తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

‘తాడు యిరిగింది భాయ్‌, కర్ర తెగింది భయ్యా’ అని ఉర్దూ ఇంటి భాషగా కలిగిన ముస్లిము పిల్లలు అన్నప్పుడు తెలుగు పిల్లలు ముసిముసిగా నవ్వుకోవడం తెలుగునాట పల్లెల్లో చాలామంది తెలుగు పిల్లలకు అనుభవమే. ఆ తెలుగు పిల్లలే పెరిగి పెద్దయ్యాక ఉద్యోగ రీత్యా భాగ్యనగరానికి వచ్చి ఉంటూ నూతనంగా పరిచయమైన ముస్లిమ్‌ మిత్రులతో ‘భూక్‌లగ్తాహై భాయ్‌’ అన్నప్పుడు ముస్లిము మిత్రులు ముసిముసిగా నవ్వుకోవడం కూడా పరిపాటే. భావము, భాష సరయినవే అయినా నవ్వులు పూయించిన వ్యాకరణదోషం రెండు సందర్భాల్లో సామాన్యాంశం కావడం గమనార్హం. ఒక చిన్న భావాన్ని పరభాషలో వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడిన పిల్లాడు సైన్సు, గణితం, చరిత్ర, సాహిత్యం తదితర పెద్ద విషయాలను, వాటికి చెందిన విజ్ఞానాన్ని పరాయి భాషలో పాఠశాల విద్యార్థిగా సక్రమంగా అర్థం చేసుకోలేడు. అర్థం కాని చదువు పలువిధాలుగా వ్యర్థం. ఏ విషయాన్నైనా మాతృభాషలో నేర్వడం సులువు అని పలు నివేదికలు, అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఐనప్పటికీ బోధనా భాష విషయమై తెలుగు పాలకులు స్పష్టమైన విధానాన్ని రూపొందించలేకపోతున్నారు. విద్యవిషయమై మన పాలకులకు స్పష్టమైన దృక్పథం కొరవడి పదే పదే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలతో యువత భవిత అతలాకుతలం అవుతోంది. డిటెన్షన్‌, నాన్‌ డిటెన్షన్‌ ప్రయోగాలతో పాఠశాల స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కుంటుపడుతోంది. నాన్‌ డిటెన్షన్‌ పద్ధతివల్ల మధ్యలో బడి మానేసే విద్యార్థుల (డ్రాపవుట్స్‌) సంఖ్య తగ్గింది. కానీ శ్రద్ధగా చదవాలనే బాధ్యత విద్యార్థుల్లోను, బోధించాలనే బాధ్యత ఉపాధ్యాయుల్లోను కనిపించడం లేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయ పడింది. హైస్కూలు విద్య పూర్తిచేసిన వారిలో కూడా భాష, గణితము, సాధారణ జ్ఞానం వంటి విద్యా విషయాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు కనిపించడంలేదని ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. గ్రామీణ యువత విద్యా కౌశలాలు తృప్తిగా లేవు. మాతృభాషలో సరిగా చదవలేనివారు 25 శాతం, ఒక్క ఆంగ్లవాక్యాన్ని కూడా చదవలేనివారు 47శాతం, కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారం వంటి సరళ లెక్కలూ చేయలేని వారు 52శాతం, కరెన్సీ నోట్లను సరిగా లెక్కించలేని వారు 24 శాతం, బరువులు, తూకాలు సరిగా లెక్కించలేని వారు 44శాతం, గడియారంలో సమయం సరిగా లెక్కించలేని వారు 40శాతం ఉన్నారని తెలుస్తోంది.

నాణ్యతా ప్రమాణాలు లేని పాఠశాల విద్యతో ముందుకు సాగి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాల వేటలో పడిన వారిలో 20శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా తేలుతున్నారు. పాఠశాల స్థాయిలో దాచిన డొల్లతనం ఉన్నత విద్య పూర్తయ్యాక వెల్లడై మొత్తం విద్య నిరుపయోగం అవుతున్నది. ఇరజనీరింగ్‌ సహా వివిధ డిగ్రీ పట్టాలతో వెలికి వచ్చిన వేలాది విద్యావంతులు ఏళ్లు గడచిపోతున్నా తమకు సంబంధించిన రంగాల ఉద్యోగ పరీక్షల్లో సఫలం కాలేకపోవడం విషాదం. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు రెండూ ఈ దుస్థితికి బాధ్యత వహించాలి.

విద్యావ్యవస్థ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించలేదు. అలాగని ప్రయివేటు రంగం పైనా వదిలేయలేదు. దాంతో పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయిదాకా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో విద్య కొనసాగుతోంది. విద్యా వ్యాపారులు విద్యార్థులను లాభాలు పండించే ముడిసరకుగా మాత్రమే చూస్తున్నారు. లాభాల వేటలో పడిన విద్యావ్యాపారులు తాము ఉత్పత్తి చేసి వదులుతున్న సరకు నాణ్యత గురించి శ్రద్ధ వహించడం లేదు. దాంతో డబ్బురూపంలో విలువైన కుటుంబ శ్రమ, మరింత విలువైన కాలం మంటగలిసిపోగా యువత రెంటికి చెడిన రేవడి అవుతున్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరేడు దశాబ్దాలు గడచిన ప్రస్తుత తరుణంలో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌లోను పాలన పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలు విద్యావిషయమై వినూత్న సంస్కరణలకు తెరతీయాలని సంకల్పించటం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్‌లో అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని అనుకునే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్దాలని సంకల్పిరచి, బోధన భాషగా తెలుగును నిర్ణయించడం ముదావహం. నిన్నటి ఇంటర్‌ పరీక్షల ఉదంతంతో తెలంగాణ ప్రభుత్వం మేల్కొని విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుండి సంస్కరణలకు ఉపక్రమించనుంది. మాతృభాషలో చదువు సాగించి తెలుగు విద్యార్థులు విశ్వవ్యాప్తంగా తెలుగు తేజాన్ని చాటాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *