ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోందా? ఫ్రంట్‌ గురించి తాను ప్రతిపాదిస్తే.. ఎదుటివాళ్లు తనకే ఉచిత సలహాలు ఇస్తున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయత్నం వృథా ప్రయాసే అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గతంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంతి నవీన్‌ పట్నాయక్‌, ఎస్‌పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తోనూ ఆయన సమావేశం అయ్యారు. అయితే ఆ పర్యటనల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వెల్లడిస్తూ.. మీడియా ముందు మాట్లాడిన కేసీఆర్‌.. తన తాజా దక్షిణాది పర్యటనల నేపథ్యంలో చర్చల సారాంశాన్ని బహి రంగంగా చెప్పకపోవడం దేనికి సంకేతం? ఈ సమావేశాల తర్వాత బయటకు వస్తున్న లీకులు దేనికి నిదర్శనం? ప్రస్తుతం అంతటా ఇదే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ భవితవ్యంపై సందిగ్ధాన్ని లేవనెత్తుతోంది.

కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి చెన్నై వెళ్లారు. ఆళ్వార్‌పేటలోని డీఎంకే అధినేత నివాసానికి వెళ్లి అక్కడ స్టాలిన్‌ను కలిశారు. సుమారు గంటన్నర పాటు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను తనదైన శైలిలో వివరించారు. దక్షిణాది ఎంపీలంతా కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని ప్రతిపాదించారు. కేబినెట్‌ పదవులతోనే సరిపెట్టుకోవద్దని, మరింత ఉన్నత పదవిని సాధించాలని, విధాన నిర్ణయాల్లోనూ మన మాట చెల్లుబాటు కావాలని చెప్పుకొచ్చారు. గవర్నర్ల నియామకంలోనూ ప్రాంతీయ పార్టీల పాత్ర ఉండాలని వివరించారు. కేబినెట్‌ మంత్రులకన్నా మరింత ఉన్నత పదవి దక్కేలా ప్రయత్నించాలన్న కేసీఆర్‌ అంతర్గతంగా ఉపప్రధాని ఆకాంక్షపై సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ‘ఉపప్రధాని’ పదవిపై గులాబీ అధినేత కన్నేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొత్త ప్రతిపాదన

అయితే, యూపీఏకు మొదటినుంచీ మద్దతు ఇస్తున్న డీఎంకే నేత స్టాలిన్‌.. ఇప్పటికే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటూ రెండుసార్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో.. ఇప్పుడు కేసీఆర్‌ చేసిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్‌ ఫ్రంట్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. ఫ్రంట్‌ తరపున కాంగ్రెస్‌ నేతత్వంలోని యూపీఏకు మద్దతు తెలపాలని కొత్త ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. స్టాలిన్‌ చేసిన ఈ ప్రతిపాదనను కేసీఆర్‌ ఖండించ లేదని, అంటే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునేలా.. తన అభిప్రాయాన్ని రిజర్వ్‌ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇరువురి సమావేశం తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది.

ట్వీట్‌ ట్రూత్‌ ?

స్టాలిన్‌తో భేటీ తర్వాత తెలంగాణ ఎంపీలతో కలిసి కేసీఆర్‌ కారెక్కి వెళ్లిపోయారు. డీఎంకే మాజీ ఎంపీ టీఆర్‌ బాలు, కోశాధికారి దురై మురుగన్‌ సైతం సమావేశ వివరాలను విలేకరుల ఎదుట వెల్లడించకుండా మౌనం పాటించారు. అనంతరం, కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌ కలుసుకున్నా రని డీఎంకే అధిష్టానం క్లుప్తంగా ఓ ప్రకటన జారీ చేసింది. కానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై మాత్రం సమావేశ సారాంశాన్ని ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్‌ నేతత్వంలోని సంకీర్ణానికి మద్దతు తెలిపేలా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్టాలిన్‌ ఒప్పించారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ప్రాంతీయ నాయకులే హీరోలు అంటూ ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. మరోవైపు.. యూపీఏలో చేరాలన్న స్టాలిన్‌ ప్రతిపాదనను కేసీఆర్‌ తోసిపుచ్చలేదని జాతీయ మీడియా పేర్కొంది.

ఫలించని ప్రయత్నం !

అయితే, అటు డీఎంకే వర్గాలు, ఇటు టీఆర్‌ఎస్‌ వర్గాలను ఉటంకిస్తూ స్టాలిన్‌-కేసీఆర్‌ భేటీపై జాతీయ పత్రికలు, చానళ్లు, వెబ్‌సైట్లలో రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌, డీఎంకే మధ్య బలమైన బంధం కారణంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయని విశ్లేషణలు సాగాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరబోమని, కాంగ్రెసతో తమ బంధం చాలా పటిష్టమైనదని డీఎంకే స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. బీజేపీతో పోరాడడానికి కాంగ్రెస్‌ కూటమితో చేతులు కలిపే విషయాన్ని పరిశీలించా లని డీఎంకేనే కేసీఆర్‌ను కోరిందన్న చర్చ సాగింది. కేసీఆర్‌ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్‌ స్పష్టం చేశారని, ఆయననే కాంగ్రెస్‌ కూటమిలోకి ఆహ్వానించారని జాతీయ మీడియా పేర్కొంది. స్టాలిన్‌ను ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలన్న కేసీఆర్‌కు నిరాశే మిగిలిందని, ఆయన ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్క రించారని తెలిపింది. జాతీయ పార్టీల సహకారంతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఇందుకు వామపక్షాలు కూడా మద్దతు పలుకుతాయని కేసీఆర్‌ ప్రతిపాదించారని, అయితే, యూపీఏకే పరిస్థితి సానుకూలంగా ఉందని డీఎంకే నేతలు తెలిపారని ఇరుపార్టీల నేతలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.

భేటీ వెనక రహస్యం ?!

తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్‌ స్టాలిన్‌కు చాలా సంకేతాలు ఇచ్చినా ఫలితం దక్కకపోవ డంతో.. గులాబీ బాస్‌ చిన్నబుచ్చుకున్నట్లు చెబుతున్నారు. స్టాలిన్‌ తిరస్కరణతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. కొద్ది రోజుల కిందట కేసీఆర్‌తో భేటీకి నిరాకరించిన స్టాలిన్‌ ఇప్పుడు ఎందుకు కలిశారు ? కాంగ్రెస్‌తోనే కలిసి సాగాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా ఈ భేటీకి ఎందుకు అంగీకరించారు? అన్న ప్రశ్నలు జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తాయి. కేసీఆర్‌ మనసులో ఏముందో తెలుసుకునే ఉద్దేశంతో కాంగ్రెస్‌ సలహాతోనే స్టాలిన్‌ ఈ భేటీకి అంగీకరించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే.. స్టాలిన్‌ను కలిసిన మరుసటిరోజే కేసీఆర్‌కు షాక్‌ తగిలింది. దేశంలో మూడోఫ్రంట్‌కు అవకాశమే లేదని స్టాలిన్‌ ప్రకటన చేశారు. దీంతో.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ వథా అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కేసీఆర్‌ ప్రస్తుతం తనకు బద్ధ విరోధిగా భావిస్తున్న చంద్రబాబును.. డీఎంకే నేత దొరై మురుగన్‌ కలిశారు. అమరావతి వచ్చిన మురుగన్‌ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా ఆసక్తిని లేవనెత్తింది. నిజానికి మూడో కూటమిపై స్టాలిన్‌కు మొదటి నుంచీ ఆసక్తి లేదు. ఇందుకు కారణం గతంలో థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయోగం రెండుసార్లు విఫలం కావడమే అన్నది ఆయన అభిప్రాయం.

రాయభారం విఫలం

మొత్తానికి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ చెన్నై రాయభారం విఫలమైంది. ఫ్రంట్‌ కోసమే, ఫ్రంట్‌ గురించే స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్లిన కేసీఆర్‌.. సక్సెస్‌ కాలేకపోయారు. పైగా.. అసలు కేసీఆర్‌ మనసులో ఏముందో, ఆయన వైఖరి ఏంటో, అవసరమైతే భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిసి వస్తారో లేదో అన్న అంశాలను గ్రహించేందుకు డీఎంకే నేతలు ప్రయత్నించారు. తమ ప్రతిపాదనలను కేసీఆర్‌ ముందు ఉంచారు. మరుసటిరోజే మూడోఫ్రంట్‌కు అవకాశమే లేదని బహిరంగ ప్రకటన చేశారు.

– సుజాత గోపగోని, 6302164068

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *