జనజాగృతి

జనజాగృతి

కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం. ఇంటర్‌బోర్డు తీరుకు నిరసనగా ధర్నాలు చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులను అత్యంత కిరాతకంగా పోలీసులు ఠాణాలకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేయడం సరికాదు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. వెంటనే ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాలి.

– హరి, హైదరాబాద్‌

భానుడి భగభగలు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద మజ్జిగ, మంచినీరు అందుబాటులో ఉంచి, వీలైతే విశ్రాంతి తీసుకునేందుకు కాస్త స్థలం కూడా కేటాయించాలి.

– రాణి, జగిత్యాల

గవర్నర్‌ నిర్ణయం అభినందనీయం!

అనుభవాలను, అర్హతలను ఏమాత్రం లెక్కచేయకుండా కొంతమంది ముఖ్యమంత్రులు తమకు నచ్చిన వారినే దేవాలయాల ట్రస్టీలుగా, ప్రభుత్వరంగ సంస్థల అధ్యక్షులుగా, సమాచార హక్కు కమిషన్‌ సభ్యులుగా, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా, సభ్యులుగా నియమిస్తున్నారు. ఈ క్రమంలో అనర్హులు ఎంతోమంది ముఖ్యమంత్రుల ప్రసన్నతను పొందుతున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంతి సిఫారసు చేసిన వారిని సమచార హక్కు కమిషన్‌ సభ్యత్వానికి అర్హతలు లేనివారిగా గుర్తించి ఆ ప్రతిపాదనను తిరస్కరించడం అభినందనీయం. ఇలాగే ప్రతి విషయంలో గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆక్షాంక్షిద్దాం!

– డా|| టి.హెచ్‌. చౌదరి, సికింద్రాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *