పోలవరంపై ఎవరిది చిత్తశుద్ధి !

పోలవరంపై ఎవరిది చిత్తశుద్ధి !

పోలవరం ప్రాజెక్టు..

తెలుగువారికి ప్రాణధార..

ఈ విషయాన్ని నాటి బ్రిటిష్‌ పాలకులే నిర్ధారించారు.

అప్పటి కాటన్‌ దొర గుర్రం మీద అంతర్వేది నుంచి వాజేడు, చంద్రుపట్ల వరకు గోదావరి ఒడ్డుపై తిరిగి ఎక్కడ ఆనకట్టలు కట్టవచ్చో పరిశీలించాడు. ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు. దరిమిలా దుమ్ముగూడెం దగ్గర పడవలకు పనికి వచ్చే లాకులు కట్టారు. ఆ తరువాత ఆంగ్లేయులు 1930 ల్లోనే పోలవరంపై ఆనకట్ట కట్టటానికి ప్రయత్నం చేశారు. గోదావరి మీదనే ఇంతటి పరిశీలన చేయటానికి కారణం ఉంది. మిగిలిన నదుల మీద ఎన్నో చోట్ల ఆనకట్టలు కట్టే వీలుంది. గోదావరికి అలా వీలు లేదు. అలా అనుకున్నట్లుగానే కృష్ణా, పెన్నా, కావేరి, నర్మద వగైరా నదుల మీద తదుపరి ఎన్నో కట్టలు కట్టారు. కృష్ణ మీద దాదాపు నీరు కడలికి చేరకుండ, మొత్తం నీటిని వాడేంతగా ఆనకట్టలు కట్టారు. ఆ కట్టల సామర్థ్యాన్ని ఇంకా పెంచుతున్నారు. గోదావరి నీరు ఇప్పటికీ 95% సముద్రంలోనే కలిసిపోతోంది. పోలవరం కట్టాక కూడ చాల నీరు వట్టిగానే పోతుంది. ఇంగ్లిష్‌ పాలన కొనసాగితే ఎప్పుడో పోలవరం పూర్తి అయిపోయేది. స్వాతంత్య్రం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దీన్ని పట్టించుకోలేదు. తెలుగు వారు అంటేనే చిన్నచూపు చూసేది. అంతగా కాంగ్రెస్‌ సంస్కృతి అర్థం కాని అంజయ్య 1980ల్లో పునాది రాయి మాత్రం వేయగలిగారు. తరువాత పోలవరం ప్రాజెక్టును అందరూ మరిచిపోయారు. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూడ అదే ధోరణిని పాటించింది. 2004 వరకు 16 ఏండ్లు అధికారంలో ఉన్నా పోలవరం కోసం ఇసుమంత పని చేయలేదు. పోలవరం ఫైల్‌ను చంద్రబాబు కసిగా పక్కకు పెట్టేవారు. కానీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ దానిని ముందుకు కదిలించారు. నోట్ల రద్దు, జిఎస్‌టి, పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటి ఎన్నో సాహస నిర్ణయాలు చేసినట్లుగానే 1930 నుండి పెండింగ్‌లో ఉన్న పోలవరం నిర్మాణానికీ కంకణం కట్టుకున్నారు. అన్ని అనుమతులూ పూర్తయ్యేటట్లు చూశారు. నిధులిచ్చారు. పనులు ఎంతవరకూ జరిగాయన్నది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

అయితే మొదటినుండి తెలుగు ప్రభుత్వాలు పోలవరంపై నిర్లక్ష్యం వహించినట్లే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వమూ మొదటి రెండేళ్లూ నిర్లక్ష్యం ప్రదర్శించింది. నిజానికి ఇక్కడి అధికార నాయకులు తమ రాజకీయ, వ్యక్తిగత స్వార్ధం కోసం వాడుకున్నారనటం సబబుగా ఉంటుంది. పనులను పూర్తి కానీయకుండా ఆటంకాలు కలిగించారు. అసలు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలకు ఖర్చుపెట్టారు. కేంద్రం గట్టిగా అడిగితే విమర్శించటం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వాస్తవంగా ఎవరిది చిత్తశుద్ధి అనేది తెలుసుకోవటం అవసరం.

నీటి ప్రాజెక్టు నిర్మాణ తీరు

నీటి ప్రాజెక్టుల పనిని రెండు భాగాలుగా చూడవచ్చు. 1. నదిలో చేసే పని. 2. కాలువ పనులు. నదిలో చేసే పనికి చాల పనితనం ఉండాలి. ఏమాత్రం లోపం ఉన్నా మొదటి వరదకే కొట్టుకుపోతుంది. పైగా ఎంత పని చేసిందీ కళ్లకు ఎప్పటికీ కనపడుతూనే ఉంటుంది. నదిలో కట్టను 10 మీటర్ల వెడల్పుతో కట్టాం అని రికార్డు చేసి ఉంటే 10 ఏండ్ల తరువాతే కాక ఎప్పటికీ అంత వెడల్పు కనపడుతూనే ఉంటుంది. మధ్యలో అవసరం వచ్చింది కాబట్టి ఎక్కువ సిమెంటు నిష్పత్తితో కట్టాను అనటం కుదరదు. భారీ ప్రాజెక్ట్‌ కట్టటానికి కొత్త యంత్రాలను విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలి. కొత్త పరిజ్ఞానం కావాలి. దానిని ఉపయోగించే పనివారు కావాలి. అదే కాలువల పనికైతే ఈ ఇబ్బందులు ఉండవు. చేయటానికి అంత పనితనం అవసరం లేదు. లోపాలున్నా పెద్దగా తెలియరావు. ఒక్క వానాకాలం పోతే ఎంత పని చేసిందీ స్పష్టంగా తెలుసుకోడానికి అవకాశం ఉండదు. పూడిపోయింది, కొట్టుకుపోయింది అని చెప్పి, పనులు చేయకుండానే తప్పించుకోవచ్చు. మధ్యలో పెద్ద మొద్దు రాళ్లు అడ్డం వచ్చాయి, చాల కష్టపడి పెకిలించి తీసివేసాము అని బిల్లు పెట్టినా తరువాత చూపించాల్సిన పని లేదు. భారీ యంత్రాల అవసరం లేదు. పార, గడ్డపార, తట్ట ఉంటే చాలు! అందుకని మన తెలుగు ప్రభుత్వాలు 4,000 కోట్ల రూపాయలను పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాల పేరుతో కుడి ఎడమ కాలువల మీద మాత్రమే చాల తెలివిగా ఖర్చు చేశారు తప్ప అసలు నదిలో పనే మొదలు పెట్టలేదు. అంతేకాదు. ఎత్తిపోతల పథకాలు ఎప్పుడూ డబ్బులు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై చేపట్టిన ఎన్నో చిన్న ఎత్తిపోతల పథకాలు మూలపడటాన్ని మనం చూశాం.

మధ్యవర్తిగా చంద్రబాబు

మోదీ ప్రధానమంత్రి అయ్యాక, పోలవరం మీద గట్టి దృష్టి పెట్టారు. దానికి ఉన్న అడ్డంకుల గురించి పట్టించుకుని, ఒక్కొక్క దానిని విజయవంతంగా తొలగింపచేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు చూపు పోలవరంపై పడింది. ఈ పనిని రెండేళ్లు అయినా ఆపవచ్చు. తనకు నచ్చిన వారికి, తనకు నచ్చిన రేట్లకు కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చు. తన రాష్ట్రంలో కనపడే పెద్ద పని ఇది. దీనిని తన భుజాలమీదే మోసి పని పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్‌ అంచనాలను పెంచుకుంటూ పోవచ్చు. తన వాళ్లకు మేలు చేయడానికి దీనిని ఉపయోగించు కోవచ్చు అని భావించారు. అవకాశాలను ముందుగా గుర్తించటంలో, వాటిని వాడుకోవటంలో అందెవేసిన చేయి కాబట్టి వెంటనే రంగంలోకి దిగారు. ప్రధాన మంత్రి దగ్గరకు వెళ్లి ‘ఈ పనిని నేను చేస్తాను. మీరు డబ్బులు ఇవ్వండి’ అన్నారు. చంద్రబాబు స్వార్థం గురించి తెలియని మోదీ దానికి ఒప్పుకున్నారు.

రెండేళ్ల సాగతీత

2004లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా పెద్ద జల ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టాడు. వాటిలో పోలవరం ఒకటి. కాని అసలు పనికన్నా ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా రకరకాల కారణాలతో పనులు ముందుకు సాగలేదు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాలంలో కూడ పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటి రెండేళ్లు ఏమీ పని కాలేదు. రాజశేఖరరెడ్డి చేసిన ధోరణి తనకు కనపడుతున్నది. నదిలో పని ముందుకెళ్లకుండా ఏమి చేస్తే బాగుంటుందో బాబు ఆలోచించారు. అందుకని కుడి గట్టున పట్టిసీమ, ఎడమ గట్టున పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలు మొదలుపెట్టారు. పట్టిసీమ వలన పంటలకు లాభం కలిగింది అని ప్రచారం మొదలుపెట్టారు. పట్టిసీమతో గోదావరిలోని నీటిని ఎత్తిపోతలతో ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించారు. అయితే ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆలోచన కూడా కొత్తగా వచ్చింది కాదు. 1950ల నుంచే నలుగుతోంది. పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ‘పోలవరం కోసం కష్టపడుతున్నాను’ అని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా అప్పుడు 1996 నుంచి 2004 వరకు అధికారంలో ఉండీ పట్టించుకోలేదు. పైగా 2001 నుంచి 2003 వరకు వరుసగా ఎన్నడూ లేని విపరీతమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా ఆయనకు ఈ పట్టిసీమ గుర్తుకు రాలేదు. అయితే 2014లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన తరువాత గుర్తుకు రావటం విడ్డూరం. అసలు పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలకు పెట్టిన డబ్బులను పోలవరం కోసం ఖర్చు చేస్తే ఇప్పటికి పోలవరం పూర్తయ్యేది.

శాశ్వత ప్రాజెక్టు పనులు జరుగుతున్న సమయంలో ఎత్తిపోతల పథకాల పని చేపట్టటమే పాలకుల స్వార్థానికి నిదర్శనం. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఎత్తిపోతల పథకం శాశ్వత నిర్మాణం కాదు. వీటికోసం ఏర్పాటు చేసిన పైపులు, మోటార్లు ప్రతి సంవత్సరం చెడిపోతూనే ఉంటాయి. కాలువల పూడికలు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉండాలి. కాబట్టి డబ్బు సంపాదించాలనుకునే ప్రభుత్వ పెద్దలకు ఈ పథకాల ద్వారా ఎప్పుడూ చేతినిండా పని ఉంటూనే ఉంటుంది. పైగా పట్టిసీమ పథకం కోసం తవ్విన కాలువలు అంతకుముందు తవ్విన పెద్ద కాలువలకు సమాంతరంగా కొంత దూరం పోవటం చూస్తే పాలకుల స్వార్థం ఇట్టే తెలిసిపోతుంది. పైగా పట్టిసీమ కోసం అప్పుడు పెట్టించిన ట్రాన్సుఫార్మర్లు, మోటార్లు, పైపులు, ఇతర కట్టుబడులను పోలవరం నిర్మాణం తరువాత లేక 2019లో ఏది ముందు జరిగితే అప్పుడు తొలగించాలి అన్నది గమనిస్తే కొంత మంది స్వార్థానికి తెలుగు ప్రజలు ఎంత నష్టపోయారో అర్థమవుతుంది.

పనిచేయలేని కాంట్రాక్టర్‌ కొనసాగింపు

పోలవరం ప్రాజెక్టు కోసం నదిలో ఆనకట్ట కట్టే పనిని దక్కించుకొన్న ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థకు ఆ పనిని చేయగలిగిన సామర్థ్యం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిపుణులు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అయినా ఇన్నేళ్లు గడిచినా దాని కాంట్రాక్టును రద్దు చేయలేదు. 2013లో ఈ సంస్థకు పనులు దక్కినప్పుడు సాగునీటి పనులలో అనుభవం లేని ఈ సంస్థకు ఎలా ఇచ్చారని విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గొడవ చేశారు. తరువాత ఈ సంస్థ యజమాని తన పార్టీలోకి మారాడు కాబట్ట్టి బాబు యూటర్న్‌ తీసుకున్నారు. కాంట్రాక్టు విలువను 4,054 కోట్ల నుంచి రూ.5535 కోట్లకు పెంచి మరీ ఇచ్చారు. పనులు చేయలేక చివరకు చేతులెత్తేసిన ఆ కంపెనీ దివాలా బాట పట్టటం అందరికీ తెలిసిందే.

ముంపు ప్రాంతాలు

ఈ ప్రాజెక్టు కడితే ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమౌతాయి. తెలంగాణలోని చింతూరు, వరరామ చంద్రాపురం, కుకునూరు, కూనవరం, వేలేరుపాడు మొత్తంగా; భద్రాచలం, బూర్గుంపాడు ఎక్కువగా మునిగి పోతాయి. 3.10.2013 నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే రాష్ట్ర విభజన గురించి తీర్మానించినా పోలవరం కోసం ఈ మండలాలను ఆంధ్రలో కలిపే విషయమై కాంగ్రెసు ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేదు. తెలుగువారి మధ్య ఈ విషయం రావణకాష్టంగా నలుగుతుంటే తన రాజకీయం కోసం వినియోగించుకోవాలని వారి ఆలోచన అయి ఉంటుంది. మోదీ వచ్చాక తెలుగు వారికి పోలవరం అవసరం గమనించారు. ప్రాజెక్టు ఒక రాష్ట్రంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరొక రాష్ట్రంలో ఉంటే ప్రాజెక్టు పనులు ముందుకు పోవని గమనించారు. వాటిని ఆంధ్రలో కలపటానికి నిశ్చయించారు. మోదీ ధోరణిని చూసిన తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ ఎంపీలు కలిసి జట్టుగా ఏర్పడి మునక ప్రాంతాలను ఆంధ్రలో కలిపే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇక్కడ మనం ఒక రాజకీయ అంశాన్ని చూడాలి. చత్తీస్‌గఢ్‌లో ఉన్న ప్రభుత్వం మోదీ పార్టీకి చెందినదే. ఒరిస్సాలోని అధికార పార్టీ మోదీ పార్టీ కాకపోయినా మోదీ తలపెట్టిన దేశానికి పనికి వచ్చే అన్ని పనులను సమర్థించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్‌ తరపున మోదీ ఆలోచించారు. ఎలాగైనా పోలవరం పూర్తి చేయాలనుకున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ముంపు ప్రాంతాల రాజకీయం ముదిరి జటిలం అవుతుందని గమనించి 2014 జులైలోనే ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. అలా పోలవరంకి సంబంధించిన అన్ని సమస్యలను మోదీ పరిష్కరించుకుంటూ వచ్చారు.

పోలవరంపై తెలుగుదేశం నిర్లక్ష్యం

అయితే అసలు పోలవరం విషయంపై తెలుగుదేశం పార్టీకి అప్పుడూ ఇప్పుడూ చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. అందుకు కారణాలివి. ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలపమని బాబు కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవు. కలిపిన తరువాత కూడా ఆ ప్రాంతాలను తనవిగా చూడలేదు. ఈ విషయంలో 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో బయటపడింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మర్రి శశిధరరెడ్డి ఈ మునక ప్రాంతాలలో కూడ ఎన్నికలు జరపాలని న్యాయస్థానంలో దావా వేశారు. కేంద్రం ఈ ప్రాంతాలను ఆంధ్రలో కలిపినా ఆంధ్ర వాటిని తనవిగా గుర్తించకపోవటాన్ని, అవి ఏ నియోజక వర్గాలలో ఉండాలో ఇంతవరకు ఆంధ్రప్రభుత్వం ప్రకటించక పోవటాన్ని ఆయన కారణాలుగా చూపించారు. నాలుగున్నరేళ్ల తరువాత, అదీ ఈ గొడవ తరువాత మాత్రమే బాబు ప్రభుత్వం ఈ మునక ప్రాంతాలను పట్టించుకుంది.

మరోపక్క పోలవరం వల్ల చుట్టుపక్కల మూడు రాష్ట్రాలు చాల నష్టాన్ని పొందుతాయి. అందుకని వాటిని మంచితనంతో ఒప్పించేట్లు చేయటం లాభం పొందే రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ కనీస కర్తవ్యం. పోలవరం పట్ల నిర్లక్ష్యం ఉన్న చంద్రబాబు సహజంగానే ఈ పనికి దూరంగా ఉండిపోయారు.

ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన చంద్రశేఖరరావు ప్రాజెక్టు అనుమతులు, అడ్డంకుల తొలగింపు విషయంలో ఎంతో శ్రమించారు. ‘కాళేశ్వరం వల్ల మహారాష్ట్రలో కొంత భాగం మునిగిపోతుంది. ఆనకట్టకు కేంద్రం సహాయం చేయాలి, మహారాష్ట్రను ఒప్పించే పని కూడా కేంద్రమే చేయాలి’ అని ఊరుకోలేదు. ముందుగా చీఫ్‌ ఇంజినీర్ల మృందాలను మూడుసార్లు ముంబాయి పంపారు. ‘ఆనకట్ట ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాము. కుడివైపు కాలువను మాత్రమే మేము వాడుకుంటాము. కట్ట కోసం ఏమి ఖర్చు పెట్టకుండా ఎడమ వైపు నీటిని మీరు వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు మీ వైపు, మా వైపు కూడ మునిగిపోతాయి. కాని అవి పెద్ద జనావాసాలు కావు, పంట పొలాలు కావు’ అని నచ్చచెప్పించారు. మహారాష్ట్ర ఇంజనీర్లు ఒప్పుకున్నారు. తరువాత సాగునీటి మంత్రి హరీష్‌రావును అక్కడి సాగునీటి మంత్రిని ఒప్పించటానికి మూడుసార్లు పంపించారు కేసీఆర్‌. హరీష్‌రావు కూడ అదే కథ వినిపించారు. ఖర్చు లేదు, పైగా నీరు వాడుకోవచ్చు అనుకున్న మహారాష్ట్ర మంత్రి సంతకం చేసేశారు. ఇక ముఖ్యమంత్రి మిగిలారు. తెలంగాణకు చెందిన విద్యాసాగరరావు మహారాష్ట్రలో గవర్నరుగా ఉన్నారు. కేసీఆర్‌ ఆయన్ని రంగంలోకి దించారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాళేశ్వరంకు ఒప్పుకున్నారు. సంతకాలు పూర్తయ్యాయి. రాష్ట్రం కోసం కొంత పని చేద్దాం అనుకునే ధోరణి వల్ల కేసీఆర్‌ సాధించారు. రాష్ట్రాల మధ్య తగాదాలు లేవు. కోర్టు కేసులు లేవు. హరిత ట్రిబ్యునల్‌ అప్పీళ్లు లేవు. ప్రజాభిప్రాయ సేకరణ, దాని కోసం గొడవలు లేవు. కేంద్ర ప్రభుతాన్ని నిందించడమూ లేదు. ఎటువంటి హడావిడి లేకుండా ప్రాజెక్టు పని నడుస్తోంది.

ఆనకట్ట అంచనా

కేంద్ర ప్రభుత్వం ముందే చాల స్పష్టంగా చెప్పింది. ఆనకట్ట కోసం 2014కు ముందు అయిన ఖర్చును తను ఇవ్వదు. అంచనాలో పెరుగుదలకు తనకు సంబంధం లేదు. విద్యుత్తు తయారీ కోసం పెట్టే ఖర్చును ఇవ్వదు. కట్ట ఖర్చును మాత్రమే భరిస్తుంది. 2010-11 మొత్తం అంచనా రూ.13,798 కోట్ల నుండి పెరిగి 16,010 కోట్లు అయింది. నీటి పారుదల కట్ట అంచనా రూ.12,294 కోట్లు. రాష్ట్రం ఖర్చు రూ.5,136 కోట్లు. ఇక కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,159 కోట్లు. ఇచ్చింది దాదాపు రూ.6,952 కోట్లు. ఇక ఇవ్వాల్సింది 395 కోట్లు మాత్రమే. అసలు 2014కు ముందు అయిన ఖర్చు వివరాలను కేంద్రం అడిగితే ఇంతవరకు రాష్ట్రం ఇవ్వలేదు. 2013, 2016ల్లో కాంట్రాక్టరుకు ఆంధ్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హెడ్‌వర్క్స్‌ విలువ రూ.5385 కోట్లు. స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనులను రూ.1244 కోట్లకు నవయుగకు రాష్ట్రం అప్పగించింది.

అయితే బాబు నేతృత్వంలో రాష్ట్రం రెండవ డి.పి.ఆర్‌. (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) విడుదల చేసింది. అందులో పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనా రూ.16,000 కోట్ల (2010-11) నుండి రూ.58,000 (2015-16) కోట్లకు పెంచారు. ముంపు ప్రాంతం 57,400 ఎకరాల (2010-11) నుంచి 11.14 లక్షలకు ఎకరాలకు పెంచారు. ఇవన్నీ 5 లేక 10 శాతం కాదు, 300% పెరగటం ఎంత విడ్డూరం! ఎకరం పొలానికి ఇచ్చే పరిహారాన్ని రూ.65 వేల నుంచి రూ.11.5 లక్షల రూపాయలకు పెంచారు. పునరావాసం, ముంపు ప్రాంతం ఖర్చును రూ.2,934 కోట్ల నుండి రూ.33,226 కోట్లకు (1130%) పెంచారు.

నష్ట పరిహారంలోనూ స్కాంలు

వింజారం గ్రామంలో ప్రైవేటు భూమి 96 ఎకరాలుంటే పరిహారం 246 ఎకరాలకు చూపించారు. రంగాపురంలో ఉన్న 300 ఎకరాల చెరువు భూమిని ప్రైవేటు భూమిగా చూపారు. 2014లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టులో మునుగుతాయి అని తెలిసీ అక్కడి ప్రభుత్వ భూములను కూడ తనవారికి కేటాయించింది. అంటే ముంపు పరిహారం వీరికి కూడా అందించాలనే ఆలోచన కనబడుతోంది కదా! అంతేకాదు, ముంపు ప్రాంతం నుండి కదిలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,500 నుంచి లక్షకు పైగా పెరిగాయి. మునిగే ఊళ్లు 276 నుంచి 321 కు పెరిగాయి.

పురాతన కట్టడాల పట్ల నిర్లక్ష్యం

క్రీ.పూ. 2,500 నాటి తెలుగు వారి మెగాలితిక్‌ శ్మశానాలు రుద్రంకోట, రాయన్నపేట ఊళ్ళల్లో బయటపడ్డాయి. అంతటి పురాతన స్థలాలను మన రాష్ట్రంలో బయటపడటం తెలుగు ప్రజల అదృష్టం. ఈ అపురూప స్థలాలు ఈ ప్రాజెక్టులో మునిగి పోతాయి. తెలుగు భాష, కళలు, సంస్క తి, చరిత్ర అంటే గౌరవం లేని చంద్రబాబు ఈ స్థలాల మునక పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నాగార్జున సాగర్‌ కట్టేటప్పుడు పరిపూర్ణమైన సర్వే చేసి మొత్తం అపురూపమైన బౌద్ధ శిల్పాలను కాపాడారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే లేదు. ప్రాజెక్టు నిర్మాణం కావాలి. పురా వస్తువుల రక్షణా జరగాలి. ఇది పాలకుల శ్రద్ధను తెలియచేస్తుంది.

నాణ్యత లోపాలు

పనులు ఆగకుండా కొనసాగటం ఏ ప్రాజెక్టుకైనా మంచిది. ఒక ఇరవై రోజులు పనులు ఆపి అన్ని సామానులు పోగు చేసుకొని గిన్నిసు రికార్డు కోసం ఒకే రోజులో పనులు పూర్తిచేయటం ప్రమాదకరం. అసలు సిమెంట్‌ పని ప్రతి రోజు కొంత చేసుకుంటూ పోతేనే మంచిది. ఒకేసారి గుట్టగా సిమెంటును కుమ్మరిస్తే అది నిలబడదనేది కొంతమంది భయం. సి.పి.ఎం. కార్యదర్శి మధు కూడ ఇది అసమంజసం అని విమర్శించారు. పనులు తగినంత వేగంగా, కావలిసినంత నాణ్యంగా జరగటం లేదని కాగ్‌ రిపోర్టు ఇచ్చింది. కాళేశ్వరంలో 39 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని అయితే, పోలవరంలో 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే జరిగింది. కాళేశ్వరానికి డబ్బులు ఇస్తామని అనేక ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ నాయకులు డబ్బుల కోసం కేంద్రాన్ని విమర్శించలేదు. కానీ పోలవరంకి కేంద్రం ఇప్పటికి 7 వేల కోట్లు ఇచ్చింది. ఇచ్చినా ఇవ్వటం లేదనే గొడవ చేయడం ఇక్కడి నాయకులు చేస్తున్న మరో విడ్డూరం. అప్పటి నాగార్జునసాగర్‌, శ్రీశైలం, ఇప్పటి కాళేశ్వరం పనులు హడావుడి లేకుండ ప్రశాంతంగా జరిగాయి, జరుగుతున్నాయి. ఒక్క పోలవరం విషయంలోనే ఇంతటి రభసను రాష్ట్రం చేస్తోంది. పైగా ఇక్కడి రాష్ట్రప్రభుత్వం డబ్బు లేదంటూనే, కేంద్రం ఇవ్వటం లేదని చెపుతూనే పోలవరం సందర్శన పేరుతో 22 కోట్లు విడుదల చేశారు. పోలవరానికి 10,000 బస్సుల్లో 5 లక్షల మంది ప్రజలను తెచ్చి, చూపించారు. ఇది కేవలం రాజకీయ స్వార్థమే.

అన్నీ పెండింగే..

2014 నుండి ఇప్పటికి జరిగిపోయిన ఈ ఐదేళ్లలో ఇక్కడి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఏ ప్రాజెక్టు పనులూ పూర్తి కాలేదు. శ్రీకాకుళం నుంచి గుటూరు జిల్లా వరకు ఉండే ప్రజలు హైదరాబాదు వైపు వెళ్లాలంటే విజయవాడ దుర్గ గుడి మార్గం దగ్గర దారి. ఆ మార్గంలో చేపట్టిన 300 మీటర్ల పైవంతెన ఈ ఐదేళ్లలో పూర్తి కాకపోవడం ఒక పెద్ద వింత. దానివలన హైదరాబాద్‌ నుండి విజయవాడకు రాకపోకలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేసిన పాలకులకు ప్రజల ఈ ఇబ్బంది కనిపించడకపోవడం మరీ విడ్డూరం. ఈ ప్రాంతంలో గుడులు పడగొట్టటానికి తీరిక ఉన్న ప్రభుత్వానికి వంతెన పూర్తిచేయడానికి మాత్రం తీరికి లేకపోయింది. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి హయాంలో అడుగుకు 10,000 రూపాయలు కేటాయించి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనం మొదటి వానకే కురవటం వింతల్లోకెల్లా వింత.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాజకీయ స్వార్ధం కోసం విపరీతంగా వినియోగించుకుంటున్నారు. పోలవరం తానే నిర్మిస్తున్నట్లుగా మీడియాలో కనబడటం కోసం అడుగడుగుకూ శంఖుస్థాపనలు చేస్తున్నారు. 50% పూర్తయిన పనినే మాటిమాటికీ జాతికి అంకితం చేస్తున్నారు. శంకుస్థాపనలు, జాతికి అంకితాల ఫలకాలపై తన పేరు వేయించుకుంటున్నారు. ప్రాజెక్టు సందర్శన పేరుతో పనులను ఆపుతున్నారు. ఇలా ఆపి, చివరికి దానిని ఎన్నికల అంశంగా చేసి, తన స్వార్థానికి వినియోగించుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు చెప్పినట్లు 2019లో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పం ఏ కోశానా ముఖ్యమంత్రిలో కనిపించడం లేదు. పైగా ప్రతి చిన్నపనికి శంకు స్థాపన పేరుతో తన పేరు వేయించుకుంటూ, అసలు డబ్బులిస్తున్న కేంద్రాన్ని, ప్రధానినీ విపరీతంగా విమర్శించడం ముఖ్యమంత్రి విద్వేష మనస్తత్వానికి నిదర్శనం.

పోలవరం కోసం మోదీ పట్టుదల

పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పనులు ఆగకూడదని నిర్ణయించుకున్న మోదీ ముందుగా నదిలోని పనిచేయాలని పట్టుపట్టారు. అక్కడే తన ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టేటట్లు చూశారు. ఎక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా ఇక పని ఆపటం కుదరని దశకు పోలవరం ప్రాజెక్టును తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా డబ్బులు ఇస్తే, లెక్కల తగాదా వస్తుందని భావించి, ఒక అథారిటీ ఏర్పరిచి దానికి డబ్బులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి తనకు ఇష్టం వచ్చిన ధరకు, ఇష్టం వచ్చిన గుత్తేదారులకు, టెండర్లు లేకుండా పనులు అప్పగిస్తుంటే పనులు పూర్తికావటమే తన లక్ష్యంగా భావించిన మోదీ చూసీచూడనట్లు ఉంటున్నారు. భరిస్తున్నారు.

తెలుగువారి పట్ల ఇంతటి ఔదార్యం ప్రదర్శించిన దేశ ప్రధానిని ‘ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌కు వస్తావు? నేను ధర్నా చేస్తాను’ అంటూ ముఖ్యమంత్రి చవకబారు మాటలను ఉపయోగిస్తున్నారు. నిజంగా కాంగ్రెస్‌కు చెందిన ప్రధాని అయితే ముంపు ప్రాంతాల సమస్యను ఇంత సులభంగా పరిష్కరించ గలిగేవారు కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు వారి మధ్య శాశ్వతంగా తగాదాలు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీలా భాజపా అనుకోలేదు. తన పార్టీ పాలనలో ఉన్న ఎగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అనుమతులు, కోర్టు స్టేల దగ్గర నుండి, నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు కలిగిస్తున్న ఇబ్బందులను తొలగించడం నుండి, నిధుల విడుదల, పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వరకు ఏ పనీ ముందుకు కదిలేది కాదు. వీటికోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ అధికారగణం ఎటువంటి శ్రద్ధా చూపలేదు. పైగా అడుగడుగునా రాజకీయ స్వార్ధం కోసం వినియోగించుకుంటున్నారు. పోలవరంపై అంత శ్రద్ధ చూపించిన ప్రధానిని నోటికొచ్చినట్లు తిడుతూ నిరంతరం విమర్శిస్తున్నారు. అయినా మోదీ విమర్శలను భరించారు తప్ప పోలవరం పనులకు ఎటువంటి ఆటంకం కలగనీయలేదు.

దీనినిబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎవరిది చిత్తశుధ్ధి అనేది తెలుగువారే నిర్ణయించుకోవడం సబబు.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *