కొక్కొరో.. క్కో..

కొక్కొరో.. క్కో..

పొత్తుల పీకులాట…!

కొంగరకలాన్‌ సభ తర్వాత ఖంగుతిన్న కేసీఆర్‌ ఏం చేయాలని ఇంట్లో మంతనాలు జరుపుతుంటే చంద్రబాబు రూపంలో ‘దశమ గ్రహ ప్రచారం’ చేయడానికి కాంగ్రెసు వారే పాతకాపును పళ్లెంలో పెట్టి ప్రగతి భవన్‌కు పంపారు. దాంతో కాంగ్రెసు మెల్లమెల్లగా పైచేయి అవుతుందని గమనించిన కేసీఆర్‌కు కాంగ్రెసును మెత్తని బట్టలో వేసి చంద్రబాబుపై బాదడం సులువు అయ్యింది. కాంగ్రెసు వారు ఎప్పుడూ ఇంతే. శత్రుపక్షాలకు ఆయుధాలు నూరి ఇవ్వడమంటే వారికి మహా సరదా! కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అనడం కన్నా కేసీఆర్‌ అహంభావం, తెంపరితనం, కేసీఆర్‌ కుటుంబం, మాటకారితనంపై యుద్ధం చేయాలనుకున్న ఉత్తర కుమార బృందానికి చంద్రబాబు రూపంలో మహా గొప్పనాయకుడు దొరికాడు.

ఈ లోపు మోదీని ఫిబ్రవరి నుండి తెలుగు పచ్చళ్ల సహాయంతో రోట్లో వేసి దంచేస్తున్న పచ్చ పార్టీకి అపరిపక్వ రాహుల్‌గాంధీ ఆరాధకుడయ్యాడు. 10 మంది లీడర్లు తప్ప కేడర్‌ లేని తెదేపాను ఉత్తమకుమారుడు భుజాలపై మోయలేక గింజుకుంటున్నాడు. 2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న భాజపాకు ఓట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయ కుండా తప్పుకొన్న బాబు పార్టీ ఈ సారి ముగ్గులోకి కాంగ్రెస్‌ను లాగింది. భాజపా వాళ్లు నిజాయితీకి, హద్దులు మారిన క్రమ శిక్షణకు మారుపేరు కాబట్టి సిటీలో తెదేపాను గెలిపిం చారు. కానీ గెలిచిన వారు వాళ్లంతట వాళ్లు టోకుగా టీఆర్‌ఎస్‌కు వెళ్లారా! బాబుగారు ఆనాటి అవసరాలకు పంపించారా తెలియదు? ఎందుకంటే గత ఏడాది రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపే కదా ఇప్పుడు బాబు రాజకీయం చేస్తున్నది!? మొత్తానికి తెదేపా-కాంగ్రెస్‌ పొత్తు ఇక్కడి కాంగ్రెసుకు లోపల ఖేదం కాగా, రాహుల్‌గాంధీకి మోదంగానే ఉంది. ఎందుకంటే చిన్నా చితక పార్టీలను కలిపే ఏజంట్‌గా బాబు దొరికాడని ముక్కు పచ్చలారని చిన్నిబాలుని సంతోషం.

ఇక గొప్ప గొప్ప వీరయోధులు పనిచేసిన సీపీఐ పార్టీకి ఎంత దుస్థితి వచ్చిందని ఎర్రజెండాలు ఎక్కిఎక్కి ఏడుస్తున్నాయి. తెలుగునాట కమ్యూనిస్టులు ఓడిపోయినా వారికి గౌరవం ఉండేది. ఇప్పుడు కాంగ్రెసు వారి ఇంటిముందు కూర్చొని 5,4,3.. అంటూంటే కక్కలేక మ్రింగలేక కస్సుమంటున్నారు కామ్రేడ్లు. ఇప్పుడేదో కేసీఆర్‌ను ఓడించడానికి ఒక్క ఓటు పోనివ్వద్దని జరుగుతున్న హాస్య డ్రామాలో కాంగ్రెస్‌ కొడవళ్లను, గొడ్డళ్లను వెంబడి పెట్టుకొన్నది గానీ.. లేకపోతేనా?

మరో తెలంగాణ బంగారు ముద్ద ఆచార్య కోదండరాం అనే అపర చాణక్యుడు మాకు కావాలని కాంగ్రెస్‌ చంకనెత్తుకున్నదా? కేసీఆర్‌ను అంతా నాయకులే తిడితే బాగుండదు కాబట్టి ఓ మెత్తని పులిని వెతుకుతుంటే ఈ ఆచార్యుడు తగిలాడు. ఆయన సీటుకే దిక్కులేదని కాంగ్రెసువారు అంటున్నా కోదండరాం అమాయకుడిలా ఫోజులిచ్చాడు తప్ప ఏమీ అనలేని దుస్థితి.

అవతల టీఆర్‌ఎస్‌ ఓ వైపు స్వీట్లు పంచుతూంటే ఇక్కడ సీట్ల పంచాయతీ తెగడం లేదు.

అపర బిస్మార్క్‌

దేశంలోని తల పండిన రాజకీయవేత్తలు అంతా చచ్చి చెడి అతుకుల బొంతగా తయారుచేసిన రాజకీయ రంగాన్ని మరోసారి కుట్టి రంగులద్దడానికి చంద్రబాబు రూపంలో మరో అపర బిస్మార్క్‌ బయలుదేరాడు. మోదీతో విరోధం మొదలైన నాటి నుండి ఎలాగైనా బీజేపీని ఓడించాలని పసుపు కొమ్ము కంకణం కట్టుకున్న చంద్రబాబు క్షణం తీరిక లేకుండా కలకత్తా నుంచి కనిమొళి వరకు ఎక్కని గడప లేదు, తొక్కని వాకిలి లేదు. గతంలో కమ్యూనిస్టు పార్టీలకు ఎప్పుడూ ఓ లక్ష్యం ఉండేది. ఎవరు గద్దెపైనున్నా వాళ్లను దింపితే గాని వారి కంటిలో కునుకు వచ్చేది కాదు. చాలాసార్లు వాళ్లతో పొత్తు చేసి చేసి వాళ్ల అడుసు తొక్కిన చంద్రబాబు సరిగ్గా ఇప్పుడు అదే లక్ష్యంతో పని చేస్తున్నాడు. ఎన్నడూ అధికారంలోకి రాని ఎర్రన్నలకంటే అది సరిపోయింది కానీ పసుపు కొమ్ము పార్టీకి అది అశుభం. ఈ రహస్యం తెలియని నిప్పు నాయుడు కాలికి బలపం కట్టుకొని తీరిగ్గా కూర్చుని తమ తమ రాష్ట్రాల్లో ఎలా అధికారానికి రావాలా అని ఆలోచిస్తూ ద్రావిడ ప్రాణాయామం చేస్తున్న పార్టీలకు మోదీ, అమిత్‌ షా వ్యతిరేక రసాయనాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయం అంతా అయిపోయి మూల కూర్చున్న ములాయం, దిక్కూ దివాణం లేకుండా కొడుకు అర్ధనగ్న రాజకీయాన్ని ఆలకించి మురిసిపోతున్న దేవెగౌడ, దేశద్రోహానికి, స్వార్థబుద్ధికి మారుపేరైన ఫరూక్‌ అబ్దుల్లా, మంచి చెడ్డ లేని మమత, పార్టీ స్టాండ్‌లో ఇంకా సరిగ్గా కూర్చోని స్టాలిన్‌.. వీళ్లంతా ఈ మహా కూటమిని మోసే బోయీలు. ఎందుకు నవ్వుతున్నాడో, ఎందుకు ఏడుస్తున్నాడో, ఎందుకు కళ్లు మూసుకున్నాడో, ఎందుకు కన్ను కొడుతున్నాడో తెలియని రాహుల్‌ మహాచక్రవర్తి ఈ సామ్రాజ్యానికి కాబోయే ఏలిక.

మోదీ మీద ద్వేషంతో పుట్టిన ఈ కొత్త వంట ఎక్కడ వికటిస్తుందోనని పచ్చ భాగాలు పరేషాన్‌లో ఉన్నా బయటకు చెప్పలేక లోపలికి మింగలేక లోలోన కుంగిపోతూ అక్షర సమరం చేస్తున్నాయి. ఇప్పుడే ప్రపంచాన్ని కలిపే మహనీయుడు భూమిపైకి అవతరించాడని, దేశాన్ని కాపాడేందుకు మరోసారి జన్మించిన మహా అవతారమని గొప్ప ప్రచారం చేస్తున్నారు. దేశాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరిన ఈ నిప్పు కణాన్ని చూసి దేశమంటే భారతదేశమా! తెలుగుదేశమా?! అని కొందరు సందేహపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం.. కాపాడుతాం.. అంటే ముందు అక్రమంగా చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను వెనక్కి పంపి ‘డెమోక్రసీ’ అన్న పదాన్ని ఉచ్ఛరించాలని ఆంధ్ర ప్రజలు అడిగితే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. దేశాన్ని ఉద్ధరిస్తానని అపర బిస్మార్క్‌లా బయలుదేరిన ఈ పసుపుపచ్చ నాయకునికి ప్రజాక్షేత్రంలో కొమ్ములు విరిస్తే గాని గుణపాఠం కలుగదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అని ఓ దిక్కు మాలిన సిద్ధాంతాన్ని కనుగొన్న ఆధునిక అవకాశవాదులకు ఈ వ్యవస్థలో ఉన్న లొసుగులు, ప్రజల రాజకీయ అపరిపక్వత కలిసివస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. ఇదంతా అవకాశవాద రాజకీయాలకు దారి తీసి ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే ముసుగు ధరించిన వీరులకు బాగా తోడ్పడుతుంది. దానిలో భాగంగానే పచ్చ మీడియా పరవశించిపోయి చంద్రబాబును అపర బిస్మార్క్‌లా చూపిస్తూ తెలుగు ప్రజల్ని కళ్లున్న ధృతరాష్ట్రుల్లా మార్చేస్తున్నది. తస్మాత్‌ జాగ్రత్త !

– డా|| పి.భాస్కరయోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *