ఇటు వేదం, అటు ఖురాన్‌…

ఇటు వేదం, అటు ఖురాన్‌…

అతను మహాపండితుడు. వేదాల్ని అధ్యయనం చేశాడు. శాస్త్రాలలో దిట్ట. సంస్కృత శ్లోకాలను అవలీలగా చెప్పేస్తుంటాడు. సంస్కృత భాషా ప్రచారమే జీవన ధ్యేయంగా పనిచేస్తుంటాడు. అనునిత్యం సంస్కృతం గురించే తపిస్తుంటాడు. సంస్కృతం తప్ప అతనికి మరొక ధ్యాస లేదు. ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌లో అతనో ప్రొఫెసర్‌. కాబూల్‌ యూనివర్సిటీ సైతం అతన్ని సంస్కృతం నేర్పించేందుకు ఆహ్వానించింది.

చాలా మంది ఆయన్ను ప్రేమగా ‘శాస్త్రి’ అని పిలస్తారు. అతని సంస్కృత పాండిత్యం చూసి తాలిబాన్లు సైతం ఆయనకి శిష్యులయ్యారు. తమ కంచుకోటల్లోకి పిలిపించి, మాట్లాడి పంపించేశారు.

కంచి శంకరాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి శాస్త్రిని ఆశీర్వదించడమే కాదు, సన్మానించి అతని కృషిని ప్రశంసించారు.

శాస్త్రి సంస్కృతంతో పాటు ఖురాన్‌నూ పుక్కిట పట్టాడు. సురాలు, ఆయత్‌లూ ఆయనకు కంఠోపాఠం. హిందూ శాస్త్రాల్లో ఉన్నదీ, కురాన్‌లో చెప్పిందీ ఒకటేనని భావిస్తాడు. అంతేకాదు, కురాన్‌లోని చాలా అంశాలకు హిందూ శాస్త్రాలే ప్రేరణ అంటాడు.

మత సామరస్యానికి శాస్త్రి చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకి ‘నేషనల్‌ కమ్యూనల్‌ హార్మొనీ’ అవార్డునిచ్చి సత్కరించింది. 2010లో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఈ అవార్డునందించారు. ఆ సభలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా ఉన్నారు.

శాస్త్రి ముక్కుసూటి మనిషి. ఉన్నదున్నట్టు మాట్లాడేస్తాడు. తనకు ప్రేరణ ఆరెస్సెస్‌ నేత ఇంద్రేశ్‌ కుమార్‌జీ నుంచే వచ్చిందంటాడు. ఆరెస్సెస్‌ ఒక జాతీయవాద సంస్థ అని చెబుతాడు. అలాంటి సంస్థలు బలపడితేనే దేశం బాగుపడుతుందని అతని అభిప్రాయం.

ఇంతకీ శాస్త్రి పూర్తి పేరేమిటో చెప్పలేదు కదా! ఆచార్య మహమ్మద్‌ హనీఫ్‌ ఖాన్‌ శాస్త్రి. అవును…! మీరు సరిగ్గానే చదివారు. అతను ముస్లిం. కానీ సంస్కృతంలో మహావిద్వాంసుడు. శాస్త్రి అన్న బిరుదు చదువుల ద్వారా వచ్చింది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి పేరులో ‘శాస్త్రి’ లాంటి డిగ్రీ అది.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *