మే 28 వీరసావర్కర్‌ ‌జయంతి

‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ ‌చేయడానికి వచ్చారు!’’

  ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ ‌శాఖ అధిపతి జంషెడ్‌జీ దొరాబ్‌ ‌నగార్వాలా శివాజీ పార్క్ ‌నివాసానికి సిబ్బందితో వచ్చి తలుపు తట్టాడు. ఇతడినే జిమ్మీ నగర్వాలా అని కూడా పిలిచేవారు. అది హిందూ మహాసభ నాయకుడు వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌నివాసం. తలుపు తెరిచిన సావర్కర్‌, ‌విషయం చెప్పాక అన్నమాట అది. ఎలాంటి అభియోగం మోపకుండానే ఆయనను బొంబాయిలోనే ఆర్ధర్‌ ‌రోడ్‌ ‌జైలుకు తరలించారు. సావర్కర్‌ అనే  మహోన్నత  దేశభక్తుడిపై నాటి భారత ప్రభుత్వం ఒక హంతకునిగా ముద్ర వేసిన దారుణ క్షణమది.

నిజానికి, జనవరి 31,1948న ఆ శివాజీ పార్క్ ‌నివాసానికి వచ్చిన దొరాబ్‌ ‌నగార్వాలా చాలా కాగితాలు, 143 ఫైళ్లు, దాదాపు 10,000 ఉత్తరాలు స్వాధీనం చేసుకున్నాడు. సావర్కర్‌ను మాత్రం అరెస్ట్ ‌చేయలేదు. ఇదంతా ఆ జనవరి 30, 1948 సాయంత్రం ఢిల్లీలోని బిర్లా హౌస్‌ ఆవరణలో జరిగిన గాంధీజీ హత్యకు సంబంధించిన వ్యవహారమే. ఇంతకీ ఆయన మీద నేరం రుజువైందా? ఆ విషయమే ఈ వ్యాసం చర్చిస్తుంది. యాభయ్‌ ‌సంవత్సరాల శిక్షవేసి అండమాన్‌ ‌కారాగారంలో పరాయి ప్రభుత్వం పెట్టిన మానసిక శారీరక క్షోభ కంటే, స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ హత్య పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఆయన అనుభవించిన క్షోభే ఘోరమైనది. చరిత్రలో ముగ్గురు సావర్కర్‌లు ఉన్నారు, వారు సోదరులు. మనకు వీర్‌ ‌సావర్కర్‌ ‌చాలావరకు తెలుసు. ఆయన అన్నగారు గణేశ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌. ఈయన కూడా నాసిక్‌ ‌కలెక్టర్‌ ‌జాక్సన్‌ ‌హత్య కుట్రలో భాగస్వామిగా వీర్‌ ‌సావర్కర్‌తో పాటు అండమాన్‌ ‌సెల్యూలర్‌ ‌జైలులో దాదాపు దశాబ్దం కఠిన శిక్ష అనుభవించారు. 1945లోనే కన్నుమూశారు. అలా అజ్ఞాత యోధునిగా మిగిలిపోయారు. చివరి సోదరుడు డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌. ‌గాంధీజీ హత్యానంతరం ఈయనను కాంగ్రెస్‌ ‌పార్టీ ‘అహింసామూకలు’ కొట్టి చంపేశాయి.

వర్తమానం గతానికి బందీ. ఇది వాస్తవం కాకపోతే భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, వాటి నేతలు వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ అనే స్వాతంత్య్ర సమరయోధుడిని గురించి ఎందుకు ప్రతికూల భావనలతో పదే పదే గుర్తు చేసుకుంటారు? గాంధీజీ హత్య కుట్రలో భాగస్వామి అని ఎందుకు వాదిస్తారు? కోర్టు ఆనాడు ఆ హత్యతో సంబంధం లేదని తీర్పు చెప్పి ఆయనను విడుదల చేసినా పాత పాట ఆపకుండా ఎందుకు పాడుతున్నారు? ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుగుదలను సహించలేని వారు, మొన్నటి భారతీయ జనసంఘ్‌, ఇప్పటి బీజేపీని ద్వేషించేవారు సావర్కర్‌ ‌పేరును అడ్డం పెట్టుకుని హిందుత్వ మీద విషం కుమ్మరిస్తున్నారు. వీరి పరిజ్ఞానం మేరకు హిందుత్వకు ఆద్యుడు సావర్కర్‌. ‌గాంధీజీ మరణించి 75 సంవత్సరాలైంది. సావర్కర్‌ ‌కన్నుమూసి ఐదు దశాబ్దాలు గడిచాయి. అసలు హిందూ మహాసభ స్థాపకుడు కూడా ఆయన కాదు. అయినా సావర్కర్‌ అనే ఆ మూడు అక్షరాలు దేశంలో నిషిద్ధాక్షరాలుగానే చూస్తున్నారు కొందరు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు చరిత్రకారులు దాచేసిన చారిత్రక సత్యాలతో, విష ప్రచారాలతో సావర్కర్‌ అనే మహోన్నత త్యాగమూర్తి జీవితచరిత్ర వివాదాల పుట్టగా మారిపోయింది. ఇది అవాంఛనీయం.

సావర్కర్‌ ‌భారత స్వాతంత్య్రోద్యమంలో నిరుపమానమైన పాత్రను నిర్వహించారు. ఆయనది అహింసాయుత పంథా కాదు. అందులో దాపరికం లేదు. గాంధీజీ దేశం మొత్తాన్ని కదిలించిన ఉద్యమ సారథి. అహింసను నమ్మారు. బ్రిటిష్‌ ‌జాతిని దేశం నుంచి పంపడానికి అహింసాపథం చాలదని నమ్మినవారు సావర్కర్‌. ‌గాంధీజీ జీవితాంతం అహింసా సూత్రాన్ని పాటించారు. కానీ ఆయన అనుయాయుల అహింసావాదం అపద్ధర్మంగానే కనిపిస్తుంది. జనవరి 30,1948న నాథూరామ్‌ ‌గాడ్సే గాంధీజీని హత్య చేస్తే, గాంధీజీ అహింసావాదాన్ని మనసావాచా నమ్ముతున్నామని చెప్పే గాంధేయులు అదేరోజు ఆ అహింసావాదాన్ని ఇంకా దారుణంగా హత్య చేశారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపమన్న గాంధీజీ ఆశయం కాస్తా, ఒక గాంధీ ప్రాణం వందల అమాయకుల ప్రాణాలు అన్న స్థితికి దిగిపోయింది. నాటి బొంబాయి ప్రెసిడెన్సీ ప్రీమియర్‌ ‌బీజీ ఖేర్‌. ‌హోంశాఖ మంత్రి మొరార్జీ దేశాయ్‌.

జనవరి 13, 1948న గాంధీజీ న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో ఆమరణ నిరాహార దీక్ష ఆరంభించారు. అప్పటికి ఆయన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త జీడీ బిర్లా అతిథిగా ఆ భవనంలో ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీలోనే పురానా ఖిలా అనే చోట హిందూ శరణార్థులకీ, ముస్లింలకీ మధ్య ఘర్షణ జరిగింది. సిక్కులు, హిందువులు, ముస్లింల మధ్య కక్షలూ కార్పణ్యాలను నిరోధించడానికి తాను ఆమరణ దీక్ష చేస్తున్నట్టు గాంధీజీ చెప్పినా, అసలు కథ వేరే. పాకిస్తాన్‌కు ఇస్తానన్న రూ. 55 కోట్లు భారత ప్రభుత్వం (నెహ్రూ ప్రభుత్వం) నిలిపివేసింది. కారణం-1947 అక్టోబర్‌లో గిరిజనుల పేరుతో పఠాన్‌లు, సైనికులు జమ్ముకశ్మీర్‌లో చొరబడ్డారు. భారత్‌-‌పాక్‌ల మధ్య జరిగిన తొలి యుద్ధం ఇదే. ఈ కారణంతో పాటు ఇంకొన్ని కారణాలతో ఆ మొత్తాన్ని నెహ్రూ ప్రభుత్వం పాకిస్తాన్‌కు చెల్లించకుండా ఆపింది. ఇది నచ్చని గాంధీజీ ఈ దీక్షకు దిగారన్నది వాస్తవం. ఇది గాంధీజీ చేపట్టిన 17వ నిరశన వ్రతం. అలాగే ఆయన జీవితంలో ఆఖరిది కూడా. జనవరి 18న ఇది ముగిసింది. అంటే గాంధీజీ నిరశన వ్రతం భారత్‌-‌పాక్‌ ‌తొలి యుద్ధ సమయంలో చోటు చేసుకుంది. అక్టోబర్‌ 22, 1947‌న పాక్‌సేనలు గిరిజనుల ముసుగులో కశ్మీర్‌ ‌మీద దురాక్రమణ చేశాయి. జనవరి 5, 1949న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పుస్తకం ‘గాంధీ: ది ఇయర్స్ ‌దట్‌ ‌ఛేంజ్డ్ ‌ది వరల్డ్ 1914-1948’‌లో ఆ కొద్దికాలంలో జరిగిన పరిణామాల మీద లోతైన పరిచయం కనిపిస్తుంది. ఈ భాగాలను హిందుస్తాన్‌ ‌టైమ్స్ (‌సెప్టెంబర్‌ 8, 2018) ‌ప్రచురించింది. నిరశన ఆరంభించిన రోజున సాయంత్రపు ప్రార్థనలలో గాంధీజీ పటేల్‌ ‌మీద కూడా ముస్లిం వ్యతిరేక ముద్ర వేశారు. ముస్లింలు తనను, నెహ్రూనే విశ్వసిస్తున్నారు తప్ప, పటేల్‌ను కాదని అన్నారని గుహ రాశారు. హిందూ-ముస్లిం అంశం మీద ఆ ఇద్దరి నాయకుల మధ్య సయోధ్య కుదర్చే క్రమంలో గాంధీజీ జనవరి30, 1948 మధ్యాహ్నం బిర్లాహౌస్‌లోనే సర్దార్‌ ‌పటేల్‌తో రెండు గంటలు చర్చించారు. తరువాత తన మనుమరాళ్లు అభా, మనుల సాయంతో సాయంత్రం ప్రార్థనల కోసం బిర్లా హౌస్‌ ‌ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడ అప్పటికే చేరుకున్న జనసమ్మర్ధం నుంచి ఒక వ్యక్తి గాంధీజీ ముందుకు వచ్చి, వంగి పాదాభివందనం చేసి, వెంటనే నిలబడి కాల్చి చంపాడు. అతడే నాథూరామ్‌ ‌గాడ్సే. నిస్సందేహంగా ఈ ఘట్టం చరిత్రకు మాయని మచ్చ. ప్రపంచాన్ని కదిపిన ఈ దురంతం జరిగి ఉండ వలసింది కాదు. అంతమాత్రాన గాంధీజీ హత్యను అడ్డం పెట్టుకుని నెహ్రూ ప్రభుత్వం తొక్కిన అడ్డతోవలు, ‘అహింసామూర్తి’ గాంధీజీ అనుయాయులయిన అహింసావాదులు సాగించిన హింసాకాండ చరిత్రలో చేరకూడని, ఎవరూ చర్చించకూడని అంశాలైపోతాయా?

78 ఏళ్ల గాంధీజీని చంపేనాటికి గాడ్సే వయసు 37 ఏళ్లు. కాంగ్రెస్‌ ‌పోషణలోని చరిత్రకారులు, కమ్యూనిస్టు మేధావులు చారిత్రక అంశాలు దాచిన స్థాయిలో.. వక్రీకరించిన తీరులో ఇతడికీ, సావర్కర్‌కీ ఉన్న బంధాన్ని దాచి పెట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. గాడ్సే ‘దైనిక్‌ ‌హిందూరాష్ట్ర’ పత్రిక సంపాదకుడు. పత్రిక పేరు (మాస్ట్‌హెడ్‌) ‌పక్కన అతడు ఒక బొమ్మను ముద్రించేవాడు. అది సావర్కర్‌ది. పైగా గాంధీజీ మీద తుపాకీ గుళ్లు కురిపించిన తరువాత గాడ్సే పలాయనం చిత్తగించే ప్రయత్నమే చేయలేదు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాడు.

గాడ్సే తండ్రి తపాలా ఉద్యోగి. పేరు వినాయక్‌. ఆయనది తరుచు బదలీలు అయ్యే ఉద్యోగం. గాడ్సే మెట్రిక్యులేషన్‌ ‌కృతార్థుడు కాలేకపోయినా, తరువాత చరిత్ర, సామాజికశాస్త్రం స్వయంగా అధ్యయనం చేశారు. తన 19వ ఏట 1929లో తండ్రి ఉద్యోగ రీత్యా రత్నగిరి జిల్లాకు వచ్చినప్పుడు మొదటిసారి సావర్కర్‌ను కలుసుకున్నారు. అప్పటికి అండమాన్‌ ‌సెల్యులార్‌ ‌కారాగారం నుంచి వచ్చిన సావర్కర్‌ ‌జిల్లాలో ఇంటర్న్‌మెంట్‌లో ఉన్నారు. నాటి నుంచి సావర్కర్‌ ‌చింతనతో గాడ్సే మమేకమయ్యారు. 1937లో సావర్కర్‌ ‌రాజకీయాలలో తిరిగి క్రీయాశీలక పాత్ర పోషించిన క్రమంలో గాడ్సే హిందూ మహాసభలో చేరాడు. నిజాంకు వ్యతిరేకంగా హిందూ మహాసభ కూడా ఉద్యమించిన సంగతి తెలిసిందే. 1938లో ఒక దళానికి నాయకత్వం వహించిన గాడ్సే ఒక సంవత్సరం కారాగార శిక్ష అనుభవించాడు. గాడ్సే హిందూ మహాసభలో చేరిన సమయంలోనే నారాయణ ఆప్టే కూడా అహమ్మద్‌నగర్‌ ‌శాఖలో చేరాడు. అక్కడ సంస్థను నడుపుతున్నవారు విష్ణు కర్కరే. ఇతడు ఒక వ్యాపారి.

శివాజీ పార్క్ ‌నివాసం నుంచి ఇంటెలిజెన్స్ ‌శాఖ స్వాధీనం చేసుకున్నవి పదివేల ఉత్తరాలు. అందులో ఇరవై వరకు గాడ్సే రాసినవి. పన్నెండు వరకు కర్కరే రాసినవి. కానీ ఎందులోనూ గాంధీజీని చంపా లంటూ సూచనప్రాయంగా చెప్పినట్టు కనీస ఆధారాలు లేనేలేవు. దైనిక్‌ ‌హిందూ రాష్ట్ర కంటే ముందు గాడ్సే ‘అగ్రణి’ అన్న పత్రికను నిర్వహిం చారు. అది తీవ్ర జాతీయవాద భావాలతో నడిచింది. దీనితో ఆ పత్రికను అణచివేయడానికి రూ. 6,000 ధరావతు కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ధనం ఏర్పాటు చేయవలసిందిగా సావర్కర్‌కు గాడ్సే ఉత్తరం రాశాడు. అలాగే అగ్రణికి వ్యాసాలు రాయవలసిందిగా మరొక లేఖలో విన్నవించాడు. కానీ సావర్కర్‌ ఆ ‌పత్రికకు వ్యాసాలు పంపలేదు. గాడ్సే, ఆప్టే, కర్కరేలను కేవలం హిందూ ఐక్యతావాదులు, లేదా హిందూ మహాసభ సభ్యులు అనడం కంటే, సావర్కరైట్స్ అనడం సబబన్న వాదన ఉంది. ఫిబ్రవరి 1-5 మధ్య గాంధీజీ హత్య నేపథ్యంలో బొంబాయి ప్రెసిడెన్సీలో జరిగిన అరాచకాలు బ్రిటిష్‌ ‌పాలకులనే విస్తుపోయేటట్టు చేసి ఉండవచ్చు. ప్రెసిడెన్సీలోని హిందూ మహాసభ కార్యకర్తలను, వారి ఇళ్లను ముట్టడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారి పరిస్థితి అంతే. ఇళ్లు తగులబెట్టారు. హింసకు దిగారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆ ఐదు రోజులలోనే 25,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. బొంబాయి ఇంటెలిజెన్స్ ‌విభాగం అదుపులోకి తీసుకున్న దాదాపు నెలరోజుల తరువాత మాత్రమే సావర్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు (మార్చి 3, 1948) చేశారు. ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ‌చట్టం కింద కేసు పెట్టారు. ఆ తరువాత కూడా ఆయనను ఆర్ధర్‌ ‌రోడ్‌ ‌జైలులోనే కొద్దికాలం ఉంచారు. ఎలాంటి అభియోగం నమోదు చేయకుండానే నిర్బంధించ డాన్ని సవాలు చేస్తూ ఎస్‌వి దేవధర్‌ అనే న్యాయవాది సావర్కర్‌ ‌తరఫున వాదించారు.

గాంధీజీ పంథా మీద, కాంగ్రెస్‌ ‌మీద సావర్కర్‌కు ఉన్న వ్యతిరేకత కారణంగానే ఈ హత్య కేసులో నిందితునిగా చేర్చారన్నది పెద్ద ఆరోపణ. దాదాపు 75 ఏళ్లుగా సావర్కర్‌ ‌కుటుంబాన్ని ఈ విధంగా అహింసావాదుల కాంగ్రెస్‌ ‌వెంటాడుతోంది. గాంధీజీ హత్య, అందులో సావర్కర్‌ ‌పాత్ర అన్న మాటలు బయటకు వచ్చిన వెంటనే ఆయన నివాసం సావర్కర్‌ ‌సదన్‌ ‌మీద (దాదర్‌) ‌దాడి జరిగింది. నాథూరామ్‌ ‌వినాయక్‌ ‌గాడ్సే కాల్పులు జరిపాడని తెలియడం, ఆ వెంటనే ఆయన కులం గురించి వెల్లడించడంతో మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలలో ఆ కులమే లక్ష్యంగా హత్యాకాండ, హింసాకాండ జరిగాయి. ఒక మనిషిని కొట్టి చంపడం అనే ఘట్టం అప్పుడే తొలిసారి స్వతంత్ర భారతదేశంలో జరిగింది. ఆ బలిపశువు ఎవరో కాదు, సాక్షాత్తు సావర్కర్‌ ఆఖరి తమ్ముడు. పేరు డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌. ‌బొంబాయిలోని ఆయన ఇంటి మీద గాంధీజీ భక్తులైన అహింసావాదులు దాడి చేశారు. గాంధీజీ మీద తమ భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి అదే మంచి పద్ధతి అన్నట్టు పత్రికలేవీ ఈ విషయాలను ప్రచురించలేదు. అయితే చరిత్ర ఎప్పటికీ మరుగననే ఉండిపోదు. బ్రిటిష్‌ ‌పత్రికా రచయిత మౌరీన్‌ ‌ప్యాటర్సన్‌ ‌గాంధీజీ హత్యానంతర మారణకాండ మీద సేకరించిన సమాచారంలో ఇవి చేరాయి. డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ను జనం కొట్టి చంపిన విషయం కూడా ఆయనే నమోదు చేశారు. ఆ వ్యాసం పేరు ‘ది షిఫ్టింగ్‌ ‌ఫార్ట్యూన్స్ ఆఫ్‌ ‌చిత్పవన్‌ ‌బ్రాహ్మిన్స్: ‌ది ఫోకస్‌ ఆన్‌ 1948’. అదే సమయంలో వీర్‌ ‌సావర్కర్‌ ఇం‌టి మీద జరిగిన దాడి గురించి కూడా కొన్నిచోట్ల నమోదైంది. ఢిల్లీలో ఉన్న జాతీయ ఆర్కైవ్స్‌లో ‘డిజిటైజ్డ్ ‌ప్రైవేట్‌ ‌పేపర్స్ ఆఫ్‌ ‌సర్దార్‌ ‌పటేల్‌: ‌లెటర్స్ అం‌డ్‌ ‌న్యూస్‌పేపర్‌ ఆర్టికల్స్’ అన్న విభాగంలో ఆ సమాచారం ఉంది. వీటి గురించి వీర్‌ ‌సావర్కర్‌ ‌చరిత్రకారుడు విక్రమ్‌ ‌సంపత్‌ ‌కూడా ప్రస్తావించారు. వీర్‌ ‌సావర్కర్‌ను కాంగ్రెస్‌ ‌వారి బారి నుంచి రక్షించే క్రమంలో డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌రక్షణ గురించి పోలీసులు విస్మరించారు. ఇంతకీ నారాయణ్‌ ‌దామోదర్‌ ఇల్లు వీర్‌ ‌సావర్కర్‌ ఇం‌టికి పొరుగునే ఉంది. విక్రమ్‌ ‌సంపత్‌ ‌డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌సావర్కర్‌ ‌మీద జరిగిన దాడిని వివరంగానే ఇచ్చారు. అదొక అమానుషకాండ. కొందరు ఇంటిలో ఉన్న నారాయణ్‌ ‌సావర్కర్‌ను బయటకు ఈడ్చుకు వచ్చారు. రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. చివరకు ఆయన నెత్తుటి మడుగులో పడిపోయారు. తలకి కూడా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబాన్ని రహస్య స్థలానికి పంపారు. 20 మాసాల పాటు మృత్యువుతో సుదీర్ఘ పోరాటం జరిపి, అక్టోబర్‌ 19,1949‌న ఆయన కన్నుమూశారు.

 ‘వీర్‌ ‌వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌’ ‌పేరుతో విక్రమ్‌ ‌సంపత్‌ ‌పుస్తకం ఆ మధ్య రెండు భాగాలుగా వెలువడింది. ‘ఆగ్రహంతో ఉన్న ఆ మూక రెండో లక్ష్యం దాదర్‌లోని సావర్కర్‌ ‌నివాసమే. 500 నుంచి 1000 మంది సావర్కర్‌ ఇం‌టి ముందు చేరి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. అప్పుటి ఒక వార్తాపత్రిక వెలువరించిన వార్త ప్రకారం సావర్కర్‌ ‌పుస్తకాలు, చిత్రాలు, ఫోటోలు ఆ రోడ్డంతా చెల్లాచెదురుగా పడేసి, వాటికి నిప్పుపెట్టారు. బొంబాయి ప్రెసిడెన్సీ లోని ఇంకొన్ని ప్రదేశాలలో సావర్కర్‌ ‌ఫోటోలను మొదట పగులకొట్టి తరువాత దహనం చేశారు.’ అని విక్రమ్‌ ‌సంపత్‌ ‌పేర్కొన్నారు.

విక్రమ్‌ ‌సంపత్‌ ‌తన మరొక పుస్తకం ‘సావర్కర్‌: ఏ ‌కంటెస్టెడ్‌ ‌లిగసి’లో ఇంకొన్ని వివరాలు ఇచ్చారు. ఇవి 420, 421 పేజీలలో కనిపిస్తాయి.‘చాలామంది కింది అంతస్తులోకి (సావర్కర్‌ ‌సదన్‌) ‌దూసుకొచ్చారు. సావర్కర్‌ ‌మాజీ కార్యదర్శి, ఇంగ్లిష్‌ ‌వారపత్రిక ‘ఫ్రీ హిందుస్తాన్‌’ ‌సంపాదకుడు భిడే గురూజీ నివాసం అదే. మొదటి అంతస్తులోని తన గదిలో సావర్కర్‌ ‌విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే సావర్కర్‌ ‌సహచరులు బాల్‌ ‌సావర్కర్‌, ‌భాస్కర్‌ ‌శిందే సమయస్ఫూర్తి ఆనాడు వీర్‌ ‌సావర్కర్‌, ఆయన భార్య యమున, కొడుకు విశ్వాస్‌ల ప్రాణాలు కాపాడింది. అంతకు ముందు రాత్రి 10 గంటల వేళ వీర్‌ ‌సావర్కర్‌ ‌కుటుంబీకులు కొందరినీ, ఆయన అంగ రక్షకుడు అప్పా కాసర్‌, ‌వ్యక్తిగత కార్యదర్శి గజానన్‌ ‌దామ్లేలనూ బొంబాయి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో భాస్కర్‌ ‌శిందే సావర్కర్‌ ‌సామాజిక వర్గం కాకున్నా కూడా కాంగ్రెస్‌ ‌కార్యకర్తల దాష్టీకానికి గురయ్యాడు. కాంగ్రెస్‌ అహింసావాదుల చర్యలు చరిత్ర క్షమించే విధంగా లేవు. జనవరి 30, 1948 రాత్రే పూనాలో 50 మందిని గుర్తించి వెంటాడి చంపారు. వారంతా సావర్కర్‌ ‌సామాజిక వర్గం వారే. అహింసావాదుల ఈ హింసోన్మాదం గాలితో పోటీపడుతూ దక్షిణ, పశ్చిమ మహారాష్ట్రలకు చేరింది. నాగపూర్‌, ‌విదర్భ ఇలాంటి హత్యాకాండకు కేంద్రాలయ్యాయి. మొదట గాడ్సే ఇంటి పేరు ఉన్నవారిని వెతికి వెతికి చంపే ఉన్మాదం, తరువాత ఆ సామాజిక వర్గంలోనే ఉప కులాల వారిని కూడా చంపే వరకు పోయింది.

 వీర్‌ ‌సావర్కర్‌, ఆయన పెద్ద తమ్ముడు గణేశ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ అం‌డమాన్‌ ‌జైలులో కఠిన శిక్ష అనుభవించారు. గడచిన ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులతో పాటు చాలామంది మేధావులు కూడా అండమాన్‌ ‌జైలులో ఆయనను ఏకాంత చీకటికొట్లో ఉంచినట్టే, చరిత్రపుటలలో మారుమూల ఉంచాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండమాన్‌ ‌నుంచి వచ్చి రత్నగిరి జిల్లాకు పరిమితమై అంటరానితనం నిర్మూలన కోసం ఉద్యమించిన ఈ సంస్కర్తను చరిత్రలో అంటరానివానిగా మిగల్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. హిందూత్వవాది అయినా ఆయన సంస్కరణ దృష్టిని నిరాకరించలేమని ఒక పక్క అంటూనే, ఆయన త్యాగాన్నీ, కాంగ్రెస్‌ ‌వారి కుట్రనీ వేర్వేరుగా అంచనా వేసే విజ్ఞతను ప్రదర్శించలేకపోతున్నారు. గాంధీజీతో సావర్కర్‌ ‌విభేదాలు 1909 నుంచి కనిపిస్తాయని రామచంద్ర గుహ అంటారు. వారిద్దరి వైరం ఉద్యమ పరమైనది కాకుండా, వ్యక్తిగతమని కూడా ఈ చరిత్రకారుడు చెబుతారు. దానికి ఆయన చూపిన ఆధారం ఇది: కస్తూర్బా గాంధీ మరణించిన తరువాత ఆమె పేరిట ఏర్పాటు చేయదలచిన స్మారక చిహ్నానికి విరాళం ఇవ్వడానికి సావర్కర్‌ ‌నిరాకరించారు. ఇందుకు సావర్కర్‌ ‌చెప్పిన కారణం గురించి కూడా గుహ పేర్కొన్నారు. ‘బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని సాయుధ పంథాలో కూల్చడానికి ప్రయత్నించి ఉరికంబాలను ఎక్కిన ఎందరో స్త్రీపురుషుల గురించి గాంధీజీ ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు కదా!’ అన్నారట సావర్కర్‌. అలాగే ఇటీవలి కాలంలో కూడా సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరిన పలాయతుడు అంటూ నోళ్లు పారేసుకున్న వారు ఉన్నారు. తాను క్షమాభిక్ష కోరిన అంశాన్ని (ఆరుసార్లు) సావర్కర్‌ ఏనాడూ నిరాకరించలేదు అంటారు ఆయన జీవితచరిత్రను రాసిన మరొక రచయిత వైభవ్‌ ‌పురందరే. క్షమా విన్నపాల కారణంగానే సావర్కర్‌ ‌చరిత్ర తన ఔన్నత్యం కోల్పోదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒక రాజకీయ ఖైదీగా ఆయన తన హక్కును వినియోగించుకున్న అంశాన్నే ఇందులో చూడాలని గుర్తు చేశారు.

గాంధీజీ హత్య ఉదంతంలో వీర్‌ ‌సావర్కర్‌ ‌పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కాలేదు కాబట్టే నిర్దోషిగా విడుదల చేశారని ఆయన మనుమడు రంజిత్‌ ‌సావర్కర్‌ ఇటీవలనే చెప్పవలసి వచ్చింది. ఇందులో ఒక మలుపు ఉంది. ఆ సంచలనం అదే. గాడ్సేకు ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడే పిస్టల్‌ ఇచ్చి చంపమన్నాడని కూడా రంజిత్‌ ‌చెప్పడంతో ఈ వ్యాఖ్యకు పదును వచ్చింది. ఈ అంశం మీద దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోరారు. గాడ్సేకు సావర్కర్‌ ‌పిస్టల్‌ ‌సమకూర్చారని గాంధీజీ మనుమడు తుషార్‌ ‌గాంధీ ఆరోపించిన నేపథ్యంలో రంజిత్‌ ఈ ఆరోపణ చేశారు. నిజానికి జనవరి 30, 1948 కంటే ముందు గాంధీజీ మీద మరొక హత్యాయత్నం (పేలుడుతో) జరిగింది. అందులో నిందితుడు మదన్‌లాల్‌ ‌ఫావా. ఈ ఘటన జరిగిన నాటి నుంచి సావర్కర్‌ ‌మీద పోలీస్‌ ‌నిఘా ఉంచిన సంగతిని రంజిత్‌ ‌గుర్తు చేశారు. ఆ పేలుడు జరిగిన తరువాత సావర్కర్‌ ఎవరినీ కలుసుకోలేదని పోలీస్‌ ‌రికార్డులు చూస్తే తెలుస్తుందని రంజిత్‌ ‌చెప్పారు. హత్యకు రెండు రోజుల ముందు తనను కలసిన గాడ్సేకు సావర్కర్‌ ఆయుధం అందచేశారన్న ఆరోపణ తప్పని దీనిని బట్టి అర్ధమవుతుందని ఆయన చెప్పారు.

గాంధీజీ హత్య కేసులో నాథూరామ్‌ ‌గాడ్సే, వీర్‌ ‌సావర్కర్‌, ‌గోపాల్‌ ‌గాడ్సే (నాథూరామ్‌ ‌సోదరుడు), మదన్‌లాల్‌ ‌ఫావా, శంకర్‌ ‌కిష్టయ్య, దిగంబర్‌ ‌బాడ్గే, నారాయణ్‌ ఆప్టే, విష్ణు కర్కరేలను నిందితులుగా అరెస్టు చేశారు. మే 27,1948న వీరిపై ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణ మొదలయింది. ఈ ప్రత్యేక న్యాయస్థానానికి జస్టిస్‌ ఆత్మచరణ్‌ ‌న్యాయమూర్తి. మొత్తం 149 మంది సాక్షులను విచారించారు. కానీ డిఫెన్స్ ‌తరఫున ఎవరూ సాక్షి లేరు. నవంబర్‌ 8, 1949‌న గాడ్సే, ఆప్టేలకు మరణ దండన విధిస్తూ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించారు. గాడ్సే, ఆప్టేలకు విధించిన శిక్షను తగ్గించవలసిందిగా గాంధీజీ కుమారులు మణిలాల్‌ ‌గాంధీ, రామదాస్‌ ‌గాంధీ విన్నవించినా ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌, ‌గవర్నర్‌ ‌జనరల్‌ ‌రాజాజీ అంగీకరించలేదు. నవంబర్‌ 15, 1949‌న ఆ ఇద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు.

సావర్కర్‌ ‌తన అరెస్టుకు ముందే లిఖిత పూర్వకంగా ఒక ప్రకటన వెలువరించారని ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ ఫిబ్రవరి 7, 1948న పేర్కొన్నది.‘గాంధీజీ హత్య అంటే భ్రాతృహత్యతో సమానం. ఇప్పుడే ఆవిర్భవించిన దేశానికి ఇది చేటు చేస్తుంది’ అన్నదే ఆ ప్రకటన సారాంశం. గాంధీజీ హత్యకు పూర్తి బాధ్యత తనదేనని నాథూరామ్‌ ‌ప్రకటించాడు. దిగంబర్‌ ‌బాడ్గే అప్రూవర్‌గా మారాడు. అతడు చెప్పిన ప్రకారం జనవరి 17, 1948న నాథూరామ్‌ ‌బొంబాయి వెళ్లి సావర్కర్‌ను కలుసుకున్నాడు. వెంట ఆప్టే కూడా ఉన్నాడు. వారు తిరిగి వస్తుంటే సావర్కర్‌ ‌విజయీభవ అని దీవించారు. కానీ ఈ వాగ్మూలాన్ని కోర్టు నిరాకరించింది. దీనితో ఆధారాలు దొరకనందున కోర్టు సావర్కర్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. వెనువెంటనే ‘హిందూ జాతీయవాదాన్ని రెచ్చ గొట్టే’ ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో స్వతంత్ర భారత ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసింది. తాను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని మాట ఇచ్చిన తరువాత విడుదల చేశారు. రాజకీయోపన్యాసాలు మానేసినా, హిందూధర్మంలోని సున్నితమైన అంశాల గురించి ఆయన ప్రసంగించేవారు.

 గాంధీజీని వ్యతిరేకించినంత మాత్రాన సావర్కర్‌ ‌వంటి యోధులను విస్మరించడానికి భారతీయులంతా సిద్ధంగా లేరు. దేశ ప్రజలకు విశేష సేవలు అందించిన వీర్‌ ‌సావర్కర్‌, ‌బరీంద్రకుమార్‌ ‌ఘోష్‌ (అరవింద్‌ ‌ఘోష్‌ ‌సోదరుడు), భూపేంద్రనాథ్‌ ‌దత్త (వివేకానందుల సోదరుడు) వంటివారి త్యాగాలను గౌరవిద్దామంటూ రాజా మహేంద్ర ప్రతాప్‌ ‌సింగ్‌ ‌నవంబర్‌ 22, 1957‌న లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఇది 45 ఓట్ల తేడాతో వీగిపోయింది. దేశభక్తికి వారంతా చిరునామాలే. కానీ గాంధీజీని అనుసరించలేదు. అదే వారు చేసిన పాపం.1964లో నెహ్రూ మరణించాక లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి సావర్కర్‌కు స్వాతంత్య్ర సమర యోధులకు ఇచ్చే పింఛన్‌ ‌సౌకర్యం కల్పించారు.

జీవిత చరమాంకంలో కూడా సావర్కర్‌ ‌రచనా వ్యాసంగాన్ని వీడలేదు. ‘ఆత్మహత్య ఆత్మార్పణ కాదు’ అన్న పేరుతో ఒక వ్యాసం రాశారు. దాదాపు ఇదే వారి అంతిమ రచన. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు రాసినది. ఒక వ్యక్తి జీవితలక్ష్యం నెరవేరితే, నిర్వర్తించడానికి ఏమీ మిగలకపోతే మరణం ఆసన్నమయ్యే దాకా వేచి ఉండకుండా ఆత్మార్పణ చేసుకోవడమే ఉత్తమమని ఆ వ్యాసంలో ప్రతిపాదిం చారు. అలాంటి భావనకు వచ్చిన తరువాతే అది రాశారని అనిపిస్తుంది. ఫిబ్రవరి 1, 1966న ఆయన మందులు, ఆహారం ఆఖరికి మంచినీరు త్యజించారు. ఫిబ్రవరి 26, 1966న తుదిశ్వాస విడిచారు. మరణం తరువాత కూడా కాంగ్రెస్‌ ‌సావర్కర్‌ ‌పట్ల అదే వైరాన్నీ, ద్వేషాన్నీ కొనసాగించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఉంది. కానీ సంతాపదినాలనూ ప్రకటించలేదు. మంత్రి వర్గంలో ఏ ఒక్కరు నివాళీ ఘటించలేదు.

ఆ దేశభక్తుడిది పరాయి పాలకుల అండమాన్‌ ‌జైలులో.. స్వతంత్ర భారత అహింసావాదుల వేటలో ఒకే రకమైన అనుభవమనిపిస్తుంది.

ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఆయనకు లేదు. ఆత్మార్పణ చేసుకోవలసిన పరిస్థితులను జీవించి ఉండగానే అహింసావాదులు చుట్టూ చితిలా పేర్చారు. ఇదే సావర్కర్‌ ‌జీవితం.

About Author

By editor

Twitter
Instagram