ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 8,9,10 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగాయి. అక్కడి కేదార్‌దామ్‌ సరస్వతీ శిశుమందిర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశాలను 8వ తేదీ ఉదయం సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌, సర్‌కార్యవాహ భయ్యాజీ జోషిలు భారతమాతా పటానికి పూలమాల సమర్పించి ప్రారంభించారు. ఈ సమావేశాల విశేషాలను పాఠకులకు అందిస్తున్నాం.

వార్షిక నివేదిక

శ్రద్ధాంజలి

2018 ప్రతినిధి సభల నుండి 2019 ప్రతినిధి సభల మధ్యకాలంలో దేశంలోని అనేక రంగాలకు చెందిన ప్రముఖులతో బాటు సంఘ కార్యకర్తలు స్వర్గస్తులయ్యారు. ప్రకతి విపత్తులు, ప్రమాదాల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన సైనికులు, హింసాత్మక సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారందరి ఆత్మలకు శాంతి, సద్గతులు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ అఖిల భారతీయ ప్రతినిధి సభ శ్రద్ధాంజలి ఘటించింది.

అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీ పి.వి.శ్రీరాంసాయి, విశాఖపట్నంలోని జ్యేష్ఠకార్యకర్త, విశాఖ మహానగర్‌ పూర్వసంఘచాలక్‌ పిళ్లా రామారావు, సామాజిక సమరసత అధ్యక్షులు ఎమ్‌.జి.కె.మూర్తి, తెలంగాణాకు చెందిన ఇతిహాస సంకలన సమితి క్షేత్రప్రముఖ్‌ కూనపులి వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవికాసమితి ప్రాంత కార్యవాహికగా బాధ్యత నిర్వహించిన శారదాతాయి బ్రహ్మపూర్‌కర్‌ మరియు మాజీ శాసనసభ్యులు బద్దంబాల్‌రెడ్డి ఉన్నారు.

ప్రాంతవారీ ముఖ్య విశేషాలు

తెలంగాణ : 2018 డిసెంబర్‌ 22, 23, 24 తేదీలలో ప్రాంతస్థాయి కిషోర్‌ ఘోష్‌ వాదకుల 3 రోజుల శిబిరం స్వరార్చన పేరుతో సిద్ధిపేటలో జరిగింది. ఇందులో 50 ఘోష్‌ కేంద్రాల నుండి 683 మంది పాల్గొన్నారు. (7వ తరగతి నుండి 10వ తరగతి లోపువారు 556 మంది, బాధ్యత గలవారు మరో 127 మంది).

దక్షిణ కర్ణాటక : 2021 సంవత్సరం నాటికి అన్ని బస్తీలు, అన్ని మండలాలు కార్యయుక్త కావాలనే లక్ష్యంతో 2 రోజుల కార్యకర్తల శిబిరం 2019 జనవరి 19, 20 తేదీలలో షిమోగలో జరిగింది. బస్తీప్రముఖ్‌, ఉపమండల ప్రముఖ్‌, మండల కార్యవాహ ఆపైవారు మొత్తం 3486 మంది పాల్గొన్నారు. (1204 మంది ప్రముఖులు, 846 బస్తీ ప్రముఖులు పాల్గొన్నారు.)

విదర్భ : మండల, ఉపఖండ, ఖండ ఆపై స్థాయి కార్యకర్తల సక్రియత పెరగడం కొరకు, అలాగే వికాసం కలగడానికి 3 రోజుల పర్యటనా కార్యకర్తల శిబిరం 2019 జనవరిలో జరిగింది. ఇందులో 3422 మంది పాల్గొన్నారు. అనువర్తి కొరకు మార్చి నెలలో బస్తీవారీ సాంఘిక్‌, ఉగాది, మరియు శ్రీరామనవమి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు.

చిత్తోడ్‌ : గ్రామీణ ప్రాంతంలో శాఖకార్యం పెరగడానికి రైతులు, ఉద్యోగులు, యువకులకు ప్రశిక్షణ వర్గ నిర్వహించారు. 22 జిల్లాలకు చెందిన 633 గ్రామాల నుండి 1665 మంది గ్రామీణ బంధువులు ప్రశిక్షణలో పాల్గొన్నారు. ప్రశిక్షణ పొందినవారిలో నుండి 16 జిల్లాలకు చెందిన 332 మంది రైతులు 7 రోజులపాటు విస్తారకులుగా పనిచేశారు. దీని ఫలితంగా ప్రాంతంలో 11 జిల్లాలలో 48 శాఖలు, 58 సాప్తాహిక్‌ మిలన్‌లు రైతుల కొరకు ప్రారంభమైనాయి.

జమ్ము-కశ్మీర్‌ : జమ్ము నుండి 40 కి.మీ. దూరంలో పురమండల్‌ అనే స్థలం దేవికానది తీరంలో ఉంది. ఇక్కడ ప్రాచీన దేవాలయంతో పాటు అందమైన ధర్మశాలలు, సంస్కృత అధ్యయన కేంద్రం చాలాకాలంగా ఉపేక్షకు గురైనవి. వాటి పునరుద్ధరణకు సంఘ స్వయంసేవకుల ద్వారా ఒక ట్రస్టు ఏర్పాటుచేసి చెట్లు నాటడం, ఉచిత వైద్యశిబిరాలు మొదలైన కార్యక్రమాలు ప్రారంభించి, చుట్టుప్రక్కల 30 గ్రామాలలో గ్రామ సమితులు ఏర్పరచారు.

సర్‌కార్యవాహ పర్యటనను పురస్కరించుకొని అక్కడ గొప్ప యజ్ఞం నిర్వహించారు. అనంతరం పరిసర గ్రామాలలో గ్రామ వికాసం పనులు స్వయం సేవకుల ద్వారా ప్రారంభమైనాయి. పురమండల్‌ అనే స్థలం పాకిస్థాన్‌కు సరిహద్దు కావడం వలన పాకిస్తాన్‌ తీవ్రవాదుల నుండి అక్కడి ప్రజలు నిరంతరం తుపాకి గుండ్లవర్షానికి గురవుతూ ఉంటారు. దానివలన ప్రజలకు రక్షణ కరువై ఊరు వదలి వెళ్ళిపోవడం, చదువులో ఆటంకాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు తాండవిస్తుండేవి. వీటి పరిష్కారం కొరకు స్వయంసేవకుల ద్వారా ప్రయ త్నాలు ప్రారంభించి 457 గ్రామాలలో సమస్యల గురించి అధ్యయనం చేశారు. సర్‌కార్యవాహ పర్యటనలో ఈ పనిని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ క్షేత్రాలతో కలిపి 90 మంది కార్యకర్తలతో సమావేశము నిర్వహించారు. తత్ఫలితంగా 360 గ్రామాలలో పాఠశాలలు, హాస్టళ్లు, సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు, హెల్త్‌ సెంటర్స్‌, స్వావలంబన దిశగా సేవా కార్యక్రమాలు ప్రారంభమైనాయి.

ఉత్తర అస్సాం : గత 2 సంవత్సరాలుగా ప్రాంతం అంతటా ఒకే రోజున జిల్లాస్థాయిలో పథసంచలన్‌ (రూట్‌మార్చ్‌) నిర్వహిస్తుండేవారు. అయితే ఈ సంవత్సరం రాష్ట్రం అంతటా ఎన్‌ఆర్‌సి చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ 30 జిల్లాలలో ఒకేరోజు నిర్వహించిన పథసంచలన్‌ కార్యక్రమాలలో 8099 మంది స్వయంసేవకులు పాల్గొనడం విశేషం.

కుంభమేళా

ఇటీవల ప్రయాగరాజ్‌లో ముగిసిన కుంభ మేళాలో పాల్గొన్న సాధుసంతుల దగ్గర నుండి సాధారణ భక్తుల వరకు అక్కడ ఏర్పాటు చేసిన శుచి, శుభ్రత నిరంతరం స్వచ్ఛమైన నీటిప్రవాహం పట్ల అందరూ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత, పర్యావరణం, యువత, నారీశక్తి వంటి అన్ని వర్గాలకు సంబంధించి కుంభ జరిగింది. ఈ సందర్భంలో సాధుసంతుల కుంభలో సమాజంలో అందరిని కలుపుకొని పోయే విషయంపై చర్చించారు. సక్షమ (వికలాంగుల సంక్షేమం కొరకు పనిచేసే సంస్థ) మరియు నేషనల్‌ మెడికో ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎమ్‌ఓ) ద్వారా నిర్వహించబడిన గొప్ప నేత్ర కుంభలో 1,85,809 మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 1,41,239 మందికి కంటి అద్దాలను అందించారు. అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు కూడా చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చిన నైపుణ్యమైన కళాకారులను ప్రోత్సహించుటకు కుంభమేళాలో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటుచేయడం విశేషం.

తీర్మానాల ఆమోదం

ఈ సమావేశాలలో ప్రస్తుతం సమాజం ఎదుర్కొం టున్న కొన్ని సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. సమావేశాల చివరి రోజున సర్‌కార్యవాహ భయ్యాజి జోషి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, విలేకరులతో ముచ్చటించారు. ఆ సమావేశంలో ఈ సమావేశాల వివరాలను విలేకరులకు అందించారు. దానితోపాటు జలియన్‌ వాలాబాగ్‌ దుస్సంఘటన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భం, నేతాజీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఆజాద్‌ హింద్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం, గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భాలను పురస్కరించుకుని ఈ సంవత్సరం ఉత్సవాలను జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *