తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండే ఎండలతో పాటు రాజకీయంగానూ వేడి మొదలయ్యింది. ఎన్నికల కమిషన్‌ ‌కూడా పోలింగ్‌ ‌కోసం సన్నద్ధమవుతోంది. ఎన్నికల వ్యవస్థ కార్యాచరణలో నిమగ్నమయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకునే క్రమంలో తొలి భేటీ జరిగింది.

ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. డిప్యూటీ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌నితీష్‌ ‌వ్యాస్‌ ‌నేతృత్వంలోని ఈసీ బృందం ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ ‌రాజ్‌తో పాటు.. ఇతర అధికారులతో సమావేశం అయ్యింది. ఈవీఎంల సన్నద్ధత, తనిఖీ, ఓటర్ల జాబితాలో చేర్పులు, అధికారులకు శిక్షణ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్‌షాప్‌ ‌నిర్వ హించాలని సూచించింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పింది. రిటర్నింగ్‌ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్‌ ‌శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని కూడా సూచిం చింది. రిటర్నింగ్‌ అధికారులు వచ్చే నెల నుంచే అంటే.. మే ఒకటో తేదీ నుంచే ఈవీఎంలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలలో పోలింగ్‌ ‌శాతాన్ని పెంచడానికి ఇప్పటినుంచే ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్‌ 1‌వ తేదీ నుండి ఈవీఎంల మొదటి దశ పరీక్ష చేపట్టి, ఆయా జిల్లాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దూకుడు పెంచిన బీజేపీ

మరోవైపు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఎలాగైనా మూడోసారి విజయం సాధించాలని బీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతూంటే, అధికార బీఆర్‌ఎస్‌ను గద్దించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు.. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా శత విధాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ సమయం లోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని అమిత్‌ ‌షా అభిప్రాయ పడ్డారు. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం ఆయన ప్రచారాన్ని దక్షిణ గోవాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 16న పనాజీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకొంది. అంతేకాదు, ఈ సందర్భంగా అమిత్‌ ‌షా మాట్లాడుతూ ఒడిశాలోనూ ప్రజలు బీజేపీకే అనుకూలంగా ఉన్నారని తెలిపారు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ గోవా, ఉత్తరాఖండ్‌ ‌వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే విజయం సాధిస్తోందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు చేసి చిన్న రాష్ట్రాలను అవమానపరచవద్దని అన్నారు. రాహుల్‌ ‌ప్రచారం చేసినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీ ఓట్ల ఆధారంగా వాటిని కంచుకోటలని కాంగ్రెస్‌ ‌భావిస్తూ వచ్చిందని, కానీ అక్కడి ప్రజలు భద్రత, శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు.

పనాజీ సభలో అమిత్‌షా ప్రత్యేకంగా తెలంగాణ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించు కున్నది. దక్షిణాదిలో ఒక్కొక్కటిగా రాష్ట్రాలను కైవసం చేసుకొని కాషాయ జెండాలు ఎగురవేయాలని బీజేపీ గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా తొలుత తెలంగాణపై దృష్టిపెట్టింది. పలు పర్యాయాలు జాతీయ నేతలు రాష్ట్రాన్ని సందర్శించారు కూడా. ఇప్పటికీ తరచూ పర్యటిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్‌లో నిర్వహించి.. ఆ పార్టీ కార్యకర్తలకే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా ఓ సంకేతాన్ని ఇచ్చారు.

త్రిముఖ పోటీ

రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చించు కుంటే.. గత ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య జరిగిన పోటీ ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీగా సాగనుంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌రెండోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. అప్పుడు అధికార టీఆర్‌ఎస్‌, ‌ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ‌మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా మారి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చు కుంది. ఈ నాలుగేళ్లలో చోటు చేసుకున్న మార్పులు, రాజకీయ పరిణామాలతో బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, జాతీయ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి పెట్టడం, ఏం జరిగినా, బీజేపీకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వెంట వెంటనే స్పందించడం.. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర కేడర్‌కు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయడం వంటి పరిణామాలతో బీజేపీ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌గతంలో కంటే తగ్గిందని, తిరోగమనంలో పడిపోయిందని ఆ పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్న బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి తెర లేపాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే తరహా హామీలను ప్రజలకు ఇస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ప్రజల భాగ స్వామ్యంతో ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తు న్నాయి. ప్రజల మధ్యనే ఉండాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లు వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయ త్నిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఏకరువు పెడుతున్నాయి. మూడు పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం, విమర్శల పర్వం ఊపందుకుంది. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటా యింపులకు అనుగుణంగా పథకాల వారీగా నిధుల విడుదలపై ఇప్పుడు దృష్టి పెట్టింది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం పడరాని పాట్లు పడుతోంది. మరోవైపు.. విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌ ‌సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో జనంలోకి వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కుటుంబ పాలన, అవినీతి అంశాలతో బీజేపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీఆర్‌ఎస్‌ ‌తొలుత దృష్టి పెట్టేది ఆత్మీయ సమ్మేళనాలపైనే. ఉపఎన్నికల సమయంలోనూ కుల సంఘాలతో విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి భవనాల నిర్మాణానికి వ్యక్తిగతంగా, పార్టీ తరఫునా ఆర్థిక సాయం చేస్తామంటూ సీనియర్‌ ‌లీడర్లు రంగంలోకి దిగి హామీ ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ‌తనదైన శైలిలో పార్టీ కార్యకర్తలతో సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. అసంతృప్తి, అసమ్మతి నెలకొన్న చోట వెంటనే వారికి కొన్ని హామీలు ఇచ్చి సర్దిజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీలో లుకలుకలు లేకుండా చేసుకోవడమే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయి. గ్రూపులు, వర్గాలతో జరిగే నష్టాన్ని నివారించుకోవ డంలో భాగంగా తొలి దశలో ఇవి జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా రానున్నకాలంలో కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నాయి. భారీ బహిరంగసభలద్వారా విస్తృతంగా జనసమీకరణ చేసి పార్టీకి తగిన బలం ఉందనే అంశాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు మున్ముందు జరగనున్నాయంటు న్నారు బీఆర్‌ఎస్‌ ‌నేతలు.

పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తోన్న కమలం

భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చూస్తే.. ప్రతీ గ్రామాన్ని టచ్‌ ‌చేసే విధంగా స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగులను నిర్వహిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఓటు బ్యాంకును కైవసం చేసుకో డానికి బూత్‌ ‌సశక్తీకరణ్‌ అభియాన్‌ ‌పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ ‌చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు వారాల వ్యవధిలోనే 11 వేలకు పైగా స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగులను పెట్టింది. తన సొంత బలం ఏ మేరకు ఉన్నదో స్వయంగా పరీక్షించుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ‌కూడా ప్రజల్లోకి వెళ్లడానికి ప్రజా సంగ్రామ యాత్రను ఐదు దశల్లో నిర్వహించారు. మిగిలిపోయిన సెగ్మెంట్లలో దీన్ని ఆరవ విడతగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు నిరుద్యోగ మార్చ్ ‌కార్యక్రమాన్ని వరంగల్‌లో నిర్వహించారు. దీనిని మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోనూ కొనసాగించాలను కుంటున్నారు. కుటుంబ పాలన, అవినీతి, హామీల వైఫల్యం, టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ లాంటి అంశా లతో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిరసన కార్య క్రమాలకు ప్లాన్‌ ‌చేసింది. ఆ దిశగా దూసుకెళ్తోంది కూడా.

ఇక, కాంగ్రెస్‌ ‌పార్టీ విషయానికి వస్తే.. తొలుత భారత్‌ ‌జోడోయాత్ర, ఆ తర్వాత హాథ్‌ ‌సే హాథ్‌ ‌జోడో అభియాన్‌ ‌పేరుతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్రలు జరిగాయి. పార్టీ లీడర్లు విడిగా పీపుల్స్ ‌మార్చ్ ‌పేరుతో పాదయాత్రలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రలతో పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE