వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||

వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు పుత్రుడు, శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు, కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం అని ప్రతి భారతీయుడు ప్రతినిత్యం నమస్కరించవలసిన వ్యక్తి వేదవ్యాసుడు. కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ మహర్షిని స్మరించి ఋణం తీర్చుకోవాలి. అటువంటి రోజే ఆషాఢ పూర్ణిమ లేక గురుపూర్ణిమ. వ్యాస పూర్ణిమగా లోక ప్రసిద్ధి. ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసుల వారిని హిందూ సమాజం తొలి గురువుగా భావించి పూజించడం పరిపాటి. అయితే వ్యాసుని కంటే ముందు ఈ సమాజంలో గురువులు లేరా? అంటే ఉన్నారు. కాని గురు వ్యవస్థను ఏర్పాటు చేసినవాడు వేదవ్యాసుడు. అందుకే వ్యాస పూర్ణిమ గురిపూర్ణిమ అయింది.

పూర్వం వేదనిధి, వేదవతి అనే దంపతుల ఎదుట వ్యాసుడు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించ డానికి

మమ జన్మదినే సమ్యక్‌ పూజనీయ ః ప్రయత్నతః

ఆషాఢ శుక్లపక్షేతు పూర్ణిమాయాం గురౌతథా ||

అని చెప్పాడట.

అనగా వ్యాసుడు ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున జన్మించినట్లు, ఆ రోజున ఆయనను శ్రద్ధా భక్తులతో పూజించే సంప్రదాయముందని తెలుస్తోంది. ఆషాఢ పూర్ణిమ గురువారంతో కలసి వస్తే విశేషమైనదిగా భావింపబడుతుందని శాస్త్రం ప్రామాణికంగా చెప్తోంది. అంతేగాక జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆషాఢ పూర్ణిమ నాడు చంద్రుడు సంపూర్ణ షోడశ కళాప్రపూర్ణుడై ప్రకాశిస్తుంటాడు. సూర్యుడు తన సర్వకాంతులను చంద్రునిపై ప్రసరింప చేస్తాడు. సూర్యుడు జ్ఞాన స్వరూపుడు. చైతన్య స్వరూపుడు. చంద్రుడు మనః స్వరూపుడు. క్రియా స్వరూపుడు. సూర్య చంద్రులకు ప్రధాన దేవత పూర్వాషాఢ నక్షత్రం. పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంతో కూడా ఉంటాడు. ఆనాడు సంపూర్ణంగా మనో బుద్ధులకు ప్రకాశం లభిస్తుంది. ఆనాడు గురువును పూజించడం కర్తవ్య మార్గాన నడవడం శ్రేష్ఠం. కాబట్టి ఆషాఢ పూర్ణిమ నాడు గూరుపూర్ణిమ యని ధర్మసింధువు, బ్రహ్మాండ పురాణాల్లో ఉంది.

‘విస్తారో విగ్ర¬ వ్యాసః’. అంటే వేద పురాణాలను విపులీకరించిన వాడు వ్యాసుడు. అందుకే వ్యాసుడొక వ్యక్తి కాదు. ఆయన ఒక వ్యవస్థ. అది ఒక పీఠం. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు ఆ పీఠాన్ని అధిరోహిస్తారు. సత్యవతీ పరాశరుల పుత్రడైన ఈ వ్యాసుడు 28వ వ్యాసుడని చెప్తారు. తల్లిదండ్రులితనికి పెట్టిన పేరు కృష్ణ. ద్వీపములో జన్మించుట వలన కృష్ణద్వైపాయనుడయ్యాడు. బదరికా వనంలో నివసించి జీవన కార్యాలైన ధర్మ ప్రచారాన్ని నిర్వహించాడు కాబట్టి బాదరాయణునిగా ప్రసిద్ధుడయ్యాడు. ‘మునీనాప్యహం వ్యాసః’ – మునులలో నేను వ్యాసుడను అని గీతాచార్యు డన్నాడు. అంతటి గొప్పవాడు వ్యాస మహర్షి. అందుకే-

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

అని నిత్యం మన స్తుతి చేస్తూ ఉంటాం. విష్ణువు అంటే సర్వ వ్యాపకుడని అర్థం. వ్యాసుడు బ్రహ్మ జ్ఞానానికి నిధి వంటివాడు. ఆ జ్ఞాన నిధిని సర్వత్రా వ్యాపింప జేయడం ఆయన లక్షణం. కర్తవ్యం కూడా. ఆ విధిని తాను నిర్వర్తించాడు. జ్ఞానాన్ని ఎప్పుడూ ప్రసరింపజేయాలి. ప్రవర్తింపజేయాలి. పంచుతూ పోవాలి. అప్పుడే అది పెరుగుతుంటుంది. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వారభిన్నులు. అటువంటి వ్యాసునకు నమస్కారం.

అచతుర్వదనో బ్రహ్మ | ద్విబాహు రపరోహరిః ||

అఫాల లోచన శ్శంభుః | భగవాన్‌ బాదరాయణః ||

ఆయనకు నాలుగు ముఖాలు లేవు అయినా బ్రహ్మే. అతడు రెండు బాహువులున్న అపర విష్ణువు. మూడవ కన్ను లేని పరమ శివుడు. ఆయనే సాక్షాత్తు భగవాన్‌ బాదరాయణుడని వ్యాసుని గొప్పదనాన్ని వేనోళ్ల కొండాడుతున్నాయి శాస్త్రాలు.

కలియుగంలో ధర్మబోధ నిమిత్తం వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋక్‌, యజు, స్సామములని వేదములు త్రయీ విద్యగా ఉంటే అధర్వమును దానికి కలిపి నాలుగు భాగాలుగా విభజించాడు వ్యాసుడు. వేదార్థాన్ని సామాన్యుని కందించడానికి అష్టాదశ పురాణాలతో, ఉపపురాణాలతో కథోపకథలు చెప్పి ధర్మాన్ని ప్రవచించాడు. ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని రచించి అపార వాఙ్మయాన్ని సృష్టించాడు. అందుకే ‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ అన్నారు. ప్రపంచమంతా నాడి ఉన్న వాఙ్మయ భిక్ష పెట్టినవాడు వేదవ్యాసుడు. ప్రపంచ వాఙ్మయానికి రచనకు వస్తువును అంటే విషయాన్ని అందించాడు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. అని తెలుగు సామెత. లక్ష శ్లోకాలతో పంచమవేదం వంటి మహాభారత గ్రంథాన్ని ఒక ధర్మశాస్త్రంగా, ఇతిహాసంగా, కావ్యంగా, ఆర్థిక శాస్త్రంగా ఎవరికి ఏ విషయం కావలసి వస్తే ఆ విషయం లభించేలా రచించాడు. అందుకే మహాభారతం గురించి చెప్తూ ‘యదిహాస్తి తదన్యత్ర, యన్నేహస్తి న తత్‌ క్వచిత్‌’ అన్నారు. అంటే మహాభారతంలో ఉన్నదే మరోచోట ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు అన్నట్లుగా ఒక సంపూర్ణ సమగ్ర గ్రంథంగా రచించాడు. అందుకే అది పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉన్న కథలు, ఉపకథలు మానవజాతికి సందేశాత్మకంగా ఉంటాయి. అడుగడుగునా ధర్మసూక్ష్మాల విశ్లేషణ ఆ ఉపాఖ్యానాల్లో చేశారు. ప్రవృత్తి ధర్మానికి, నివృత్తి ధర్మానికి దారి చూపించారు. మౌలిక విలువలకు, ధార్మిక జీవనానికి దిశాదర్శనం చేశారు వ్యాసులవారు. అందుకే వ్యాసుడొక మహాముని. వేద వ్యవస్థాపకుడు. సాక్షాత్తు ధర్మస్వరూపుడు. సమకాలికులాయనను ధర్మనిర్మాతగా, ఆచార్యునిగా స్వీకరించారు. ఆయన చెప్పిన మాట చూపిన బాట ధర్మబద్ధమైనది.

కష్టాలలో ఉన్న వారిని తీర్థయాత్రలు చేయమని, తీర్థాలలో స్నానం చేసి పునీతులు కమ్మని మహాభారతంలో అనేక సందర్భాలలో వేదవ్యాసుడు ఉపదేశించాడు. వారు ప్రబోధించిన ఈ తీర్థ సంప్రదాయమే దేశ సమైక్యతను, సాంస్కృతికతను, ఈ దేశమంతా ఒకటే అనే భావనను ఆనాటి నుండి కాపాడుతూ వస్తోంది. సందర్భానుసారంగా తీర్థ, క్షేత్రాల, మహిమను కొనియాడుతూ తీర్థ సంప్రదాయాన్ని నిలబెట్టిన మహనీయుడు వ్యాసుడు.

ధర్మ ప్రబోధానికొక వ్యవస్థను ఏర్పాటు చేసిన ధార్మికుడు వ్యాసుడు. శిష్యులకు వేదాలనిచ్చి వేదధర్మాన్ని ప్రబోధించమన్నాడు. ముఖ్యంగా అధర్వ వేద ప్రచారానికి సుమంత్రుడిని నియుక్తి చేశాడు. మహాభారత ప్రచారానికై దేవలోకంలో నారదుణ్ణి, పితృలోకంలో దేవలుడిని, భూలోకంలో వైశంపాయ నుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలకు శుకమహర్షిని నియుక్తి చేశాడు. మహాభాగవత ప్రచారాన్ని కూడ శుకుని భుజస్కంధాలపై ఉంచి నిరంతర ధార్మిక జాగృతి కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత పరంపరాయుతంగా సూతమహాముని పౌరాణికునిగా ప్రసిద్ధుడయ్యాడు. అందుకే ప్రాచీన కాలం నుండి వస్తున్న గురుశిష్య పరంపరకు వేదవ్యాసుడు ఆద్యుడు. ‘కథా వాచయితా స్వయం’ అన్నారు వ్యాసులవారు. వేదవేదాంగాల రహస్యాలను, పురాణ గాథలను ప్రవచించే వారిలోనే నేను స్వయంగా నివసిస్తుంటానని చెప్పారు వ్యాసులు. కాబట్టే మానవులు సాధువులను, సన్యాసులను, మఠాధిపతులను, పీఠాధిపతులను, అవధూతలను మంత్రదీక్ష ఇచ్చిన గురువులను ఆశ్రయించి వేదవ్యాస స్వరూపునిగా భావించి గురుపూజ చేయడం ఆనాటి నుండి సంప్రదాయంగా వస్తోంది. వివిధ పంథాలలో ఉపాసనా పద్ధతిలో ఈ మార్గాన్నే అవలంబిస్తూ వచ్చారు. పీఠాధిపతులు, మఠాధిపతులు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష అవలంబించి వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉపాసనా మార్గంలో ఉంటూ ధర్మప్రచారం చేయడం పరిపాటిగా వస్తోంది.

ప్రాచీన కాలం నుండి భారతీయ జీవన పద్ధతిలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. ‘ఆచార్య దేవోభవ’ అనే వేదవచనం ప్రకారం గురువే దైవం. గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిగుణాత్మక శక్తి స్వరూపుడు. ‘గు’ శబ్దస్య అంధకారస్యాత్‌, ‘రు’ శబ్దస్య తన్నివారయేత్‌. అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడే గురువు.

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా |

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః ||

అజ్ఞానమనే చీకటిలో జ్ఞానమనే కాటుక పెట్టి కన్నులను తెరిపించే గురువునకు నమస్కారమని గురుస్తోత్రం చేస్తుండటం పరిపాటి. భారతీయ జీవనంలో గురువుకిచ్చే స్థానం ఎంతో విశిష్టమైనది. ఒక మనిషి విద్యావంతుడు కావాలన్నా సాధకుడు కావాలన్నా ముక్తిని పొందాలన్నా గురువు నాశ్రయించ వలసిందే. గురువిచ్చే దీక్ష, చేసే మంత్రోపదేశాల వల్ల సాధకుడవుతాడు. ‘నగురో రధికం’. అంటే గురువును మించిన వారు మరొకరు లేరు. అలా భావించినప్పుడే గురువు అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.

ధౌమ్య మహర్షి వద్ద విద్యాధ్యయనం చేసి శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించిన ఉపమన్యుడు, ఆరుణి, ఉత్తంకుని వంటి గాథలెన్నో మహాభారతం ద్వారా వ్యాసుల వారు ప్రబోధించారు. గురువును వంచించిన కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురువు కానందం కలిగించిన ఏకలవ్యుడు ధన్యుడయ్యాడు. గురుభక్తిలో ఆదర్శప్రాయుడయ్యాడు.

‘దేవేరుష్టే గురుస్త్రాతా గురౌరుష్టే న కశ్చన’ అని వేదాంత శాస్త్రం చెప్తోంది. అంటే దేవుని ఆగ్రహానికి గురియైన వాడిని గురువు రక్షించగలుగుతాడు. కానీ గురువు ఆగ్రహానికి గురయిన వాడిని దేవుడు కూడా రక్షించలేడు. ఇది గురు మహిమ. గురువు శక్తి, సామర్థ్యం అపారం.

శ్రీరాముడు వశిష్ఠ, విశ్వామిత్రులను; కురు పాండవులు ద్రోణుని; శంకరాచార్యులు గోవింద భగవత్పాదులను; చంద్రగుప్తుడు చాణక్యుని; ఛత్రపతి శివాజి సమర్థర-మదాసును; స్వామి దయానంద సరస్వతి స్వామి విరజానందను, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను ఆశ్రయించి ధర్మ, సంస్కృతులను ప్రచారం చేయడంలోను రక్షించడం లోను సఫలీకృతులై జగద్విఖ్యాతి చెందారు.

గులాబీలున్న చోట ముళ్లుంటాయి. తులసి వనంలో కూడ గంజాయి మొక్కలు మొలిచే ప్రయత్నం జరుగుతుంటుంది. ఆధునిక కాలంలో ఊరుపేరు చెప్పుకుంటూ కాయలమ్ముకొన్నట్లుగా కొందరు ఆషాఢభూతులు, దొంగబాబాలు అవతరిస్తుంటారు. వారిపట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. అది ధర్మలోపం, వ్యవస్థలోపం కాదు. కొందరు వంచకుల కుట్ర అని మాత్రమే గ్రహించాలి. ఈ మోసాన్ని ఖండించవలసిందే.

అలాగే విద్యా గురువుల విషయంలో కూడ. ఆధునిక యుగాలకనుకుణంగా సాంకేతిక విద్యలు వచ్చాయి. నాటి గురుకుల వ్యవస్థ నేడు లేదు. నేడు విద్యాబోధకులే గురువులు. వారిపట్ల భక్తి శ్రద్ధలుండవలసిందే. అలాగే గురువులకు కూడ శిష్యులయందు పుత్ర వాత్సల్యముండవలసిందే. కాని అక్కడక్కడ కలుపు మొక్కలు మొలుస్తున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండి తీరవలసిందే. అందుకే శాస్త్ర గ్రంథాలలో కూడ

గురవో బహవస్సంతి శిష్య విత్తాప హారిణః |

దుర్లభోయా గురుర్దేవి శిష్య సంతాప హారకః ||

అని చెప్పారు. శిష్యుల విత్తాన్ని అపహరించే వారనేనక మంది ఉండవచ్చు. శిష్యుల సంతాపము లను తొలగించగల ఉత్తమ గురువులు లభించడటం అదృష్టం గదా!

చతుర్విధ పురుషార్థ సాధనలో మానవుడు దారితప్పకుండా జ్ఞాన జ్యోతిని ధరించి చీకట్లను తొలగించి నడిపించడానికి ఒక ఆధారంగా, ఒక మార్గదర్శిగా, ఒక గురువు కావాలి. ఏది చేయ దగినదో, ఏది చేయకూడనిదో తెలియ జెప్పేవాడే గురువు. సత్యాసత్యాలు, ధర్మాధర్మాల మధ్య సంశయమేర్పడి కింకర్తవ్యతా విమూఢులైనప్పుడు సంశయాలను తొలగించగల గురువే నిజమైన గురువు. అట్టి గురువునారాధిద్దాం! ఆశీస్సులను పొందుదాం!

మంగళం గురుదేవాయ| మహనీయ గుణాత్మనే|

సర్వలోక శరణ్యాయ| సాధు రూపాయ మంగళం||న

– డా.అన్నదానం వెం.సుబ్రహ్మణ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *