నిబద్ధతకు నిలువుటద్దం..

నిబద్ధతకు నిలువుటద్దం..

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి

సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం కేంద్ర మంత్రి స్థాయికి చేరుకుంది. నాలుగు దశాబ్దాల నమ్మిన సిద్ధాంతం.. నూతన అధ్యాయం దిశగా పయనించేందుకు దోహద పడింది. దేశ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించి పెట్టింది. గంగాపురం కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి కార్యకర్తలకు ఆక్సిజన్‌లా మారింది. మొత్తానికి భారతీయ జనతాపార్టీ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది.

ఎమ్మెల్యే పదవి తృటిలో చేజారి పోయినా ఎంపీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ఆ వెంటనే కేంద్ర సహాయమంత్రిగా అరుదైన అవకాశం లభించింది. పార్టీని, కార్యకర్తలను, ప్రజలను నమ్ముకున్న నాయకుడికి ఓటమే గెలుపుకు పునాది అవుతుందని నిరూపితమయ్యింది. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో తెలుగు వాడికి దక్కిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి.. మరోసారి నరేంద్రమోదీ హయాంలో ఇప్పుడు కిషన్‌రెడ్డిని వరించింది.

కిషన్‌రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో 1964, మే 15న స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. టూల్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వైష్ణవి, తన్మయ్‌.

రాజకీయ ప్రస్థానం

1977లో జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో యువనాయకుడిగా ప్రవేశించారు కిషన్‌రెడ్డి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో బీజేపీలో చేరి అప్పటి నుంచి పార్టీకి తన సేవలు అందిస్తున్నారు.

కిషన్‌రెడ్డి 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్‌ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. 1984లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1985 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 1992లో జాతీయ కమిటీ ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నారు. సుదీర్ఘకాలం జనతా యువమోర్చాలో తనదైన శైలిలో బాధ్యతలు నెరవేర్చిన కిషన్‌రెడ్డి 2010, మార్చి 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టి పార్టీకి సేవలందించారు.

పోరుయాత్ర

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న ‘పోరుయాత్ర’ ప్రారంభించారు. 22 రోజులపాటు కొనసాగిన ఈ యాత్ర కిషన్‌రెడ్డిని ప్రజలకు మరింత దగ్గర చేసింది.

నిరంతరం ప్రజాసేవలో..

పార్టీ అనుబంధ యువమోర్చాలో ఎక్కువకాలం పనిచేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పదవులు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్‌ నగర్‌ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికలలో అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనాయకుడిగా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికలలో మరోసారి అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుండి 62వేల 598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. 2018 డిసెంబర్‌ 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి 1016 ఓట్ల స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానం నుంచి 62వేల 144 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది అధికార పార్టీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని అధిష్టించారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఏకైక మంత్రిగా కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనా జాతీయ స్థాయి నాయకుడిగా కిషన్‌రెడ్డికి దాదాపు రెండు దశాబ్దాలు పనిచేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో తెలుగు రాష్ట్రాల తరపున గళం వినిపించే అవకాశం కూడా లభించింది. కిషన్‌రెడ్డికి మంత్రిపదవి దక్కడంతో ఒక్క హైదరాబాద్‌కే కాదు.. తెలంగాణ మొత్తానికి ప్రాతినిథ్యం లభించినట్లయ్యింది.

నిజానికి, 2014 ఎన్నికల సమయంలోనే కిషన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయమని పార్టీలో చర్చ జరిగింది. కానీ.. అప్పుడు అసెంబ్లీకే పోటీచేసిన కిషన్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో హస్తిన మెట్లెక్కారు.

భాజపాయే ప్రత్యామ్నాయం

ఆరు నెలలక్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేసినా గోషామహల్‌లో మాత్రమే విజయం సాధించింది. కానీ.. ఇప్పుడు ఐదు నెలల్లోనే అనూహ్య రీతిలో పుంజుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా సంకేతాలను వెలువరించింది. ఈ క్రమంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి బాధ్యతలు భుజానికెత్తినట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎంపీలుగా బండి సంజయ్‌ కుమార్‌-కరీంనగర్‌, ధర్మపురి అర్వింద్‌-నిజామాబాద్‌, కిషన్‌రెడ్డి- సికింద్రాబాద్‌, సోయం బాపూరావు-ఆదిలాబాద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లే. అయితే భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించటం కిషన్‌రెడ్డికి కలిసి వచ్చిన అంశాలు. అంతేకాకుండా.. ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం సరైన నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన బాధ్యతలను కూడా ఆయనకు కేంద్ర నాయకత్వం అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పనిచేసే అవకాశాలున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తాను మంత్రిని అయ్యానని.. ఇది గర్వకారణ మన్నారు. కేంద్ర మంత్రిగా తనపై ఉంచిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చిన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదేళ్లూ దేశాభివృద్ధి కోసం మోదీ నేతృత్వంలో సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌.. నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఐదో వ్యక్తి!

కేంద్ర హోంశాఖలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఐదో తెలుగు వ్యక్తి కిషన్‌రెడ్డి. గతంలో ఈ బాధ్యతలను కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, పెండేకంటి వెంకట సుబ్బయ్య, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు నిర్వర్తిం చారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో 1974 అక్టోబరు నుంచి 1977 మార్చి 24 వరకు కేబినెట్‌ మంత్రి హోదాలో కాసు బ్రహ్మానందరెడ్డి పనిచేశారు. కేంద్రంలో ప్రతిష్టాత్మక పోర్టుఫోలియోగా చెప్పుకొనే హోంశాఖ బాధ్యతలు చేపట్టిన తొలివ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి చరిత్రపుటలకెక్కారు. తర్వాత పీవీ నరసింహారావు రెండుసార్లు హోంశాఖ కేబినెట్‌ మంత్రిగా సేవలందించారు. రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో 1984 జులై 19 నుంచి డిసెంబరు 31 వరకు ఒక విడత, 1986 మార్చి 12 నుంచి మే 12 వరకు రెండో విడత హోంశాఖ బాధ్యతలను పీవీ నిర్వర్తించారు. 1985లో రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలోనే కర్నూలు జిల్లాకు చెందిన పెండే కంటి వెంకట సుబ్బయ్య హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్‌పేయి మంత్రివర్గంలో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు ఆ అవకాశం సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి లభించింది.

– సుజాత గోపగోని, 6302164068

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *