సత్సంప్రదాయాలూ – సవాళ్లు

సత్సంప్రదాయాలూ – సవాళ్లు

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. అసాధారణ విజయం సాధించిన వైకాపా నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మొదటి సంతకం వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం (వృద్ధాప్య పెన్షన్‌) ఫైలుపై చేశారు. తాను మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వృద్ధాప్య పెన్షన్‌ను 2 వేల నుండి 2,250కి పెంచారు. ప్రతి సంవత్సరం రూ.250 చొప్పున పెంచుతామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 3 వేలు తప్పకుండా అవుతుందని స్పష్టం చేశారు. ఎటువంటి అరమరికలు, దాపరికాలు లేకుండా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. మంచి సంప్రదాయానికి బాటలు వేశారు.

అదేవిధంగా నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాలతోనూ, కేంద్రంతోనూ సత్సంబంధాలు పునరుద్ధరించే ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది మరో సత్సంప్రదాయం. రాష్ట్రం 2014లో విభజనకు గురై, వేల కోట్ల ఆదాయాన్నిచ్చే హైదరాబాద్‌ వంటి రాజధానిని పోగొట్టుకుంది. పైగా ఇంతకుముందు రాష్ట్రంలో కొలువుతీరిన ప్రభుత్వం పొరుగు రాష్ట్రం తెలంగాణ పట్ల, కేంద్రం పట్ల ఘర్షణ వైఖరి అవలంబించింది. దాంతో విభజనకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా సమస్యలుగానే మిగిలిపోయాయి. వాటిలో నదీ జలాలు, హైదరాబాద్‌లోని పాలక భవనాలు ముఖ్యమైనవి.

నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ప్రమాణస్వీకార కార్యక్రమంతోనే ఇరుగు పొరుగుతో సత్సంబంధాలకు పెద్దపీట వేశారు. ప్రమాణస్వీకా రోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌నూ ఆహ్వానించారు. ప్రధాని మోదీని, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను కూడా ఆహ్వానించారు. అంతకుముందు జగన్‌ కేసీఆర్‌ను, మోదీని వ్యక్తిగతంగా కలిశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్‌ కేసీఆర్‌తో కలిసి విభజన సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం ప్రారంభించారు. అందులో భాగంగానే తెలంగాణలో నిరుపయోగంగా పడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే పనిని విజయవంతంగా పూర్తిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం 2016లో రాష్ట్ర పరిపాలనను హైదరాబాద్‌ నుండి అమరావతికి తరలించింది. ఉద్యోగులందరూ అమరావతికి తరలి వచ్చారు. అప్పటినుండి ఈ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న ఆ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. అక్కడి ఉద్యోగులకు తగిన భవనాలు లేక కొరతగా ఉండటం దీనికొక కారణం. ఆ భవనాలు తమకు అప్పగిస్తే తమ మంత్రులకూ, ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుందని, భవనాల కొరత తీరుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో చెపుతోంది. ప్రస్తుతం ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా జగన్‌ రావడం, ఆయన తెలం గాణ రాష్ట్రంతో సత్సంబం ధాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో భవనాల అప్పగింత వినతి మళ్లీ తెర పైకి వచ్చింది. తాజాగా తెలంగాణ మంత్రిమండలి చేసిన వినతి మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్‌ సమక్షంలో కలిసి చర్చించారు. భవనాల అప్పగింతకు అనుమ తించారు. దానిమేరకు హైదరాబాద్‌లోని ఏపీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకి అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఎనిమిదో సెక్షన్‌లో తనకు నిర్దేశించిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కూ కొన్ని భవనాలను కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ పోలీస్‌ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు గవర్నర్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ భవనాలపై గత మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ పన్నులు పేరుకుపోయాయి. వాటన్నిటిని రద్దు చేయాలని గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

భవనాల అప్పగింత పట్ల తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఉత్తర్వులను స్వాగతించారు. తెలుగు ప్రజలమైన మన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్నేహ సహకారాలతో ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మన ప్రజల ప్రయోజనాలే మన పరమావధి అని, అందుకు ముందడుగు పడటం శుభపరిణామం అనీ అన్నారు.

ఈ విషయంపై స్పందిస్తూ భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సైతం హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. తాను గత ఐదేళ్లుగా ఇదే కోరానని, కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదని విచారం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో విభజన సమస్యలున్నాయని, వాటన్నింటిని రెండు రాష్ట్రాల పాలకులు కలిసి చర్చించుకుని, పరిష్కరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిక్కుల్లో ఆర్థికస్థితి

2014లో విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలువునా ఆదాయాన్ని కోల్పోయింది. పైగా గత ఐదేళ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉన్న నిధులను మంచినీళ్లలా ఖర్చు చేసింది. ఆదాయం తెచ్చిపెట్టే ఒక్క అభివృద్ధి పథకం చేపట్టలేదు. పైగా లక్షల కోట్లు అప్పుల భారం మోపింది. దాంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదపుటంచులకు చేరింది. ఈ విషయంలో నూతన ప్రభుత్వానికి చిక్కులు తప్పేట్లు లేవు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు జగన్‌ ఎన్నికలలో ప్రకటించిన నవరత్నాలూ అమలు చేయాలి. వీటన్నింటికీ నిధులు వేల కోట్లలో కావాలి. దీనికితోడు ప్రతి నెలా ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలి. పైగా ఉద్యోగులంతా తమ జీతభత్యాల పెరుగుదలపై నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికితోడు రాజధాని నిర్మాణంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు జరగాల్సిన చెల్లింపులు అనేకం ఉన్నాయి. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్‌ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే మరెన్నో నిధులు కావల్సి ఉంది. రాష్ట్రంలో అంతకుముందటి టీడీపీ ప్రభుత్వం చేసిన రెండు లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుతం వడ్డీలు కట్టాల్సి ఉంది. ఎన్నికల ఖర్చుల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రిజర్వుబ్యాంకు వద్ద 8 వేల కోట్ల రూపాయల ఓవర్‌డ్రాఫ్ట్‌ పొందింది. దాంతో ప్రస్తుతానికి ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం కూడా రాష్ట్రానికి లభించేట్లు కనబడటం లేదు. ప్రస్తుతం ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సమస్యలు అన్నిటికి ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ త్వరలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సిన అవసరం నూతన ప్రభుత్వానికి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నూతన ముఖ్యమంత్రి జగన్‌ ఆర్ధిక శాఖ సమీక్ష చేస్తూ నూతన ఆదాయ వనరులను వెతకవలసిందిగా, ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించవలసిందిగా అధికారులకు సూచించాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం ప్రతి విషయంలోనూ లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ, రాష్ట్రం తమ హయాంలో విపరీతమైన అభివృద్ధి చెందుతోందని పదేపదే అబద్ధాలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. స్వలాభం చేకూర్చే రాజకీయ ప్రచార ప్రకటనలూ, రాజధాని నిర్మాణం పేరుతో నిరుపయోగమైన విదేశాల పర్యటనలు వంటి వాటితో దుబారా ఖర్చులు చేసింది. పైగా ఎన్నికలకు ముందు తమ పార్టీకి లాభం చేకూర్చే ధర్మపోరాట దీక్షలకు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి ఖజానాకు పాతరేసింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా అత్యంత బీదస్థితిలో ఉందన్నమాట ఎంతో వాస్తవం. దీనిని పరిష్కరించడం నూతన ముఖ్యమంత్రికి మహాసవాలే అవుతుంది.

మరోపక్క మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాబోయే రెండున్నర నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్‌ పేరుతో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రక టించారు. వారికి ఒక్కొక్కరికి నెలకు 5 వేలు జీతంగా ఇస్తామనీ చెప్పారు. ఇటుపక్క రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు 3 వేలుగా ఉన్న జీతాన్ని 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో ఖర్చులను పెంచేవే. వీటన్నింటికీ కావలసిన నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి కత్తిమీద సామే.

ఎన్నికల హామీలైన నవరత్నాలలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి మే నెలలో రైతుకు పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కొత్త పంటలు వేయబోయే కాలం కాబట్టి ఆ హామీ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తుంటారు. రైతుల తరపున పంట బీమా ప్రీమియం చెల్లింపు కూడా చేయాల్సి ఉంది. అలాగే బడికి వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు చెల్లిస్తామనే హామీ పట్ల రాష్ట్రవ్యాప్తంగా పిల్లల తల్లులు ఎదురు చూస్తుంటారు. పెంచిన పింఛన్లు, ఇతర నవరత్నాల అమలు కోసం వేల కోట్ల నిధులు అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇంతటి దుస్థితిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదాయాన్నిచ్చే మద్యం బెల్టు షాపుల మూసివేతకు ఆదేశాలివ్వడం, విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామనే ప్రకటనను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా చేయడం హర్షదాయకం. ఆ కార్యక్రమంలోనే రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా చేస్తానని గట్టిగానే చెప్పారు. అవినీతి జరిగిన కాంట్రాక్టులను రద్దు చేస్తామనీ, టెండర్లలో ఎక్కువమందికి అవకాశ మిస్తామని చెప్పడం కొంత సాహసమే.

యువనేత నేతృత్వంలోని నూతన ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక దుస్థితిలో ప్రజల ఆశలను, ఆశయాలనూ నెరవేర్చుతూ, సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించటం నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌. ఈ సవాల్‌ను ఆయన ఎలా ఎదుర్కొంటా రనేది వేచి చూడాల్సిన అంశమే.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *