– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌శాంతి అంటే రెండు యుద్ధాల నడుమ విరామమే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు రాజకీయ పండితులు. ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా మధ్య సంఘర్షణకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాజాగా పదకొండు రోజుల పాటు జరిగిన ఘర్షణ, మళ్లీ కాల్పుల విరమణ దీనినే గుర్తుకు తెస్తాయి. పశ్చిమాసియా- ప్రపంచంలోనే రాజకీయంగా, వ్యూహాత్మకంగా అత్యంత పెళుసైన, సున్నితమైన ప్రాంతం. అక్కడ అనూహ్యంగా యుద్ధమేఘాలు కమ్ముకొస్తుంటాయి. రాకెట్లు పేలుతుంటాయి. యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతుంటాయి. బహుళ అంతస్తుల అత్యాధునిక భవనాలు నేలమట్టం అవుతుంటాయి. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుంటాయి. రెండుదేశాల మధ్య అన్నివేళలా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. ఇరుదేశాల అధినేతలు, ద్వితీయశ్రేణి నేతలు, సైనికాధికారులు తరచూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంటారు. యుద్ధ బూచి చూపి, జాతీయ, మత భావనలను రెచ్చ గొడుతూ తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు సైతం ఇరుదేశాల అధినేతలు వెనకాడరు. అందుకే ప్రపంచంలోనే పశ్చమాసియా అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరొందింది.  దీనిని పాశ్చాత్యులు మధ్య ప్రాచ్యం (మిడిల్‌ ఈస్ట్) అం‌టారు.

ఉగ్రవాద సంస్థ హమాస్‌, ఇ‌జ్రాయెల్‌ ‌సేనల నడుమ చెలరేగిన దాడుల కారణంగా ఈసారి పాలస్తీనాలో రంజాన్‌ ‌వాతావరణమే కనిపించలేదు. తాజా వివాదం మొదలైనదే పండుగ మాసంలో. ఎట్టకేలకు అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ఇజ్రాయెల్‌ ‌కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని బెంజిమన్‌ ‌నెతన్యాహూ నాయకత్వంలోని మంత్రివర్గం తీర్మానం చేసింది. గాజా తరఫున ‘హమాస్‌’ ‌సైతం కాల్పుల విరమణకు సుముఖుత చూపడంతో పశ్చిమాసియాలో 11 రోజుల ఘర్షణకు తెరపడింది. మే 21న నెతన్యాహు కాల్పుల విరమణకు తీర్మానించారు. ఇందులో విజేతలు, పరాజితులు ఎవరు అన్న విషయాన్ని పక్కనపెడితే శాంతికి బాటలు పరచడం సంపూర్ణంగా స్వాగతించదగ్గ అంశం. ఈ పదిరోజుల సంఘర్షణలో 230 మంది పాలస్తీనియన్లు చనిపోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్‌ ‌తమ భూభాగం మీద 4,070 రాకెట్లు ప్రయో గించిందని ఇజ్రాయెల్‌ ‌రక్షణ విభాగం వెల్లడించింది. ఇటు కూడా కొంత ప్రాణ నష్టం ఉంది. ఈ రాకెట్లను నిరోధించే పటిష్ట వ్యవస్థ ఉన్నప్పటికి 12 మంది మరణించారని ఆ రక్షణ విభాగం ప్రకటించింది. తాజా గొడవలు ఆరంభించింది హమాస్‌ అని ఇజ్రాయెల్‌ ఆరోపణ.

ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌మధ్య ఇప్పుడు జరిగిన గొడవలకు కొత్త కారణాలేమీ లేవు. రంజాన్‌ ‌మాసంలో జెరూసలెంలోని ప్రఖ్యాత అల్‌ ఆక్సా మసీదు వద్ద జరిగిన చిన్నపాటి గొడవలే కారణమని చెప్పకతప్పదు. కొద్దిరోజుల క్రితం ఆ మసీదు వద్ద ఇజ్రాయెల్‌ ‌భద్రతా బలగాలకు, గాజా పౌరులకు ప్రార్థనల విషయంలో చిన్నపాటి వివాదం ఏర్పడింది. ఇది చిలికి చిలికిగాలి వానగా మారి రెండు దేశాలూ దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. వివాదానికి కేంద్ర బిందువు దాదాపు 35 ఎకరాల్లో విస్తరించిన సువిశాల అల్‌ అక్సా మసీదు. ఇది మూడు మతాలకు – ముస్లిములకు, యూదులకు, క్రైస్తవులకు కూడా పవిత్రమైనది. ఈ విషయమై తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. ముస్లిములు దీనిని హరామ్‌ అల్‌ ‌షరీఫ్‌ (‌పవిత్ర స్థలం) అని పిలుచుకుంటారు. యూదులు టెంపుల్‌ ‌మౌంట్‌ (‌పవిత్ర కొండ) అని వ్యవహరిస్తుంటారు. మహ్మద్‌ ‌ప్రవక్త మక్కా నుంచి ఒకరాత్రి ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం స్వర్గారోహణ చేశారన్నది ముస్లిముల విశ్వాసం. అందువల్ల వారు ఈ మసీదులో ప్రార్థనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ ఒకేసారి అయుదువేల మంది ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనిని ఎనిమిదో శతాబ్దంలో నిర్మించారని చెబుతుంటారు. బంగారు పూతతో కూడిన రాతిచిప్ప లాంటి కప్పు ఈ మసీదు ప్రత్యేకత.

 యూదులు కూడా మసీదు ప్రాంతాన్ని తమ పవిత్ర స్థలంగా పరిగణిస్తుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రెండు యూదు దేవాలయాలు ఉండేవి. మొదటి ఆలయాన్ని కింగ్‌ ‌సాల్మన్‌ ‌నిర్మించారన్నది వారి విశ్వాసం. ఆ తరవాత బాబిలేనియన్లు దానిని పడగొట్టారు. రెండో ఆలయం రోమన్‌ ‌చక్రవర్తుల చేతిలో ధ్వంసమైంది. మెసయ్య తిరగివచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందన్నది యూదుల నమ్మకం. తొలి రోజుల్లో ఈ మసీదు జోర్డాన్‌ ఆధీనంలో ఉండేది. 1967 నాటి యుద్ధంలో ఈ మసీదు ఉన్న తూర్పు జెరూసలెం నగరాన్ని జోర్డాన్‌ ‌నుంచి ఇజ్రాయెల్‌ ‌స్వాధీనం చేసుకుంది. ఆ తరవాత జెరూసలెంను ఇజ్రాయెల్‌ ‌తన రాజధానిగా ప్రకటించుకుంది. అయితే మసీదు నిర్వహణ బాధ్యతను జోర్డాన్‌కు చెందిన ఇస్లామిక్‌ ‌ట్రస్టుకు అప్పగించారు. ఇజ్రాయెల్‌ ‌బలగాలు మసీదు ప్రాంగణంలో ఉంటూ ట్రస్టుతో సమన్వయంగా వ్యవహరిస్తుంటాయి. మసీదులో ప్రార్థనలకు ముస్లిములను అనుమతించినట్లుగా యూదులు, క్రైస్తవులను అనుమతించరు. ముస్లిములు నేరుగా మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసుకోవచ్చు. యూదులు, క్రైస్తవులకు ఈ వెసులుబాటు లేదు. వారు ఈ స్థలాన్ని సందర్శించడానికి మాత్రమే అనుమతి ఉంది. మసీదులోని రాతికప్పు కేంద్ర పశ్చిమ భాగంలోని గోడ వద్ద యూదులు ప్రార్థనలు చేస్తారు. ఈ గోడ ఒకప్పుడు టెంపుల్‌ ‌మౌంట్‌లో భాగంగా ఉండేదన్నది వారి నమ్మకం. ముస్లిమేతరులను ప్రార్థనలకు అనుమతించకపోవడంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇది చినికి చినికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ‘జెరూసలెం డే’ కార్యక్రమం ఘర్షణలకు ఆజ్యం పోసింది. తూర్పు జెరూసలెంలో నివసిస్తున్న పాలస్తీనా వాసులను ఈ ప్రదర్శన రెచ్చగొట్టింది. యథాతథ స్థితిని (ముస్లిమేతరులను ప్రార్థనలకు అంగీకరించరు) కొనసాగిస్తామని అధికారికంగా ప్రకటించినా ఇజ్రాయెల్‌ ‌లోని అనేక మత సంస్థలు తమకూ ప్రార్థనలు చేసుకనే అవకాశం కల్పించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెరూసలెం పాతబస్తీ (తూర్పు జెరూసలెం)లో యూదులు, పాలస్తీనియన్లకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇవి తదనంతరం రెండు దేశాల మధ్య దాడులకు దారితీశాయి.

రాజకీయ కారణలూ…

తాజా ఘర్షణల వెనక ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా అంతర్గత రాజకీయ కారణాలూ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండేళ్లలో ఇజ్రాయెల్‌ ‌నాలుగుసార్లు ఎన్నికలకు వెళ్లింది. ఈ నాలుగు సందర్భాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. యుద్ధానికి ఉత్సాహపడిన లికుడ్‌ ‌పార్టీ అధినేత, ప్రధాని నెతన్యాహూ మొన్న మార్చిలో నాలుగోసారి జరిగిన ఎన్నికల్లోనూ మెజార్టీ సాధించలేకపోయారు. సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం రాజకీయంగా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు అయిదోసారి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. యుద్ధం ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను రెచ్చగొట్టి, వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలో నెతన్యాహూ ఉన్నారని కూడా చెబుతున్నారు. హమాస్‌ను అంత తేలిగ్గా వదిలిపెట్టబోమని, అంతు చూస్తామని నెతన్యాహూ దేశ టెలివిజన్‌ ‌చానల్‌లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పాలస్తీనాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ నెల 30న ఇక్కడ చట్టసభకు ఎన్నికలు జరగాలి. దాడులను సాకుగా చూపి ఫతా పార్టీ అధినేత, దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ ‌వాటిని నిరవధికంగా వాయిదా వేశారు. వెస్ట్ ‌బ్యాంకులో ఫతా పార్టీ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. ఇక్కడ హమాస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదన్నది ఫతా పార్టీ ఉద్దేశం. ప్రస్తుతానికి గాజా స్ట్రిప్‌ ‌హమాస్‌ ‌గుప్పెట్లో ఉంది. ఇజ్రాయెల్‌ ‌ను ప్రతిఘటించే శక్తిగా అవతరించి, తద్వారా వెస్ట్ ‌బ్యాంకు ప్రజల్లో ప్రాబల్యం పెంచుకుని, రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది దాని ఆలోచన. అందుకే దాడుల్లో పెద్దసంఖ్యలో పాలస్తీనా పౌరులు మరణిస్తున్నప్పటికీ హమాస్‌ ‌వెనకడుగు వేయడం లేదు. వాస్తవానికి ఇజ్రాయెల్‌ ‌బలం ముందు హమాస్‌ ‌శక్తి సామర్థ్యాలు పరిమితమే. ఇక హమాస్‌ ‌దూకుడుతో వెస్ట్ ‌బ్యాంకు లోని ఫతా పార్టీపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

శాంతి….శాంతి

ఇజ్రయెల్‌, ‌హమాస్‌ ‌ఘర్షణలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలకు వెంటనే ముందుకు రావాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌, ‌పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌విజప్తి చేశారు. గాజాలోని అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌, అల్‌ ‌జజీరా, ఇతర మీడియా సంస్థల కార్యాయాలున్న భవనాలను ఇజ్రాయెల్‌ ‌కూల్చింది. ఇజ్రాయెల్‌ ‌మీద ప్రసారం చేస్తున్న నకిలీ వార్తల వల్లనే కూల్చివేస్తున్నట్టు ఇజ్రాయెల్‌ ‌సమాధానం. కొన్ని దేశాలు రాజీ ప్రయత్నాలు చేశాయి. పశ్చిమాసియా వ్యవహరాల్లో మొదటి నుంచీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా ఇరుపక్షాలూ వెనక్కు తగ్గాలని కోరింది. వాషింగ్టన్‌ ‌విధాన నిర్ణేతలు ఎవరైనప్పటికీ ఇజ్రాయెల్‌ ‌పట్ల వారి వైఖరిలో పెద్దగా మార్పుండదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ‌తోపాటు ప్రస్తుత అధినేత బైడెన్‌ది ఇదే విధానం. తాజా ఘర్షణలకు సంబంధించి బైడెన్‌ ఇ‌జ్రాయెల్‌ ‌ప్రధాని బెంజిమన్న నెతన్యాహుతో మాట్లాడారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన ఫ్రాన్స్ ‌రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌ ‌పొరుగున్న ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లతో మాట్లాడింది.

పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్‌ అనుచితంగా వ్యవహరిస్తోందని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ ‌తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆ‌గ్రహించారు. అంతర్జాతీయ సమాజం ఆ దేశానికి గట్టిగా సమాధానం చెప్పాలని ఆయన కోరారు.ఇది ఎవరినీ ఆశ్చర్యపరిచే ప్రకటన కాదు. కారణం టర్కీ ప్రస్తుత విధానం తెలిసిందే.దాని ధ్యేయం ఇస్లామిక్‌ ‌దేశాలకు నాయకత్వం వహించాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌తో ఎర్డోగన్‌ ‌మాట్లాడారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి టర్కీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఈజిప్టు అధికారులు గాజా నగరంలో హమాస్‌ ‌నేతలతో చర్చలు జరిపారు. అనంతరం టెల్‌ అవీవ్‌ ‌వెళ్లి ఇజ్రాయెల్‌ ‌నేతలతోనూ భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌ ‌బేషరతుగా వెనక్కి తగ్గాలని 57 దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌ (ఓఐసీ) డిమాండ్‌ ‌చేసింది. అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమావేశమైన ఈ దేశాలు అల్‌ అక్సా మసీదులోకి ముస్లిముల ప్రవేశాన్ని అడ్డుకోరాదని కోరింది. ఓఐసీలోని సభ్య దేశాలైన టర్కీ, ఇరాన్‌ ‌ధ్వజమెత్తాయి. ఇజ్రాయెల్‌ ‌మారణకాండకు పాల్పడుతోందని ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి జావెద్‌ ‌జారిఫ్‌ ఆరోపించారు. ఇజ్రాయెల్‌ ‌ను గుర్తిస్తూ కొన్ని అరబ్‌ ‌దేశాలు చేసుకున్న ఒప్పందాలను టర్కీ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టారు. ఇజ్రాయెల్‌ ‌యుద్ధ నేరాలకు పాల్పడుతోందని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టమని అంతర్జాతీయ న్యాయస్థానంలో దోషిగా నిలలబెడతామని ఆయన హెచ్చరించారు.

 దేశాల రాజకీయాలు….

 గొడవల నుంచి అంతర్జాతీయంగా ఎదగడానికి కొన్ని దేశాలు ప్రయత్నించాయి. టర్కీ, పాకిస్తాన్‌ల మాదిరిగా మత పరమైన ప్రయోజనాలు ఆలోచనలు వాటికి ఉండడమే ఇందుకు కారణం. టర్కీ, చైనా ఈ విషయంలో ముందున్నాయి. అంతర్జాతీయంగా ముస్లిం సమాజానికి నాయకత్వం వహించాలన్న ఆలోచనతో టర్కీ ముందడుగు వేస్తోంది. ఇటీవల జరిగిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌ (ఓఐసీ) సమావేశంలో పాలస్తీనా రక్షణ కోసం ఓ రక్షణ దళాన్ని ఆలోచనను ప్రతిపాదించింది. అంతేకాక ఆ దళానికి తాను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందుకు ఇస్లామాబాద్‌ ‌వంత పాడింది. పాకిస్తాన్‌ ‌కు అంతర్జాతీయంగా గల విశ్వసనీయత ఏపాటిదో అందరికీ తెలిసిందే. నాటో (నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌దేశమైన టర్కీ ఇటీవల కాలంలో తనను తాను ఇస్లామిక్‌ ‌రక్షకుడిగా భావిస్తోంది. అయితే టర్కీ మాటలను నమ్మే పరిస్థితిలో ఏ ఇస్లామిక్‌ ‌దేశమూ లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌యుద్ధంపై చైనా కూడా హడావిడి చేసింది. రెండు దేశాల మధ్య రాజీకి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తద్వారా అరబ్‌ ‌దేశాల్లో అమెరికా పాత్రను తాను పోషించేందుకు చూస్తోంది. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవకాశముంటే అక్కడ అంతర్జాతీ యంగా అమెరికా ప్రాధాన్యాన్ని తగ్గించి, తన పరిధిని పెంచుకోవడం లక్ష్యంగా చైనా లక్ష్యం. శాంతి చర్చల్లో మధ్యవర్తి పాత్రకు సిద్ధమవడం అందులో భాగమే. స్వయం ప్రతిపత్తి గల ప్రాంతమైన టిబెట్‌లో బౌద్ధుల మీద, దేశం లోపలి వీగర్‌ ‌ముస్లిములపై ఉక్కుపాదం మోపుతున్న బీజింగ్‌ అం‌తర్జాతీయంగా ముస్లిములకు సంబంధించిన విషయాల్లో ఎక్కడ లేని ఉదారత, ఆసక్తి కనబరుస్తోంది.

ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌ఘర్షణలకు సంబంధించి భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని ఇరుదేశాలను కోరుతూనే తటస్థంగా ఉంది. వాస్తవానికి అటు ఇజ్రాయెల్‌, ఇటు పాలస్తీనాతో భారత్‌ ‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ (పీ ఎల్‌ ఓ) అధినేత దివంగత యాసర్‌ అరాఫత్‌ ‌హయాం నుంచి పాలస్తీనా హక్కుల కోసం మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తోంది. ఇందుకోసం కోసం కొంతకాలం, అంటే పీవీ ప్రధాని అయ్యే వరకు ఇజ్రాయెల్‌ను దూరంగా పెట్టింది. లుక్‌ఈస్ట్, ‌యాక్ట్ ఈస్ట్ ‌విధానాలతో కాలక్రమంలో తన వైఖరిని మార్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2017లో ఇజ్రాయెల్‌ ‌ను సందర్శించి ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెరదీశారు. యూదు దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. నిజానికి భారత్‌ ఎదుర్కొంటున్న ముస్లిం ఛాందస ఉగ్రవాద సమస్య నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను అక్కున చేర్చుకుంటున్నది కూడా. అంతమాత్రాన పాలస్తీనా న్యాయబద్ధమైన హక్కులను విస్మరించడం లేదు. ఒక దేశంతో స్నేహంగా ఉన్నంత మాత్రాన మరొక దేశానికి వ్యతిరేకం కాదన్న విధానాన్ని పాటిస్తోంది. పాలస్తీనాకు సంబంధించి ఐక్యరాజ్య సమితి తీర్మానాల అమలు, రెండు దేశాల విధానం, తీవ్రవాద సంస్థ హమాస్‌ ‌దాడులపై వ్యతిరేకత తదితర అంశాల్లో భారత్‌ ‌విధానంలో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం. ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌. ‌తిరుమూర్తి ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. భారత్‌ ‌వైఖరిని అటు ఇజ్రాయెల్‌, ఇటు పాలస్తీనా సానుకూల వైఖరితో అర్థం చేసుకున్నాయి. అందుకే ఆ రెండు దేశాలూ భారత్‌ ‌పై విమర్శలకు దూరంగా ఉన్నాయి. మొత్తానికి కాస్త ఆలస్యమైనప్పటికీ కాల్పుల విరమణను ఇరుపక్షాలు పాటించడం ఆహ్వానించదగ్గ అంశం. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవకుండా, దానిని తుచ తప్పకుండా ఇరుదేశాలు పాటించడంపైనే పశ్చిమాసియాలో శాంతిస్థాపన సాధ్యపడుతుంది. ఆ దిశగా ఉభయ పక్షాలూ అడుగులు వేయాలని, కలసి పనిచేయాలని అంతర్జాతీయ సమాజం మనసారా కోరుకుంటోంది.

————-

కేరళ మహిళ కన్నుమూత

హమాస్‌ ‌రాకెట్ల దాడిలో, ఇజ్రాయెల్‌ ‌యుద్ధ విమానాల దాడిలో అమాయక పౌరులు హతులవడం ఆందోళన కలిగించింది.దాడుల కారణంగా అభం శుభం తెలియని అనేకమంది చిన్నారులకు నూరేళ్లు నిండాయి. పిల్లలను కోల్పోయి ఒకరు, భర్తను కోల్పోయి ఇంకొకరు, భార్యను కోల్పోయి మరో అభాగ్యుడు కన్నీరున్నీరయ్యాడు. ఇజ్రాయెల్‌లోని అష్కెలాల్‌ ‌నగరంలో చోటు చేసుకున్న సంఘటన ఇందుకు నిదర్శనం. హమాస్‌ ‌దాడులకు కేరళకు చెందిన సౌమ్య అనే మహిళ కన్నుమూశారు. ఆమె మరణవార్త తొమ్మిదేళ్ల తమ కుమారుడు జీర్ణించుకోలేకపోతున్నరాని సౌమ్య భర్త సంతోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ పని ఒత్తిడిలో ఉందని రేపు ఫోన్‌ ‌చేస్తుందంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నామని ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదని సంతోష్‌ ‌గద్గద స్వరంతో చెప్పారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ ‌నుంచి వెనక్కు వచ్చేయాలనుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరిగిందని ఆయన రోదిస్తూ చెప్పారు. సౌమ్య భౌతిక కాయాన్ని కేరళకు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ ‌ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సౌమ్య మరణానికి భారత్‌లోని ఇజ్రాయెల్‌ ‌రాయబారి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా కేరళలోని సౌమ్య నివాసానికి వచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రివ్లిన్‌, ‌ప్రధాని నెతన్యాహూ, ఇంకా అనేకమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమ దేశస్తురాలు కానప్పటికీ సౌమ్య మరణం పట్ల ఇజ్రాయెల్‌ ‌నేతలు చూపించిన శ్రద్ధ, నిబద్ధత కొనియాడదగ్గది.

————–

యుద్ధ నియమాల ఉల్లంఘన

పౌర ఆవాసాలపై దాడులు జరపరాదన్నది సాధారణ యుద్ధ నియమం. నివాసాలు, వైద్యశాలలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రార్థనా స్థలాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు చేయరాదని అంతర్జాతీయ యుద్ధ నియమాలు చెబుతున్నాయి. కానీ ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇజ్రాయెల్‌ ఏకంగా మీడియా సంస్థలు పనిచేస్తున్న భవనంపై దాడికి దిగడం పరాకాష్ట. అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌ (ఏపీ), అల్‌ ‌జజీరా వంటి  అంతర్జాతీయ వార్తా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న 11 అంతస్తుల అల్‌ ‌జలాల్‌ ‌భవనాన్ని నేలమట్టం చేసింది. దాడి విషయాన్ని కేవలం గంట ముందే భవన యజమానికి అందించారు. కనీసం అయిదారు గంటలు సమయం ఇచ్చినా విలువైన వస్తువులు బయటకు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది. గాజా నగరంలోని ఐరాస నిర్వహిస్తున్న కాందిశీకుల శిబిరంపైనా ఇజ్రాయెల్‌ ‌రాకెట్ల వర్షం కురిపించింది. ఇది కచ్చితంగా యుద్ధ నియమాల ఉల్లంఘనే.

————————

About Author

By editor

Twitter
Instagram