మరిన్ని సంస్కరణల దిశగా..

మరిన్ని సంస్కరణల దిశగా..

నరేంద్రమోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో భారతదేశంలో మరోమారు ఆర్థిక సంస్కరణలను చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటి విడత ప్రభుత్వ హయాంలో పలు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపడానికి కృషిచేసిన మోదీ ఈ మారు మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా రావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కఠినంగా ఉన్న కేంద్ర చట్టాలను సరళతరం చేసి నూతన విధానాలను రూపొందించ డానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. జులైలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాలలో ఈ కొత్త చట్టాలను తీసుకురానున్నారు.

మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోగా సరళ వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైనంత వరకూ ఎక్కువగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది కనుక ఐదేళ్ల వరకూ వారి పెట్టుబడులకు ఢోకా ఉండదు కనుక పెద్ద మొత్తంలో పెట్టుబడులు దేశానికి తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు చైనా-అమెరికా వాణిజ్య యుద్ధంతో భారత్‌కు నష్టాలు ఉన్నా దాన్ని అవకాశంగా తీసుకుని చైనాకు ప్రత్యమ్నాయంగా మారే అవకాశం ఉంది. 44 కేంద్ర చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి నూతన చట్టాలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. వేతనాలు, పారిశ్రామిక సంబం ధాలు, సాంఘిక రక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్య కరమైన పని, పరిసరాలు అనే అంశాలపై దృష్టి సారించింది. ఇవి పెట్టుబడి దారులకు, కార్మికులకు ఇరువురికి రక్షణ కల్పించనున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఎకరాల భూములను పెట్టుబడిదారులకు అందిచ నున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నియంత్రించ డానికి ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

ఇంకా విదేశీ పెట్టుబడులకు దూరంగా ఉన్న కొన్ని రంగాల్లో వాటి అనుమతులకు చర్యలు తీసుకోనున్నారు. ఈ విధంగా మోదీ ప్రభుత్వం తీసుకోనున్న చర్యల మూలంగా భారత ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడనుంది. వృద్ధి రేటు ఒక శాతం పెరిగితే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏకకాలంలో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగం, పేదరికం, జీడీపీ వృద్ధి రేటుపై దృష్టి కేంద్రీకరించింది. ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకువచ్చిన నీతిఆయోగ్‌ సత్ఫలితాలను ఇస్తోంది. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నోట్ల రద్దు, వస్తువులు సేవల పన్నుతో మొదటి విడతలో భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచిన మోదీ ఈ మారు మరిన్ని చర్యలతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అనేక సమస్యలను మోదీ ప్రభుత్వం దాటవలసి ఉంది.

సవాళ్లు

కనిష్ఠ స్థాయికి జీడీపీ వృద్ధిరేటు

రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీకి ఆర్థిక వృద్ధిరేటు మందగమనం పెను సవాలుగా పరిణమించింది. కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన 2018-19 సంవత్స రంలో త్రైమాసిక జీడీపీ వృద్ధిరేటు అయిదేళ్ల కనిష్ఠ స్థాయిలో 5.8 శాతంగా నమోదైంది. 2018-19 మొత్తం ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతంగా సీఎస్‌వో లెక్కగట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, తయారీ రంగాలు నిరాశ పరిచాయి. 2017-18లో 7.2 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు 2018-19లో 6.8 శాతానికి తగ్గింది. మోదీ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2014-15లో 7.4 శాతం, 2015-16లో 8.2 శాతం, 2016-17లో 7.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2018-19 చివరి త్రైమాసికం జీడీపీ వృద్ధిరేటు చైనా వృద్ధిరేటు కంటే తక్కువగా ఉంది. దేశంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభమే వృద్ధిరేటు మందగించ డానికి ప్రధాన కారణంగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం ప్రభావం వినియోగంపై పడటంతో వృద్ధి మందగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక వృద్ధిరేటుపై కూడా ఈ ప్రభావం ఉండవచ్చు. రెండో త్రైమాసికం నుంచి వృద్ధి పుంజుకోవచ్చు. భారతదేశ తలసరి ఆదాయంలో కూడా 10 శాతం వృద్ధి నమోదైంది. 2018-19లో తలసరి ఆదాయం రూ.1,26,406కు చేరింది.

ఇంధన రంగ సంక్షోభం

భారత్‌ ఇరాన్‌ నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేసుకోకపోతే మారక నిల్వలు మొత్తం చమురు దిగుమతికే ఖర్చు చేయవలసి ఉంటుంది. ఏటి కేడు భారత చమురు దిగుమతులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ముడిచమురు ధరలు పెరిగితే లీటరు పెట్రోలు ధర త్వరలోనే 100 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. ధరలను నియంత్రించాలి అనుకుంటే ఆదాయాన్ని మొత్తం ఇంధన రాయితీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభివృద్ధి కుంటుపడి దేశం సంక్షోభంలోకి వెళుతుంది.

దిగుమతులు ఎక్కువగా చేసుకునే భారత్‌ ఎగుమతుల విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. రూపాయి విలువ తగ్గడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగితే అది ఆధిక ద్రవ్యలోటుకు దారితీస్తోంది.

దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుండటంతో వారి వినియోగ సామర్థ్యం పెరిగి దేశీయంగానే డిమాండు పెరుగు తోంది. ఈ అవకాశాలను దేశీయ కంపెనీలు అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగానికి మేలు చేసే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్‌ పథకం మరింత మందికి విస్తరిం చడంతో సుమారు లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవనున్నాయి. ఇది కొంతలో కొంత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి దిశగా నడిపించ గలదు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏడాదికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటేనే కోట్లాది మంది ఉపాధి పొంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం అవుతోంటే, లక్ష కోట్ల పీఎం కిసాన్‌ నిధులతో ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మొదటి విడత అధికారం చేపట్టిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలందరికి ఆర్థిక సమ్మిళిత్వం అందించడానికి పెద్ద ఎత్తున పీఎం జన్‌ధన్‌ ఖాతాలను తెరిచింది. దీంతో దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా బ్యాంకులకు దూరంగా ఉన్న అణగారిన వర్గాలకు తమకంటూ ఒక బ్యాంకు ఖాతా ఏర్పడింది. ఈ ఖాతాలను ఆధార్‌తో, మొబైల్‌తో అనుసంధానించి జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ పథకంతో వివిధ పథకాల రాయితీలను వారికే నేరుగా అందిస్తున్నారు. ఈ చర్యల మూలంగా అలసత్వం, అవినీతి నశించి జవాబుదారీతనం పెరిగింది. నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టడానికి తీసుకువచ్చిన నోట్ల రద్దు కూడా సత్ఫలితాలను ఇచ్చింది. వస్తువులు సేవల పన్నును విమర్శించిన వారు నేడు నెలకు లక్ష కోట్లకు పైగా వసూళ్లు అవుతున్న పన్నును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా సరిగానే ఉన్నా మరిన్ని సంస్కరణలు చేపడితేనే భారత వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉండటంతో మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయనుంది. జులైలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌తోపాటు పలు సంస్కరణలకు సంబంధించిన చట్టాలను ప్రవేశ పెట్టనుంది.

అమెరికా భారత్‌కు అందించే వాణిజ్య రాయితీలను ఎత్తివేయడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థ ద్వారా భారత్‌ వస్తువులు ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికా మార్కెట్‌లోకి ఎగుమతి అవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది భారత్‌ ఎగువుతులపై ప్రభావం చూపనుంది. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే పార్మస్యూటికల్స్‌, సర్టికల్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, తోలు వస్తువులు, ఇమిటేషన్‌ జ్యూవలరీ ఈ చర్యల వలన ప్రభావితం అవుతాయి. మరోవైపు అమెరికా చైనాల వాణిజ్య యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వేరుపడుతుండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య ఆసియాలో కూడా ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఉత్తర కొరియా కవ్వింపు చర్యల మూలంగా యుద్ధ భయాలు ఉండనే ఉన్నాయి. అరబ్‌ దేశాలు, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు అలానే ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశాలు రుణ ఊబిలో చిక్కకొని విలవిల్లాడుతున్నాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు నెలకొన్నవేళ 2008లో మాదిరిగా భారత్‌ ఈ మారుకూడా మాంద్యం పరిస్థితుల నుండి విజయవంతంగా గట్టెక్కగలదని, కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడిన బలమైన ప్రభుత్వం దీన్ని సరైన ప్రణాళికతో ఎదుర్కోగలదని ఆశిద్దాం.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *