టిడిపికి వ్యవసాయమే కాదు.. రైతుప్రాణం కూడా దండగే!

టిడిపికి వ్యవసాయమే కాదు.. రైతుప్రాణం కూడా దండగే!

ఎన్నికలలో ఏదోవిధంగా నెగ్గడం, అధికారం నిలబెట్టుకోవడమే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జీవిత పరమావధి. ఇందుకు తనవైపు నుండే ఆలోచిస్తారు. విపక్షాలపై విరుచుకు పడతారు. తానొక్కడే ప్రజాసంక్షేమానికి పాటుపడు తున్నానని బీరాలు పలుకుతారు. కానీ వాస్తవంగా ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదు. ఆయన నిజంగా ప్రజాసంక్షేమం పట్టించుకోరన్న వాస్తవం రైతు కోటయ్య మరణం వ్యవహారంతో మళ్లీ రుజువయ్యింది.

ఫిబ్రవరి 17,18 తేదీల్లో గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో కొండవీడు కోట ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల ప్రారంభంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇతర అధికారులు పాల్గొనగా, ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మొదటి రోజున అక్కడికి దగ్గరలో ఉన్న పుట్టకోట గ్రామ రైతు కోటేశ్వరరావు (కోటయ్య) అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు. కోటయ్య మరణంపై పోలీసులు, మంత్రులు, కోటయ్య కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్న విషయాల మధ్య పొంతన కుదరకపోవడంతో ఈ మృతి వివాదంగా మారింది. ఈ విషయంలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసు కోవడం, అధికారపక్షం తమ తప్పేమీ లేదంటూ సవాళ్లు విసరడం, విచారణ తూతూ మంత్రంగా జరిపించడం తప్ప మరణించిన రైతు కుటుంబానికి సరైన న్యాయం అందించలేకపోయారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం మరీ వివాదమైంది. ఒక ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన పౌరుడు అనుమానాస్పదంగా మరణిస్తే బాధ్యత గల రాష్ట్ర పాలక యంత్రాంగం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. జరిగిన దుస్సంఘటన పట్ల వెంటనే స్పందించి, పాలక పక్షంపై ప్రజలలో వ్యతిరేకత రాకుండా నిజాయితీగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా చూడాలి. అదీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమం దగ్గర ఇటువంటి దుస్సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి మరింత బాధ్యతతో మెలగాలి. సత్వర విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చూడాలి. అప్పుడే కార్యక్రమం జరిగిన స్థలానికి చుట్టుపక్కల ప్రజల లోనూ, రాష్ట్రమంతటా పాలకపక్షం పట్ల సద్భావన కలుగుతుంది. అలాకాక వేరేగా వ్యవహరిస్తే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూట్టకట్టుకోక తప్పదు. ఇటువంటి వ్యవహారశైలి రాబోయే ఎన్నికలలో మరింత నష్టం చేకూర్చగలదు.

అసలేం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు కోట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. కోటమీదకు వెళ్లడానికి నిర్మించిన రోడ్డును ప్రారంభించటం, మిగతా నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయటం కోసం మంత్రులు, ముఖ్యమంత్రి అక్కడకు వచ్చేలా కార్యక్రమం నిర్ణయమైంది. కోటకు దగ్గరలోని ఖాళీ ప్రదేశంలో హెలీపాడ్‌ నిర్మించారు. ముఖ్యమంత్రి వచ్చే సభ కావడంతో పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ హెలీపాడ్‌కు దగ్గరలోనే అంటే 700 మీటర్లు దగ్గరలోనే కోటయ్య పొలం (మొత్తం 14 ఎకరాలు) ఉంది. అయితే అక్కడ జరిగే కార్యక్రమం, బందోబస్తు వంటి భద్రత అంశా లన్నిటిని పర్యవేక్షించడం కోసం పోలీసులు అడిగితే కోటయ్య తన పొలంలో ఒక అరెకరం ఇచ్చాడు.

కోటయ్య ఈ 14 ఎకరాలు కౌలుకు తీసుకుని పండించుకుంటున్నాడని అక్కడి స్థానికులు చెపుతున్నారు. ఆ 14 ఎకరాలలో కనకాంబరాలు, చామంతి, బొప్పాయి, మునగ పంటలున్నాయి. ఇవన్నీ రాబోయే నెల, నెలన్నరలో కోతకు వస్తాయి. మొత్తంమీద 5 లక్షల వరకు ఆదాయం వచ్చే స్థితి ఉంది అని స్థానికులు చెపుతున్నారు. బొప్పాయి, మునగ పంటలు ఒక సంవత్సరం పాటు కష్టపడి విత్తనాలు, ఎరువులు వేసి పెంచితే కాని పంట చేతికి రాదు. కోతకు వచ్చిన పంట కోయాలంటే కూలీలు, వారి ఖర్చులు తప్పనిసరి. అలాగే కనకాంబరాలు, చామంతి వంటి పూల పంటలు ఒకసారి ఫలించటం ప్రారంభమైతే ప్రతి రోజూ ఎకరాకు వెయ్యి నుండి 2 వేల వరకు ఆదాయం వస్తుంది. కోటయ్యకు వేరే అప్పులేమీ లేవని స్థానికులు చెపుతున్నారు. ఇదీ అప్పటికి కోటయ్య పొలం, వచ్చే ఆదాయం స్థితిగతులు.

అయితే కోటయ్య కొండవీడు ఉత్సవాల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన అరెకరం కాకుండా పోలీసులు మిగతా పొలంలోకి జొరబడి బొప్పాయి కాయలు కోస్తున్నారని ఎవరో చెప్పడంతో కోటయ్య భార్య ప్రమీల వచ్చి నిలదీసింది. దీనికి పోలీసుల వద్దనుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె తన భర్త కోటయ్యకు చెప్పింది. కోటయ్యకు కూడా ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యమైన సమాధానమే ఎదురైంది. పైగా కోటయ్య అక్కడ ఉన్న సమయం లోనే భద్రత నిమిత్తం అంటూ కొన్ని వాహనాలు పొలంలోకి వచ్చివెళ్లాయి. వాటి తొక్కిడికి కనకాంబ రాల పంట కొంత దెబ్బతింది. దీంతో ఆందోళన చెందిన కోటయ్య గ్రామస్తుల దగ్గర తన బాధ వెళ్లబోసుకున్నాడు. ఈ ఒక్కరోజులోనే ఇంత నష్టం జరిగితే ఇక ఉత్సవాలు జరిగినన్నాళ్లలో ఇంకెంత నష్టం చేస్తారోనని బాధపడ్డాడు. కాసేపటి తరువాత వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాధితుడైన కోటయ్యను పలకరించకుండా వేరే ఎవరితోనే ఏదో మాట్లాడి వెళ్లిపోయారని, అందుకు కోటయ్య మరింత వేదన చెందాడని స్థానికుల కథనం.

ఈ క్రమంలోనే రెండోరోజు ఉదయం పొలానికి వచ్చిన కోటయ్యకు పొలంలో మరికొంత పూలపంట తొక్కేసినట్లుగా కనబడింది. పోలీసుల నుండి సరైన సమాధానం రాలేదు. ఇక గ్రామస్తులు కోటయ్యకు మద్దతుగా వచ్చి అడిగితే పోలీసులు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి ఆ సమయానికి అందరినీ పంపించేశారు. ఆ సమయంలో కోటయ్య పాలేరు పున్నారావు కూడా అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కాసేపటికి కోటయ్య పురుగుమందు తాగి చనిపోయాడంటూ పున్నారావు తన సెల్‌ఫోన్‌ నుంచి కోటయ్య కొడుక్కి ఫోన్‌ చేసి చెప్పాడు. కొడుకు సంఘటన జరిగిన స్థలానికి వచ్చేటప్పటికి కోటయ్య మృతదేహాన్ని వాహనంలో ఎక్కించారు. ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అక్కడికి ఎవరినీ రానివ్వలేదు. పున్నారావు ఎక్కడ అని గ్రామస్తులు అడిగితే తెలియదని పోలీసులు చెపుతున్న సమయంలోనే పున్నారావు అక్కడికి దగ్గరలో ఉన్న పోలీసు వాహనంలో కనబడ్డాడు. ఆ సమయంలో అతని సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది.

పోలీసులు కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలిస్తే పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కోటయ్య గుండె పట్టి చనిపోయాడని, పురుగుమందు తాగడంవల్ల కాదని చెప్పారు. పోలీసులేమో పురుగుమందు తాగి చనిపోయాడని ఇంతకుముందు చెప్పారు. మొత్తం మీద కోటయ్య పోలీసులు చెబుతున్నట్లుగా పురుగు మందు తాగి కాకుండా గుండె సమస్యతోనే చనిపో యాడని తేలింది. నడివయస్కుడైన కోటయ్యకి గుండె ఎందుకు పట్టేసింది అనే విషయంలో స్థానికులు తర్కించుకుంటున్న మాట ఏమిటంటే పోలీసులు కొట్టి అయినా ఉండాలి లేదా కోటయ్య పోలీసులతో జరిగిన వాగ్వివాదంలో వచ్చిన కోపానికి గుండె పట్టి ఉండాలి. కారణం ఏదైనప్పటికి కోటయ్య ప్రభుత్వం తలపెట్టిన ఉత్సవాల సమయంలో, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వ్యవహారంతోనే చనిపోయాడు.

ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో స్థానిక పౌరుడు అదీ ఒక రైతు చనిపోయాడు. దానివల్ల అతని కుటుంబం రోడ్డున పడుతుంది. పైగా అతని పొలం తొక్కేసినందువల్ల వచ్చే నష్టాన్ని కుటుంబ సభ్యులు భరించాలి. ఇవన్నీ తీవ్రబాధా కరమైన విషయాలు. వీటిని అక్కడికి వచ్చిన సాక్షాత్తూ ముఖ్యమంత్రి పట్టించుకుని, సంఘటనకు కారణాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ కోటయ్య మరణానికి నివాళి అర్పించి, 5 లక్షల నష్టపరిహారం ప్రకటించి వెళ్లి పోయారు. ఇక ఈ విషయం మీడియాలో రచ్చరచ్చ అయిన తరువాత తీరికగా విచారణ జరిపించారు. విచారణలో ఏమీ తేల్చకపోవడం గమనార్హం.

కోటయ్య బ్రతికి ఉంటే ప్రతి సంవత్సరం 5 నుండి 10 లక్షలు సంపాదించేవాడు. ఇప్పుడాయన పోయాడు. మరి కుటుంబసభ్యుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం నష్టపరిహారం కింద కేవలం 5 లక్షలు ఇస్తే సరిపోతుందా? న్యాయం జరుగుతుందా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అదీగాక ప్రభుత్వం ఇటువంటి దుస్సంఘటనల పట్ల ఇలా చూసీ చూడనట్లు వ్యవహరించడం సరైనదేనా? ప్రభుత్వం తనకు అవసరమైతే ప్రజలను ఇలా బాధలకు గురిచేస్తుందా? ఇదేనా ప్రభుత్వ పనితీరు? అని న్యాయనిపుణులు చర్చించుకుంటున్నారు.

సాధారణంగా రాష్ట్ర ప్రజలలో వినబడే మాట ‘చంద్రబాబు రైతుల గురించి పట్టించుకోరు’ అని. ఆ విషయం గత తొమ్మిదేళ్ల పాలనలోనూ, ఇప్పటి పాలనలో కూడా అనేకమార్లు రుజువైందని రాజకీయ విశ్లేషకులు చెపుతుంటారు. రైతులకు అందాల్సిన విత్తనాలు, ఎరువులు, రుణాలు, మద్దతు ధరలు, విద్యుత్తు వంటి వాటి విషయంలో చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోవలసినంతగా పట్టించుకోరని అంటుంటారు. గత తొమ్మిదేళ్ల పాలనలో కరెంటు కోసం పోరాడుతున్న రైతులపై కాల్పులు జరిపించి రైతు వ్యతిరేకి అనే అపకీర్తిని మూటకట్టుకున్నారు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకుండా కేవలం సాఫ్ట్‌వేర్‌, హైదరాబాద్‌ అభివృద్ధి పట్ల మాత్రమే దృష్టి పెట్టారు. ఈసారి కూడా పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే తీసుకున్న అత్యంత రైతు వ్యతిరేక నిర్ణయం రాజధాని నిర్మాణం కోసం పచ్చని పంటక్షేత్రమైన కృష్ణానది ఒడ్డును ఎంపిక చేయటం. అది కూడా ఒకేసారి 33 వేల ఎకరాలను సేకరించి వాటిని పంటలు లేకుండా ఎండపెట్టడం.

ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సమయంలో, ప్రభుత్వ కార్యక్రమానికి పొలం ఇచ్చిన రైతు కోటయ్య మరణం సంభవిస్తే దానిగురించి ముఖ్యమంత్రి పట్టించుకోవలసినంతగా పట్టించుకోక పోవడం కూడా ఆ విషయాన్ని రుజువు చేస్తున్నదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *