‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

బీజేపీ నేత లక్ష్మణ్‌ దీక్ష భగ్నం

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవలపై భాజపా సమరశంఖం పూరించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందించడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించకపోవడంపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర జేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఏప్రిల్‌ 29వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేపట్టాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, దీక్ష చేపట్టిన కొద్దిసేపటికే పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. ఆయనను తొలుత గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసు కోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భాజపా మహిళా కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అలాగే, మరో 50 నుంచి 60 మంది నేతలు, కార్యకర్తల్ని సైతం పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి లక్ష్మణ్‌ను నిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అరెస్టులు చేసినా ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం జరిగే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ తెలిపారు.

ఇంటర్మీడియట్‌ బోర్డు ఫెయిల్‌!

సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థుల్లో కొందరు పాసవుతారు, మరికొందరు ఫెయిలవు తారు. పాసైన వాళ్లల్లో కొందరు టాపర్లుగా నిలుస్తారు. ఈ వ్యవహారమంతా సంబంధిత బోర్డు చూసుకుంటుంది. విద్యార్థులకు ఎక్కడా అన్యాయం జరగకుండా, నిష్పక్షపాతంగా, అత్యంత అప్ర మత్తంగా సాగుతుందీ తంతు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించే ఇంటర్‌బోర్డే ఫెయిలయ్యింది. సక్రమంగా పరీక్షలు రాసిన విద్యార్థులను పాస్‌ చేయాల్సిన బోర్డు ఊబిలో కూరుకుపోయింది. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు అపఖ్యాతిని మూట గట్టుకుంది. లక్షల మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేసింది. వేలాదిమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులను బాధపెట్టింది. పైగా మొదట్లో పొరపాట్లను అపోహలంటూ కొట్టిపారేసింది. కనీసం సమస్య చెప్పుకునేందుకు వచ్చినవాళ్ల మాటలు కూడా వినే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సమాధానం చెప్పకుండా పోలీసులను ఉసిగొల్పింది. బోర్డు పరిసరాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది.

3 లక్షల మంది ఫెయిల్‌

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 70వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వారిలో మూడు లక్షల 24వేల మంది ఫెయిలయినట్లు ఆన్‌లైన్‌ రికార్డులు చూపించాయి. ఇది సాంకేతిక తప్పిదమా? మానవ తప్పిదమా? అన్నది ఇంకా తేల్చలేదు. ఇంటర్‌బోర్డు వ్యవహారశైలితో చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటామని ఎంతో భరోసాగా ఉన్న విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్ర షాక్‌కు గురయ్యారు. వాళ్ల తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా అంతటా ఆవేదన అలుముకుంది. కన్నీళ్లు ప్రవాహంలా కారిపోయాయి. అధికారుల తీరు, పోలీసుల శైలి వాళ్లల్లో మరింత ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.

ఇవేం ఫలితాలు?

ఫస్టియర్‌లో మండల టాపర్‌గా నిలిచిన అమ్మాయికి సెకండియర్‌లో సున్నా మార్కులు కనిపించాయి. మరుసటిరోజు సాయంత్రానికే సున్నా మార్కులు 99 మార్కులుగా మారిపోయాయి. ఓ విద్యార్థిని సిద్ధిపేటలో తన హాల్‌టికెట్‌ ఎంటర్‌ చేస్తే ఫెయిల్‌ మెమో కనిపించింది. అదే హాల్‌టికెట్‌ నెంబర్‌ను హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే పాస్‌ మెమో కనిపించింది. ఓ విద్యార్థి మొదటిసారి చెక్‌చేస్తే ఫెయిల్‌మెమో దర్శనమిచ్చింది. రెండోసారి ఆన్‌లైన్‌లో చూసుకుంటే పాస్‌ మెమో కనిపించింది. మూడోసారి తిరిగి పరిశీలిస్తే ఫెయిల్‌మెమో వచ్చింది. ఇంకో విద్యార్థికి 17 మార్కులొస్తేనే పాస్‌ అయినట్లు చూపించింది. ఇవి ఈసారి ఇంటర్‌బోర్డు తప్పిదాల్లో కొన్ని మాత్రమే.

వారి ప్రాణాలు తిరిగొస్తాయా?

టాపర్లుగా నిలుస్తామనుకున్న వాళ్లు, కచ్చితంగా పాసై తీరతామన్న ధీమాతో ఉన్నవాళ్లు తీరా ఫెయిలయినట్లు చూపించడంతో తట్టుకోలేక పోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏప్రిల్‌ 27వ తేదీనాటికి 19మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఫలితాల గందరగోళంలో అసలు ఎవరు పాసయ్యారో, ఎవరు ఫెయిలయ్యారో కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. మరోవైపు తమ పిల్లలు ఎక్కడ అఘాయిత్యాలకు పాల్పడతారోనని రాత్రీ పగలూ క్షణక్షణం కనిపెట్టుకొని చూసుకుంటున్నారు తల్లితండ్రులు. ఒకవేళ రీవాల్యుయేషన్‌ తర్వాత చనిపోయిన చిన్నారుల్లో ఎవరైనా పాసయినట్లు తేలితే వాళ్ల ప్రాణాలు తిరిగొస్తాయా? దీనికి బాధ్యులెవరు? విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యారంగ నిపుణులు, విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న ఇది.

భయానక వాతావరణం!

ఇంటర్‌ ఫలితాల్లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా తేడాలతో షాక్‌ తిన్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు బాట పట్టారు. అధికారులెవరైనా కనికరిస్తారని, పోలీసుల చట్రాలు దాటుకొని బోర్డు కార్యాలయంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, లేదంటే కనీసం అధికారులే తమ వేదనను అర్థం చేసుకొని బయటకు వచ్చి సమాధానం చెబుతారని రోజుల తరబడి ఎదురుచూశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన విద్యార్థులు బోర్డు దగ్గర పడిగాపులు కాశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పనులన్నీ వదులుకొని సమస్య పరిష్కారం కోసం తాపత్రయపడ్డారు. ఓ దశలో సహనం కోల్పోయి పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. అయితే పోలీసులు మాత్రం కనికరం చూపలేదు. విద్యార్థులు, విద్యార్థినులన్న తేడా లేకుండా తమ ప్రతాపం చూపించారు. తల్లిదండ్రులు మరింత క్షోభ పడేలా ప్రవర్తించారన్న విమర్శలు ఆ సమయంలో సర్వత్రా వినిపించాయి. ఇంటర్‌బోర్డు నిర్వాకంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అయితే పోలీసులు ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు ఆయా పార్టీలు, సంఘాల నేతలను అరెస్టులు చేశారు. ఏకంగా ఇంటర్‌బోర్డు కార్యాలయాన్నే తమ అదుపులోకి తీసుకున్న పోలీసు బలగాలు, ఆ ప్రాంతలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సష్టించారు.

గ్లోబరీనాతోనే గందరగోళం !

అసలు ఈ తలనొప్పికి ప్రధాన కారణం గ్లోబరీనా కంపెనీయే అన్న విమర్శలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. తొలుత హాల్‌టికెట్ల జారీ సమయం లోనే బోలెడన్ని తప్పులు దొర్లాయని, ఆ సమయం లోనే విద్యార్థులు ఇంటర్‌బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఏమాత్రం అర్హతలు, సాంకేతిక నైపుణ్యం లేని సంస్థకు ఈ బాధ్యత అప్పగించడమే దీనికంతటికీ ప్రధాన కారణమన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో తరహా మార్కుల మెమో చూపిం చడం దేనికి నిదర్శనమని విద్యారంగ నిపుణులు సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు.

తప్పును ఎత్తిచూపిన త్రిసభ్య కమిటీ

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇంటర్‌బోర్డు సహా పరీక్షల వాల్యుయేషన్‌ వంటి బాధ్యతలు నిర్వర్తించిన గ్లోబరీనా కంపెనీల్లో సోదాలు, తనిఖీలు చేసి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ప్రకారం ఫలితాల్లో తప్పులు వాస్తవమే అని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. 531 మంది జాగ్రఫీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ మార్కులు పడలేదని కమిటీ గుర్తించినట్లు తెలిపారు. 496 మంది విద్యార్థుల విషయంలో పరీక్షా కేంద్రం కేటాయింపులో పొరపాట్లు జరిగాయని అందువల్లే ‘ఆబ్‌సెంట్‌-పాస్‌’ అనే గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఓఎంఆర్‌ పత్రంలో సరిగ్గా బబుల్‌ చేయకపోవడం వల్ల 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిపై తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఇంటర్‌ ఫలితాల్లో బోర్డు అవలంభించిన నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇంటర్‌ పరీక్ష ఫలితాల రీవాల్యుయేషన్‌పై నిర్ణయం తెలుపాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బాలల హక్కుల సంఘం దాఖలుచ చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించి.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంటర్‌ ఫలితాల్లో 3 లక్షల మంది వరకు ఎలా ఫెయిల్‌ అవుతారని కోర్టు ప్రశ్నిం చింది. విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్‌ మేరకు రీవాల్యుయేషన్‌పై బోర్డు నిర్ణయం తెలుపాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. ప్రశ్నాపత్రాల పునర్‌ మూల్యంకనం కోసం ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. అయితే రీవాల్యుయేషన్‌కు రెండునెలల సమయం పడుతుందని ఇంటర్‌బోర్డు కోర్టుకు విన్నవించింది. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం విద్యార్థుల ఫలితాలు వెల్లడించేందుకు నెలరోజుల సమయం పడితే 3 లక్షల మంది విద్యార్థుల రీవాల్యుయేషన్‌కు రెండు నెలలు ఎలా పడుతుందని నిలదీసింది.

ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. మీడియా ప్రచురించిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హక్కుల సంఘం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించిన వారిపై తీసుకున్న చర్యలతో పాటు బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందించారనే విషయాలను కూడా వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించింది.

దిగొచ్చిన ప్రభుత్వం

ఈ పరిణామాలతో కంగుతిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలన్నీ ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేస్తామని ప్రకటించింది. అయితే, రీవాల్యుయేషన్‌ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవన్న భరోసా ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సాంకేతిక తప్పిదా లంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఈసా రైనా పకడ్బందీగా రీవాల్యుయేషన్‌ చేయాలని తల్లి దండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *