అక్కడ సైన్యమే పాఠశాలలు నడుపుతుంది

అక్కడ సైన్యమే పాఠశాలలు నడుపుతుంది

సైన్యమంటే కేవలం యుద్ధ కోసమేనా…

శత్రువులను చంపడమే వారి పనా…

వారింకేమీ చేయరా…

అని కొన్ని సందేహాలు రావడం సహజం.

కానీ భారత సైన్యం యుద్ధ తయారీతో పాటు సేవ కూడా ముఖ్యమని చెపుతోంది. అవసరమైతే సమాజాన్ని నిర్మించే కార్యం కూడా తాము చేయ గలమని నిరూపిస్తోంది.

గత 35-40 ఏళ్ళ నుండి ఉగ్రవాదంతో అట్టుడి కిన కాశ్మీర్‌ లోయలో, ఇక బ్రతుకులు బాగుపడ వనుకొనే స్థితిలో ఉన్న అక్కడి ప్రజలకు సాంత్వన నివ్వడానికి భారత సైన్యం రకరకాల సేవలను అందిస్తోంది. అక్కడి ప్రజల హృదయాలను గెలుచు కొంటోంది.

హృదయాలను గెలుచుకోవడం కోసం చాలా ఓపిక కావాలి. ముఖ్యంగా వేర్పాటువాదం వేళ్లూను కున్న జమ్మూ కశ్మీర్‌లో మరింత ఓపిక కావాలి. జమ్మూ కశ్మీర్‌లో యువకులను వేర్పాటువాదం, ఉగ్రవాదం నుంచి దూరం చేయాలంటే వారికి అభివృద్ధి పథాన్ని చూపించాలి. వెలుగుబాటను చూపించాలి. భారతీయ సైన్యం అదే పని చేస్తోంది.

గత రెండేళ్లుగా ఆపరేషన్‌ సద్భావనలో భాగంగా కశ్మీరీ విద్యార్ధినీ విద్యార్థులకు జెఈఈ మెయిన్స్‌ పరీక్షలు వ్రాసేందుకు కావలసిన శిక్షణను ఇస్తున్నారు. ఇది సైన్యం చేస్తోంది. దీనికి ”కశ్మీర్‌ సూపర్‌-30” అని పేరు పెట్టారు. బీహార్‌లో అత్యంత పేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులకు సూపర్‌-30 అనే సంస్థ ఉచిత శిక్షణనిచ్చి వారిని అఖిల భారత పోటీలకు సమాయత్తం చేస్తోంది. అదే పద్ధతితో సైన్యంలోని డాగర్‌ డివిజన్‌ ఈ శిక్షణను ఇస్తోంది. గతేడాది 30 మంది విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. ఇందులో ఒకరు జెఈఈ మెయిన్‌ పరీక్షల్లో ప్యాసయ్యారు. మరో 17 మంది దేశంలోని ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందగలిగారు. ఈ ఏడాది 36 మందిని ఎంపిక చేసి శిక్షణను ఇచ్చారు. దీనిలో ముగ్గురు ఐఐటీ కి ఎంపికయ్యారు. 27 మంది దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందగలిగారు.

ఒక వైపు వేర్పాటు వాదాన్ని కొన సాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, మామూలు పౌరులకు ఉగ్రవాదంతో సంబంధాలు లేవు. శ్రీనగర్‌ వంటి పట్టణం వదిలేస్తే చాలా చోట్ల ప్రజలు ఉగ్రవాదంతో విసిగి వేసారిపోయి ఉన్నారు. ప్రజలు శాంతిని, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఉపాధిని, ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి చేయూత నిచ్చేందుకే ఆపరేషన్‌ సద్భావన కొనసాగుతోంది.

ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కశ్మీర్‌లోని ప్రభుత్వ స్కూళ్లు మూతపడిపోయాయి. ఆ సమయంలో సైన్యం దాదాపు 40 గుడ్‌విల్‌ స్కూళ్లను నడుపుతోంది. దీనిలో లక్షమంది విద్యార్థులు హైస్కూలు స్థాయి చదువులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి స్కూళ్లు మరిన్ని కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ఇవి ఎంత విజయవంతంగా నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో తరగతి గదులు, లైబ్రరీలు, టాయిలెట్లు, ఆట స్థలాలు, క్రీడా సదుపాయాలు, మంచి ఫర్నీచర్‌, కంప్యూటర్‌ వంటివి అందచేస్తున్నారు. అంతేకాదు. విద్యార్థులకు ఉపాధి అవకాశాల గురించి శిక్షణను ఇస్తున్నారు. వీటన్నిటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తు న్నాయి.

అందుకే ఏదోవిధంగా సైన్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వేర్పాటువాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. హంద్వారా వంటి సంఘటనల్లో అబద్దాల ప్రచారం ఈ కారణంగానే జరుగుతోంది. కానీ సైన్యం నిశ్శబ్దంగా చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఒక కొత్త వాతావరణం నిర్మాణం అవుతోంది.

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *