ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో యోగా విశ్వానికి శ్వాస అయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యం మీద కొత్త దృష్టికి నాంది పలికింది. ఇస్లాం, క్రైస్తవ దేశాలలో సైతం భారతీయ యోగా ఖ్యాతి గాంచింది. కమ్యూనిస్టులు సైతం ఆచరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యోగాకు పట్టం కట్టింది.

పిన్న వయసులో గురువుగా గౌరవం

అప్పటికి తబే అట్విన్స్‌కు ఆరేళ్లే. ఆ ప్రాయంలోనే యోగా వైపు దృష్టి సారించాడు. కారణం- తల్లి క్యాన్సర్‌ ‌వ్యాధిని యోగాతో జయించింది. రేడియం చికిత్సలతో క్యాన్సర్‌ ‌రోగులు పడే బాధలు వర్ణనా తీతం. అలాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడినప్పటికి తల్లి మృత్యుంజయురాలు కావటానికి యోగానే కారణమని ఆ బాలుడు గ్రహించాడు. యోగ సాధనలో అంచెలంచెలుగా ఎదిగాడు. 10వ ఏటనే అమెరికాలో అతి పిన్న వయసు యోగా మాస్టర్‌గా ఖ్యాతి గాంచాడు. 200 గంటలు యోగ సాధన చేసి విశ్వాస్‌ ‌సర్టిఫికెట్‌ను చేజిక్కించుకున్నాడు. తన సంపాదన సేవా కార్యక్రమాలకూ, క్యాన్సర్‌ ‌బారిన పడిన పిల్లలకు ధారపోస్తున్నాడు. పిల్లల నుండి వృద్ధుల దాకా అందరికీ యోగా నేర్పుతున్నాడు. వైద్యులు, సెలబ్రిటీలు తబే దగ్గర శిక్షణ పొందడం విశేషం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దీపక్‌ ‌చోప్రా తబేను యోగా గురువుగా భావించాడు. తల్లి స్ఫూర్తితో అమెరికాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు.

భారతదేశం అంటే తబేకు ఎంతో గౌరవం. ఇప్పుడు ఓంకార సాధనలో ఉన్నాడు. నమస్తే అంటూ శిక్షణ ప్రారంభిస్తాడు. తరగతులలో ఓంకారం, బుద్ధుని ప్రతిమలు దర్శనమిస్తాయి. క్లిష్టమైన ఆసనాలను కూడా సునాయాసంగా వేస్తాడు. మాంసాహారానికి ఏనాడో వీడ్కోలు చెప్పేశాడు. శాకాహారానికి ‘జై’ అంటాడు. తబేకు ఇప్పుడు 15 సంవత్సరాలు. అమెరికాలో పిన్న వయసు యోగా మాస్టర్‌ ‌స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు.

శ్రుతి కీర్తి పతాక

అలహాబాద్‌కు చెందిన శ్రుతి పాండేకు ప్రధాని మోదీ అంటే ఎంతో భక్తి, గౌరవం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించినందుకు మోదీని ఎంతగానో శ్లాఘించింది. రెండవ సంవత్సరం వయసు నుంచే శ్రుతి యోగాను అభ్యసించడం ఆరంభించింది. కేవలం యోగా తరగతులకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా పర్యటిస్తూ యోగా గురించి ప్రజలలో చైతన్యం పెంచుతోంది. వేకువన అలహాబాద్‌లో తరగతులు ఆరంభిస్తుంది. కఠినమైన యోగాసనాలను కూడా సునాయాసంగా చేస్తుంది.

జంతువుల భంగిమలు

ఆల్మా చిన్న వయసులోనే జంతువుల భంగిమ లను ఇట్టే పసిగట్టేసింది. శునకం, కోతి, పిల్లి, గద్ద వంటివి ప్రదర్శించే భంగిమలు మన శారీరక రుగ్మతల నివారణకు ఎలా దోహదం చేస్తాయనేది ఈ చిన్నారి యోగా బోధనాంశం. పర్వత ధ్యానం, పర్వతారోహణ ఇలా వైవిధ్య యోగా సందేశాలు ఆమె కృషిలో కనిపిస్తాయి.

భాగ్యనగరం భాగ్యశాలలు

వైష్ణవి, శ్వేత అన్నదమ్ముల పిల్లలు. వైష్ణవి నాల్గవ సంవత్సరంలోనే యోగా సాధన ప్రారంభించింది. ఇప్పుడు 10వ తరగతి. శ్వేత ఇంటర్‌ ‌విద్యార్థి. ఇద్దరూ అంతర్జాతీయ యోగా శిక్షణను రెండు నెలల్లో పూర్తి చేశారు. 300 గంటలు యోగ సాధన చేసి యోగ్యతా పత్రాలను పొందారు. ఇతర దేశాలవారికి కూడా ధ్యానం, ప్రాణాయామంపై ఆన్‌లైన్లో బోధిస్తున్నారు. యోగా సిస్టర్స్‌గా వినుతికెక్కారు. బోధిలో శిక్షణ పొందారు.

పద్మ వికాసం

అమీర్‌పేటలోని యోగక్షేత్ర నిర్వాహకురాలు పద్మ, ఆ కేంద్రాన్ని ఫిబ్రవరి, 2010లో ప్రారంభిం చారు. మూడు నెలలు, ఆరునెలల శిక్షణ కాలాం శాలు. హాస్టల్‌ ‌వసతి ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు ఇలా పలు వయసుల వారికి ఉదయం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. అన్నీ రుగ్మతలకు యోగానే విముక్తి అంటారు పద్మ. ఇతర ప్రాంతాలవారు వస్తే భోజన, వసతి సదుపాయాలున్నాయి. భాగ్యనగర్‌ ‌నడిబొడ్డు అమీర్‌పేటలో యోగక్షేత్రం అందరికీ అందుబాటులో ఉంది. గృహిణులు అల్పాహారం చేసి ఇల్లు చక్కపెట్టు కొని 11 గంటలకు వస్తే 12 వరకు గంట శిక్షణ ఉంటుంది. అల్పాహారం తరువాత వ్యాయామానికి రెండు గంటల వ్యవధి ఉండాలి.

దుర్గమ్మ సన్నిధి

విజయవాడకు చెందిన శిరీష గృహిణి. గురువులు మంతెన సత్యనారాయణరాజు, సీతా రామయ్య ప్రోత్సాహంతో యోగ సాధనలో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి సుబ్బారావు భీమవరంలోని మార్కెటింగ్‌ ‌యార్డులో యోగ సాధన చేయడానికి వెళుతూ ఉంటే, 15 సంవత్సరాల వయసులో శిరీష కూడా యోగా ఆరంభించింది. తండ్రి ప్రోత్సాహం లభించింది. తర్వాత భర్త సత్యనారాయణ కూడా మద్దతు పలికారు. అనతికాలంలోనే బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. కళాదర్శన్‌ ‌పేరుతో సంస్థను ప్రారంభించి యోగా శిక్షణ అందిస్తున్నారు. జ్యోత్స్న, జెన్నిఫర్‌ ‌లాంటి యోగ అధ్యాపకులను తయారు చేశారు. శిరీష యోగ డ్యాన్స్‌లో కూడా తన ప్రావీణ్యం చాటుకున్నారు. దక్షిణ కొరియాలో వచ్చే ఆగస్ట్‌లో నిర్వహించనున్న యోగ పోటీలలో తన సత్తా చాటుకోనున్నారు. గతంలో ఆర్థిక సమస్యల కారణంగా చైనా వెళ్లలేకపోయారు. పంజాబ్‌లో జరిగిన పోటీలలో గ్రాండ్‌ ‌మెడల్‌ అం‌దుకున్నారు.

యోగా కుటుంబం

విజయవాడ అయోధ్యనగర్‌ ‌నివాసి ఎల్‌.‌శాంతి, భర్త మురళీకృష్ణ, తనయులు శ్రీకృష్ణ, శ్రీరామ్‌. అం‌తా యోగ సాధకులే. భార్యభర్తలు యోగా టీచర్లు. వీరి యోగ ప్రదర్శన ఉత్తరప్రదేశ్‌ ‌యోగ అసోసియేషన్‌ ‌వారిని ఆకర్షించింది. శాంతి బెంగళూరులోని ఎస్‌.‌వ్యాసలో శిక్షణ పొందారు. లక్నో, అన్నామలై విశ్వవిద్యాలయాలలో (చిదంబరం) శిక్షణ పొంది, రాజస్తాన్‌ ‌యోగ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.‌డి పొందారు. జాతీయ యోగా పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ప్రముఖులకు శిక్షణ ఇస్తున్నారు.

ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌

‌విజయవాడ గాయత్రీనగర్‌ ‌వాసులు దండు శ్రీనివాసరాజు, దుర్గశక్తమ్మ ఎడ్వాన్స్‌డ్‌ ‌టీచర్లు. తెలుగు రాష్ట్రాలలో సుదర్శన పక్రియను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అనేకమంది ప్రముఖులు, డాక్టర్లు వీరి వద్ద శిక్షణ పొందుతున్నారు. కరోనా సమయంలో కూడా తరగతులకు విరామం ఇవ్వలేదు. శ్రీశ్రీ పండిట్‌ ‌రవిశంకర్‌ ‌గురూజీ (ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌) ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు.

యోగాలో రకాలెన్నో

హాస్య యోగ పేరుతో లాఫింగ్‌ ‌క్లబ్‌, ‌హైదరా బాద్‌లో ఎస్‌.ఎల్‌.‌వి. కుమార్‌ ‌నిర్వహించే ట్రెడిషినల్‌ ‌యోగ, కోయంబత్తూర్‌ ‌కేంద్రంగా సద్గురు ఆశీస్సులతో ఇషా యోగ, మౌంట్‌ ఆబూ కేంద్రంగా బ్రహ్మ కుమారీలు నిర్వహించే రాజయోగ, పుణే కేంద్రంగా అయ్యంగార్‌ ‌యోగ, మైసూరు శ్రీ గణపతి సచ్చిదానందవారి క్రియా యోగ, రాంచీ కేంద్రం వారి క్రియా యోగ, బిహార్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌యోగ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌స్ఫూర్తితో ఎస్‌.‌వ్యాస బెంగుళూరు నిర్వహిస్తున్న యోగా, టిబెటిన్‌ ‌యోగ, విపస్యన ధ్యాన పద్ధతి ఇలా ఎన్నో ప్రాచుర్యం పొందాయి.

సద్గురు జగ్గీవాసుదేవ్‌ ‌యుక్త వయసులో వేల సూర్యనమస్కారాలు చేయబట్టి వారు ఆధునిక ప్రపంచంలో, హఠయోగను బోధిస్తున్నారు. సేవ్‌ ‌రివర్స్ ‌పేరుతో మోటర్‌ ‌సైకిల్‌ ‌యాత్రను చేపట్టారు. పర్వతా రోహకులుగా, హెలికాప్టర్‌ ‌పైలట్‌గానూ ప్రావీణ్యం ఉంది. ఎన్నోసార్లు మానస సరోవర్‌ ‌యాత్ర గావించారు. రామ్‌దేవ్‌బాబా ఆసనాలు యోగాను దేశ ప్రజలందరికీ సుపరిచితం చేశాయి. అన్య మతస్తులు కూడా ఆసనాలపై మక్కువ చూపుతున్నారు.

యోగాభ్యాసాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంతోనే సరిపెట్టకుండా నిత్య జీవితంలో భాగం చేసుకున్నప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది.

– దండు కృష్ణవర్మ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram