పార్టీలను ఊరిస్తున్న విజయం

పార్టీలను ఊరిస్తున్న విజయం

ఈ సంవత్సరం మే 23వ తేదీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ రోజు వెలువడతాయి. ఆ ఫలితాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా మే 23నే తెలుస్తాయి. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్న ఉత్కంఠ కూడా తేలిపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు ఇప్పటివరకు అనేకసార్లు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరుగుతూ వస్తున్నాయి. ఈసారి కూడా అలాగే జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో పోలింగ్‌ జరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 11న మొదటి విడతలోనే పోలింగ్‌ ముగిసింది. కానీ ఫలితాల కోసం 42 రోజుల సుదీర్ఘకాలం ఎదురుచూడవలసి వచ్చింది. ఈ ఆధునిక ఎలక్ట్రానిక్‌, సమాచార విప్లవ యుగంలో ఎన్నికల ఫలితాల కోసం ఇంతకాలం వేచి ఉండాల్సి రావడం కొంత కష్టమైన పనే. కానీ రాష్ట్ర ప్రజలు అంతటి కష్టాన్ని, ఉత్కంఠను భరించారు. మధ్యలో కొన్ని నియోజకవర్గాలలో మే 6న జరిగిన రీపోలింగ్‌ లోనూ పాల్గొని మరోసారి ఓటేశారు. ఫలితాల కోసం ఓపిగ్గా ఎదురుచూశారు. మరో నాలుగు రోజుల్లో అందరూ ఎదురుచూస్తున్న మే 23 రాబోతోంది. ఫలితాలు వెలువడనున్నాయి. ఎదురుచూపులకు తెరపడనుంది. గెలుపు, ఓటముల ఉత్కంఠ తీరిపోనుంది.

ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో పోటీచేసిన ప్రధాన పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతాపార్టీ, జనసేన, కాంగ్రెస్‌. 2014లో జరిగిన ఎన్నికలలో జనసేన తప్ప మిగతావన్నీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేశాయి. జనసేన పోటీ చేయ కుండా అప్పటి టీడీపీ-భాజపా కూటమికి తన మద్దతును తెలియచేసింది. మరోపక్క వైసిపి, కాంగ్రెస్‌లు ఒంటరిగా పోటీచేశాయి. ప్రస్తుత ఎన్నికలలో ఈ అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీచేశాయి. లోపాయి కారీగా ఒక పార్టీ మరొక పార్టీకి మద్దతుగా పనిచేస్తోంది అనే ఊహాగానాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి. అసెంబ్లీలో విజయం లభించాలంటే 88 సీట్లు సాధించాలి.

ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాల కోసం దాదాపు నెలరోజుల పాటు కష్టపడిన దాదాపు అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు (ముఖ్య నాయకులు కాదు) పోలింగ్‌ తరువాత విశ్రాంతికే ప్రాధాన్యం ఇచ్చారు. వారంతా గత మార్చిలో 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసేవరకు కష్టపడి పనిచేసి, పోలింగ్‌ తరువాత విశ్రాంతి తీసుకున్నారు. అందుకోసం దేశంలోని చల్లని ప్రదేశాలకు, చల్లగా ఉండే విదేశీ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇటువంటి వారంతా ఫలితాలు రాబోతున్న ఈ తరుణంలో మళ్లీ తమ నియోజక వర్గాలకు తిరిగివస్తున్నారు. ఫలితాల సరళిని పర్యవేక్షించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫలితాల సరళిని బట్టి తాము ఎలా స్పందించాలనే చర్చలు సాగిస్తున్నారు.

పోలింగ్‌ ముగిసిన తరువాత రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పోలింగ్‌కు ముందు ప్రచార సమయంలో చేసినంత హడావిడి చేశాయి. సాధారణంగా పోలింగ్‌ ముగిసిన వెంటనే ఫలితాలు తమకే అనుకూలం అంటూ అన్ని పార్టీలు బీరాలు పలుకుతాయి. ఇది సాధారణం. కానీ ఫలితాలు తమకే అనుకూలం అనే ప్రకటనలను కొన్ని పార్టీలు వారాల పాటు అదేపనిగా మీడియాకు గుప్పించాయి. మరికొన్ని పార్టీలు తమ వ్యవహార శైలితో తమ గెలుపోటముల గురించి చెప్పకనే చెప్పాయి.

తెలుగుదేశం

రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా ఎన్నికలలో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అందుకోసం బాబు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ¬దా అంశంపై ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ఉద్యమాలతో, ప్రచారంతో ఆ పార్టీకి ప్రజలలో అనుకూలత పెరుగుతున్నదని భావించి తాను కూడా ¬దా బాట పట్టారు. కేంద్రంలోని భాజపాతో తెగతెంపులు చేసుకున్నారు. మోదీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ప్రజలలో వైఎస్‌ఆర్‌సీపీ పట్ల అనుకూలత తగ్గించడానికి తన పట్ల అనుకూలత పెరగడానికి ఎత్తులు వేశారు. జగన్‌ వస్తే రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతాయని, తనతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌నూ విమర్శించారు. ఎన్నికలు దగ్గరయ్యే సమయానికి పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలకు తెరతీశారు. మరోపక్క పోలింగ్‌ కోసం ఇవిఎంలు కాకుండా బాలెట్‌ పెట్టాలని, లేదా వివిపాట్‌ స్లిప్పులు కూడా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ రోజున ఇవిఎంలు మొరాయించిన విషయం గురించి పెద్ద రాద్ధాంతమే చేశారు.

ఇక పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా చంద్రబాబు తన పోరాటానికి స్వస్తి చెప్పలేదు. ఎన్నికలలో తమ గెలుపు ఓటములు జిల్లాలవారీగా ఎలా ఉన్నాయన్న అంశంపై సమీక్షలు నిర్వహించారు. తమ పార్టీకి గెలుపు తథ్యం అనీ, మెజారిటీ సీట్లు ఎన్ని అనేదే తేలాల్సిన అంశం అనీ కుండబద్దలు కొట్టారు. అన్ని సమీక్షలు, నివేదికలు పరిశీలించి, తన నలభై ఏళ్ల అనుభవంతో ఈ మాట చెపుతున్నా ననీ అన్నారు. అయితే గెలుపుమీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇన్ని సమీక్షలు చేయటం, ప్రతి రోజూ గెలుపు తమదే అని ప్రకటించుకోవటం ఎందుకు? అని విశ్లేషకులు ప్రశ్నించుకుంటున్నారు. సాధార ణంగా గెలుపుమీద నమ్మకం ఉన్న పార్టీ, నాయకుడు పోలింగ్‌ తరువాత అసలు ఏమీ మాట్లాడరు అని వారు చెపుతున్నారు. అందుకు రుజువుగా గత అనుభవాలను తవ్వితీస్తున్నారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎన్నికలలో విజయం కోసం రెండేళ్ల పాటు పాదయాత్ర చేశారని, పోలింగ్‌ తరువాత ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలు పక్కనపెట్టి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారని, గెలుపుపై ఎంతో ధీమా ఉన్న నాయకులే అలా చేయగలరనీ అంటున్నారు. అలాగే 2009లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రెండు విడతల పోలింగ్‌ ముగిసిన తరువాత ఫలితాల గురించిన ఎటువంటి ప్రకటనలు చేయలేదని గర్తు చేస్తున్నారు. కానీ బాబు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ హడావిడి చేయడం చూస్తే ఆయన ఫలితాల గురించి భయపడు తున్నట్లుగా కనిపిస్తోందనీ అంటున్నారు. మరోపక్క ఆయన పోలింగ్‌ తరువాత ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో 102 సీట్లు వచ్చాయి.

వైఎస్‌ఆర్‌సీపీ

ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌సీపీ గత ఎన్నిక లలో గెలుపుకు దగ్గరగా వచ్చింది. 67 సీట్లను కైవసం చేసుకుంది. అధికార పార్టీకీ, తమకు కేవలం 5 శాతం ఓట్లే తేడా అని గ్రహించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ ఎన్నికలలో గెలుపు కోసం గత మూడేళ్లుగా గట్టి ప్రయత్నాలు చేశారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి బాటలో పాదయాత్ర చేపట్టారు. అన్ని జిల్లాలను చుట్టివచ్చారు. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తనవైపు మలచుకునే ప్రయత్నం చేశారు. అందుకోసం ¬దా అంశం అందుకు న్నారు. తాను వస్తే ¬దా తెచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దానితో పాటు పలు సంక్షేమ పథకాలనూ ప్రకటించారు. అయితే ఎన్నికలలో ¬దా అంశం కనుమరుగు కావటం విశేషం. ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి సర్వేలన్నీ వైఎస్‌ఆర్‌ సీపీ వైపే విజయాన్ని సూచించటంతో వైఎస్‌ఆర్‌ శ్రేణులు ఉత్సాహంతో పోలింగ్‌లో పాల్గొన్నాయి. పోలింగ్‌ తరువాత పార్టీ అధ్యక్షుడైన వైఎస్‌ జగన్‌ పెద్దగా వార్తలలో కనిపించకపోవటం, ఆ పార్టీ మీడియా ప్రతినిధులు అంబటి రాంబాబు వంటివారు మాత్రమే కనిపిస్తూ కొన్ని ముఖ్యఅంశాల గురించిన ప్రకటనలు మాత్రమే చేస్తుండటం గమనార్హం.

భాజపా

రాష్ట్రంలో భాజపా ఖ్యాతి చెప్పుకొనేంత గొప్పది కాదు, అంత తక్కువ కాదు. కానీ చెప్పుకోదగ్గ పరిమాణంలో ప్రభావం చూపగలుగుతోంది. 1982 నుండి అనేకసార్లు ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భాగస్వామ్యం వహించింది. ఎక్కువసార్లు టీడీపీ మిత్రపక్షంగా కొనసాగి, ఆ పార్టీ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించింది. 2014లో కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉండి, ఓట్లలో చీలిక రాకుండా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. 4 స్థానాలను కైవసం చేసుకుంది. మొదటిసారి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్యాలరావు, శ్రీనివాస్‌ రాష్ట్రమంత్రివర్గంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. కానీ 2018 జనవరి నుండి చంద్రబాబు తెగతెంపుల రాజకీయంతో భాజపాకూ వార్తలలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్థానం లభించింది. ఒక దశలో భాజపా టీడీపీకి గట్టి పోటీ ఇవ్వగలదనే సంకేతాలు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాదే కీలకపాత్ర అనీ, అవినీతి మచ్చ లేని పార్టీ అనీ ప్రజలు, నాయకులు అందరికీ తెలుసు. ఇది ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపిందనేది ఫలితాల తర్వాతే తెలుస్తుంది.

జనసేన, కాంగ్రెస్‌

రాష్ట్రంలో ప్రస్తుత ప్రధాన పార్టీల తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నవి జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు. వీటిలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అత్యంత గొప్ప చరిత్ర గలది. మొదటినుండి రాష్ట్రంలో అధికార పార్టీగానే కొనసాగింది. 1980లో తెలుగుదేశం వచ్చేవరకు తిరుగులేని శక్తిగానే నిలిచింది. 2004 నుండి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉంది. కానీ 2004లో రాష్ట్ర విభజన అంశంపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం అనుసరించిన తీరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలలో అభిమానం పోగొట్టుకుని రాష్ట్రంలో చతికిల పడింది. 2014 ఎన్నికలలో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత మరింత చతికిలపడి, రాష్ట్రంలో కొన్నిచోట్ల తప్ప మిగతా చోట్ల కార్యకర్తలు కూడా లేని పరిస్థితికి దిగజారింది. ఈ ఎన్నికలలో ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రమే ఆయన పోటీచేసిన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ప్రభావం చూపించారని విశ్లేషకులు అంటున్నారు.

ఇక జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించింది. ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఎక్కడా పోటీ చేయన ప్పటికీ టీడీపీ-భాజపా కూటమికి తన మద్దతును ప్రకటించి, ప్రభుత్వ ఏర్పాటులో భాజపాతో పాటు కీలకపాత్ర పోషించింది. ఆ పార్టీ స్థాపకుడు, అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేరు. 2014 తరువాత అధికార టీడీపీతో పూర్తి మిత్రపక్షంగా కాక, అంశాలను బట్టి వ్యవహరించింది. ఇటువంటి వ్యవహారశైలి ఆ పార్టీకి పెద్దగా లాభం చేకూర్చలేదు. దాంతో 2019 ఎన్నికల సమయానికి ఆ పార్టీకూడా టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఒంటరిగా అన్ని స్థానాలలో పోటీకి దిగింది. కానీ ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ అవగాహన ఉన్నదనే వార్తలు, ఊహాగానాలు పొక్కాయి. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జగన్‌ను మాత్రమే ఎక్కువగా విమర్శించడం, టీడీపీని పెద్దగా విమర్శించకపోవడం, ప్రచారం ముగియడానికి రెండురోజుల ముందు వడదెబ్బ పేరుతో ప్రచారానికి దూరంగా ఉండటం ఈ ఊహలకు ఊతమిచ్చింది. దానికితోడు ఈ మధ్య పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ తమకు ఓటమి భయం లేదని, మార్పు మొదలు కావడమే తమ గెలుపు అని చెప్పుకొచ్చారు. ఇది ఫలితాల గురించి ఆ పార్టీ తీరును చెప్పకనే చెబుతోంది.

మొత్తంమీద పోలింగ్‌ సమయం నాటికి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ మధ్యే గట్టి పోటీ నెలకొనడం వాస్తవం.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *