సహనం మన సొంతం

సహనం మన సొంతం

భారతీయతలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ హిందూ సంస్కృతి అలవర్చిన విశేషం. ఔత్సాహికులైన కొందరు పరిశోధక పాత్రికేయులు గత శతాబ్దిలో ప్రపంచంలోని వివిధ జాతుల, మతాల ప్రత్యేకతను గురించి అధ్యయనం జరిపారు. ప్రపంచం అంతటా జరిపిన వారి అధ్యయనంలో క్రైస్తవులు సేవలో, ముస్లిములు దానం చేయడంలో, హిందువులు మత సహనంలో సర్వ ప్రథములని తేలినట్లు వెల్లడించారు. హిందువులు మత సహనంలో ప్రథములనే విషయం ప్రపంచ చరిత్రను స్థూలంగా పరిశీలిస్తే కూడా మరింత స్పష్టంగా వెల్లడవుతుంది.

ప్రపంచం మొత్తరలో భారత్‌ మీద జరిగినన్ని దాడులు మరే దేశం మీదా జరగలేదనడం ఎంత సత్యమో, ఇతర దేశాలపై దురాక్రమణకు పాల్పడని ఏకైక జాతి, దేశం భారత్‌ అని చెప్పడం కూడా అంతే సత్యం. అగ్రరాజ్యాలుగా నేడు వెలుగొందుతున్న పలు ఐరోపా దేశాల ధాటికి అమెరికా ఖండంలోని మూల వాసులైన రెడ్‌ ఇండియన్లు అంతరించిపోయారు. ఇస్లామిక్‌ దండయాత్రల ఫలితంగా ఈజిప్టు, పారశీక సంస్కృతులు నశించి ఆ దేశాలు ఇస్లామిక్‌ దేశాలుగా మారిపోయాయి. నిన్న క్రైస్తవులు, మొన్న ముస్లిములు, అంతకు ముందు హూణులు, శకులు, గ్రీకులు భారత్‌ను ఆక్రమించాలని, హిందూ సంస్కృతిని తుదముట్టించాలని విఫలయత్నం చేశారు.

ఆశ్రితులై వచ్చిన పారశీకులతో పాటు అక్రమణ కారులైన ఇస్లామ్‌, క్రైస్తవ సమాజాల సంతతిని కూడా భారత్‌ అక్కున చేర్చుకున్నది. ఆక్రమణకారులుగానో, ఆశ్రితులుగానో భారత్‌లో స్థిరపడిన వివిధ మతాల, జాతుల ప్రజలు వారి వారి సంస్కృతిని, మతాచారాలను హిందువులలోని మతసహనం కారణంగానే స్వేచ్ఛగా నిర్భయంగా అనుసరించగలుగుతున్నారు. ‘మాతృభూమిని కోల్పోయి, వలస వెళ్లినప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అవమానాలు, వివక్షను ఎదుర్కొన్న మా జాతి జనులు భారత్‌లో మాత్రమే సగౌరవంగా స్వేచ్ఛగా జీవించగలిగారు’ అని ఇజ్రాయిల్‌ దేశీయులు వారి మాతృభూమికి తిరిగి చేరుకున్నాక పేర్కొనడం చరిత్ర.

‘ఏకం సత్‌ విప్రా బహుదా వదంతి’. పేర్లు వేరైనా మానవులు చేరుకోవలసిన సత్యం ఒక్కటే అని, హిందుత్వం అలవరచిన సంస్కృతి కారణంగానే భారత్‌లో వివిధ జాతుల, మతాలకు చెందిన ప్రజల; విభిన్న సైద్ధాంతిక దృక్పథాల సహజీవనం కొనసాగుతున్నది. నాస్తికులు, హేతువాదులు, సమాజవాదులు, సామ్యవాదులు, మానవ వాదులు స్వేచ్ఛగా భారత్‌లో తమ భావాల వ్యాప్తిని కొనసాగించగల వాతావరణం ఉండటం హిందుత్వ ప్రభావం వల్లనే. రాముడిని ఆరాధ్యదైవంగా భావించి, కొలిచే భారత్‌లో ‘రామాయణ విషవృక్షం’ పుస్తకం రాసిన రంగనాయకమ్మ స్వేచ్ఛ, గౌరవాలకు ఎలాంటి భంగం కలగలేదు. ‘ఆమె పుస్తకం చదివాక నా ‘రామాయణ కల్పవృక్షం’ చదివే వారి సంఖ్య పెరుగుతోంది’ అని కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్య హిందూ సంస్కృతి సహనశీలతలో మకుటాయమానం. ఇస్లామిక్‌ సాంప్రదాయాలను, విశ్వాసాలను విమర్శిస్తూ ‘సెటానిక్‌ వర్సెస్‌’ రాసిన సల్మాన్‌ రష్డీకి, బంగ్లా ముస్లిముల దురాగతాలను అక్షరబద్ధం చేస్తూ ‘లజ్జ’ నవల రాసిన తస్లీమా నస్రీన్‌కు పట్టిన దురవస్థను యావత్‌ ప్రపంచం మౌనసాక్షిగా వీక్షించింది.

శతాబ్దాలుగా విజాతీయుల దాడిని ఎదుర్కొని కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగిన హిందూ సంస్కృతిని భారత్‌లో స్వజనులే తమ రాజకీయ స్వార్థానికి బలిపెట్టాలని చూస్తున్నారు. హిందుత్వను అసహనశీలిగా, ఉగ్రవాదిగా చిత్రిస్తున్న రాజకీయ వాదులు అందరూ హిందువులే కావడం గమనార్హం. జాతీయ స్థాయిలో కారగ్రెస్‌ నుండి ప్రాంతీయ స్థాయిలో తృణమూల్‌ కాంగ్రెస్‌, డియంకె తదితం పార్టీల నేతలతో పాటు వామపక్ష ఉద్యమకారులు కూడా హిందువులే కావడం విషాదం! రాజకీయ స్వార్థాన్ని పండించుకునే తాపత్రయంలో జాతి విశిష్టతకు వాటిల్లనున్న ముప్పును ఈ రాజకీయ వాదులు గ్రహించడం లేదు. హిందుత్వం బలంగా ఉన్నంత వరకే భారత్‌లో రాజకీయ, ఆధ్యాత్మిక వైవిధ్యం మనగలదు. మార్క్సిజాన్ని తలకెత్తుకున్న కమ్యూనిస్టు దేశాల్లో, మత రాజ్యాలుగా ప్రకటించుకున్న ఇస్లామిక్‌ దేశాలలో మానవ హక్కులు, మత స్వేచ్ఛ మచ్చుకైనా లేకపోవడం మన కళ్లు తెరిపించాలి. ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ వివిధతలోని మాధుర్యాన్ని ఆస్వాదించగల భారతీయులు కుల, మత, రాజకీయాలకు అతీతంగా హిందూ తాత్వికతను కాపాడుకోవాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *