సప్తస్వరాల సర్వస్వం

సప్తస్వరాల సర్వస్వం

కర్ణాటక సంగీత కోశం (ఎన్‌సైక్లోపీడియా అప్‌ కర్ణాటక మ్యూజిక్‌) అనే గ్రంథాన్ని ఆసాంతం చదవడానికి ఒకవారం రోజులు, ఆకళింపు చేసుకొనడానికి మరోవారం పట్టింది. పుస్తకంలోని విషయానికి తగ్గట్టుగా (కాకతీయ శిల్పం) ముచ్చటగా ఉంది పుస్తకం పైన అట్ట. దక్షిణాది సంగీతానికి సంబంధించిన ఒక విలక్షణ గ్రంథం ఇది. లక్ష్య సంగీతానికి (ప్రాక్టికల్‌) సంబంధించినవి – గీతాలు, వర్ణాలు, కీర్తనలు, కృతులు మొదలైన రచనలతో కూడినవి – స్వర సహితంగా ఉన్న పుస్తకాలు విరివిగా ఉన్నాయి. ఇక లక్షణ గ్రంథాలు (థీయరీ) – సిద్ధాంతపరమైనవి కూడా తక్కువేమీ కాదు. అనాది కాలం నుండి భరతాది మునులు వెలువరించిన ‘నాట్యశాస్త్రం’ మొదలు నేటివరకు – ఎన్నో లక్షణ గ్రంథాలు సంగీతజ్ఞులకు మార్గదర్శకంగా ఉన్నాయి. కాని, వాటిని చదవడానికి, అవగాహన చేసుకోడానికి చాలా సమయం వెచ్చించాలి; కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలో రచయిత్రి డాక్టర్‌ చల్లా విజయలక్ష్మి గారు ఒక సమగ్ర నిఘంటువుని రూపొందించారు. సంగీతంలో తరచుగా వినిపించే ఎన్నో పారిభాషిక పదాలకు సరళమైన అర్థం, అవసరమైన చోట వివరణ ఇచ్చారు. ఇటువంటి బృహత్కార్యానికి విస్తారంగా గ్రంథ పరిశోధన, పండిత చర్చలు అవసరం. వీరి విశేషకృషి ఈ నిఘంటువు ప్రామాణికతకు దర్పణం పడుతుంది.

ఈ గ్రంథంలో పొందుపరచిన కొన్ని అంశాలను సమీక్షిస్తాను.

కర్ణాటక సంగీత విద్వాంసులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు తరచుగా తలెత్తే సందేహాలలో ఒకటి – గ్రామ, జాతి, మూర్చనల వివరణకు సంబందించినది. షడ్జ, మధ్యమ, గాంధార గ్రామాలు ప్రాచీన గాన సంప్రదాయానికి చెందినవి. దీనిని ఎలా గానం చేసేవారో మనకు స్పష్టంగా తెలియదు. ఒక్కొక్క స్వర ఆధారిత గ్రామ సముదాయంలో కొన్ని జాతులుండేవి: షాడ్జీ, ఆర్షబి, గాంధారీ, మధ్యమ, పంచమ, ధైవత, నిషాదీ.. ఈ ఏడు జాతులకు కొన్నేసి (7చొప్పున) మూర్చనలు. అవే కాలక్రమేణా రాగాలైనాయి. ‘రాగం’ పదం మొదటగా ‘బృహద్దేశి’లో ఉపయోగించడం కనిపిస్తుంది. ఆనాడు రాగాలలో మేళరాగాలు, జన్యరాగాలు ఇలాంటి విభజన లేదు. శార్ఞదేవుడి ‘సంగీత రత్నాకరం’ పాటపై వచ్చిన సంగీత గ్రంథాల వివరణ, కుడిమియామలై శాసన ప్రశస్తి – ఇవన్నీ అవసరమైన మేరకు విపులీక రించడంలో రచయిత్రి చేసిన కృషి అభినందనీయం.

ఇక, ఈ గ్రంథంలో ప్రస్తావించినన్ని వీణలపేర్లు ఇంతకు ముందు ఎక్కడా వినలేదు. బ్రహ్మవీణ- ఏకతంత్రీ వీణ; నకుల వీణ- ద్వితంత్రీ; చిత్రవీణ- సప్తతంత్రి; కాత్యాయనీ వీణ- శతతంత్రి (సంతూర్‌ వంటిది), ఇంకా కైలాసవీణ, కూర్మవీణ, ఆకాశవీణ, కిన్నెరవీణ, మనోరథ వీణ, సరస్వతీ వీణ (ఇప్పుడు వాడుతున్నది)- ఇలా ఎన్నో ప్రస్తావించారు రచయిత్రి. కర్ణాటక సంగీత సంప్రదాయంలో శ్రుతి నిర్ధారణకు మూలధారం ‘వీణ’యే.

ప్రాచీన సంగీత సంప్రదాయంలో ఉన్న రాగాలన్నింటికి రాగాదిదేవతలు- పురుష, స్త్రీ దేవతలు. తత్సంబంధిత వర్ణనల గురించి వివరించారు. ఉదాహరణకి –

హిందోళ రాగవర్ణన –

గౌరాంగీ మణి భూషణాం

మురళి కాగాన ప్రియాం మేమనే

హిందోళం వరచిత్ర వస్త్రలసితాం

తుంగస్పనీం ధ్యాయతి ||

ముఖారి –

సఖీద్వయే హస్తయుగం చదత్త్వా

ప్రసర్పయంతీ మదలాలసేన

మందారమాలాంకిత కంఠభాగాం

ద్యాయే న్ము-రీం సతతం మనోమే||

కాంభోజి-

కరతల ధృథవామ గండబాగాం

చరణతలే భువంసదా లిఖంతీమ్‌

అవిరళ సవిలాస గాన లోలాం

మనసి ధ్యాయామి సంతతం కాంభోజీమ్‌||

భూపాలరాగం –

ఉత్తుంగ వక్షోభర భార నమ్రా

గౌరీ స్ఫురత్‌ కుంకుమ లిప్తదేహా

సంపూర్ణ శీతాంశు మనోజ్ఞ వక్త్రా

భూపాళికా సైవ పతిం స్మరంతీం ||

యమునా కళ్యాణి –

శృంగార మాతృకాం మేమధురిపు

వామాంక వాసినీం సద్బూషాం

యమునాం రుచిజిత యమునాం మనని

ధ్యాయామి సంతతం మృదంగీమ్‌ ||

ఈ గ్రంథంలో ఒకే పేరుతో ఉన్న రాగాల ప్రస్తావన పలుచోట్ల కనిపిస్తుంది. వాటి జనక రాగాలు, మూర్చనలు భిన్నంగా ఉన్నా ఒకే పేరుమీద చెలామణి అవుతున్నాయి. మచ్చుకమ్‌ – అసావేరి, ఆహిరి, కన్నడగౌళ, కుంతలవరాళి, కర్ణభూషణి, కళావతి, కళ్యాణవసంతం, కోకిలప్రియ, దేశ్యకాపి, మలహరి, పరమేష్ఠి, ప్రతీతి మొదలైనవి.

ప్రాచీన సంప్రదాయంలో తాళాధ్యాయంలో విప్ర, క్షత్రియ, వైశ్య, శూద్ర తాళాలు (వర్ణ విభజన ఆధారమైనవి) ఉన్నట్లుగా పేర్కొనడం కనిపిస్తుంది. ఆయా తాళాలను ఎలా లెక్కవేసేవారో, గాన, వాద్య ప్రక్రియలలో ఎలా ఇమిడినవో తెలియరాదు.

కొంతమంది అజ్ఞాత వాగ్గేయకారుల, విద్వాంసుల పరిచయం కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఇవిగాక, కంఠగుణ లక్షణాలు, కంఠ శుద్ధ ఔషధాల గురించిన వివరణ గాయకులందరికీ ఉపయోగకరమైన విషయం. అక్కడక్కడ సప్తస్వరాల మంత్రధ్యానం గురించి వివరించారు. సులభగ్రాష్యమైన భాషలో రచించిన ఈ ‘కర్ణాటక సంగీత కోశం’ సంగీత విద్యార్థులు, విద్వాంసులు, పరిశోధకులు, ఔత్సాహికులు చదువుకోవలసినదే. అలాగే ప్రతి సంగీత పాఠశాలలోనూ ఉండదగిన గ్రంథం కూడా.

–  డి. బాలాత్రిపురసుందరి

 

సహజత్వాన్ని వదులుకోరాదు

‘ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది కర్ణాటక సంగీత సంప్రదాయం. అయినా ఆ ధార కూడా కాలం వేసే వల నుంచి తప్పించుకోలేక పోతోందనిస్తున్నది. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది తప్పట్ల సంగీతమేననిపిస్తుంది’ అంటున్నారు డాక్టర్‌ చల్లా విజయలక్ష్మి. రెండున్నర దశాబ్దాలుగా సంగీత కళా శోధనలో ఉన్నారు డాక్టర్‌ విజయలక్ష్మి. ఆమె ఎంఫిల్‌తో పాటు, రెండు డాక్టరేట్లు తీసుకున్నారు. ఎంఫిల్‌ పట్టా కోసం సమర్పించిన పరిశోధక వ్యాసం ’15, 16 శతాబ్దాల నాటి తెలుగు సాహిత్యంలో సంగీత గద్య ప్రబంధాలు’. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు డాక్టర్‌ బాలాంత్రపు రజనీకాంతరావు పర్యవేక్షణలో ఈ పరిశోధక వ్యాసం రూపొందింది. రాజమహేంద్రవరంలోని (బొమ్మూరు) సాహిత్య పీఠం ఇచ్చిన ఈ ఎంఫిల్‌ పరిశోధక వ్యాసానికి రెండు స్వర్ణ పతకాలు కూడా దక్కాయి. పీహెచ్‌.డి. పట్టా కోసం మొదటి పరిశోధన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య పర్యవేక్షణలో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో చేశారు. ఈ పరిశోధనాంశం ‘ఆంధ్రదేశ సంస్థానాలు-సంగీత వాజ్ఞయం’. ఇది తెలుగులో చేశారు. తరువాత తెలుగు విశ్వ విద్యాలయం నుంచి సంస్కృతంలో, ‘కర్ణాటక సంగీత చరిత్ర- క్రమపరిణామం’ అనే అంశం మీద పరిశోధక వ్యాసం సమర్పించారు. ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పర్యవేక్షణలో ఈ పరిశోధన సాగింది.

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ‘కర్ణాటక సంగీత రచనలలో ఆలంకారిక ఛందోరీతులు’ అనే అంశంతో పరిశోధక పత్రం రూపొందిచారు డాక్టర్‌ విజయలక్ష్మి. అలాగే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ఎన్‌ఎస్‌ రాజు పర్యవేక్షణలో ‘కర్ణాటక సంగీత రచనలు- నిర్మాణ విశ్లేషణ’ అనే పరిశోధక గ్రంథాన్ని వెలువరించారు. దీనికే యూజీసీ వారి పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోఫిప్‌ వచ్చింది. ఆమె తాజా రచన- ‘కర్ణాటక సంగీత కోశం’. మూడున్నర సంవత్సరాలు శ్రమించి వెలువరించారు. ఆమెకు పరిశోధన ఒక తీరని తృష్ణ. ఇందుకు నిదర్శనం- మళ్లీ ఇప్పుడు టాగోర్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికై, ’19, 20 శతాబ్దాల కాలం నాటి యక్షగానాలు, సమగ్ర పరిశీలన’ అనే అంశం మీద కొత్త పరిశోధనకు సమాయత్త మవుతున్నారు. ఆ విదుషీమణితో జాగృతి జరిపిన మాటామంతీ.

మీ సంగీత నేపథ్యం ఏమిటి? ఈ అభిరుచి ఎలా వచ్చింది?

నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహమే ఇదంతా. మా నాన్న చల్లా కృష్ణమూర్తిశాస్త్రి ఆకాశవాణి నిలయ విద్వాంసులు. ఆయన 1992లో కన్నుమూశారు. నాకు ఏదైనా తెలిసిందంటే అదంతా ఆయన నుంచి నేర్చుకున్నదే.

కర్ణాటక సంగీతాన్ని ఒక సముద్రంతో పోల్చవచ్చునేమో! అలాంటి సంప్రదాయానికి కొత్తగా ఒక పదకోశం అవసరం ఉందని మీరు అనుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ఇంతకు ముందు లేవా?

‘సంగీత శబ్దార్థ చంద్రిక’ అని ఒక పదకోశం ఉంది. అరిపిరాల సత్యనారాయణమూర్తి అనే విద్వాంసుడు 1954లో వెలువరించారు. ఈ గ్రంథం సమగ్రమని ఎవరూ అనుకోలేరు. కర్ణాటక సంగీతానికి అద్భుతమైన సేవ చేసిన తెలుగువారు ఎందరో ఉన్నారు. కానీ వారిని ఈ గ్రంథం పెద్దగా పట్టించుకోలేదు. కర్ణాటక సంగీమంటే తమిళనాడు వారిదే అన్నట్టు, ప్రాధాన్యమంతా ఆ ప్రాంత విద్వాంసులకే ఇచ్చారు. ఆనాడు ఆ గ్రంథ రచనకు, గ్రంథకర్తకు ఉన్న పరిమితులు ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పుస్తకం అన్ని అంశాలను స్పృశించలేదని మాత్రం చెప్పగలం. అంతేకాదు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వారు ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో మూడు సంపుటాలు వెలువ రించారు. అందులో కూడా ఏదో పేరుకి అన్నట్టు, అన్నమాచార్యులవారి పేరు, మంగళంపల్లి బాల మురళీకృష్ణగారి పేరు మాత్రం కనిపిస్తాయి. అలాగే కర్ణాటక సంగీత సంప్రదాయానికి చెందిన రాగాల పేర్లు కూడా తగినంతగా ప్రస్తావించలేదు. కాబట్టి ఒక కొత్త పదకోశం అవసరం ఉందని నాకు అనిపించి పరిశోధన ఆరంభించాను.

భారతదేశంలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీతాలకి ఎంతో ఆదరణ ఉంది కదా! వైరుధ్యం కావచ్చు, వైవిధ్యం కావచ్చు, వీటి మధ్య ప్రధానంగా కనిపించేది ఏమిటి?

హిందుస్తానీ సంప్రదాయంలో సాహిత్యం (గౌణం) అప్రధానం. కర్ణాటక సంగీతంలో సాహిత్యం ప్రధానం. కర్ణాటక సంప్రదాయంలో చాలా ప్రక్రియలే ఉన్నాయి కదా! పదం, కృతి, వర్ణం, జావళి. మళ్లీ వీటిలో సాహిత్య ప్రధానమైనవి పదం, కీర్తన జావళి. సంగీత ప్రధానమైనవి కృతి, వర్ణం. ఈ సంప్రదాయంలో ప్రాతఃస్మరణీయుల ప్రతిభ కూడా అమోఘం. ముత్తుస్వామి దీక్షితుల వారు కృతులు రాశారు. త్యాగరాజస్వామి కీర్తనలు, కృతులూ కూడా రాశారు. శ్యామశాస్త్రి వర్ణాలు, కృతులు, కీర్తనలు – మూడూ రాశారు.

కొత్తగా ఏదైనా పుస్తకం వస్తోందా?

16-17 శతాబ్దాలకు చెందిన భానుదత్తమిశ్రుడు అనే లాక్షిణికుడు ‘రసమంజరి’ అనే పుస్తకం రాశాడు. అక్బర్‌ షా అనే పండితుడు శృంగార రసమంజరి’ అనే పుస్తకం రాశారు. ఇది పద సాహిత్యం లక్ష్య లక్షణ సమన్వయం. దీనిని సురథాని కోదండపతికవి అనే ఆయన ‘శృంగార రసమంజరి’ పేరుతో అనువదించారు. రజమంజరి, శృంగార రసమంజరి, క్షేత్రయ్య పదాలు కలపి ఒక లాక్షిణిక గ్రంథంగా వెలువరిస్తున్నాను. త్వరలోనే బయటకు వస్తుంది.

కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఆధునిక కాలంలో ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, బాలమురళి వంటివారి కృషిని ఒక పరిశోధకురాలిగా మీరు ఎలా చూస్తారు?

వారి కృషి నభూతో నభవిష్యతి. అంతే. ‘జనకరాగ కృతి మంజరి’లో 72 మేళకర్తల కృతులు రాశారు బాలమురళి. తిల్లానాలు రాశారు. ఇక సుబ్బులక్ష్మి వంటివారు మళ్లీ పుట్టాలి. నానాటికి సహజత్వం కోల్పోతోన్న కర్ణాటక సంగీతానికి మళ్లీ సహజ ధర్మం రావాలంటే అలాంటి మహనీయురాలు రావాలి. కానీ కొత్తవారు ఏరి? ఎప్పటికి వస్తారు? ఎదురు చూద్దాం! కానీ వస్తారనే నా ఆశ. రావాలనే నా ఆకాంక్ష. సంగీతంతో కీర్తిని ఆశిస్తున్నారు చాలామంది. గతించిపోయిన ఆ మహనీయులు జీవితకాలం సాగించిన తపస్సు ఓ అద్భుతం. కానీ ఇప్పుడు రెండు మూడు కీర్తనలు నేర్చే సరికే చాలా సంగీతం వచ్చునని అనుకుంటున్నవారు కనిపిస్తున్నారు, నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని గ్రహిస్తున్నవారు కనిపించడం లేదు. ఆ సంగతి ఇలాంటి వారికి చెప్పేవారు కూడా లేరేమోనని పిస్తున్నది. ఇది శుభ పరిణామం కాదు కదా!

ఆరోగ్యం సహకరించకున్నా ఇంత కృషి సాగించారు. ఏమిటి ప్రేరణ?

భగవంతుడి దయ. నాన్నగారి ఆశీస్సులు.

కర్ణాటక సంగీత కోశం

రచన : డా.చల్లా విజయలక్ష్మి

పుటలు : 570 , వెల : రూ.850/-

ప్రతులకు : రచయిత్రి పేరిట

ఇంటి నెం.1-5-22, వీధి నెం.12ఎ

న్యూ మారుతీ నగర్‌, కొత్త పేట,

హైదరాబాద్‌ – 500060

దూరవాణి : 040-24048479

 

–  డా. చల్లా విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *