గౌతముడు

గౌతముడు

సప్తరుషులలో గౌతముడు ప్రసిద్ధుడు. అహల్యా-గౌతముల వృత్తాంతం వాల్మీకి రామా యణంలో విపులంగా ఉంది. అహల్యా-గౌతముల కుమారుడు శతానందుడే జనకమహారాజు పురోహితుడు. విశ్వమిత్రుని వెంట వచ్చిన రామ లక్ష్మణులకు స్వాగతం పలికి సీతారామ కల్యాణం జరిపించిన మహనీయుడు.

కొందరి దాంపత్య జీవితాలు అర్ధంతరంగా ఏదో ఒక నెపంతో విడివడతాయి. మళ్లీ సానుకూల సమయం వచ్చినప్పుడు కలసి మెలిసి జీవిస్తారు. అహల్యా గౌతములిద్దరూ లోకోపకారానికి కృషి చేసినవారే. ఇద్దరి జన్మవృత్తాంతాలూ మహత్తర మైనవే.

బ్రహ్మ మానస పుత్రులలో గౌతముడు ఒకడు. ఆయన తపస్సంపన్నుడు. భూలోకంలో తపస్సు చేసుకుంటూ ఆశ్రమవాస జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన బ్రహ్మచర్యవ్రత దీక్షలో ఉన్నాడు.

బ్రహ్మదేవుడు దేవతలను, రాక్షసులను సృష్టించాడు. కాని సముద్ర మథనం తర్వాత విష్ణువు ధరించిన మెహినీ అవతారం ముందు దేవలోకంలో అప్సరసలు దిగదుడుపయ్యారు. లోకాలన్నీ సృష్టించడం చేతకానివాడని బ్రహ్మను ఆడిపోసుకున్నాయి. అతిలోకసుందరిని సృష్టించాలని బ్రహ్మ సంకల్పించాడు. ఫలితమే అహల్య. అద్భుత సుందరి.

ఆమెను బ్రహ్మదేవుడు ఎవరికిస్తాడా? అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అదృష్ట వంతుడు బ్రహ్మ దృష్టిలో తపస్సంపన్నుడైన గౌతముడే. ‘నీకీ అహల్య నిస్తున్నాను’ అని ఇచ్చాడు. అహల్య మీద తాము పెంచుకున్న ఆశలన్నింటినీ బ్రహ్మదేవుడు తుంచేశాడని ఇంద్రాది దేవతలంతా అనుకున్నారు.

అహల్య చాలా చిన్న పిల్ల. ఆమెను తీసుకెళ్లి గౌతముడు ఆశ్రమంలో పెంచాడు. పెరిగి పెద్దదయిన అహల్యను తీసుకెళ్లి గౌతముడు బ్రహ్మకే ఇచ్చాడు. ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ చుట్టూ మూగారు. మాకివ్వమంటే మా కివ్వమన్నారు.

నిస్సంగుడైన గౌతముడు అడగలేదు. బ్రహ్మదేవుడు దేవతలకు ఒక పరీక్ష పెట్టాడు. కన్యావరణంలో పరీక్షలొక భాగం. మత్య్స యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని పొందాడు. శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతాకర గ్రహణం చేశాడు.

బ్రహ్మ ఓ పరీక్ష ప్రకటించాడు. భూప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా వస్తారో వారికి అహల్య దక్కుతుందన్నాడు. ఉరుకులు పరుగుల మీద దేవలోకం, భూలోకంలో ఉండే మహర్షులంతా భూప్రదక్షిణకు బయలు దేరారు.

గౌతముడు బ్రహ్మజ్ఞాని. ఒక ఉత్తమ జాతి గోవు సమీపంలో గడ్డి మేస్తూ కన్పించింది. దాని దగ్గరకు వెళ్లి భక్తి శ్రద్ధలతో మూడుసార్లు ప్రదక్షిణ చేసి బ్రహ్మ దగ్గరకు వచ్చి స్మృతి వాక్యం ప్రకారం నా భూప్రదక్షిణ పూర్తి అయిందన్నాడు.

అహల్యను గౌతమునికిచ్చి బ్రహ్మ వివాహం చేశాడు. ప్రదక్షిణకు వెళ్లి వచ్చిన మహర్షులు నాలుక కరుచుకొని నూతన వధూవరులకు ఆశీర్వాద పూర్వకంగా అక్షింతలు వేసి వెళ్లారు. దేవతలకు మాత్రం అసూయ తగ్గలేదు.

బ్రహ్మను గూర్చి దండకారణ్యంలో ఆశ్రమంలో ఘోర తపస్సు చేశాడు గౌతమ మహర్షి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. లోకోపకారం ధ్యేయంతో తపస్సు చేసిన గౌతముడిలా కోరాడు. ‘బ్రహ్మదేవా! భూలోకంలో వర్షాలు సరిగ్గా లేవు. నేను విత్తనం చల్లితే ఒకే ఒక జాములో పంట పండి ఫలితం దక్కెలా వరమివ్వ’మన్నాడు. తధాస్తు అన్నాడు బ్రహ్మ సంతోషంగా.

అనంతరం కొంతకాలానికి భూలోకంలో అతివృష్టి ఏర్పడి కరువు కాటకాలేర్పడ్డాయి. గౌతముడు లోకోపకారం కోసం గుప్పెడు ధాన్యాన్ని సృష్టించి తన ఆశ్రమ ప్రాంతంలో చల్లాడు. అవి జాములోనే రెండు గంటల్లో పంట పండేవి. వాటితో క్షుధార్తులకు ఆహారాన్ని సమకూర్చాడు గౌతముడు.

గౌతముని అపూర్వ సృష్టి గూర్చి అన్ని లోకాలవారు ఘనంగా చెప్పుకోసాగారు. ఎక్కడెక్కడి వారో వచ్చి పొగడుతున్నారు. అది చూచి సాటి మునులు సహించలేకపోయారు.

ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పంట చేలలో ప్రవేశపెట్టారు. బాగా పెరిగిన పంటను అది మేస్తోంది. గౌతముడు అది చూశాడు. ఒక దర్భపుల్లను దానిపై విసిరాడు. అది మాయా గోవు. వెంటనే మరణించింది.

ఆ మునులంతా వచ్చి ‘నీకు గోహత్యా పాతకం చుట్టుకొంది. మీ ఇంట్లో మేం భోజనం చేయబో’మని వెళ్లిపోయారు. దానికి మార్గాంతరం వెతికాడు గౌతముడు.

వినాయకుని సలహా మేరకు ఆకాశగంగను భూలోకానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. పరమశివుని గూర్చి తపస్సు చేసి గంగను తన ఆశ్రమ ప్రాంతంలో ప్రవహింపజేశాడు. అందుకే ఆ నదికి గౌతమి అని పేరు వచ్చింది.

పంచకన్యలలో అహల్య ఒకరు. ద్రౌపది, సీత, తార, మండోదరి మిగతా నలుగురు. అహల్యను వంచించిన ఇంద్రుడు ఆశ్రమంలోంచి బయటకు వెళుతున్నప్పుడు చూశాడు గౌతముడు. ఇంద్రుని శపించాడు. అహల్యను కూడా ధూళిధుసరితయై పడివుండమని శపించాడు. శాపగ్రస్త అయిన అహల్యకు శ్రీరాముని పాదస్పర్శతో యథారూపం సిద్ధించింది. అహల్యా-గౌతములు సంసారం కొనసాగించారు.

విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు గౌతముని ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అహల్యకు శాపవిమోచనం కలిగింది. అహల్యా-గౌతములు రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి సత్కరించారు. శ్రీరామునికి అయోధ్య నుండి బయటకు వచ్చిన తర్వాత కన్పించిన తొలి దంపతులు అహల్యా-గౌతములు. గౌతమ ధర్మసూత్రాలు ‘గౌతమ స్మృతి’ పేరుతో ప్రసిద్ధం. గౌతమ న్యాయశాస్త్రంలో తర్కశాస్త్రం మొదలైందని పెద్దలు చెబుతారు. ఆ విధంగా గౌతముడు మహత్తర కార్యక్రమాలు నిర్వహించాడు.

– డా.ఆర్‌.అనంతపద్మనాభరావు, 9866586805

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *