– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పంజాబ్‌ ‌రైతులు ఉద్యమించారు. ఈ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ వాస్తవాలను కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ఉత్తరాది రాష్ట్రంలోనూ కమలం ఏమీ వెనకబడిపోలేదన్న వాస్తవం బోధపడుతుంది. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ ఏనాడూ అధికారంలో లేదు. 1996 నుంచి శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోరాడుతూ వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సాకుగా చూపి కమలంతో గల సుదీర్ఘ అనుబంధాన్ని ఆ పార్టీ తెంచుకుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి ఆ పార్టీకి చెందిన హర్‌ ‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌వైదొలిగారు. ఈమె పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌భార్య, పార్టీ సీనియర్‌ ‌నాయకుడు ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌కోడలు. అకాలీదళ్‌ ఏకపక్ష నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలోని పంజాబ్‌ ‌లోక్‌ ‌కాంగ్రెస్‌ (‌పీఎల్‌సీ), అకాలీదళ్‌ ‌చీలికవర్గంతో పొత్తు పెట్టుకుని భాజపా రంగంలోకి దిగింది. చాలాకాలం అధికారంలో ఉన్న అకాలీదళ్‌ ‌దూరమైనప్పటికీ ఈ ఎన్నికల్లో భాజపా పెద్దగా వెనకబడిందేమీ లేదు.

మూడు వ్యవసాయ చట్టాలపై విపక్షాలన్నీ కూడబలుక్కుని విషప్రచారం చేసినప్పటికీ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడం విశేషం. 2017 ఎన్నికల్లో అకాలీదళ్‌తో పొత్తున్నప్పటికీ 5.4 ఓటు శాతానికే పరిమితమైంది. ఈ దఫా ఓట్ల శాతం ఏకంగా 6.6. శాతానికి పెరగడాన్ని చూస్తే కమలం పట్ల పంజాబీల్లో విముఖత లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఈ అయిదేళ్లలో పార్టీ ఓట్ల శాతం 1.2 శాతం పెరగడం చిన్న విషయం కాదు. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన పార్టీ ఈసారి రెండు సీట్లు సాధించింది. ఇంతటి వ్యతిరేక ప్రచారం లోనూ గురుదాస్‌పూర్‌ ‌పార్లమెంటు పరిధిలోని పఠాన్‌కోట్‌ ‌స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వనీకుమార్‌ ‌శర్మ విజయం సాధించడం విశేషం. ఆయనకు 43,132 ఓట్లు రాగా ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థికి 35,373 ఓట్లు లభించాయి. దాదాపు ఎనిమిది వేల మెజార్టీని సాధించడం చిన్న విషయం కాదు. పఠాన్‌కోట్‌ ‌మొదటినుంచీ పార్టీకి పట్టున్న స్థానం. ఇక్కడ 1967లో జనసంఘ్‌, 1977‌లో జనతా పార్టీ, 1997, 1985, 2007, 2012ల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 2017లో కొద్ది తేడాతో ఓడిపోయింది. హోషియా పూర్‌ ‌జిల్లాలోని ముకేరియన్‌ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థి జంగీలాల్‌ ‌మహాజన్‌ 2691 ఓట్ల మెజార్టీతో ఆప్‌ అభ్యర్థిని ఓడించారు.

ఏకపక్షంగా భాజపాతో విడిపోయిన అకాలీదళ్‌ ఈ ఎన్నికల్లో సాధించింది ఏమీలేదు. ఆ పార్టీకి ఓట్లు, సీట్లు తగ్గడం గమనార్హం. అయిదుసార్లు సీఎంగా పనిచేసిన 94 సంవత్సరాల ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ ‌సొంత నియోజకవర్గం ‘లంబి’లో పరాజయం పాలయ్యారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ఓటమి అన్నది ఎరగరు. భాజపాతో పొత్తుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బాదల్‌ ‌కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌పాకిస్తాన్‌ ‌సరిహద్దుకు 11 కిలోమీటర్ల దూరంలో విస్తరించిన జలాలాబాద్‌ ‌నియోజక వర్గంలో ఓటమి పాలయ్యారు. 2017లో 25.2 శాతం ఓట్లు సాధించిన పార్టీ ఇప్పుడు 18.4 శాతానికే పరిమతమైంది. అంటే ఏకంగా 6.8శాతం ఓట్లకు గండి పడింది. అదేవిధంగా గత ఎన్నికల్లో 15 సీట్లు సాధించిన పార్టీ ఈ దఫా మూడు సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిని బట్టి చూస్తే పొత్తు లేనందున ఎవరికి నష్టం జరిగిందో అర్థమవుతుంది. అకాలీదళ్‌ ‌వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలిచినప్పటికీ అకాలీదళ్‌ ‌సాధించింది ఏమీ లేదన్నది సుస్పష్టం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీచేసిన భాజపా రెండు సీట్లు (గురుదాస్‌పూర్‌, ‌హోషియా పూర్‌) ‌గెలుచుకోగా, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అకాలీదళ్‌ ‌సైతం రెండు (భటిండా, ఫిరోజ్‌పూర్‌) ‌సీట్లే గెలుచుకుంది. దీనిని బట్టి ఎవరి బలం ఎంతో అర్థమవుతుంది. తాజా ఎన్నికల్లో ఆప్‌, ‌భాజపా ఓట్లశాతం పెరగ్గా, అకాలీదళ్‌, ‌కాంగ్రెస్‌ ఓట్లశాతం తగ్గడం గమనించదగ్గ విషయం. రైతు ఉద్యమాలకు మద్దతిచ్చినా కాంగ్రెస్‌, అకాలీదళ్‌ ఓట్ల శాతం తగ్గడం దేనికి సంకేతమో ఆ పార్టీలు విశ్లేషించుకోవాలి.

దాయాది దేశమైన పాకిస్తాన్‌తో సున్నితమైన సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్‌ ‘ఆప్‌’ ఏలుబడిలోకి రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళనా లేకపోలేదు. ఆప్‌ ‌నేతలూ గతంలో కొన్ని సందర్భాల్లో ఖలిస్తాన్‌ ‌వాదన పట్ల కొంత సానుకూలత కనబరిచిన విషయం తెలియనిది కాదు. సిక్కుల పవిత్రమైన స్వర్ణ దేవాలయం కొలువుదీరిన అమృత్‌సర్‌ ‌నగరానికి కేవలం 32 కిలోమీటర్ల దూరంలోనే భారత్‌-‌పాక్‌ ‌సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులోని వాఘా-అట్టారీ వద్ద రోజూ రెండు పూటలా సెక్యూరిటీ గార్డుల విన్యాసాలు జరుగుతుంటాయి. 80ల్లో ఇక్కడినుంచే పాకిస్తాన్‌ ‌ఖలిస్తాన్‌వాదులకు అన్నీ సమకూర్చేది. కర్తార్‌పూర్‌ ‌సాహిబ్‌ ‌గురుద్వారాకు సంబంధించిన నడవాను కూడా తెరవడంతో భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. గతంలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఇలాంటి ఆందోళన కలగడం సహజం. మాజీ క్రికెటర్‌, ‌పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ.. పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రమాణ స్వీకారానికి తగుదునమ్మా అంటూ వెళ్లిరావడం గమనార్హం. అంతేకాక ఇమ్రాన్‌ ‌పార్టీ నాయకులతో, మరీ ముఖ్యంగా ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌బజ్వాతో రాసుకుపూసుకు తిరగడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఒక క్రికెటర్‌గా ఇమ్రాన్‌తో గల అనుబంధం కారణంగా అక్కడికి వెళ్లానని, దీనివల్ల రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉందని అప్పట్లో సిద్ధూ వితండవాదన చేసి అభాసుపాలయ్యారు. అయితే, అతని ప్రవర్తనను హస్తం పార్టీ సైతం ఖండించలేకపోయింది.

ఇప్పుడు దాదాపు సిద్ధూ లాంటి నాయకుడైన భగవంత్‌సింగ్‌ ‌మాన్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య మంత్రి పగ్గాలు అప్పగించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సున్నితమైన సరిహద్దు రాష్ట్రానికి నాయకత్వం వహించగల అవగాహన, పరిపక్వత ఆయనకు ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మాన్‌ ‌గత ప్రవర్తనను విశ్లేషించినప్పుడు ఈ అభిప్రాయం ఎవరికైనా కలగక మానదు. ఈయన సంగ్రూర్‌ ‌స్థానం నుంచి 2014, 2019ల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్‌ ‌నుంచి పోటీచేసి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ ‌బాదల్‌పై ఓడిపోయారు. మద్యపాన వ్యసనానికి లోనైన మాన్‌ ‌తన ప్రవర్తనతో ప్రజాప్రతినిధి స్థాయిని దిగజార్చారు. రాజకీయ వర్గాల్లో ఆయనను భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ ‌బదులు పెగ్వంత్‌సింగ్‌ ‌మాన్‌ అని కొందరు పిలుస్తుంటారు. అంటే ఆయన అంతగా మద్యానికి చేరువయ్యాడన్న విషయం గమనార్హం. మాన్‌ ‌మద్యపానం అలవాటు గురించి 2015 జులైలోనే ఆప్‌ ‌నాయకుడైన యోగేంద్ర యాదవ్‌ ‌పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ‌దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వ్యసనం గురించి పంజాబ్‌ ‌పీసీసీ బహిరంగంగానే ప్రస్తావించింది. మాన్‌ ‌తరచూ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తున్నారని, ఆయన పక్కన కూర్చోవడం తనకు ఇబ్బందిగా ఉందని అందువల్ల తన సీటును మార్చాలని 2016లో తోటి ఆప్‌ ‌పార్లమెంటు సభ్యుడు స్పీకర్‌ను కోరడం గమనార్హం. 2017లో ఒక బహిరంగ సభకు మద్యం సేవించి వచ్చిన మాన్‌ ‌వేదికపై తూలుతూ మాట్లా డుతూ కింద పడిపోయారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక నాయకుడు ఈ తీరున వ్యవహరించడాన్ని ఎవరూ అంగీకరించ లేరు. ఒక రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ అలాంటి నాయకుడి చేతిలో కేజ్రీవాల్‌ ‌రాష్ట్రాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమన్నది చర్చనీయాంశం. సంగ్రూర్‌ ‌జిల్లాలోని ‘ధురి’ నియోజకవర్గం నుంచి గెలిచిన మాన్‌ ఇక నుంచి మద్యానికి దూరంగా ఉంటానని తన తల్లి, కేజ్రీవాల్‌ ‌సమక్షంలో బహిరంగ సభలో ప్రతిన చేశారు. తన ప్రతినకు ఎంతవరకు కట్టుబడి ఉంటారో మున్ముందు చూడాలి.

పాకిస్తాన్‌తో పంజాబ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్తాన్‌, ‌గుజరాత్‌ ‌తదితర రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నప్పటికీ పంజాబ్‌ ‌సరిహద్దు అత్యంత కీలకం. స్వాతంత్య్రం అనంతరం ఉమ్మడి పంజాబ్‌ ‌రెండుగా చీలిపోయింది. పంజాబ్‌లో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లో చేరిపోయింది. దాని రాజధాని లాహోర్‌ ‌నగరం. భారత్‌లో మిగిలిన పంజాబ్‌కు రాజధాని లేదు. అందువల్ల ప్రత్యేకంగా అప్పట్లో చండీగఢ్‌ ‌నిర్మించారు.

వాఘా-అట్టారీ సరిహద్దు పంజాబ్‌ ‌సమీపంలోనే విస్తరించి ఉంది. పటిష్టమైన భద్రత ఇక్కడ ఉన్నప్పటికీ దొంగచాటుగా పాక్‌ ‌నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధన తీసుకువచ్చింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్న అసోం, పశ్చిమ బెంగాల్‌; ‌పాక్‌తో సరిహద్దులు కలిగి ఉన్న పంజాబ్‌లో బీఎస్‌ఎఫ్‌ (‌బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్- ‌సరిహద్దు భద్రతా దళం) అధికారాలను గతంలో ఉన్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై కన్నేసి ఉంచడానికి, అరెస్టులు చేసేందుకు, తనిఖీలు చేసేందుకు బీఎస్‌ఎఫ్‌కు గల పరిధిని పెంచారు. సరిహద్దుల భద్రతకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. అయితే, దీనిని కొన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. వాటిలో టీఎంసీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ లున్నాయి. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం, సమాఖ్య వ్యవస్థపై దాడి అని నాటి పంజాబ్‌ ‌సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ ‌చన్నీ, బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆప్‌ ‌వ్యాఖ్యానించింది.

జాతీయ భద్రతను గమనంలోకి తీసుకున్న నిర్ణయానికి బాధ్యతాయుతమైన పార్టీలు మద్దతు తెలపాల్సింది పోయి వ్యతిరేకించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు సైన్యంలో పనిచేసిన నాటి కాంగ్రెస్‌ ‌నాయకుడు, పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌సైతం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కేజ్రీవాల్‌ ‌పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ఆప్‌ ‌నాయకత్వంలో పంజాబ్‌ ‌భవితవ్యంపై అనుమానాలు, ఆందోళన కలగడం సహజం.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram