జీఎస్టీతో 110 నుండి 5 శాతానికి..

జీఎస్టీతో 110 నుండి 5 శాతానికి..

– జీఎస్టీకి ముందు 110 శాతం పన్ను ఉండేది

– జీఎస్టీతో అది 28 శాతంకి తగ్గింది

– ఇప్పుడు 12 – 18 మధ్యకి వచ్చింది

– భవిష్యత్తులో అన్నీ 5 శాతంకే రావచ్చు

– ఇవి కాదా మంచిరోజులు (అచ్చేదిన్‌)..!

దేశమంతటికి ఒకే పన్నును అమలు చేయడానికి తీసుకువచ్చిన ‘వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ కు ఏడాదిన్నర కాలం పూర్తయింది. 1 జులై 2017న ఈ విప్లవాత్మక పన్ను సంస్కరణను కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ పద్దెనిమిది నెలల కాలంలో జీఎస్టీ రకరకాల మార్పులకు లోనై మెల్లమెల్లగా తన ఫలితాలను ఆదాయం రూపంలో చూపిస్తోంది. వస్తువులు సేవల పన్నును సమర్థంగా అమలు చేయడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వీటన్నిటినీ జీఎస్టీ మండలి చర్చల ద్వారా చర్యల ద్వారా అధిగమించింది.

అప్పుడు 17 రకాల పన్నులు, 110 శాతం పన్ను

జీఎస్టీ అమలుకు ముందు కేంద్రప్రభుత్వం పరోక్ష పన్నులను విపరీతంగా వసూలు చేసేది. ఈ పరోక్ష పన్నుల విధానం పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందికరంగా ఉండేది. కొన్నిసార్లు పన్నులపై కూడా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 17 రకాల పన్నులను వివిధ వస్తువులపై విధిస్తూ ఉండేవి. ఈ 17 రకాల పన్నులకు పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామికవేత్తలు 17 రకాల రిటర్నులను దాఖలు చేయాల్సిన అవసరం ఉండేది. అదేవిధంగా 17 రకాల పన్ను ఇన్‌స్పెక్టర్లకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. పన్ను రేట్లు కూడా అధికంగా ఉండేవి. విలువ ఆధారిత పన్ను 14.5 శాతం, ఎక్సైజు సుంకం 12.5 శాతం మేర చెల్లించాల్సి ఉండేది. వివిధ ఇతర పన్నులను కలుపుకుంటే చెల్లించే పన్ను 31 శాతానికి చేరేది. ఒక రాష్ట్రం నుంచి సరుకులను ఇంకో రాష్ట్రానికి తరలించాలంటే ఎంట్రీ టాక్సును చెల్లించాల్సి వచ్చేది. వినోదపు పన్నును 35 శాతం నుంచి 110 శాతం వరకూ చెల్లించాల్సి ఉండేది. సుమారు 235 వస్తువులకు 31 శాతం లేదా ఆ పైన పన్ను చెల్లించాల్సి వచ్చేది. పన్ను రేట్లు గరిష్టంగా ఉండటం మూలంగా ఈ పన్నును ఎగవేయడానికి వ్యాపారులు, ఉత్పత్తిదారులు అడ్డదారులను వెతికేవారు. సంఘటిత రంగంలోని ఉత్పత్తిదారులు, వ్యాపారులు ఈ గరిష్ట పన్నులను తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించేవారు.

2014లో కేంద్రంలో మోదీ నేతత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పన్ను సంస్కరణ లపై దష్టి పెట్టింది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా పేర్కొనే వస్తువులు సేవల పన్ను బిల్లును పార్లమెంటు ఆమోదించి 1 జులై 2017 నుంచి అమలులోకి తెచ్చింది. జీఎస్టీ అమలు తరువాత పన్ను చెల్లింపుల్లో చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి.

ఇప్పుడు ఒకే పన్ను – 110 నుండి 28కి తగ్గింపు

జీఎస్టీ ఒకే పన్ను విధానం అమలుతో 110 శాతం ఉండే పన్ను 28 శాతంకి తగ్గింది. సామాన్య ప్రజలు ఉపయోగించే అనేక నిత్యావసర వస్తువులను 0 నుండి 5 శాతం పన్ను పరిధిలో చేర్చారు. పన్ను చెల్లింపులను, రిటర్నులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. బహుళ స్థాయిలో ఉండే ఇన్‌స్పెక్టర్ల జోక్యం లేకుండా చేశారు. ఇలా పన్ను చెల్లింపును సులభతరం చేసి పన్నులను తగ్గించడంతో పెద్ద ఎత్తున పన్ను చెల్లింపుదారులు పెరిగారు. పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. జీఎస్టీతో తమకు రావాల్సిన పన్నులు తగ్గిపోతాయి అని భయపడిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్ను చెల్లిం పులు పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల్లో పన్ను ఆదాయం ఐదేళ్లలో సగటున ఏడాదికి 14 శాతం మేర పెరగగలదని జీఎస్టీ భరోసా ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు దీనికంటే ఎక్కువగానే వద్ధి చూపాయి. తక్కువ వద్ధి చూపిన రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు రెండో ఏడాది చాలా మేరకు తగ్గాయి. జీఎస్టీ అమలు తర్వాత మొదటి ఏడాది నెలకు సగటున 89,700 కోట్ల రూపాయలు పన్నులు వసూళ్లు కాగా రెండో ఏడాది నెలకు సగటున 37,100 కోట్ల ఆదాయం లభించింది.

31వ జీఎస్టీ కౌన్సిల్‌ 28 శాతం శ్లాబులోని చాలా వస్తువులను తక్కువ శ్లాబులోకి బదిలీ చేసింది. సినిమా టికెట్లు, ఎల్‌ఈడీ తెరలు, కంప్యూటర్‌ మానిటర్లు వంటి వస్తువుల పన్నులను గణనీయంగా తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత 183 వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి పన్ను లేదు. బ్రాండెడ్‌ తణధాన్యాలు, వంటనూనెలు, ఇన్సులిన్‌, పాదరక్షలు వంటి 308 వస్తువులపై 5 శాతం పన్నును వసూలు చేస్తున్నారు. వెన్న ఇతర కొవ్వు పదార్థాలు, పిస్తా, మొబైల్‌ ఫోన్లు, సైకిళ్ల వంటి 178 వస్తువులపై 12 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. వెనిగర్‌, మార్బుల్స్‌, పెయింట్స్‌, ప్లైవుడ్‌ వంటి 517 వస్తువులపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. సిమెంట్‌, ఆటోమొబైల్‌ పార్ట్స్‌, ఏసీలు, పొగాకు వస్తువులు, ఏరేటెడ్‌ డ్రింక్స్‌పై 28 శాతం పన్నును వసూలు చేస్తున్నారు. ఈ నాలుగు శ్లాబులు కాకుండా బంగారం, వెండి, ఇతర విలువైన రాళ్లపై 3శాతం సుంకాన్ని విధిస్తున్నారు. వజ్రాలపై 0.75 శాతం పన్ను విధిస్తున్నారు.

ఇక అన్నిటిపై 5 శాతమే..

రానున్న కాలంలో ఈ నాలుగు శ్లాబులను ఏకం చేసి అన్ని వస్తువులను 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ శ్లాబుల ఏకీకరణపై ప్రకటన కూడా చేశారు.

ఆర్థికమంత్రి ప్రకటించినట్లుగా జీఎస్టీని ఒకే శ్లాబుకి మార్చటం, దేశంలోని అన్ని వస్తువులపై పన్నును 5 శాతానికే పరిమితం చేయడంపై ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. పెట్రోలు, మద్యం వంటి రాష్ట్రాల పరిధిలో ఉన్న వస్తువులను సైతం ఈ శ్లాబు పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే ఇంధనంపై పన్ను, మద్యంపై పన్ను ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి, ఏక శ్లాబ్‌ విధానంలో 5 శాతం పన్నుకు పరిమితం చేస్తే అటు వినియోగదారులకు, ఇటు పన్ను చెల్లింపు దారులకు మేలు జరుగుతుంది. పన్ను వసూళ్లు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించనంతగా మెరుగుపడే అవకాశం ఉంది. పన్నులు సరళతరమైతే దేశంలోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. ఇదే కదా నిజమైన అచ్చేదిన్‌.

గత ప్రభుత్వాల నిర్వాకం

గత ప్రభుత్వాలు ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి ఆ పేరుతో దేశ నిధులను కొల్లగొట్టాయి. మాజీ ఆర్థిక మంత్రి మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ మన్మోహన్‌ను కీలుబొమ్మలా మార్చి చిదంబరం లాంటి వారు తమ ఇష్టం వచ్చినట్లు దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఒకవైపు ప్రజాకర్షక పథకాలకు ఆదాయం మొత్తాన్ని వినియోగించి జీడీపీ వద్ధి రేటు మందగించేలా చేశారు. ఈ విధంగా రాయితీలు, ఉపాధి హామీ పథకం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చి చేరడంతో డిమాండుకు తగ్గ సప్లయి లేక ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికాభివద్ధి కుంటుపడింది. దీన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను పెంచవల్సిన పరిస్థితి వస్తే చిదంబరం రిజర్వుబ్యాంకుపై వత్తిడి తెచ్చేవారు. ఇప్పుడేమో రిజర్వు బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య స్పర్థలు వస్తే మోదీ నియంత అంటూ నిందలు వేస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ పై కూడా ఇలాంటి విమర్శలే చేసిన యూపీఏ ఆర్థికవేత్తలు దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతోందని నానా హంగామా చేస్తున్నారు. అసలు జరిగేది వేరుగా ఉంది.

ఏదీ రైతు సంక్షేమం ?

రైతు రుణ మాఫీ పేరుతో ఈ మధ్య జరిగిన మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ లబ్ది పొందింది. కర్ణాటకలో ఇదే ఎత్తుగడతో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ తర్వాత రైతులకు మొండి చేయి చూపించిన విషయం గమనార్హం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోనూ విత్తనాలు, పురుగు మందులు, యూరియా కోసం 15 ఏళ్ల తరువాత లైన్‌లో నిలబడి ఎదురుచూసే పరిస్థితి రైతులకు ఎదురైంది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వం రైతుల నుండి కొన్న పంటకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు.

గతంలో తమ హయాంలో జరిగిన బోఫోర్స్‌, ఆగస్టా స్కామ్‌ల వలె ఈ సర్కారు కూడా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అతినీతికి పాల్పడిం దని బురదజల్లడానికి ప్రయత్నించి కాంగ్రెస్‌ పెద్దలు విఫలమయ్యారు. ఆగస్టా దొంగను మోదీ తన రాజనీతితో భారత్‌ రప్పించాడు. ఈ వ్యవహారంలో క్రిస్టియన్‌ మిషేల్‌ ఇప్పటికే సోనియా కుంటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..

మోదీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నది. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా అందించిన రాయితీలకు అడ్డుకట్ట వేసింది. యూరియ రాయితీ దుర్విని యోగం కాకుండా వాటికి వేపపూత కలిపింది. కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకట్ట వేసింది. గ్యాస్‌పై రాయితీని అందరికి కాకుండా అవసరం ఉన్న పేదలకు మాత్రమే అందించింది. ప్రధాని పిలుపుకు స్పందించి కోట్లాదిమంది భారతీయులు తమ గ్యాస్‌ రాయితీని వదులుకుని దేశభక్తిని చాటుకున్నారు. ఈ మిగిలిన రాయితీని పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ అందించేందుకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఉపాధి హామీ పథకంలో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది. గ్రామీణ రోడ్లు, గహాల నిర్మాణానికి వీరి సేవలను వినియోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం కుంటుపడి ఆ ప్రభావం భారతదేశంపై పడుతున్నా దాన్ని తమ విధానాలతో ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆర్ధిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తూనే దేశానికి ఎంతో కీలకమైన రక్షణ వ్యవస్థను ఆధునీకరించే పనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది.

రైతులకు పెట్టబడి సాయం..!

దేశంలో రైతుల పరిస్థితిని మెరుగుపర్చడానికి మార్కెట్‌ సంస్కరణలు తీసుకువచ్చి ఈనామ్‌ పేరుతో దేశ వ్యాప్త మార్కెట్లను అనుసంధానం చేసినా దాని ఫలితాలను రైతులు అందుకోలేకపోతున్నారు. ఈ ఆటుపోట్లను తట్టుకోడానికి రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్రం ఆలోచనలు చేస్తోంది.రుణ మాఫీ కంటే ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు తెలుపుతున్న సందర్భంలో ప్రభుత్వం ఈ ఆలోచనలు చేస్తోంది.

అలాగే పేదరికాన్ని తగ్గించడానికి యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ అందించడానికి సమాలోచనలు చేస్తోంది. ఈ ఆదాయంతో ప్రజలకు మంచి పౌష్టికాహారం, చదువు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా ముందడుగు వేసిన సర్కారు జీఎస్టీ ద్వారా వస్తున్న ప్రతి పైసా ఆదాయాన్ని దేశ అభివద్దికే ఖర్చుచేస్తోంది.

జీఎస్టీ ప్రవేశ పెట్టి ఏడాదిన్నర కాలమే అయినా ఎన్నో మార్పులకు ఇది శ్రీకారం చుట్టింది. దీని మంచి ఫలితాలు మన అనుభవంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలను మనదేశంలో జరిగిన రెండో ఆర్థిక సంస్కరణలుగా పేర్కొనవచ్చు. తాత్కాలికంగా ఇవి చేదుగా ఉన్నా దేశ ఆర్థికరంగ భవిష్యత్తుకు ఇవి పునాదులవు తున్నాయి. ఈ సంస్కరణలు మరింత సఫలం కావాలంటే మరికొంతకాలం వేచిచూడక తప్పదు.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *