ముదురుతున్న ‘అగ్ర’ యుద్ధం

ముదురుతున్న ‘అగ్ర’ యుద్ధం

రష్యా పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటికీ అమెరికాకు మనశ్శాంతి లభించలేదు. దానికి కారణం చైనా ఎదుగుదల. ప్రస్తుత ప్రపంచం ఈ రెండింటిని అగ్ర దేశాలుగా పరిగణిస్తోంది. ఈ దేశాల మధ్య వాణిజ్యం ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపే స్థాయిలో జరుగుతోంది. ట్రంప్‌ హయాంలో అమెరికా చైనాపై వాణిజ్యంలో పైచేయిని సాధించాలన్న పట్టుదలతో దూకుడును ప్రదర్శిస్తోంది. అందుకు చైనా కూడా తనదైన శైలిలో ప్రతిస్పందిస్తున్నది. ఈ అగ్ర దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే !

చైనాతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును గురించి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన ట్రంప్‌ ‘చైనా మన దేశానికి నష్టం కలిగిస్తుంటే మనం చూస్తూ ఊరుకోరాదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి’ అని అన్నారు. కానీ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత చైనాతో వాణిజ్యం ఎంత ముఖ్యమైనదో గ్రహించిన ట్రంప్‌ అధ్యక్షుడు జీ పింగ్‌తో చర్చలకు సిద్ధపడ్డారు. రెండు దేశాల మధ్య వాణిజ్య రంగంలో వ్యత్యాసాలను తగ్గించుకునేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇద్దరు నేతలు ఖరారు చేశారు. దీని మూలంగా చైనాలో వ్యవసాయం, ఆర్ధిక మార్కెట్‌లు, విద్యుత్‌ రంగాల్లో అమెరికా భాగ స్వామ్యానికి దారి ఏర్పడితే, అమెరికాకు పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం చైనాకు దక్కింది.

సాంకేతిక రంగంలో చైనా పెట్టుబడులను నియంత్రించేందుకు, చైనా వివక్షాపూరిత వాణిజ్య పద్దతులను అరికట్టేందుకు ట్రంప్‌ ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. మేధో హక్కుల పరిరక్షణ ఒప్పందంపై సంతకం చేసే ముందు ఉక్కు, అల్యూ మినియం దిగుమతులపై సుంకాలు విధించారు. ఆ విధంగా అమెరికా సంరక్షణ విధానాలకు శ్రీకారం చుట్టారు. దానితో చైనా ప్రతిగా అమెరికా నుండి దిగుమతి అయ్యే సోయాబీన్స్‌, వాహనాలు, రసాయనాలు మొదలైన 106 వస్తువులపై 25శాతం సుంకాన్ని విధించింది. ఆ తరువాత 15 రోజుల్లో చైనా టెలికాం కంపెనీ జెడ్‌టిఈ పై నిషేధాన్ని విధించింది. అమెరికా ఆంక్షలను ఆ కంపెనీ ఉల్లంఘించిందన్నది ఆరోపణ. తమ కంపెనీపై అమెరికా నిషేధం విధించడంతో ఆగ్రహించిన చైనా ప్రతీకారంగా అమెరికా నుండి దిగుమతయ్యే జొన్నపై పెద్ద ఎత్తున సుంకాలు విధించింది. ఇలా వాణిజ్య యుద్ధం ఒకపక్క సాగుతుంటే మరోపక్క రెండు దేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. రెండేళ్ల లోగా చైనా తన 200 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా డిమాండ్‌ చేసింది. అలాగే తమ టెలికాం కంపెనీపై విధించిన నిషేధాన్ని అమెరికా తొలగించ డంతో అమెరికా జొన్నపై విధించిన అదనపు సుంకాన్ని చైనా ఉపసంహరించుకుంది. అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తామని చైనా అంగీకరించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది.

కానీ ఒక వారం కూడా గడవకుండానే మళ్లీ రెండు దేశాలు తిరిగి పరస్పరం సుంకాలు విధించు కున్నాయి. ఆగస్టులో అమెరికాపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (ఔుూ)లో ఫిర్యాదు చేసింది. కానీ ఈ ఫిర్యాదును పట్టించుకోని ట్రంప్‌ 517 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకం విధిస్తానని హెచ్చరించడంతో చైనా చర్చల రాగం అందుకుంది. ఏ ఒప్పందానికి రాలేకపోయిన రెండు దేశాలు సెప్టెంబర్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నాయి. చివరికి జి-20 సమావేశాల సందర్భంగా కలిసిన ఇరు దేశాధినేతలు 90 రోజుల వరకు ఎలాంటి సుంకాలు విధించుకోరాదని ఒప్పందానికి వచ్చారు.

జనవరి నుంచి మార్చి వరకు రెండు దేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. అందులో సుంకాల కాలపరిమితిని ట్రంప్‌ ప్రతిపాదించారు. అధ్యక్షుడు జీ కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. అలాగే కొన్ని చైనా ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మే 1న చైనా అధికారులతో సమావేశమైన స్టీవ్‌ మ్నుచిన్‌ ‘చర్చలు ఫలవంతమయ్యాయని’ ప్రకటించారు. మే 5నాటికి తాము వాణిజ్య ఒప్పందంలో ఒప్పుకున్న విషయాలను ప్రస్తావిస్తూ చైనా 150 పేజీల పత్రాన్ని వాషింగ్టన్‌కు పంపించింది. అయితే ఇందులో సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, ప్రభుత్వ సంస్థలకు భారీ సబ్సిడీలు, మేధో హక్కులు, ఆర్ధిక సేవలు, బీమా రంగంలో అనుమతి వంటి అంశాల గురించి ఎప్పటిలాగానే చైనా ప్రస్తావించలేదు. ఆఖరు నిముషంలో ఒప్పంద అంశాలను మార్చడంపై ఆగ్రహించిన ట్రంప్‌ 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 నుంచి 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.

వాణిజ్య చర్చల్లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించిన రాబర్ట్‌ లైటిజెర్‌ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించడం పట్ల తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. చైనాపై అత్యధిక సుంకాలను విధించడం ద్వారా ఆ దేశం తన వాణిజ్య చట్టాలను సవరించుకునే విధంగా ఒత్తిడి తేవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు కూడా. డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ‘చైనా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఎందుకంటే అనేక కంపెనీలు చైనా వదిలి ఇతర దేశాలకు తరలి పోతాయి. చైనాలో వస్తువులు చాలా ఖరీదు అవుతాయి. చాలా మంచి ఒప్పందం కుదిరిందని సంతోషించే సమయానికే మీరు వెనక్కు తగ్గారు. దీనివల్ల నష్టపోతా రని నేను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు, ఇతర చైనా మిత్రులకు చెప్పదలచు కున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఒప్పందంలో 30శాతం అంశాలను చైనా మార్చివేసే సరికి చైనా సబ్సిడీల వివాదం అలాగే మిగిలిపోయింది.

ఇలా ఉండగా తాజాగా చైనా 60 మిలియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సుంకం జూన్‌ 1 నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. దీనివల్ల చైనాలో అమెరికా వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇప్పటివరకు అమెరికా 250 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై సుంకం విధిస్తే, చైనా 110 మిలియన్‌ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై పన్నులు విధించింది. కానీ తాజాగా చైనా మరో 10శాతం సుంకాలు విధిస్తున్నట్లయింది. అయితే అమెరికా ఇందుకు ప్రతిగా ఏకంగా 300 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్నులు విధించవచ్చును.

విమర్శకులకు సమాధానం చెప్పేందుకు చైనా తన ప్రచార యంత్రాంగాన్ని పనిలో పెట్టింది. అమెరికా ‘దురాశ, పొగరు’ గురించి జిన్‌ హువా వార్తా సంస్థ, పీపుల్స్‌ డైలీలు ప్రచారం ప్రారంభిం చాయి. అమెరికా కలిగిస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు ‘ప్రజా యుద్ధం’ అంటూ అభివర్ణించాయి. ఒకప్పుడు జపాన్‌కు వ్యతిరేకంగా మావో జెడాంగ్‌ కూడా ఇదే యుద్ధ నినాదాన్ని ఇచ్చారు. ‘ఈ వాణిజ్య యుద్ధానికి కారణం అమెరికాలో ఒక వ్యక్తి, అతని బందం’ అంటూ ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండా సంపాదకీ యాలు వ్రాసాయి. ఈ ప్రచారంలో భాగంగానే ప్రభుత్వ రేడియో కూడా ‘ఇది నూతన ప్రపంచం కోసం యుద్ధం’ అని, ‘ఇది మేము ఇంతకుముందు చూడనిది ఏమి కాదు’ అని ప్రకటించింది. ‘చైనా ఆర్ధిక వ్యవస్థ చిన్న చెరువు కాదు. అది మహా సముద్రం. తుఫాను చెరువును అల్ల కల్లోలం చేయగలదుగానీ, సముద్రాన్ని ఏమి చేయలేదు. ఇలాంటి అనేక తుఫానులు ఎన్నో వచ్చినా సముద్రం అలాగే ఉంది’ అంటూ చైనా సామాజిక మాధ్యమంలో పోస్టింగ్‌లు వెల్లువెత్తాయి.

రెండు పెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య ఘర్షణ ప్రపంచం మొత్తంపై పడుతుంది. అధిక సుంకాల వల్ల చైనా స్థూల జాతీయోత్పత్తిలో 0.4 నుంచి 0.5 శాతం క్షీణత ఉంటుందని, అమెరికాలో 0.1 శాతం తరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రపంచ జిడిపి 0.15శాతం క్షీణత నమోదు చేస్తుందని అంచనా. రెండు దేశాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌లు పతనంలోనే సాగుతున్నాయి.

అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం 2015లో ‘మేడ్‌ ఇన్‌ చైనా 2025’ అనే విధానాన్ని చేపట్టింది. దాని ప్రకారం 10 కీలక రంగాలను గుర్తించింది. సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించేందుకు చైనా 300 బిలియన్‌ డాలర్లు గుమ్మరించడానికి సిద్ధమవుతోంది.

జాతీయ భద్రత సాకు చూపి ట్రంప్‌ తమ దేశంలో చైనా టెలికాం కంపెనీలు వ్యాపారం చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. హువై కంపెనీపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహం తెప్పించింది. దానితో ఆ కంపెనీ అమెరికా నుంచి ఐటి ఉత్పత్తులు కొనుగోలు చేయరాదని నిర్ణయించుకుంది. అమెరికా నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సష్టించింది. ఈ నిర్ణయం తమ కంపెనీలను కూడా ప్రభావితం చేయవచ్చని యూరోపియన్‌ యూనియన్‌ ఆందోళన చెందుతోంది. అమెరికా చర్యకు ప్రతీకార చర్యను చైనా ఇప్పటివరకు తీసుకోకపోయినా త్వర లోనే ఆ దేశం అమెరికాకు చెందిన ఒక కంపెనీపై నిషేధం విధించే అవకాశం మెండుగా ఉంది.

ఆర్ధిక, సాంకేతిక యుద్ధంతోపాటు తైవాన్‌ జల సంధిలో చైనా వ్యూహాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధపడుతోంది. 2018 తరువాత చైనా పట్ల అమెరికా విధానం ‘వ్యూహాత్మక సహకారం నుంచి వ్యూహాత్మక పోటీ’గా మారిపోయింది. నాలుగు దశాబ్దాల అమెరికా, చైనా సంబంధాలు ఎప్పుడు విశ్వాసరాహిత్యం, సందేహాల తోనే సాగాయి. కేవలం రష్యా భయంతోనే రెండు దేశాలు పరస్పర సంబంధా లను కొనసాగించాయి. కానీ రష్యా ప్రాభవం తగ్గి పోయిన తరువాత ఏకైక సూపర్‌ పవర్‌గా ప్రపంచాన్ని ఏలాలనుకున్న అమెరికా ఆశలపై చైనా నీళ్లు జల్లింది. అలాగే భిన్న ధవ ప్రపంచాన్ని అంగీకరించేందుకు అమెరికా సిద్ధపడకపోవడం కూడా చైనా భయాలను మరింత పెంచింది. దానితో రెండు దేశాలు ప్రత్యర్ధులు గానే మిగిలిపోయాయి.

మరోపక్క చైనా ఏకపక్ష విధానాలు తెలిసినప్పటికి ఎప్పటికైనా అవి మారతాయనే ఆశాభావంతో అమెరికా వేచి చూసింది. కానీ చైనా ఆర్ధిక సామ్రాజ్యవాద విధానాలు మరింత పెరగడంతో పాశ్చాత్య దేశాలకు ఆందోళన ఎక్కువైంది. అన్ని దేశాలను తన ఉత్పత్తులతో ముంచివేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇది చైనా, అమెరికాల మధ్య ఘర్షణను మరింత పెంచుతోంది. అయితే ఈ పరిస్థితులలో ప్రపంచం భారత్‌కు కీలకమైన, వ్యూహాత్మకమైన అవకాశాలను అందిస్తోంది. వాటిని భారత్‌ అందిపుచ్చుకోవాలి.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *