ఆజాదీ కా అమృతోత్సవ్‌ – ‌దేశ స్వాతంత్య్ర 75 వసంతాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో గోరక్షణకు అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పు జాతి మనోబలాన్ని పెంచేదే.

 1947కి ముందు 36 కోట్ల గోసంపదతో వ్యవసాయం సుభిక్షంగా ఉండగా, 50 సంవత్సరాలలో ఆ సంపద 10 కోట్లకు తగ్గిపోయింది. వధశాలలు 300 నుండి వేల సంఖ్యకు చేరి, వేల టన్నులలో గోమాంస ఎగుమతులు పెరిగాయి. విదేశాలు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గుతుంటే మనం గోమాంస ఎగుమతుల వైపు మొగ్గి ప్రమాదంలో పడిపోతున్నాం. విదేశాలు నిషేధించిన పురుగుమందులు వాడి జీన్స్ ‌లోపం తెచ్చి భవిష్యత్తరాల వినాశనానికి విషబీజాలు నాటుతున్నాం.

ఈ సెప్టెంబర్‌ 1‌వ తేదీన అలహాబాద్‌ ‌హైకోర్టు గోరక్షణకు అనేక విషయాలను జోడిస్తూ తీర్పు వెలువరించింది. 2021, 2018, 2017, 2005 సంవత్సరాలలో అనేక సందర్భాలలో  తెలంగాణ, ముంబాయి, కోల్‌కత్తా  సహా ఇతర హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇప్పటికే గోరక్షణపై స్పష్టమైన తీర్పులు వెలువరించినాయి. తాజా తీర్పులోని అంశాలను అన్ని రాష్ట్రాలు అమలుచేయాలి. దీని ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను గోవులకు వెంటనే వర్తింపచేయాలి. గోమాంస భక్షణ ఎవరికీ మౌలిక హక్కు కాదు. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనది. జిహ్వ కోసం ఇతర జీవుల ప్రాణాలు తీసే అధికారం ఎవరికీ లేదు.  భారతీయ సంస్కృతిలో, దేశంలో గోమాత (part of the culture of our Nation) భాగం. గోరక్షణ కేవలం ధార్మిక, మతపరమైన విషయం కాదు.  గో సంక్షేమం పైనే దేశ సంక్షేమం ఆధారపడి ఉంది. గోరక్షణ-గోసంవర్ధన ఈ దేశంలోని ప్రజలందరి మౌలిక కర్తవ్యం, బాధ్యత, హక్కు, విధి. పూజించే వారికి, ఆర్థికంగా ఆధారపడే వారికి గోరక్షణ ప్రాథమిక హక్కు. సంస్కృతి, శ్రద్ధ, విశ్వాసాలు దెబ్బతింటే దేశం బలహీనపడుతుంది. కనుక సంస్కృతీ పరిరక్షణ మతాలు, కులాలు, వర్గాలు ప్రాంతాలకతీతంగా దేశంలో నివసించే ప్రతీ పౌరుని   ప్రాథమిక బాధ్యత, విధి. సుదీర్ఘ చరిత్రలో ఎప్పుడెప్పుడు మన సంస్కృతీ, విశ్వాసాల రక్షణను మరిచామో అప్పుడల్లా విదేశీ ఆక్రమణలకు లొంగి, బానిసలమైనాం. అనేకమంది వీరాధివీరుల ప్రయత్నంతో వేల సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రంగా మన సంస్కృతి నిలబడిందని గుర్తించాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది ఉల్లంఘించినవారికి 7 నుండి 10 సంవత్సరాల వరకు కారాగారం, 3 నుండి 5 లక్షల వరకు జరిమానా ఉంటాయి. జరిమానా విధింపును ఉదహరిస్తూ, గోరక్షణ ప్రజల విశ్వాసాలు, వైజ్ఞానిక ప్రయోజనాల దృష్ట్యా వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సంగతిని కూడా న్యాయమూర్తి గుర్తు చేశారు.

1954 నాటి బొంబాయి హైకోర్టు ఆదేశం కూడా కీలకమైనది. గోవధ సంపూర్ణ నిషేధం వైపు తీసుకువెళ్లిన ఆదేశమది. 18 లేదా 15 సంవత్సరాలు అంటూ గోవధకు మినహాయింపులను ఆ తీర్పు నిరసించింది. గోవులు వయసు మీరినా వ్యయసాయానికీ, వైద్యానికీ, బయోగ్యాస్‌కు కావలసిన మూత్రం, పేడను ఇస్తూ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ కారణాలతో వధించే అధికారం ఎవరికీ ఉండదు. అందుకే గోరక్షణ రాజ్యాంగం, రాష్ట్ర, కేంద్ర పాలకుల మౌలిక బాధ్యత. రాజ్యాంగ నిర్ణాయక సభలో ఆర్థిక, నైతిక విషయాలు రెండూ గోవధ నిషేధంపై ఉన్నాయి. గోరక్షణ రాష్ట్ర జాబితాలో ఉంచటం ద్వారా, కొన్ని రాష్ట్రాల్లో గోహత్యా నిషేధం అమలులో ఉండటం లేదు. అది అక్కడ సామరస్యానికి భంగం కలిగిస్తున్నది.  గోరక్షణ ఆవశ్యకతను చెప్పే వివిధ మతాల, చారిత్రక, పౌరాణిక, వైజ్ఞానిక, వైద్యపరమైన విషయాలను తమ తీర్పులలో న్యాయమూర్తులు ప్రస్తావిస్తూనే ఉన్నారు కూడా.  ఆక్సిజన్‌ ‌తీసుకుని మళ్లీ అదే తిరిగి ఇవ్వగలిగే శక్తి గోవుకు ఉంది. గోవు పంచగవ్యాలు మొండిరోగాలను నయం చేయగలవు. తన మాంసంతో కేవలం కొద్ది మందికే కడుపు నింపగలుగుతుంది. కానీ గోఘృతం (నెయ్యి) యజ్ఞం ద్వారా, హవిష్షు ద్వారా వర్షాలు ఇస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్‌ ‌పెంచి, కాలుష్యాలను హరిస్తుంది. వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం పితృదేవతల ఉత్తమలోక ప్రాప్తికి గోవే ఆధారం. హానికారక సూక్ష్మ క్రిములను నాశనం చేసి, వ్యవసాయాన్ని వృద్ధి చేస్తుంది. వేద, శాస్త్ర, పురాణ, రామాయణ, మహాభారత, భాగవతాలతో, గోసంస్కృతితో భారత్‌కి గుర్తింపు వచ్చిందని కూడా కోర్టులు అభిప్రాయపడ్డాయి. కృష్ణుడు గోవును గీతలో ‘కామధేను’ అన్నాడు.ఏసు ‘గోవు, ఎద్దు హత్య మనుషుల హత్యతో సమానం’ అన్నాడు. జైన్‌ ‌మతం ‘గోమాత స్వర్గ ప్రదాయిని’ అంటుంది. బుద్ధభగవానుడు ‘మనుషులకు మిత్రురాలు’ అని చెప్పాడు. గురుగోవింద్‌ ‘‌గోరక్షణ నీ బాధ్యత’ అని ఆనాడే చెప్పాడు. శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పురాణ పురుషులు  వశిష్టుడు, తీర్థంకరులు,చాణక్య, శంకర భగవత్పాదులు, మంగళపాండే, తిలక్‌, ‌మదన్‌ ‌మోహనమాలవీయ, మహర్షి అరవింద్‌, ‌గాంధీ,  రాందేవ్‌ ‌వంటి వారిని గోరక్షణ సంబంధంగా న్యాయమూర్తులు ఉటకించారు. మౌలానా అబ్దుల్‌ ‌హుసేన్‌, అహ్మద్‌ ‌మదానీ, ఖ్వాజా హాసన్‌లు కూడా గోరక్షణకు మద్దుతు తెలిపిన సంగతిని కూడా వారు గుర్తు చేశారు. పంజాబ్‌ ‌రంజిత్‌ ‌సింగ్‌ ‌గోహత్యకు మృత్యు దండన శిక్ష విధించారు. మైసూర్‌ ‌హైదర్‌ ఆలీ నవాబ్‌ ‌గోవధ దండనీయ అపరాధంగా ప్రకటించారు. బాబర్‌, ‌హుమాయూన్‌, అక్బర్‌ ‌వంటి వారందరూ గోవధ నిషేదాన్ని అమలు పరిచినవారే.1857 ప్రథమ భారత స్వతంత్ర పోరాటం గోభక్తి ప్రేరక విన్ఫులింగం.

తెలంగాణ హైకోర్టు జూలై 19, 2021న తన తీర్పు వెలువరిస్తూ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అవి:

గోరక్షకులు సి.ఆర్‌.‌పి. 43 ప్రకారం గోవులను కబేళాలకు తరలించే వాహనాలను ఆపవచ్చు. 100కి డయల్‌ ‌చేసి పోలీసులకు తెలపాలి. స్టేషన్‌లలో తప్పనిసరిగా కేసు బుక్‌ ‌చేయాలి.

తనిఖీలకు చెక్‌పోస్టుల దగ్గర  గోరక్షకులను అనుమతించాలి.

సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్‌ ‌నగరానికి గోవులను తరలించే వాహనాలను ఎట్టి పరిస్థితులోనూ అనుమతించరాదు. ఇలా పలు సూచనలు చేసింది.

కేంద్ర కామధేను ఆయోగ్‌ ‌బోర్డు ద్వారా 2020 దీపావళికి గోమయ ప్రమిదలు  తయారీ దేశవ్యాప్త్యంగా పెద్ద ప్రభావమే చూపించింది. చిన్న ప్రయత్నం కూడా కనీసం 25 వేల రూపాయల ఆదాయాన్ని కలిగించింది. 2021లో గోమయంతో రంగుల తయారీ, పూలకుండీలు, విగ్రహాలు, రాఖీలు – సుమారు 100పైన గో ఉత్పత్తుల తయారీ ప్రయత్నాలు ముందుకెళ్తున్నాయి. వ్యవసాయ ఎరువులూ, పురుగు మందుల కషాయాలూ, 20 రకాల గోమూత్ర ఔషధాలు, ఆవు నెయ్యి, పంచగవ్యాలతో రకరకాల ఔషధాలు – బహుళ ప్రయోజనాన్ని కలిగిస్తూ, కరోనా పరిస్థితిలోనూ తమ ప్రభావాన్ని చూపాయి.

–  జగన్మోహన్‌, 7382440729
ప్రాంత సహగోసేవా ప్రముఖ్‌, ‌తెలంగాణ

————–

ఒడిశా గోపాలురు..

గోరక్షాదళ్‌ ‌గోశాల అత్తాపూర్‌లో (పీవీ ఎక్స్‌ప్రెస్‌ ‌వే 161వ పిల్లర్‌ ‌వద్ద) ఉంది. 2003లో ఆరంభమైన ఈ గోశాల అనంతపద్మనాభస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇదొక పురాతన ఆలయం. కొండమీద అనంతపద్మనాభ స్వామివారి కోవెల, కింద వినాయకుడు, హనుమ, శివాలయాలు ఉన్నాయి. కొంతవరకు శిథిలమైపోయిన ఈ ప్రాంగణంలోనే గోశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆరువందల వరకు గోవులు ఉన్నాయి. వీటి పోషణ, సంరక్షణ బాధ్యత మొత్తం 21 మంది చూస్తూ ఉంటారు. ఇందులో పనిచేసే యువకుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. వీరంతా ఒడిశా నుంచి వచ్చినవారే. వారే ఎందుకు అంటే, గోవు మీద వారికి ఉన్న భక్తి, గౌరవం మరొకరిలో చూడడం సాధ్యంకాదని అంటారు శ్రీధర్‌. ఒక గోవును ఎంత జాగ్రత్తగా చూస్తారో చెప్పాలంటే వారి ఆచారం గురించి తెలియాలి. ఒక గోవు మరణిస్తే వీరే నిర్వర్తించే కార్యక్రమం గురించి తెలుసుకోవాలి. వీరు సాకుతున్న గోవులలో ఏదైనా కన్నుమూస్తే (కారణం ఏదైనా) వారు పాపపరిహారం చేసుకుంటారు. వెంటనే ఒడిశా వెళ్లి పూరీ జగన్నాథుని దర్శించుకుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. పదకొండు ఇళ్లలో భిక్ష కోరతారు. ఆ తరువాత మళ్లీ గోసంరక్షణలో చేరతారు. ఈ ఒడిశా గోపాలురు ఇక్కడ 11 మంది ఉన్నారు. ఇది 24 గంటల పని. మహిళలంతా స్థానికులే. ఒకటి నిజం. వీరికి జీతాలు ఇస్తారు. అయినా గోశాలలో పనిచేయడానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కావాలి. సేవాభావం ఉండాలి. ధార్మిక దృష్టి ఉండాలి. వీటిలో ఎక్కువ కసాయి కేంద్రాల నుంచి ఇక్కడకు వచ్చినవే. ఈ గోశాల మేనేజర్‌ ‌మిశ్రా. ఆయన కూడా ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినవారే.

————-

మనిషే మృగమైతే…

కొమ్ములు విరిగినవి.. కాళ్ల ఎముకలు విరిగి లేవలేనివి.. రోజుల తరబడి నీళ్లూ, గడ్డీ లేక నీరసించినవి… గిట్టలు తెగినవి…తోకలు విరిగినవి.. దేహమంతా గాయాలతో ఆవులు జియాగూడ ఆశ్రమ గోశాలలో కనిపిస్తాయి.

మనిషి నోరు లేని జీవాల పట్ల చూపిన క్రూరత్వానికి ఇది ప్రబల సాక్ష్యం. మనిషే పశువా అన్న ప్రశ్న వేసుకునేటట్టు చేస్తాయి. దేశంలో ఏదో మూల నుంచి మరేదో మూలకి గోసంతతి అక్రమ రవాణా అవుతూ ఉంటుంది. భారీ వాహనాలలో రోజుల తరబడి ఆవులూ, ఎడ్లూ ఉంచుతారు. మూడురోజులో నాలుగురోజులో, అంతకంటే ఎక్కువగానో అలాగే నీళ్లూ, గడ్డీ లేకుండా ఆ వాహనాలలో ఉండిపోతాయి. వాహనాలకు కుదుపు వచ్చినప్పుడు డెబ్బయ్‌ ఎనభయ్‌ ‌నుంచి వంద వరకు కూడా కిక్కిరిసి ఉండే ఈ ప్రాణులు కిందపడిపోతాయి. పొడుచుకుంటాయి. తొక్కుకుంటాయి. వాటిని గోరక్షకులు పట్టుకుని పోరాడి  గోశాలలకు తీసుకువస్తారు. ఆ తరువాత కనిపించే  వాటి స్థితి ఇంత హృదయ విదారకంగా ఉంటుంది. ఇక్కడకు తీసుకు వచ్చిన తరువాత వైద్యం చేస్తారు. కొన్ని వెంటనే కోలుకోగలుగుతాయి. కొన్నింటికి సమయం పడుతుంది. కాస్త ఓపిక వచ్చే వరకు అలా కళ్లు తెరుచుకుని కదిలే ఓపిక లేక తల వాల్చేసి ఉంటాయి. దగ్గరకు వెళితే ఒక్కసారి తల లేపి మళ్లీ పడుకుంటాయి. కాళ్లు విరిగినవి ఒక చోటే ఉండిపోతాయి. జియాగూడ గోశాలలో పశువైద్యశాల కూడా ఉంది.

About Author

By editor

Twitter
Instagram