ప్రజావేదిక కూల్చివేత క్రమమా? అక్రమమా?

ప్రజావేదిక కూల్చివేత క్రమమా? అక్రమమా?

రాష్ట్రంలో ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న అంశాలలో ప్రజావేదిక ఒకటి. జూన్‌ 24, 25 తేదీలలో ఈ ప్రజావేదిక భవనంలోనే రెండు రోజుల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజావేదిక భవనం అక్రమంగా నిర్మించిన కట్టడం అనీ; అక్రమ కట్టడాలనూ, అవినీతిని ఈ ప్రభుత్వం సహించదనీ చెపుతూ, కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ఈ భవనాన్ని కూల్చివేస్తామని అన్నారు. అవినీతి నిర్మూలన, అక్రమ కట్టడాల కూల్చివేత పనులను ప్రజావేదిక భవనం కూల్చివేతతో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై వివిధ వర్గాల నుండి రకరకాల స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టులూ పెడుతున్నారు. ఉలిక్కిపడుతున్నారు.

ప్రజావేదిక భవనం రాష్ట్ర రాజధానిగా నిర్ణయమైన అమరావతిలో ఉండవల్లి గ్రామంలో కృష్ణానది ఒడ్డున వరద కరకట్ట ప్రాంతంలో నిర్మితమైంది. 2014 ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు 2016లో పరిపాలన సౌలభ్యం కోసం అంటూ పరిపాలన విభాగాన్ని హైదరాబాద్‌ నుండి అమరావతికి తరలించారు. వచ్చిన వెంటనే తన నివాసం కోసం ఒక భవ్య భవనం నిర్మించతల పెట్టారు. అందుకోసం కృష్ణానది కరకట్ట ప్రాంతంలో ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. కృష్ణానదికి, నది వరదను అడ్డుకునే కరకట్టకు మధ్య ఈ ప్రాంతం ఉంటుంది. ఆ స్థలంలో ఆ భవనం నిర్మించిన తరువాత దానిపక్కనే ప్రభుత్వ ఖర్చులతో ప్రజా వేదిక భవనాన్ని నిర్మించారు. ఈ రెండు కట్టడాలు అక్రమ నిర్మాణాలే అని ఇటీవల సిఆర్‌డిఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి) ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక సమర్పించింది. అప్పట్లో సిఆర్‌డిఏ ఈ కట్టడాలకు అనుమతి ఇవ్వలేదని, అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మించారని చెప్పింది. సాధారణంగా ఈ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణా లకు తావు లేదు. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతం వరద ముంపుకు గురవుతుంది. అందుకే ఈ కట్టడాలకు అనుమతి ఇవ్వలేదని సిఆర్‌డిఏ స్పష్టం చేసింది. అయితే వాస్తు పేరుతో చంద్రబాబు ఈ స్థలాన్ని ఎంపిక చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రజావేదిక నిర్మాణానికి మొదట్లో కోటి రూపాయల అంచనా వేశారు. తరువాత దాని కోసం ఏడున్నర కోట్ల ప్రజాధనం ఖర్చుచేశారు. ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని ప్రభుత్వ సమావేశాలు, కలెక్టర్ల సమావేశాల కోసం, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి వివిధ సమీక్షలు, టెలీ కాన్ఫరెన్సుల కోసం వినియోగించటానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మెల్లగా ప్రజావేదిక భవనాన్ని తన పార్టీ కార్యకలాపాల కోసం, తన కుటుంబ అవసరాలకు పరిమితం చేశారు. ప్రభుత్వ సమావేశాలను నక్షత్రాల హోటళ్లలో నిర్వహించి, హోటళ్లకు రుసుముల రూపంలో కోట్లలో ప్రజాధనం వృథా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు తన పార్టీ కార్యకలాపాల కోసం ప్రజావేదిక భవనాన్నే వినియోగించారు. అయితే ఆ ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయి వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష స్థానంలోకి వచ్చారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాస్తూ ప్రజావేదిక భవనాన్ని తనకు కేటాయించాలని కోరారు. ప్రతిపక్ష నేత హోదాలో తన కోసం, తన పార్టీ కార్యకలాపాల కోసం దానిని వినియోగించు కుంటామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై వివిధ వర్గాలు స్పందిస్తూ ప్రజాధనంతో నిర్మించిన భవనం చంద్రబాబుకు సొంతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం దీనిపై ఏవిధమైన స్పందన వ్యక్తం చేయలేదు.

కొన్నాళ్లకు కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు ప్రజావేదిక భవనాన్ని అనువైన స్థలంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై టీడీపీ వర్గాలు గుర్రుమన్నాయి. తమకివ్వకుండా ఉండటం కోసమే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోకుండా ప్రైవేటు పరం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజావేదికను కలెక్టర్ల సమావేశాలు, వివిధ శాఖల సమీక్షల కోసం వాడారని, ఇప్పటి ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ల సదస్సు కోసం ప్రజావేదికను ఎంపిక చేసిందని చెపుతూ, చంద్రబాబుకో విధానం మాకో విధానం ఉండదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

నిర్ణయించిన విధంగానే కలెక్టర్ల సదస్సు 24వ తేదీన ప్రజావేదికలో ప్రారంభమైంది. ఆ సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అవినీతిని, అక్రమాలను తన ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పింఛను కావాలంటే ఏ పార్టీకి ఓటేశారని అడిగేవారని, మీకొచ్చే ఫించనులో నాకెంత లంచం ఇస్తావని ప్రశ్నించేవారని, రేషన్‌కార్డు మంజూరు, మరణ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం జారీ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వచ్చేదని అన్నారు. ఇలా ఆ ప్రభుత్వం ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడిందని గుర్తు చేశారు. మట్టి, ఇసుకను కూడా దోచేశారని ఎద్దేవా చేశారు. పరికరాల పంపిణీ, ట్రాక్టర్ల కొనుగోలు తదితర వాటిలోనూ అవినీతే. మరుగుదొడ్ల మంజూరుకూ లంచాలు తీసుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. లంచాలిస్తే తప్ప పనులు జరగని స్థితి; ప్రభుత్వ పథకాలు, పనుల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి మన ప్రభుత్వంలో ఉండకూడదని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పారు. నీతి, నియమాలను అందరూ పాటించాలని అన్నారు. ముఖ్యమంత్రి నుండి కలెక్టర్ల వరకు, కలెక్టర్ల నుండి క్రిందిస్థాయి గ్రామ అధికారుల వరకు వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. అవినీతిరహిత, పారదర్శక పాలనంటే దేశం మనవైపు చూడాలని, ఎన్నికలు జరిగితే మన పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లేస్తారని అన్నారు. మన పనితీరు అంటే మీ, నా పనితీరని గుర్తుంచుకోవాలని కలెక్టర్ల నుద్దేశించి అన్నారు. అవినీతి ఎక్కడున్నా అడ్డుకోవాలని గట్టిగా చెప్పారు. జగన్‌ ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులమైన మనం నేడు అక్రమంగా నిర్మించిన భవనంలో కూర్చుని అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటున్నామని, ఇది విచారకరమని అన్నారు. కాబట్టి అవినీతి నిర్మూలనను, అక్రమ కట్టడాల కూల్చివేతను ఈ ప్రజావేదిక భవనం కూల్చివేతతోనే ప్రారంభిద్దామని అన్నారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశమని అన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే ఈ ప్రజావేదికను కూల్చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజావేదికను కూల్చేస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన రాష్ట్రంలో పెను సంచలనమే సృష్టిం చింది. దీనిపై వివిధ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు దీనిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని కూల్చటం సక్రమం కాదని అంటున్నారు. ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రికి ప్రజావేదిక కూల్చివేతపై సలహా ఇస్తూ తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తే సొమ్ము వృథా అవుతుంది. మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని ఆ పోస్టులో పేర్కొన్నారు. మరొక నాయకుడు ప్రజావేదికతో పాటు, దాని చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలూ అక్రమ కట్టడాలే. కాబట్టి ప్రజావేదితో పాటు అవన్నీ కూల్చడం మంచిది అని అభిప్రాయపడ్డారు.

దీనిపై స్పందిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ట్వీట్‌ చేశారు. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన తన ట్వీట్‌లో ప్రశ్నించారు. అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి పెద్దోళ్లు నిర్మించు కున్నవని తెలిపారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారని, ఇకపై అది సాధ్యం కాదని చురకలంటించారు.

అయితే ప్రజావేదికను కూల్చడంపై అందరూ సలహాలు, విమర్శల రూపంలో స్పందిస్తున్నారు తప్ప ఎవరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం. అయితే కొంతమంది ప్రజా నాయకులు ఈ నిర్ణయం మంచిదే అని సమర్ధిస్తూనే మరికొన్ని సలహాలూ ఇస్తున్నారు. ప్రజావేదికను కూల్చడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కట్టడాల నిర్మాణానికి ఎవరూ సాహసించకుండా చేయాలని అంటున్నారు. అందుకోసం ప్రజావేదిక నిర్మాణానికి అనుమతిచ్చిన అప్పటి మంత్రి, అధికారులు, నిర్మించిన కాంట్రాక్టరు మీద చర్యలు తీసుకుని డబ్బు కక్కించాలని అంటున్నారు.

అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జగన్‌ ఆదేశించిన మరుసటి రోజే అధికారులు వాటి కూల్చివేతను ప్రారంభించారు. దానిలో భాగంగా 25వ తేదీన తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ విషయంలో అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. అక్కడి 17వ వార్డు నరసింహారావు పేటలో బాల వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ వైస్‌ చైర్మన్‌ గొర్రెల శ్రీధర్‌ ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో దేవాదాయ శాఖ, పోలీసు అధికారులు అక్కడి రోడ్డు ఆక్రమణలు తొలగించారు. మరికొన్ని అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశారు. ప్రజావేదిక కూల్చివేతనూ అధికారులు అదేరోజు సాయంత్రం ప్రారంభించారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *