–  సుజాత గోపగోని, 6302164068

బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నికల ముందు ఊహించినట్లుగానే, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌కు అధికారాన్ని దూరం చేయడంలో ఓ ప్రధాన అంశంగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రాజెక్టు ‘వదల బొమ్మాళీ’ అనేలా  ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు డిజైనింగ్‌ మొదలుకొని, ప్రాజెక్టు ఖర్చుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.  కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గలేదు.  నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసింది. ఖజానాపై ఎంత భారం పడినప్పటికీ, ఆలోచించకుండా ఖర్చు చేసింది. విమర్శలను కూడా అంతే స్థాయిలో తిప్పికొట్టింది. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కీలక మంత్రులు హరీష్‌రావు, కె.తారకరామారావు  విపక్షాల విమర్శలపై ఎప్పటికప్పుడు ప్రతి విమర్శలు చేశారు. కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే  విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని గుప్పించారు.

అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, నాసిరకం పనులు అప్పటి ప్రభుత్వం బండారాన్ని బట్టబయలు చేశాయి. మొదటగా గతేడాది కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు పంప్‌ హౌస్‌లు నీట మునిగాయి. గోదావరికి వచ్చిన వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్‌ హౌస్‌లు మునిగిపోయాయి. ఆ పంప్‌హౌజ్‌లలో అమర్చిన బాహుబలి మోటార్లు గోదావరి వరదల్లో మునిగిపోయి బురద మేట వేసింది. ప్రొటెక్షన్‌ వాల్‌, క్రేన్లు, లిఫ్టు కూలడంతో మోటార్లు ధ్వంసమయ్యాయి. ప్రాజెక్టు నిర్మించి మూడేళ్లు కూడా గడవక ముందే ఇలా జరగడంతో నిర్మాణ సంస్థలు ఆ ఖర్చును భరించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఈ యేడాది ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు అప శ్రుతులు చోటు చేసుకున్నాయి. తొలుత మేడిగడ్డ బ్యారేజ్‌ వంతెన ఒక్కసారిగా కొంతమేర కుంగింది. బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్‌ పిల్లర్‌ రెండు ఫీట్ల మేర కుంగిపోయింది. దీంతో దానికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా దాని ప్రభావం పడిరది. 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కిందికు కుంగిపోయిన ఘటన మరవక ముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో నాణ్యతా లోపం బయటపడిరది. ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలోని రెండు గేట్ల వద్ద జరిగిన లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టుకు బుంగ ఏర్పడిరది. వరద నీరు విడుదలయ్యే ప్రదేశంలో అడుగు నుండి నీరు పైకి ఉబికి వచ్చింది. ఇది గమనించిన ఇంజనీరింగ్‌ అధికారులు అప్రమత్తమై ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేశారు. బుడగలు వచ్చే ప్రదేశంలో ఇసుక, మెటల్‌ నింపిన సంచులను వేయించారు. ఈ ఊటలతో పాటు నీటిలోని ఇసుక ఉబికి పైకివస్తే ప్రమాదమని అధికారులు భావించి.. అప్పటికే సరస్వతీ బ్యారేజీలో 8 టీఎంసీల నీళ్లుండగా గేట్లు తెరిచి దాన్ని కూడా ఖాళీ చేశారు. ఈ క్రమం లోనే కుంగిన మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ చేయవద్దని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట్లో పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, నీటిపారుదల శాఖ అధికారులు చివరకు వాస్తవాన్ని గ్రహించారు. పొరపాటును అంగీకరించి దిగివచ్చారు.

 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నట్లు తమ పరిశీలనలోనూ తేలడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని బ్యారేజీలను గుట్టుగా ఖాళీ చేసేశారు. తొలుత మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, ఆ తర్వాత అన్నారం సరస్వతి బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేసిన ఇంజినీర్లు, ఆ తర్వాత సుందిళ్ల పార్వతి బ్యారేజీ గేట్లను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే 23 టీఎంసీల నీళ్లన్నీ వృథాగా సముద్రంపాలయ్యాయి. ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఎన్నికల వేళ కలకలం రేపాయి.

దేశంలోనే అత్యంత వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి ఇలా కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు శాజనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలయ్యింది.ఎన్నికల వేళ.. కాళేశ్వరం లోపాలు బయటపడటం అప్పటి ప్రభుత్వానికి పంటికింద రాయిలా మారింది. ఓ రకంగా విపక్షాలన్నీ కేసీఆర్‌కు ఉచ్చు బిగించేలా చేశాయి. ఎన్నికల సభల్లో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ అగ్ర నేతలు, జాతీయ నాయకులు కాళేశ్వరాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రచారంలో హోరెత్తించారు. ‘కాళేశ్వరం ఏటీఎం’ అంటూ భారీ బాక్సులను తయారు చేయించి ఎన్నికల ప్రచార సభల్లో ప్రదర్శించారు. ఇక, బీజేపీ నేతలు మరింత దూకుడుగా వ్యవహ రించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి మయమంటూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా విచారణ జరిపించి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ఓవైపు బీజేపీ నేతలు, మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. మొత్తానికి ఎన్నికల పర్వం ముగిసింది. ప్రభుత్వం బదలాయింపు జరిగింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఎన్నికల సమయంలో, ప్రచార పర్వంలో సవాలక్ష చెబుతారని, చెప్పినవన్నీ ఆచరణలోకి రావన్న చర్చ జరిగింది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంపై తీవ్రకలకలం చెలరేగు తున్న నేపథ్యంలో ముందుగా దానిపై కాంగ్రెస్‌ సర్కారు దృష్టిపెట్టింది. దీనిపై మంత్రి ప్రత్యేకంగా సవిూక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు సంఘటన తీవ్రమైన అంశమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ప్రాజెక్టులపై మంత్రి సవిూక్షిస్తూ, పిల్లర్ల కుంగు బాటుకు కారకులైన బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘అన్నదాతలకు అత్యావశ్యకమైన నీటిపారుదలే ప్రభుత్వ ప్రాధాన్య అంశం. మంత్రిమండలి ఆమోదం తీసుకుని, సీఎం సూచనల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు సంఘటనపై విచారణకు ఆదేశిస్తాం.

‘బ్యారేజీ పిల్లర్లు కుంగటం అనేది చాలా తీవ్రమైన అంశం. త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా. బ్యారేజీ డిజైన్‌, పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థ, ఇంజినీర్లు కూడా రావాల్సి ఉంటుంది.త్వరలో మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు, విద్యుత్‌, పనులు, ప్రయోజనంపై సమగ్ర నివేదిక అందించా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత, రహస్య ఉత్తర్వులు, అవినీతి చోటుచేసుకున్నాయని జోరుగా ప్రచారం జరిగిందంటూ మంత్రి ఉత్తమ్‌, ప్రజాధనంతో జరిగే పనుల్లో గోప్యత అవసరం లేదన్నారు. వారిని మార్టిగేజ్‌ చేసి రుణాలు తెస్తున్నామనేది గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఒక్క రూపాయి కూడా వృథా కావొద్దని, ఇంజనీర్లు అవినీతికి తావు లేకుండా, సమర్థంగా పనిచేయాలని సూచించారు. ‘మా ప్రభుత్వ ప్రాధాన్య అంశం నీటిపారుదల రంగమే. ప్రాజెక్టులకు పెడుతున్న ఖర్చు, చేకూరుతున్న లబ్ధి నిష్పత్తిని బేరీజు వేస్తూ.. సమగ్ర నివేదిక రూపొందించాలి. కొత్త ప్రాజెక్టుల కింద నూతన ఆయకట్టు వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి’అని మంత్రి ఆదేశించారు కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం 1.20 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లివ్వడం దారుణమన్నారు. ప్రాజెక్టు కింద 19.6 లక్షల ఆయకట్టు ఉంటే ఇంత తక్కువ విస్తీర్ణానికి నీళ్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. స్థిరీకరణ ఆయకట్టును ప్రాజెక్టు కింద ఎలా చూపుతారని అధికారులను నిలదీశారు. రూ.4వేల 600 కోట్ల తో నిర్మించిన మేడిగడ్డ మూడేళ్లకే కుంగిపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. ఈ బ్యారేజీ లేకపోతే కాళేశ్వరం మొత్తం నిరుపయోగమే అని అభిప్రాయపడ్డారు. పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోత లను కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా ఎలా చేపట్టారు?అని సందేహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు థర్డ్‌ పార్టీ తనిఖీలు లేవా? అని ప్రశ్నించారు. అంచనాలు, టెండర్లు, నిర్మాణా లకు సంబంధించి శాఖ అంతర్గత ఆడిట్‌ ఉండాల్సిందేనని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

 గత ప్రభుత్వం డాక్టర్‌ బాబాసాహెబ్‌ ప్రాణతహిత`చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, పేరును మార్చి, ఖర్చు పెంచి కాళేశ్వరం చేపట్టిందని ఉత్తమ్‌ మండిపడ్డారు. తమ ఎన్నికల ఎజెండాలో ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ఒక అంశమని, దీన్ని నిర్మించి ఎగువ ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు పరిసర జిల్లాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. శ్రీశైలం ఎడమ బ్రాంచ్‌ కాలువ పనులు తొమ్మిదేళ్లుగా సాగడం లేదని, గుత్తేదారు సంస్థకు కొన్నేళ్లుగా నిధులు విడుదల కావడం లేదని సీఈ చెప్పారన్న మంత్రి… సీఎం ఆమోదంతో.. క్యాబినెట్‌ అనుమతి తీసుకుని అవసరమైన నిధులు విడుదల చేస్తామని, పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. రాష్ట్రంలోని 40 వేల చెరువుల సంరక్షణ కూడా చేపడతామని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులుపవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాళేశ్వరం, మేడిగడ్డపై వివరాలను మంత్రి ప్రత్యేకంగా వివరాలు అడిగారు.

‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలి. ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చేలా బ్యారేజీ నిర్మాణం జరిగిందో, ఒక్కో ఎకరాకు సాగు నీరు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతోందో చెప్పాలి’అని అధికారులను ఆదేశిం చారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల డబ్బులతో కట్టే ప్రాజెక్ట్‌ల పనుల్లో అత్యంత పారదర్శకత అవసరమని సూచించారు. అయితే, మంత్రి నిర్వహించిన తొలి సమీక్ష సమావేశానికి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ గైర్హాజ రయ్యారు. సవిూక్షకు సంబంధించిన సమాచారం లేకపోవడంతోనే ఆమె హాజరు కాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘మేడిగడ్డ బ్యారేజీ ఒక పిల్లరు 1.2 విూటర్లు కుంగింది. దాని ప్రభావం మరో మూడు పిల్లర్లపై పడిరది. వెంటనే ప్రాజెక్టులోని నీటిని విడుదల చేయడంతో కుంగుబాటు తగ్గింది’ అని సవిూక్షలో పాల్గొన్న ఈఎన్సీలు సి.మురళీధర్‌, నాగేంద్రరావు, నల్ల వెంకటేశ్వర్లు, సీఈలు వివరించారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram