలు… ఎవరికి సందేశం ! ఎవరికి పాఠం !

అడ్వాణీ బ్లాగు బాణాలు…  ఎవరికి సందేశం ! ఎవరికి పాఠం !

ఎన్నికలు సమీపిస్తే కొన్ని పార్టీల నాయకుల నోళ్లు అదుపు తప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు. ఆఖరికి ఉపఎన్నికలు కావచ్చు. రాజ్యసభ ఎన్నిక కూడా కావచ్చు. ఎలాంటి ఎన్నిక అయినా ఆడిపోసుకోవడమే కొన్ని పార్టీలకీ, నాయకులకీ రివాజుగా మారింది. గెలిస్తే చాలు. విమర్శలో సిద్ధాంతపరమైన అంశాలు అటకెక్కి, వ్యక్తిగత విమర్శలు చొరబడుతున్నాయి. ఆఖరికి ఉగ్రవాదుల దాడిని కూడా బీజేపీ నాయకత్వం ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నదంటూ విమర్శలు రావడమే దారుణం.

ఒక రాష్ట్రంలో మొదటిసారి సొంతంగా పోటీ చేస్తున్న ప్రాంతీయ పార్టీ దేశ ప్రధాని ఎలా ఉండాలో, ఎవరు ఉండాలో నిర్ణయించే సాహసం చేస్తోంది. లోక్‌సభకీ, అసెంబ్లీకీ కూడా కొన్ని స్థానాలలో పోటీ చేస్తున్న ఆ పార్టీకి రెండంకెల స్థానాలు కూడా రావని సర్వేలు చెప్పేశాయి. అయినా సరే ప్రధాని ఎవరు ఉండాలో నిర్ణయిస్తామంటున్నారు ఆ పార్టీ నేత. ఇది హాస్యాస్పదం కాదా? ‘ఫిబ్రవరి 14 నాటి పుల్వామా దాడి వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గాంధీజీని హత్య చేసిన సంస్థకు చెందిన పార్టీ..’ – ఈ నెల ఏడో తేదీన శ్రీనగర్‌ స్థానం నుంచి లోక్‌భకు పోటీ పడుతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫారుఖ్‌ అబ్దుల్లా అన్న మాటలు ఇవి. ఇంత దారుణమైన ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్‌ కూడా సాహసించ లేదు. ‘కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌ఫీఎఫ్‌ వాహన శ్రేణి మీద దాడి జరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీకి తెలుసు. నిఘా వర్గాలు చెబుతాయి. అయినా ఆయన నిలువరించడానికి ప్రయత్నం చేయలేదు. పైగా ఎన్నికలు ముందర పెట్టుకుని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి.’ – ఇది పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన ప్రకటన. ఒకసారి కాదు, రెండు మూడు సందర్భా లలో ఆమె అన్నారు. దీనినే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా వల్లించారు. ఇది ఎంత నీచమైన వ్యాఖ్యో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మా జాతీయ ప్రభుత్వమే మా సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్ల చావుకు కారణం అంటూ చేస్తున్న విమర్శలు పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేవి కావని ఎవరైనా అనగలరా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారంతా పాకిస్తాన్‌కు వెళ్లడం మంచిదని కొందరు బీజేపీ నాయకులు, శివసేన నాయకులు పేర్కొన్న మాట నిజం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎవరైనా చెబుతారు. కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారన్న ఒక ప్రశ్న ఇక్కడ తప్పనిసరి.

ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత లాల్‌ కష్ణ అడ్వాణీ ఇచ్చిన ఒక సందేశం ప్రాధాన్యం సంతరించుకోవడంలో ఆశ్చర్యం లేదు. 2019 ఎన్నికలలో దాదాపు పదిమంది సీనియర్లను పోటీకి దింపరాదని బీజేపీ నిర్ణయించింది. అందులో అడ్వాణీ కూడా ఉన్నారు. ఇంకా మురళీమనోహర్‌ జోషి, సుమిత్రా మహాజన్‌, కల్రాజ్‌ మిశ్రా వంటివారు కూడా ఉన్నారు. నిజానికి ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ కూడా ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఎల్‌జెపి నాయకుడు, ఎన్‌డిఏ భాగస్వామి రామ్‌విలాస్‌ పాసవాన్‌ కూడా బరిలో లేరు.

ఇందుకు రకరకాల కారణాలు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం(ఏప్రిల్‌ 6) సందర్భంగా అడ్వాణీ తన బ్లాగ్‌లో ఈ నెల నాలుగున ఒక సందేశం ఉంచారు. దాదాపు 500 పదాలు ఉన్న ఈ సందేశానికి ఆయన పెట్టిన శీర్షిక ‘మొదట దేశం, ఆ తరువాత పార్టీ, ఆ తరువాతే సొంత విషయం’. ఆ సందేశంలో ఆయన, ‘బీజేపీలో ఉన్న మనమంతా గతం, భవిష్యత్తుల గురించి ఆత్మ విమర్శ చేసుకోవలసిన కీలక సందర్భం ఇది. 1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గ ప్రజలకు కతజ్ఞతలు. రాజకీయంగా విభేదించిన వారిని బీజేపీ ఎన్నడూ కూడా శత్రువుగా చూడకుండా ప్రత్యర్థిగా మాత్రమే భావించింది. పార్టీని స్థాపించిన నాటి నుంచి ఇదే వైఖరి అవలబించింది. ఏకీభ వించని రాజకీయ విరోధులను జాతి వ్యతిరేకులుగా చూడరాదన్నది పార్టీ జాతీయవాద భావన’ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రతి పౌరుడు తనకు ఇష్టం వచ్చిన రీతిలో ఉండే హక్కు ఉందన్న సిద్ధాంతానికే పార్టీ కట్టుబడి ఉంది.’ అని కూడా అడ్వాణీ సందేశంలో పొందుపరిచారు. ‘పార్టీ లోపల, జాతీయ స్థాయి నిర్మాణంలోను ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ బీజేపీ గర్వించదగిన అంశాలలో కొన్ని’ అని కూడా అడ్వాణీ వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఓటర్లు నిజాయితీతో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. సందేశం మీద ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. అడ్వాణీ వంటి నేత ఉన్న పార్టీలో తానూ కార్యకర్తను అయినందుకు గర్వపడుతున్నానని మోదీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

చిత్రం ఏమిటంటే అడ్వాణీ వ్యాఖ్యల లక్ష్యం ఎవరో తెలియకుండా చేసేందుకు, మసిపూసి మారేడు కాయ చేయడానికి అన్నట్టు మమతా బెనర్జీ కూడా ఈ వ్యాఖ్యలను స్వాగతించారు. ఇంకా చాలామంది నేతలు మమతా బెనర్జీ మార్గాన్ని అనుస రించారు. భారతదేశంలో బీజేపీ ఒక విభిన్నమైన పార్టీ అన్న నినాదం ఇచ్చిన వారు అడ్వాణీ. బీజేపీకి ఉన్న ఆ ప్రత్యేకత కలకాలం కొనసాగాలని ఆయన కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ముందు నుంచీ అనుసరిస్తున్న సంప్రదాయం మేరకు అవతలి వారు నోరు జారినా, బీజేపీ నేతలు ఆ పని చేయ కూడదన్న సిద్ధాంతమే కనిపిస్తుంది. అడ్వాణీ దానినే గుర్తు చేశారు. దిగజారుడు రాజకీయాలు నడిపిన వారికి బుద్ధి చెప్పడానికి ఎన్నికలున్నాయన్నదే ఆయన భావన కావచ్చు. రాజకీయ కశ్మలాన్ని తొలగించడం ఓటు ద్వారా జరగాలి. కానీ అడ్వాణీ సందేశం మీద మీడియా పెద్ద చర్చను లేవదీయాలనీ, తద్వారా మోదీ వ్యతిరేకులకు ఊతం ఇవ్వాలని భావించింది. అంటే వివాదాస్పదం చేయాలి. ప్రతిపక్షాలు కూడా మీడియా బాటనే పట్టాయి. పుల్వామా దాడిని మొదట ఎన్నికల అంశంగా చూసింది ప్రతిపక్షమే. ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా చూడవద్దంటూ అధికార పక్షానికి సుద్దులు చెప్పడం ఆరంభించనవారు విపక్ష నేతలే. దుర్మరణం చెందిన సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు నాలుగు సానుభూతి వాక్యాలు పలకడానికి ముందే, మోదీ ఈ దాడిని ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ఉపయోగించుకో రాదంటూ సభలలో ఉద్ఘాటించారు. అక్కడితో ఆగలేదు. ఫారూఖ్‌ ఈ దాడి వెనుక మోదీ ఉన్నారని విమర్శించినట్టు పైన చదివాం. ఇలాంటి ఆరోపణలు ఎంత ముదిరిపోయాయో చెప్పలేం! ఇమ్రాన్‌, మోదీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని ఆరోపించడానికి కూడా కొందరు విపక్ష నేతలు వెనుకాడలేదు. అందుకు సాక్ష్యం మమతా బెనర్జీ ప్రకటన. పుల్వామా దాడి మేమే చేశామని జైష్‌ ఎ మమహ్మద్‌ సంస్థ ప్రకటించినా, ఆ దాడిలో పాకిస్తాన్‌ కుట్ర ఉందని దేశమంతా నినదిస్తూ ఉంటే, సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ఉంటే… ఇంకో పక్క మొత్తం పాకిస్తానీలను ఎందుకు తప్పు పడతారంటూ పంజాబ్‌ ఉప ముఖ్య మంత్రి గుడ్లురిమారు. పేలని రఫేల్‌ ఆరోపణల స్థానంలో మరొక ఆయుధం దొరికిందని కాంగ్రెస్‌ సంబర పడింది. పుల్వామా దాడిలో, అది జరిగిన సమయంలో ఆ జాతీయ పార్టీ కూడా కుట్రను చూసింది. అప్పుడే, అంటే ఎన్నికల ముందు జరగడం అనుమానించదగినదేనని ఆ పార్టీ ఆరోపణ. ఇది ఎంతవరకు సబబు? ఇలా పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే వారంతా ఆ దేశానికే వెళ్లిపోవడం మంచిదని ఈ ధోరణికి కలత చెందిన బీజేపీ వారు కొందరు మాత్రమే కాదు, శివసేన మాత్రమే కాదు, లక్షలాది మంది నెటిజన్లు కూడా అభిప్రాయపడ్డారు. అసలు మోదీనీ, బీజేపీనీ ఈ దేశం నుంచి తరిమివేయాలన్న నినాదం కూడా జేఎన్‌యులో వినిపించింది. మోదీ హయాం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ మేధావులు కొన్ని నెలలపాటు కోళ్లై కూశారు. ఐదేళ్లు పూర్తి కావస్తోంది. ఎన్నికలు కూడా జరుగు తున్నాయి. కానీ ఇలా నానా చెత్త వాగిన వారంతా ఇప్పటికీ టీవీ చానళ్లలో కూర్చుని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూనే ఉన్నారు. ఎవరూ అరెస్టు కాలేదు. ఏ జైలూ మోదీ వ్యతిరేకు లతో నిండిపోలేదు. ఇలాంటి ప్రచారం ప్రజలను భయపెట్టడం కాదా? బీజేపీనీ, మోదీనీ అపఖ్యాతి పాలు చేసే కుట్ర కాదా? అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒరిస్సాలో ఒక మిషనరీని సజీవ దహనం చేస్తే దానిని నాటి బీజేపీ మీదకు నెట్టే యత్నం చేశారు. కానీ లక్ష్మణానంద స్వామి అనే ఆయనను చంపితే ఎవరూ మాట్లాడలేదు. ఢిల్లీలో చర్చ్‌ మీద దాడి జరిగితే అది బీజేపీ పనే అన్నారు. ఇందులో ఏ ఒక్క ఆరోపణ రుజువు కాలేదు. కశ్మీర్‌ శాశ్వత నివాసులు ఎవరు అనేది తేల్చే ఆర్టికల్‌ 35ఎ రద్దు గురించి బీజేపీ యోచిస్తుం దని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే, అయితే మా ప్రధానిని మేం తెచ్చుకుంటాం అంటూ ఒమర్‌ అబ్దుల్లా నోటి నుంచి ప్రకటన వెలువడింది. ఇది ఎవరికి మేలు చేసే వాదన?

మహారాష్ట్రలోని వాల్టాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. హిందువులందరినీ ఉగ్రవాదులని ప్రతిపక్షాల వారు ఎలా అంటున్నారు? అన్నదే ఆ ప్రశ్న. సంతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ల కేసులో అసిమానంద్‌ నిర్దోషిగా బయటపడ్డారు. అలాంటి ఉదంతం మరొకటి లేనేలేదు. అసలు హిందూ దేశ చరిత్రలోనే స్వీయ రక్షణ గురించి తప్ప, ఇతరుల మీద దాడి చేసిన ఘటనలే కానరావు. మరి హిందువు లందరినీ ఉగ్రవాదులని ఎలా అంటారు? పుల్వామా దాడిలో పాక్‌ హస్తముందని అంటే, ప్రాణం విలవిలలాడి పోయిన ఆ దేశ ప్రేమికులు హిందువులందరినీ ఉగ్రవాదులని ఎవరో నోరు పారేసుకుంటూ ఉంటే ఎందుకు స్పందించరు? అంటే ఆ వ్యాఖ్యను అంగీక రించినట్టేనా? భారతదేశంలో ప్రతి ముస్లింను ఎవరూ ఉగ్రవాదిగా చూడడం లేదు. కానీ ముస్లిం మత ఛాందసవాదం ఇవాళ ప్రపంచానికి బెడద. అది వాస్తవం. ముస్లిం ఛాందసవాదంతో తీవ్రంగా నష్టపోయిన దేశం భారత్‌. బీజేపీ బలంగా ఉన్నంత కాలం కేంద్రంలో పాగా వేయలేమని మిగిలిన రాజకీయ పార్టీలకు అనుభవంలోకి వచ్చింది. అలా అని బీజేపీ బలాన్ని తగ్గించలేరు. అంతటి నైతిక, సామాజిక బలాలు వాళ్లకి కనీసంగా కూడా లేవు. కాబట్టి, అసలు ఫెడరల్‌ వ్యవస్థ మీదే అనుమానాలు రేకెత్తించి బలహీన పరచడమే వ్యూహంగా కొందరు రాజకీయ నాయకులు పాచికలు కదుపుతున్నారు. ప్రధాని పదవి ఇప్పుడే తమ దాకా వచ్చే సూచనలు కనిపించడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా మోదీకి వ్యక్తిగత ఆదరణ ఇతోధికంగా కనిపిస్తోంది. కాబట్టి ప్రధాని పదవి స్థాయిని పాతాళానికి దించి చూపించడానికి ఇంకొందరు శత విధాలా కషి చేస్తున్నారు. 1969 రాష్ట్రపతి ఎన్నికలో ఇందిరాగాంధీ అనుసరించిన విధానం దీనికి దగ్గరగానే ఉంటుంది. ఆమె పార్టీ అభ్యర్థిని కాదని, సొంత అభ్యర్థిని నిలిపి, అంతరాత్మ ప్రబోధం పిలుపు ఇచ్చారు. ఆ ఎన్నికతో అసలు దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌లోనే, అంటే అధికార పార్టీలోనే ఐకమత్యం లేదన్న ఒక సంకేతం పాకిస్తాన్‌కు వెళ్లింది. 1971 యుద్ధానికి అది కూడా కారణమే.

ఇక, ఇందిర విదేశీ హస్తం ఆరోపణ కూడా విపక్షాల నేతలను ప్రతినాయకులుగా చిత్రించడానికి చేసినదే. ఆ ‘విదేశీ హస్తం’ పెద్ద మోసం. మోదీ విషయంలో చూస్తే భారతీయ జనతా పార్టీని విమర్శించే క్రమంలో విపక్షాలు భారతదేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే- ఆనాడు అధికార పక్షంలో ఐక్యత లేదు. ఇప్పుడు అధికార పక్షంలో ఐకమత్యం ఉంది. కానీ విపక్షం పాకిస్తాన్‌ భాష మాట్లాడుతోంది. పాకిస్తాన్‌ అభిప్రాయాలను పలుకుతోంది. 2014 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ మోదీని అన్నమాట ఏమిటి? ‘మత్యు బేహారి’ అని కాదా!? మరి 1984లో అన్ని వందల మంది సిక్కులను దేశ వ్యాప్తంగా ఊచకోత కోసిన ఆమె పార్టీ నాయకుల సంగతేమిటి? 2019 లోక్‌సభ ఎన్నికలు ప్రకటించే ముందు వరకు రాహుల్‌ గాంధీ నోటి నుంచి రఫేల్‌ మాట తప్ప మరొకటి వినిపించేది కాదు. ఇప్పుడేమైంది, ఆ రభస? పుల్వామా, బాలాకోట్‌ జపం ఎందుకు? 1971లో ఇందిర పాక్‌తో యుద్ధం చేశారు. నేటి బీజేపీ రూపమైన నాటి భారతీయ జనసంఘ్‌ ఇందిర చేస్తున్న యుద్ధం భారతదేశ ప్రతిష్టకు సంబంధించినదనే భావించింది. ఇందిరను నాడు వాజపేయి శ్లాఘించడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. అలాంటి జాతీయ దష్టి ఇప్పుడు ఏది? పొరుగు దేశం దాడి చేసినప్పుడైనా పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశ మంతా ఒక్కటై ఉంది అన్న సందేశం పంపించాలన్న కనీస జ్ఞానం ఇప్పుడు ఏది? ఎన్నికల ముందే బీజేపీకి రాముడు, హిందుత్వం గుర్తుకు వస్తాయంటూ తెరాస నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విమర్శ కాంగ్రెస్‌ది. 2014 ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ ఇలాంటి విమర్శ చేసింది. వారికి లాభసాటి కాదనిపించిన తరువాత వదిలేశారు. ఆ ఎంగిలి ముక్కలనే ఇప్పుడు తెరాస అపురూపంగా అందుకుంది. ఎంఐఎంను బుజ్జగించ డానికి హిందూగాళ్లు, బొందూగాళ్లూ వంటి చౌకబారు విమర్శలకు దిగజారిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి అయితే మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారంటూ ఊదర గొట్టే విమర్శ తప్ప మరొక మాట చెప్పడం లేదు. ఏకంగా మోదీ అంతు చూస్తాడట ఆయన. మోదీని రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయడట. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఆయన ప్రలోభ పెట్టి తెలుగుదేశంలో చేర్చుకున్నారు. కానీ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారంటూ మోదీ మీద విరుచుకుపడు తున్నారు. కేసీఆర్‌ చేసిందీ, చేస్తున్నదీ అదే. కానీ చంద్రబాబు మోసగాడని, నిజాయితీ లేని వాడని నిరభ్యంతరంగా మాట్లాడుతున్నారు. జగన్‌ మీద 38 కేసులు ఉన్నాయని చెబుతారు చంద్రబాబు. స్టేలు తెచ్చుకుని బయట తిరిగితే పులుకడిగిన ముత్యమై పోరని బీసీ నాయకుడు, న్యాయ నిపుణుడు ఈశ్వరయ్య చేసిన విమర్శకు మాత్రం బాబు నుంచి సమాధానం ఉండదు. బీజేపీలో మూడు దశాబ్దాలు పనిచేసిన శత్రుఘ్ను సిన్హా వంటివారి మాటలు మరీ విడ్డూరం. వికారం, వికతం కూడా. ఆయన బీజేపీ అంటే వన్‌ మ్యాన్‌ షో, టు మెన్‌ ఆర్మీ అని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు ఆయన చేరిన పార్టీ వన్‌ మ్యాన్‌ షోయేనన్న నగ్నసత్యం ఆయనకి తెలియదా? ఒకే కుటుంబ జేబు సంస్థ అన్న వాస్తవం ఆయన ఎరుగరా? అడ్వాణీకి టిక్కెట్టు ఇవ్వకుండా బీజేపీ అవమానించిందని గుండెలు బాదుకుంటున్న ఈ నటశేఖరుడు, బీజేపీ ఎంపీగా ఉంటూ మోదీని తిట్టే సభలలో చేతులెత్తి డవిలాగులు కొట్టి సొంత పార్టీనీ, సొంత నియోజకవర్గాన్నీ ఎంత అవమానించారో ఎందుకు తెలుసుకోరు? ఆయనకు అడ్వాణీ అంటే దైవ సమానమట. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరింది మాత్రం, లాలూ ప్రసాద్‌ దివ్య సందేశంతోనట. అయోధ్య వెళుతున్న అడ్వాణీని అరెస్టు చేసిన ఘనుడు ఆ లాలూయే! కాబట్టి ‘మొదట దేశం, ఆ తరువాత పార్టీ, ఆ తరువాతే సొంత విషయం’ అన్న వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి అడ్వాణీ చేశారో అర్థం చేసుకో వచ్చు. ఇలాంటి దష్టి కనీసం దేశం కష్టకాలంలో ఉన్న సమయంలో, లేదా పొరుగు దేశం దాడికి దిగాలన్న యోచనలో ఉన్నప్పుడైనా బీజేపీ యేతర నేతలు అలవరచుకోవలసిన అసవరం లేదా? కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. మొదట సొంత విషయం. తరువాత పార్టీ. ఆ తరువాత వీలుంటే దేశం గొడవ. జాతి పరువు ప్రతిష్టల విషయం కాస్త పట్టించుకోవచ్చు. ఇదీ నేటి క్రమం. కానీ సొంత విషయం ముందు, తరువాత పార్టీ విషయం అనుకునేవారు దేశం గురించి యోచించేందుకు సమయం ఇస్తారని భావించలేం. అడ్వాణీ, జోషి, సుమిత్రా మహాజన్‌ వంటి వారికి బీజేపీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు. లేదా వారే పోటీకి దూరంగా ఉండాలని భావించి ఉండవచ్చు.

సుష్మ, ఉమా భారతి, శాంతకుమార్‌ వంటివారు స్వచ్ఛందంగా పోటీ చేయడం లేదని ప్రకటించి ఉండవచ్చు. ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. పెద్దలను, వ్యవస్థాప కులను, త్యాగాలు చేసిన వారిని గౌరవించాలంటూ కాంగ్రెస్‌ వంటి పార్టీ చెప్పడం వింతల్లోకెల్లా వింత. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే మాట కూడా ఇక్కడ నిర్ఘాంతపోతుంది. స్వాతంత్య్రం సమరంలో ఎంత మంది మహా పురుషుల త్యాగాలను ఆ పార్టీ గుర్తించింది? సర్దార్‌పటేల్‌ను ఎలా చూశారు? పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని అయినా గౌరవించా లన్న ఇంగిత జ్ఞానం లేని పార్టీ ఇతరులకు ఏం చెప్పగలదు? ఎలా చెప్పగలదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *