పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

రైతులు పాల ఉత్పత్తిని పెంచేందుకు అధిక మొత్తంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పశువులకు దాణాగా అందించినప్పుడే మనదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

పశుగ్రాసం రకాలు :

సాలీన పచ్చిగడ్డి లభ్యతకు సూచనలు: పది పాడి పశువులు, 5 దూడలకు సగటున ఒక సంవత్సరానికి కావలసిన పచ్చిగడ్డి 173 టన్నులు. అంటే ప్రతిరోజు ఒక పశువుకు 40 కిలోలు, ఒక దూడకు 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవు తుందన్నమాట. ఈ లెక్క ప్రకారం ఒక సంవత్సర కాలానికి అవసరమయ్యే పచ్చిగడ్డిని ఉత్పత్తి చేసేందుకు రైతు ఒక హెక్టారు (2.5 ఎకరాలు) విస్తీర్ణంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటుంది. బాజ్రానేపియర్‌ హైబ్రిడ్లను, బహు వార్షిక పప్పుజాతి పంటను (హెడ్జ్‌లూసర్న్‌) అంతర పంటలుగా 3:1 నిష్పత్తిలో ఖరీఫ్‌లో 1.5 ఎకరాల్లో సాగుచేయాలి. అలాగే మరో ఎకరాలో జొన్నను సాగుచేసుకొని మిగిలిన అరెకరాలో ‘అలసంద’ను రెండు దఫాలుగా విత్తుకోవచ్చు.

రబీలో అరెకరాలో జొన్న, తర్వాత నవంబరులో రెండో వారంలో మొక్కజొన్నను సాగుచేసుకుని, మరో అరెకరాలో అలసందను, ఆ తర్వాత లూసర్న్‌ పంటను విత్తుకొన్నట్లైతే పచ్చి మేత చాలినంత వస్తుంది. రబీలో మొక్కజొన్న, వేసవిలో సజ్జను సాగు చేసుకుంటే తక్కువ నీటి తడులతో బాగా పెరిగి పచ్చిమేత అధికంగా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక హెక్టారులో 180 టన్నుల పచ్చిమేతను పొందొచ్చు. మిగిలిన గడ్డిని కూడా మాగుడు గడ్డిగా పాతర వేసి నిల్వ చేసుకోవచ్చు.

గడ్డి కొరకు ప్రత్యేకంగా పొలాన్ని కేటాయించ లేకపోతే వరిసాగు చేసే ముందున్న 40-60 రోజుల వ్యవధిలో అలసందను సాగుచేసుకోవచ్చు. వరి కోసిన తర్వాత తేమ ఉంటే జనుము, పిల్లిపెసర్లను సాగుచేసుకోవచ్చు. కందిలో పశుగ్రాసపు సజ్జను, మొక్కజొన్నలో పశుగ్రాసపు అలసందను అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చు. తోటల్లో అంజన్‌గడ్డి, స్టైలో గడ్డి విత్తనాలను 2:1 నిష్పత్తిలో కలిపి జల్లుకొని 3 నెలల తర్వాత పచ్చి మేతను పొందొచ్చు. కాలువ, పొలం గట్లపై బాజ్రానేపియర్‌, హెడ్జ్‌లూసర్న్‌లను లేదా సుబాబుల్‌, అవిసె లాంటి చెట్లను పెంచి కూడా పశుగ్రాసాలుగా సాగుచేయవచ్చు.

పశుగ్రాసాల నిల్వ

పశుగ్రాసాలను ‘హే గడ్డి’, ‘సైలేజ్‌’ పద్ధతిలో నిల్వ చేయవచ్చు. గడ్డిజాతి పంటను గాని, ధాన్యపు జాతి గడ్డినిగాని, లేదా పప్పుజాతి పంటలను గాని పూత దశ కన్నా ముందుగానే కోసి, ఎండబెట్టడం వల్ల ఎండిన గడ్డిని ‘హే’ గడ్డిగా కొరత సమయంలో వాడుకోవచ్చు.

‘సైలేజ్‌’ ను తయారు చేయడమెలా ?

పచ్చిగా ఉన్న పశుగ్రాసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గాలిలేని ప్రదేశంలో పులియబెట్టి నిల్వ ఉంచే స్థితిని ‘సైలేజ్‌’ అంటారు. దీనివల్ల గ్రాసం ఆమ్ల పరిమాణం పెరగటం వల్ల బాక్టీరియా, శిలీంధ్రాలు పెరగలేవు.

ఎత్తైన ప్రదేశంలో నీటి ఊటలేని చోట పాతర తవ్వి అడుగు భాగంలో, పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. కట్టర్‌తో ముక్కలుగా నరికిన మేతను పొరలు పొరలుగా ఆ గుంతలో నింపి గాలి తగలకుండా ట్రాక్టరుతో గాని యంత్రంతోగాని ఒత్తిడికి గురిచేసి అణచాలి. ప్రతి టన్నుకు బెల్లపు మడ్డి 2-3 కిలోలు + రాతి ఉప్పు 2 కిలోలను ఆ పొరల మధ్యలో చల్లాలి. పాతరను భూమికి 2-3 అడుగుల ఎత్తువరకు నింపి పైన మందమైన పాలిథిన్‌గాని, వరిగడ్డిని గాని పరచి మట్టి, పేడ మిశ్రమంతో అలికి గాలి, వర్షపు నీరు లోపలికి పోకుండా జాగ్రత్తపడాలి. పాతర అడుగుభాగం, పక్క గోడల్లో ఎండిన వరి గడ్డిని ఉంచితే గడ్డి వృథా కాదు. పాతరేసిన 2-3 నెలలకు గడ్డి మాగి లేతపసుపు రంగులోకి మారి బాగా పండిన పండ్ల వలె వాసన వస్తుంది. అవసరాన్ని బట్టి ఆ గడ్డిని బయటకు తీసి సుమారు 20 కిలోల సైలేజ్‌ను ఎండు మేతతో కలిపి పశువులకు అందించొచ్చు. బాగా తయారైన సైలేజ్‌ను 1-2 సంవత్సరాల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. అయితే ఒకసారి సైలేజ్‌ మూత తెరచిన తర్వాత దాన్ని నెల రోజుల్లోపే వాడుకోవాల్సి ఉంటుంది. అందుకే కొద్ది కొద్దిగా తీసి వాడుకోవాలి.

ప్రత్యామ్నాయ పద్ధతులు

పచ్చిక బయళ్లు, బీడు భూముల్లో పశుగ్రాసపు చెట్లను (సుబాబుల్‌, అవిసె, ఇప్పచెట్టు) పెంచి ఈ చెట్ల మధ్య గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రానేపియర్‌ లేదా అంజన్‌గడ్డి లేదా గినీ గడ్డి, పప్పుజాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా సాగుచేయాలి. ఈ పద్ధతినే సిల్విపాశ్చర్‌’ అంటారు. తద్వారా సాలీనా పశువులకు పచ్చిమేత అందుబాటులో ఉంటుంది.

అజొల్లా: తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే మంచి పోషక విలువలున్న అజొల్లా రకం గడ్డి వల్ల పశువులకు పోషకాలు బాగా అందుతాయి. అజొల్లాలో ప్రోటీన్లు 25-35 శాతం ఉంటాయి. ఈ రకంలో విటమిన్లు, ఖనిజాలు సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి గనుక రైతులు తక్కువ విస్తీర్ణంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడిని సాధించొచ్చు. రెండు కిలోల అజొల్లా ఒక కిలో దాణాతో సమానం. దాణాతో పాటు అజొల్లాను 1.5 – 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశువుల్లో ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే గాక పాల దిగుబడి శాతం కూడా పెరుగుతుంది.

హైడ్రోఫోనిక్‌ పద్ధతిలో పశుగ్రాసాల సాగు

నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే పద్ధతినే ‘హైడ్రోఫోనిక్స్‌’గా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్‌ గ్రీన్‌ హౌస్‌ యంత్రాల్లో సాగుచేస్తారు. ఈ పద్ధతికి మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఓట్స్‌, బార్లీ మొదలగు ధాన్యపు జాతి పశుగ్రాసాలు సాగుకు అనువుగా ఉంటాయి. ఈ విధానంలో విత్తిన వారం రోజుల్లోనే మొక్క 25-30 సెం.మీ. ఎత్తు పెరిగి ఒక కిలో విత్తనానికి 6-8 రెట్ల పచ్చి మేత దిగుబడినిస్తుంది. హైడ్రోఫోనిక్‌ పద్దతిలో పశుగ్రాసాల సాగుకు అవరమయ్యే నీటి శాతం 1/10వ వంతు మాత్రమే.

పశుగ్రాసాల సాగులో రైతులు గుర్తుంచుకో వాల్సిన ముఖ్యాంశాలు:

1. గడ్డిజాతి పశుగ్రాస విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి గనుక విత్తేటప్పుడు 2 సెం.మీ. లోతు కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

2. గడ్డి రకం పంటలను 50 శాతం పూత దశలో కోసి వాడితే నాణ్యత గల పచ్చి మేతను పొందొచ్చు.

3. మేతలో మూడొంతుల గడ్డి జాతి పశుగ్రాసంతో పాటు, ఒక వంతు పప్పుజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వల్ల పశువులకు ఎక్కువ పోషకాలు అందుతాయి.

4. జొన్న గ్రాసాన్ని మాత్రం పూత తర్వాతనే కోయాలి. లేకపోతే పశువులకు ‘నాము’ వ్యాధిసోకే అవకాశముంది.

5. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

6. బాజ్రానేపియర్‌ హైబ్రిడ్‌ రకం సాగులో మొదటి కోతను 70 రోజుల తర్వాత. రెండో కోతను 45 రోజుల తర్వాత కోసుకోవాలి.

7. స్టైలో విత్తనాలను వేడి నీటిలో 800 డిగ్రీల్లో 4 నిమిషాలు నానబెట్టి తర్వాత రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది.

8. పశుగ్రాసాల సాగులో వీలైనంతవరకు రసాయన క్రిమిసంహారకాలను వాడకూడదు. క్రిమిసంహార కాల వాడకం వల్ల పశువులకు అనారోగ్యం సోకే అవకాశముంది. ఒకవేళ వినియోగించినా 15-20 రోజుల తర్వాతనే ఆ పంటను కోసుకోవాలి.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, వ్యాసకర్త వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *