అవినీతి అక్రమాలపై అంతులేని అనురాగం

అవినీతి అక్రమాలపై అంతులేని అనురాగం

గత ప్రభుత్వంలో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను అప్పటి ప్రభుత్వం బలవంతంగా రిటైర్‌ చేయించింది. అందుకోసం రిటైర్‌మెంట్‌ నోటీసులను ఇస్తున్నట్లుగా ఆయనకు ఏమాత్రం చెప్పకుండా తెల్లవారేసరికి ఆయన ఇంటి గోడకు అంటించారు. ఇదంతా రమణ దీక్షితులపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షపూరిత చర్య అని అప్పట్లో అందరూ అనుకు న్నారు. రాష్ట్ర పర్యటనకు, తిరుమల సందర్శనకు వచ్చిన భాజపా అధ్యక్షుడు అమిత్‌షాకు రమణ దీక్షితులు దగ్గరుండి అపూర్వ మర్యాదలు చేయడం, వేంకటేశ్వరుని దర్శనం చేయించడమే అందుకు కారణం అనీ చెవులు కొరుక్కున్నారు. మొత్తానికి ఆలయ అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేదు అని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు రమణ దీక్షితులను రిటైర్‌ చేయించారు. ఆ తరువాత అర్చకులందరికీ 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్‌గా ప్రకటించి మేనిఫెస్టోకు పాతరేశారు. ఈ విషయాన్ని తరువాత అందరూ మర్చిపోయారు.

2019లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఘోరంగా ఓడిపోయి అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే తన పాలనలో అవినీతి, అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినట్లుగానే అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనంతో ప్రారంభమైంది. తరువాత ఊపందుకుంది. ముందుగా కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసి అక్రమ కట్టడాలకు స్థానం లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ప్రజావేదిక కూల్చివేతతో పాటు ఆ పక్కనే ఉన్న మరో అక్రమ కట్టడం లింగమనేని రమేష్‌ ఇంటినీ కూల్చివేస్తా మంటూ నోటీసులు పంపింది. పంపడం కాదు, ఆ ఇంటి గోడకు అంటించింది. ఇంతకూ ఆ ఇంటిలో నివాసముంటున్నది సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇల్లు అక్రమంగా నిర్మించినదనే విషయాన్ని సిఆర్‌డీఏ స్పష్టం చేసిందని, కాబట్టి దీనిని కూల్చి వేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందనీ, వారం రోజులలో ఈ నోటీసుకి ఎటువంటి సరైన సమాధానం రాకపోతే కట్టడం కూల్చివేస్తామని ఆ నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నోటీసును ప్రభుత్వం పంపిన విధానం, ఆ ఇంటిలో నివాసం ఉంటున్న చంద్రబాబుకు లేదా ఆయన కుటుంబ సభ్యుల చేతికి ఇవ్వకుండా ఆ ఇంటి గోడకు అంటించిన విధానం చూసిన తరువాత రాష్ట్ర ప్రజలకు రమణ దీక్షితుల ఇంటి గోడకు రిటైర్‌మెంట్‌ నోటీసు అంటించిన విషయం జ్ఞప్తికి వచ్చి ఉంటుంది.

అలాగే ఎన్నికలలో అసాధారణ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌ అనేకసార్లు తన ప్రసంగంలో ఒక మాట ప్రజలకు గుర్తుచేస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు తన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు లాగేసుకున్నారని, ఆ పాపం ఊరికే పోలేదని, ప్రస్తుతం అలా లాగేసుకున్న 23 మంది ఎమ్మెల్యేలూ, ముగ్గురు ఎంపీలు మాత్రమే చంద్రబాబుకు మిగిలారని, దేవుడు చంద్రబాబు పట్ల సరైన తీర్పు ఇచ్చాడనేదే ఆ మాట.

రమణదీక్షితులకు చేసిన అన్యాయం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌కు చేయబోయిన అన్యాయం వంటివి తిరిగి నేడు బాబుకే ఎదురుదెబ్బలుగా తగిలాయి అనే వాదన ప్రస్తుతం ఉచితం అనిపించు కోదు. కానీ ప్రజావేదిక కట్టడం కూల్చివేతతో మాత్రం మరొక వాదన తెరపైకి వచ్చింది. ప్రజావేదిక నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అనేదే ఆ వాదన. ఎందుకంటే కూల్చివేత ప్రారంభించిన తరువాత తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైందనుకున్న ప్రజావేదికలో పైపై మెరుగులను తొలగించిన తరువాత దర్శనమిచ్చింది అచ్చమైన తాత్కాలిక పద్ధతిలో నిర్మించిన రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డును చూసినవారంతా దాని నిర్మాణానికి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చయ్యా యనే మాటను గుర్తుతెచ్చుకుని ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మహా మాయాజాలాన్ని మరోసారి మనసులోనే స్మరించుకున్నారు.

రేకుల షెడ్డు నిర్మాణంలోనే తొమ్మిది కోట్లు దోపిడీ జరిగితే మరి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మిగతా నిర్మాణాలు, గత ప్రభుత్వ పాలన కాలంలో నిర్మితమైన టీడీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో ఇంకెన్ని కోట్లు దోపిడీ జరిగిందనే విషయం ప్రభుత్వంలో చర్చకు వచ్చినట్లుంది. వెంటనే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్‌ ఇంటికి, విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయానికి నోటీసులు పంపారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటికి సీఆర్‌డిఏ అనుమతి లేదని, అంతేకాక అనుమతులు లేకుండానే ఆ ఇంటిలో మరికొన్ని నిర్మాణాలు చేపట్టారని, సీఆర్‌డీఏ అనుమతి లేనందున దీనిని అక్రమ కట్టడంగా గుర్తించామని, ఈ నోటీసుపై వారం రోజుల వ్యవధిలో సరైన సమాధానం ఇవ్వకున్నా, సమాధానంలో స్పష్టత లేకున్నా కూల్చివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే విశాఖ టీడీపీ కార్యాలయంకి జారీ చేసిన నోటీసులో భవన నిర్మాణానికి సంబంధించి ప్లాను మంజూరు చేయడానికి 2016లో దరఖాస్తు చేశారని, స్థలం రాణీ కమలాదేవి నుంచి తెదేపా కార్యాలయానికి దఖలు పడిన దస్త్రాలను అందజేయలేదని పేర్కొన్నారు. దీంతో ప్లాను మంజూరు చేయలేదని, లింకు డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. 1955 హైదరాబాద్‌ మున్సిపల్‌ చట్టం 452 ప్రకారం నోటీసులు జారీ చేసిన వారంలోగా సమాధానం ఇవ్వకపోతే, అక్రమ భవనంగా గుర్తించి కూల్చివేస్తామని, అందుకయ్యే ఖర్చును సైతం భరించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.

ఇవేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మునిసిపాలిటీల పరిధిలోనే 2,367 అక్రమ కట్టడాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం జిల్లాల వ్యాప్తంగా చూస్తే మరిన్ని కట్టడాలు వేలసంఖ్యలో బయటపడగలవని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇన్ని అక్రమ కట్టడాల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు, ప్రోత్సాహమే కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షాత్తూ పార్టీ అధినేతే అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ, పక్కనే మరో అక్రమ కట్టడం నిర్మించి, కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే, కార్యకర్తలు మరోలా ఎలా ఆలోచిస్తారని వారు తర్కించుకుంటున్నారు. ప్రభుత్వం మరింత గట్టి ప్రయత్నం చేస్తే, తీగ లాగితే డొంక కదిలినట్లుగా మరిన్ని అక్రమ కట్టడాలు బయటపడటం ఖాయం అనీ అనుకుంటున్నారు. ఇది ఇప్పటికే ఓటమితో, పార్టీ నాయకుల వలసలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి మరింత కష్టకాలం అనీ భావిస్తున్నారు.

అయితే ఈ నోటీసుల పట్ల, ప్రభుత్వ హెచ్చరికల పట్ల కూడా చంద్రబాబు సరైన రీతిలో స్పందించక పోవటం గమనార్హం. పైగా తనపై ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ సానుభూతి ప్రకటనలకు తెరతీశారు. తన ఇంటికి రైతులమని చెప్పుకునే కొంతమందిని ప్రతిరోజూ రప్పించుకుంటూ సానుభూతి వచనాలు పలికించుకుంటున్నారు.

ఇవే కాదు, చంద్రబాబు పాలనలో అనేక రంగాల్లో అవినీతి ఇబ్బడి ముబ్బడిగా జరిగిందని ఎన్నో వార్తలు, వ్యాసాలు అప్పట్లో వెలువడ్డాయి. పోలవరం నిధులు, రాజధానికి కేటాయించిన నిధులూ పక్కదారి పట్టాయని, రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను తన పార్టీ ఎమ్మెల్యేలు ఆక్రమించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఇసు అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్వార్వో వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడికి పాల్పడిన సంఘటన రాష్ట్రంలో సంచలనమే సృష్టించింది. ఆ సంఘటనలో పార్టీ అధినేత చంద్రబాబు మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన తన పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకు రావడం, వనజాక్షికే చూసీ చూడనట్లు పోవాలని సర్దిచెప్పడం మరింత దారుణం. ఇక పోలవరం, రాజధాని, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాల నిధులను పక్కదారి పట్టించారనే విషయంలో కేంద్రం చంద్రబాబు పట్ల అసంతృప్తిగా ఉందని, ఆ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ బాబును విశాఖకు రప్పించుకుని హెచ్చరించినందునే బాబు ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రజలు తన చుట్టూ అడ్డుగోడలా నిలబడి తనను రక్షించుకోవాలి’ అంటూ ప్రకటించారని మీడియా విశ్లేషణలు వెలువడ్డాయి. బాబు ఆ తరువాత కాంగ్రెస్‌తో జట్టుకట్టడంతో ఈ విశ్లేషణలకు బలం చేకూరింది. తన అవినీతిని సహించని మోదీనే గద్దె దింపాలని బాబు భావించి, అవినీతికి మారుపేరయిన కాంగ్రెస్‌తో ఆయన జట్టు కట్టారు. కాంగ్రెస్‌కు బలం చేకూర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులను కలిశారు. ఒకే వేదికపైకి తెచ్చారు. ఒక దశలో తన రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారిని విచారించడానికి సీబీఐకి స్థానం లేదంటూ సీబీఐని రాకుండా నిరోధించే చట్టాన్ని అమలుచేశారు. అదే ఊపులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి దీదీకీ మద్దతిచ్చారు. పైగా కేంద్రం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఒకపక్క ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరోపక్క తన పార్టీ నాయకుల అవినీతికి కొమ్ముకాస్తూ వచ్చారు. చివరికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి గెలుపు కోసం పసుపు-కుంకుమ సంక్షేమ పథకం పేరుతో రాష్ట్ర ఖజానాను మరో తొమ్మిది వేల కోట్ల మేర లూటీ చేశారు. దానికోసం రిజర్వు బ్యాంకు వద్ద లభించే 8 వేల కోట్ల ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యాన్నీ వినియోగించుకున్నారు. చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదని గ్రహించిన మహిళలు బాబు వద్ద పసుపు కుంకుమ డబ్బులు తీసుకుని జగన్‌కు పట్టం కట్టారు.

తీవ్రమైన అవినీతి మరకలతో, నాయకుల అక్రమాలతో ఎన్నికలలో ఎన్నడూ చూడని ఘోర పరాజయం చవిచూసిన తరువాత కూడా టీడీపీలో అంతర్మధనం జరిగిన దాఖలాలు కనబడ్డం లేదు. అక్రమ కట్టడాల కూల్చివేత పట్ల ఆ పార్టీ నాయకులు చేస్తున్న అసందర్భ ప్రకటనలే దానికి అద్దం పడుతున్నాయి. అవినీతిని తొలగించడమంటే తమ పునాదులను తొలగిస్తున్నట్లుగా వారు భావిస్తున్నారు. పార్టీ ఇటువంటి వైఖరితో విసిగిన కొంతమంది సీనియర్‌ నాయకులు సైతం పార్టీని వదిలి ఇతర పార్టీలలోకి వలసలు పోవడం కూడా జరుగుతున్నది. అవినీతి, అక్రమాల పట్ల వ్యామోహ వైఖరితోనే టీడీపీ ముందుకెళ్లినట్లయితే భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే కాగలదు. అందుకే మన విధానాలను బట్టే మన భవిష్యత్తూ నిర్ణయమవుతుందని పెద్దలు ఊరికే అనలేదు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *