కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

ఘటం భింద్యాత్‌ ఫటం ఛింద్యాత్‌

కుర్యాత్‌ గార్ధభ రోహణమ్‌ |

ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషోభవ ||

ఇదొక సంస్కృత శ్లోకం. ‘ఎలాగోలా అందరి కళ్లల్లో పడు, ప్రసిద్ధుడవవ్వు, దానికోసం నడిరోడ్లపై కుండలు బ్రద్దలు కొట్టు, గుడ్డలు చించుకో, గాడిద ఎక్కి ఊరేగు!’. ఇదీ దాని అర్థం.

శ్లోకంలో పేర్కొన్న ‘ప్రసిద్ధ’ పురుషులకి మనదేశంలో లోటు లేదు. ‘అందరిదీ ఓదారి – ఉలిపిరి కట్టది మరోదారి’ సామెత మాదిరిగా ఉంటుంది వీరి వ్యవహారం. జాతీయవాదానికి వ్యతిరేకులైన వీరిని నిర్మొహమాటంగా ధర్మద్రోహు లనో, జాతి ద్రోహులనో అనవచ్చు. అందుకు తగ్గట్టుగానే సమాజ హితానికి విరుద్ధంగా ఉంటుంది వీరి ప్రవర్తన. సనాతన ధర్మాన్ని చిన్నబుచ్చేలా వీరి రచనలుంటాయి. వలసవాదులైన క్రైస్తవపాలకులకు అనుయాయులు వీరు. మెకాలేకి మానసిక పుత్రులు. బ్రిటిష్‌ పాలనకి పొడిగింపు అనదగిన కాంగ్రెస్‌ పాలనలో ఈ కుహనా మేధావులకు పోషణ లభించింది. ‘కుహనా మేధోనియంతలు’ పుస్తకం అటువంటి వారి అవైదిక, అవాస్తవిక రచనలకు ధీటుగా జవాబు చెప్పిన పరిశోధనా గ్రంథం. ఈ పుస్తక రచయితలు ఇద్దరు యువకులు, పరిశోధకులు, ప్రవాస భారతీయులు అయిన మైలవరపు సుధామోహన్‌, రంగారెడ్డి.పి.

భారతీయ ప్రజలను తప్పు పడుతూ రచనలు చేస్తున్న ఓ కుహనా మేధావి కంచె ఐలయ్య రచనలకు సాధికారంగా జవాబు చెప్పే విశేష ప్రయత్నం ఈ 186 పేజీల పుస్తకంలో పాఠకులకు కనిపిస్తుంది. ఇందుకోసం రచయితలు ఎన్నో పుస్తకాలను పరిశీలించారు. ఇంటర్నెట్‌లో ఎన్నో ఆధారాలను శోధించి అందించారు. వెరసి 104 ఆధారాలతో ఆ ‘రెసిడెంట్‌ నాన్‌-ఇండియన్‌’ అనదగిన కంచె ఐలయ్యకు ఈ ‘నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌’ (ఎన్‌ఆర్‌ఐ) లు ధీటుగా జవాబు చెప్పారు.

ఈ పుస్తక ప్రచురణకు కారణం చెప్తూ రచయితలు ఇలా అంటారు. ‘ఇప్పటికైనా యావద్భారత జాతి జాగృతమయ్యి ఐలయ్య లాంటి కుహనా మేధావుల రచనలు, ప్రేలాపనల నుండి మన భావితరాలను కాపాడాల్సిన అవసరం, వాస్తవాలను అవగతం చేసుకోవలసిన అవసరం ఉంది’. జాతీయ వాదులైన ఈ యువకులు ధర్మాగ్రహంతో సమాజ శ్రేయస్సుకోసం ప్రచురించిన దేశచరిత్ర గ్రంథం ఇది. భారతదేశపు విలువల మీద, వ్యవస్థమీద ఐలయ్యకి చెప్పిన పాఠ్యపుస్తకం. 15 అధ్యాయాలు దీనిలో ఉన్నాయి.

తొలి అధ్యాయం ‘ఐలయ్య నై(ఇ)జంలో ఏది నిజం’లో అసత్యవాది ఐలయ్య నైజాన్ని తూర్పార బట్టారు రచయితలు. ‘బ్రాహ్మణులు ఆధ్యాత్మిక ఫాసిస్టులు’ అంటూ సాగిన ఐలయ్య రచనలోని ప్రతీ వాక్యానికి జవాబు ఇవ్వటం ఈ పుస్తక ప్రత్యేకత. ‘భారతీయుల లౌకికతత్వాన్ని, కలుపుగోలుతనాన్ని చూసి తట్టుకోలేక బ్రాహ్మణులపై విషం చిమ్ముతూ రాసిన పుస్తకమే ఐలయ్య రాసిన ‘బ్రాహ్మణులు- ఆధ్యాత్మిక ఫాసిస్టులు’. ఐలయ్య వ్యవహారం వలసవాదులు నియమించిన ఏజెంటులా ఉందని చెపుతూ ఆ తీరుని ఈ అధ్యాయంలో రచయితలు ఎండగట్టారు. బ్రాహ్మణులపై ఐలయ్య చేసిన అర్ధరహిత ఆరోపణలు, విజ్ఞత కలవారికెవ రికైనా అవివేకమైన రాతలనిపిస్తాయి. బ్రాహ్మణులు వలసవాదులని ఐలయ్య ఏ ఆధారంతో వ్రాశాడు? ఆధారాలు లేక వీగిపోయిన ‘ఆర్యద్రావిడ సిద్ధాంతా’న్ని ఐలయ్య ఎందుకు భుజాన వేసుకొని తిరుగుతున్నాడు? అని ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులు కూడా ప్రశ్నించగలరు.

‘హింసను బ్రాహ్మణులు ఆరాధించినంతగా మరే ఇతర మతం ఆరాధించదు’ అని ఐలయ్య చెప్పటాన్ని ఆయన అర్ధరహిత వ్యాఖ్యలకు ఉదాహరణగా రచయితలు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు వ్యవసాయం తెలియదని ఒకసారి, బ్రాహ్మణిజం భూస్వామ్య విధానంతో పెనవేసుకుపోయింది అని మరోసారి పరస్పర విరుద్ధమైన మాటలతో ఐలయ్యలో ఏదో ఒకరకంగా విప్రులను విమర్శించటమనే ఆరాటం మాత్రమే కనబడుతోంది అంటారు రచయితలు.

ఇదే అధ్యాయంలో చివరిలో పాతబైబిల్‌ నిబంధనలలో పదిహేను చిన్న, పెద్ద బైబిల్‌ వాక్యాలని సహితం రచయితలు ఉదహరించారు. ఈ వాక్యాలలో క్రైస్తవం గురించిన వాస్తవాలను చదివిన పాఠకులు నివ్వెరపోతారు. ముఖ్యంగా అన్ని మతాలు ఒకటే అని భావించే వారికి కనువిప్పు కలుగుతుంది. స్వదేశంలో ఉంటూ విదేశీయునిలా ప్రవర్తిస్తున్న కంచె ఐలయ్యలాంటి కుహనా మేధావులు ప్రస్తావించిన అంశాలు అసత్యాలని ఋజువు చేస్తూ రచయిత ఇచ్చిన సాక్ష్యాధారాలు పాఠకుల భ్రమలను దూరం చేస్తాయి.

భారతీయ సమాజంలో స్త్రీకి చదువుకొనే అవకాశాలు లేవని, స్త్రీని భోగవస్తువులా చూస్తారని సత్యదూరమైన ఆరోపణలు చేసిన ఐలయ్యకి రచయితలు తగువిధంగా జవాబిచ్చారు.

స్త్రీ ఓ మనిషి కాదు అంటూ స్త్రీలపై చర్చి పాల్పడిన అమానుష ప్రక్రియల్ని, చరిత్రలో మంత్రగత్తెలనే నెపంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్త్రీలను హతమార్చిన చర్చి వికృత పోకడలను 3వ అధ్యాయంలో బట్టబయలు చేశారు రచయితలు. గురువిందగింజ సామెత మాదిరి మనదేశంలో ‘సతీసహగమనం’ గురించి గోరింతలు కొండంతలు చేయటాన్ని, ఆ ప్రచారం ఆధారంగా చర్చి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడాన్ని ఘాటుగా విమర్శించారు. ‘సతి’ని గురించిన వాస్తవ చరిత్రను గణాంకాలతో సహా అందించారు. అలాగే లుప్తమైన ‘జోగినీ’ వ్యవస్థను గురించిన అవాస్తవ, అతిశయోక్తి ప్రతిపాదనలను, దాని వెనుకున్న చర్చి కుతంత్రాన్ని రచయితలు తూర్పారబట్టారు

‘బ్రిటిష్‌ వారి ఆర్ధిక విధానాలు, వారి వలస వాదపు దోపిడీ’ అనే అధ్యాయంలో భారతదేశంలో సాంప్రదాయక చేతివృత్తులను ధ్వంసం చేసిన బ్రిటీష్‌ వారి అకృత్యాలను రచయిత వివరంగా ఇచ్చారు. ఈ దుశ్చర్యను ఇంగ్లీషువారు, వారి తోలు కప్పుకున్న రచయితలు, చరిత్రకారులు తెలివిగా హిందూ ధర్మంపైకి, వైదిక సమాజంపైకి తోశారని పేర్కొన్నారు.

బ్రిటీష్‌వారు 1871 జనాభా లెక్కల సమయంలో తయారు చేసిన గణాంకాలను ఉదహరిస్తూ బ్రాహ్మణులు ఎన్ని వృత్తులలో ఉన్నదీ తెలియజేశారు. ఉత్పత్తిరంగానికి విప్రులు దూరంగా ఉన్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాసుకొంటూపోయిన ఐలయ్యకు ఋజువులతో సహా జవాబు ఇచ్చారు. ‘చదవడం రాయడం అనేవి ద్విజులు మాత్రమే చేయాల్సిన పనులుగా హిందూ ధర్మం నిర్దేశించింది. దానివల్ల ఉత్పత్తి వర్గానికి చదువు, రాతలు లేకుండా పోయాయి’ అన్న అసత్యాన్ని పటాపంచలు చేస్తూ ‘బ్యూటిఫుల్‌ ట్రీ’ (ధర్మపాల్‌) లోని మద్రాస్‌ ప్రెసిడెన్సీలో స్కూలుకి వెళ్లే విద్యార్ధుల గణాంకాలను పుట 72లో ప్రచురించారు. ఇటువంటి పుస్తకాలు ఏవీ చదవని అజ్ఞాని ఐలయ్య చల్లిన బురదను శుభ్రం చేసే ప్రయత్నంలో 1822-25 మధ్య రాజమండ్రి లోని అన్ని కులాలకు సంబంధించిన పిల్లలు వీధిబడులనే ప్రాథమిక పాఠశాలల్లో చదవడం, ఆ పిల్లల పాఠ్యపుస్తకాల జాబితా వివరాలు పాఠకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. భారతదేశంలో అందరికి విద్య అందుబాటులో ఉండేది అనటానికి అవసరమైన అన్ని సాక్ష్యాలను రచయితలు ఈ పుస్తకంలో పొందుపరచారు.

హిట్లర్‌ గావించిన రక్తపాతానికి, భారతీయ సమాజానికి ముడిపెడుతున్న ఐలయ్య రాసిన రాతలకు కౌంటర్‌ ఇస్తూ రచయితలు హిట్లర్‌ స్వస్తిక్‌ గుర్తును వాడటానికి పూర్వమే అనేక చర్చిల్లో స్వస్తిక్‌ వాడబడిన సాక్ష్యాల చిత్రాలు (91వ పేజీ) ఈ పుస్తకంలో ఇచ్చారు. బిషప్‌లతో హిట్లర్‌ కలసివున్న ఫోటోలు కూడా ప్రచురించి అసత్యవాదులు, కుహనామేధావుల నోరు మూయించారు.

‘భారతదేశంలో అనేక కుల సమస్యలకు బ్రిటిష్‌వారే ఖచ్చితంగా ప్రత్యక్షంగా కారణం’ అనటానికి కావలసిన బ్రిటిష్‌ రిపోర్టులను ఉదహరిస్తూ ఓ అధ్యాయమే లిఖించారు.

1860లో భారతదేశం నుండి పని కోసం వెళ్లిన కొంతమంది బాండెడ్‌ లేబర్‌ వివరాలను, ఫోటోలను రచయితలు ఈ పుస్తకంలో పంచుకున్నారు. సుమారు 45 ట్రిలియన్‌ డాలర్లు దోచుకున్న బ్రిటిష్‌వారికి మించిన దోపిడీదారులెవరు ? అని ప్రశ్నిస్తూ, లంచగొండితనం వారి నుంచే మనకు సంక్రమించింది అని రచయితలు కుండబద్దలు కొట్టారు ఈ సందర్భంగా.

భారతదేశం నుంచి విడివడిన భాగాలైన బంగ్లా, పాకిస్తాన్‌లు; రద్దుచేయబడిన (1998) రిజర్వేషన్ల గురించిన వాస్తవ గాథలు; గిరిజనులు, మాలలు, మాదిగలు హిందువులు కారా? అనే అధ్యాయాలలో మతమార్పిళ్ల మహమ్మారిని గురించిన విషాద గాథలను ఉటంకించారు. భారతీయుల మధ్య చిచ్చుపెడుతున్న విదేశీ కుట్రగా మతమార్పిళ్లను వర్ణించారు.

ఇలా ఐలయ్య అవాకులు చవాకులకి చెంపపెట్టు సమాధానాలు ఈ పుస్తకంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే పనులు మానేసి, సమాజానికి పనికి వచ్చే పనులు మాత్రం ఐలయ్యవంటివారు చేస్తే మంచిది’ అంటూ హితవు పలికారు రచయితలు. కొన్ని ముఖ్యమైన అంశాలకే ఈ పుస్తకం సమాధానం ఇచ్చింది. వైదిక ధర్మం మీద బురద చల్లడానికి ప్రయత్నించిన ఇద్దరు కుహనా మేధావులు ఐలయ్య, రంజిత్‌ ఒఫిర్‌లు కూడా చదవాల్సిన పుస్తకం ఇది.

ఈ వ్యాసం మొదట్లోనే పేర్కొన్న ‘యావద్భారత జాతి జాగృతమయ్యి ఐలయ్యలాంటి కుహనా మేధావుల రచనలు, ప్రేలాపనల నుండి మన భావితరాలను కాపాడాల్సిన అవసరం ఉంది’ అనే వాక్యంతో గ్రంథం ముగించారు యువ రచయితలు సుధామోహన్‌ మైలవరపు, రంగారెడ్డి.పి. నిద్ర నటించేవారిని లేపలేం, గానీ నిద్రపోతున్న వారికి మేలుకొలుపు పాడగలదు ఈ పుస్తకం. పరిశోధకులైన యువరచయితలు అభినందనీయులు.

పుస్తకం:  కుహన మేధోనియంతలు

రచన :సుధామోన్ మైలవరపు, రంగారెడ్డి.పి

పుటలు: 196

వెల: రూ.140/-

ప్రతులకు: ధర్మధ్వజ ముద్రణాలయం,

అరండల్ పేట, విజయవాడ.

ఫోన్ : 6281379488,9885454477

– బి.ఎస్‌.శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *