‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

ముఖ్యమంత్రి చంద్రబాబులో ఈ మధ్య ఒక విషయం స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తిని అతిగా ద్వేషించడం. ఇదే కోణంలో మరింత వెనక్కి వెళితే బాబుకు అతిగా ద్వేషించే స్వభావం మొదటినుండే ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఆయన మొదట తన మామ ఎన్‌టిఆర్‌ను అతిగా ద్వేషించారు. ఆ క్రమంలో ఎన్‌టిఆర్‌ స్థాపించిన టీడీపీ పార్టీని సైతం కబ్జా చేశారు. 2004 ఎన్నికలలో తాను ఓడిపోయిన తరువాత బాబు కొన్నాళ్లు వాజపేయిని ద్వేషించారు. వాజపాయ్‌తో స్నేహం వల్లే మైనారిటీలు నాకు దూరమయ్యారు, అందుకే నేను ఓడిపోయాను, ఇక ఎప్పుడూ ఆ తప్పు చేయను అంటూ నోరు పారేసుకున్నారు. ఆ తరువాత మరికొన్నాళ్లు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ద్వేషించారు. బాబు రాజశేఖర్‌ రెడ్డిని ఎంతగా ద్వేషించారంటే ఒకానొక సందర్భంలో అసహనం పట్టలేక ‘ఫినిష్‌ చేసేస్తాను’ అని కూడా ప్రకటించారు. 2018 నుండి బాబు మోదీని అతిగా ద్వేషించడం మొదలుపెట్టారు. మోదీపై ద్వేషం ఎక్కడివరకు వెళ్లిందంటే టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో సైతం జట్టుకట్టేంత వరకూ వెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో సోనియాగాంధీని ఘాటుగా విమర్శించిన బాబు మోదీపై ద్వేషంతో సోనియా, రాహుల్‌లతో వేదిక పంచుకోవడానికి సైతం సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీతో పాటు కేసీఆర్‌ను, జగన్‌ను కలిపి ద్వేషించారు. వీరిపై ద్వేషం ఎక్కడివరకూ వెళ్లిందంటే పోలింగ్‌ రోజున ఇవిఎంలు ఒక గంట మొరాయిస్తే, దీనికి కారణం కేసీఆర్‌, జగన్‌లే అని, వారిద్దరూ మోదీతో చేతులు కలిపి తనను ఓడించడానికి పోలింగ్‌ జరగకుండా చూడాలని నిశ్చయించుకున్నారని, అందుకే ఇవిఎంలు మొరాయించేటట్లు చేశారని పస లేని విమర్శలతో తన అక్కసు వెళ్లగక్కారు.

పోలింగ్‌ పూర్తయిన తరువాత తాజాగా చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తన ద్వేషుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జికె ద్వివేదిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రమణ్యంలను అతిగా ద్వేషిస్తున్నారు.

ద్వివేదిపై..

ఎన్నికల ప్రచారం సమయంలో తన హయాంలో నియమితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాను ఎన్నికల కమిషన్‌ పక్కకు తప్పించి ఎల్‌.వి.సుబ్రమణ్యంను ఆ పదవిలో నియమించింది. ఇంటెలిజెన్స్‌ డీజీపీని, అలాగే కొంతమంది ఎస్‌.పి.లు, సిఐలనూ ఎన్నికల సంఘం తప్పించింది. ఇవన్నీ బాబుకు ఎన్నికల కమిషన్‌ పట్ల ద్వేషానికి కారణమయ్యాయి. అందుకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జికె ద్వివేదిపై ద్వేషం పెంచుకున్నారు. పోలింగ్‌ ముందురోజు ద్వివేదిని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోనే కలిసి వినతిపత్రం సమర్పిస్తూ మీరు నాకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మీరు కేంద్రం చెప్పినట్లు కాకుండా స్వతంత్రంగా వ్యవహరించండి అంటూ ఒక ఉచిత సలహా పడేశారు. పోలింగ్‌ పూర్తయిన తరువాత బాబు మరో అడుగు ముందుకేసి ద్వివేదిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో పోలింగ్‌కి ముందు, అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని బాబు పేర్కొన్నారు. సీఈవో గోపాలకష్ణ ద్వివేది తన అధికార పరిధిని అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. నిఘా విభాగాధి పతి సీఎంకు రిపోర్టు చేయకూడదని సీఈవో ఆదేశించారని, ఏ అధికారంతో ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారని ప్రశ్నించారు. ఈసీ ఇప్పటికైనా తన బాధ్యత గుర్తెరగాలని, ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు అడ్డుపడవద్దని సీఈవోకి, సంబంధిత అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

తాను శాఖా సమీక్షలు చేయకపోతే ఇక్కడ పనులు ఆగిపోతాయని, మే 23 లోపు ఖర్చులు పెరిగిపోతాయని, దానికి ఎవరు బాధ్యులని ఈసీని లేఖలో బాబు ప్రశ్నించారు. మరి గత ఐదేళ్ల నుండీ పనులు ఎందుకు నడవలేదో, అవన్నీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ఈ సమయంలోనే బాబుకు ఎందుకు గుర్తుకు వచ్చాయో ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. నేను సమీక్షలు చేస్తే తప్పు పడుతున్నారు. మరి కేసీఆర్‌, కేంద్రం సమీక్షలు చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? నాకో న్యాయం, వాళ్లకో న్యాయమా ? అనీ ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో శానససభకు ప్రస్తుతం ఎన్నికలు జరగలేదని, ఒకవేళ ఏదైనా సమీక్ష చేయవలసి వస్తే అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సంఘం అనుమతి తీసుకుంటున్నారని బాబు గమనించాలి. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న జడ్‌పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నికలను ఎన్నికల సంఘం అనుమతితోనే నిర్వహిస్తున్నారని బాబు గుర్తించాలి. అలాగే కేంద్రంలో ఎన్నికల కోడ్‌కి అతీతమైన భద్రతాపరమైన అంశాలు, అంతకుముందే నిర్ణయమైన మిషన్‌శక్తి ప్రయోగం, సబ్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి నిర్భయ్‌ పరీక్ష వంటివాటి పైన మాత్రమే సమీక్షలు జరుగు తున్నాయని, మిగతా శాఖా పరమైన సమీక్షలు ఏవీ జరగడం లేదని కూడా ముఖ్యమంత్రి గమనించాలి. గమనించాల్సిన మరో ముఖ్యవిషయం ఏమిటంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వివేదీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేసింది చంద్రబాబు పంపిన మూడు పేర్లలో నుండే. అంటే చంద్రబాబు ద్వివేది తాను చెప్పినట్లు నడుచుకుంటారని ఆశించారన్న మాట. కానీ ఇప్పుడు ద్వివేదీ కేంద్ర సంఘం చెప్పినట్లు నడుచుకుంటూ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు వ్యతిరేకంగా పరిణమించడంతో బాబు ఆయనను తీవ్రంగా ద్వేషిస్తున్నారు.

సీఎస్‌పై సైతం..

ఇక చంద్రబాబు పోలింగ్‌ తరువాత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరో వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్‌.వి.సుబ్రమణ్యం. ఈయనను అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠా స్థానంలో ఎన్నికల సంఘం నియమించి నప్పుడే ఈయనపై బాబు ద్వేషానికి బీజం పడింది. ఇప్పుడు ఆ ద్వేషం మరింత పెరగడానికి మరో పెద్ద కారణమే ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ అమలుకు ముందు జరిపిన అన్ని ఆర్థిక లావాదేవీలపై ఎల్‌.వి. సమీక్షలు నిర్వహిస్తుండటం. ఎల్‌.వి. సమీక్షలు నిర్వహించడానికీ మరో కారణం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై లెక్కలు పంపాలంటూ రిజర్వ్‌ బాంక్‌ చేస్తున్న వత్తిడి.

ఏమిటా లెక్కలు ?

పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్‌లో రాష్ట్రప్రభుత్వం రిజర్వ్‌బ్యాంక్‌ నుండి 8 వేల 2 వందల కోట్ల రూపాయలు ఓవర్‌డ్రాఫ్ట్‌గా తీసుకుంది. ఇటీవల మళ్లీ మరో వెయ్యి కోట్లు అప్పుగా కావాలంటూ లేఖ రాసింది. అయితే ఇంతకుముందు తీసుకున్న ఓవర్‌డ్రాఫ్ట్‌కు లెక్క చెప్పాలని, లేకపోతే మరో వెయ్యి కోట్లు ఇవ్వటం కుదరదంటూ రిజర్వ్‌బ్యాంక్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖకు ప్రస్తుత సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రమణ్యం సమాధానం రాయాల్సి ఉంది. దానికోసం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను లెక్కలు పంపాల్సిందింగా సీఎస్‌ సూచించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి లేదా ఆర్థిక మంత్రి ఈ లేఖకు సమాధానం ఇవ్వలేరు. అందుకోసం ఆర్థిక కార్యదర్శిని సీఎస్‌ లెక్కలు అడిగారు. సీఎస్‌కు లెక్కలు ఇవ్వకుండానే ముద్దాడ రవిచంద్ర దీర్ఘ సెలవుపై వెళ్లిపోయారు. దాంతో సీఎస్‌ ఎల్‌.వి. స్వయంగా ఆర్థిక శాఖ జరిపిన లావాదేవీలపై సమీక్షలు చేయడం ప్రారంభించారు. అప్పటినుండి ముఖ్యమంత్రి సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రమణ్యంను తీవ్రంగా ద్వేషించడం ప్రారంభించారు.

అసలు ఈ పని ముఖ్యమంత్రి లేదా ఆర్థిక మంత్రి చెయ్యాల్సింది. కోడ్‌ అమల్లో ఉన్నందున సీఎస్‌ చేసుకుంటున్నారు. ఎవరున్నప్పటికీ రిజర్వ్‌ బ్యాంక్‌ తాను ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడుగుతుంది. అడిగిన లెక్కలకు ఎవరైనా సమాధానం చెప్పక తప్పదు. ఇవన్నీ వ్యవస్థాగత పనులే కదా. మరి ఆ కోణంలో పనిచేసుకుపోతున్న సీఎస్‌పై ముఖ్యమంత్రి ఎందుకంతగా ద్వేషం ప్రదర్శిస్తున్నారు? ఆయనే కాక ఆర్ధిక మంత్రి, ఇతర మంత్రులు సైతం సీఎస్‌ను ద్వేషిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సీఎస్‌ రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నా రంటూ తన అక్కసు వెళ్లగక్కారు. పరిధిదాటి ప్రవర్తిస్తే మే 23 తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఎల్‌.వి. అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు చేయరాదన్నట్లుగా మాట్లాడటం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అయితే పట్టుబడిన తితిదే బంగారం అంశంపై సీఎస్‌ సమాధానం చెపుతా రంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వీరంతా సీఎస్‌ను ఇంతగా ద్వేషిస్తున్నారెందుకు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఆర్ధిక శాఖలో అవకతవకలు జరిగాయని, అవన్నీ సీఎస్‌ ఎల్‌.వి. చేస్తున్న సమీక్షలో బయటపడతాయేమోనని వీరంతా భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. లెక్కలు చెప్పమని సీఎస్‌ ఆర్థిక కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను అడిగితే, ఆయన చెప్పకుండా దీర్ఘ సెలవుపై వెళ్లడానికి ఇదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. దాంతో ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం పూర్తి బాధ్యతలు తీసుకుని లావాదేవీలన్నిటినీ బయటకు తీస్తున్నారనీ అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి అసహనానికి గురవుతున్నారని, ఆ అసహనంతోనే వారు సీఎస్‌పై తీవ్ర విద్వేషం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

అయితే బాబు విద్వేష వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఎన్నికలకు ముందు మోదీపై, ఇప్పుడు ద్వివేది, ఎల్‌.వి.లపై దారుణ విమర్శలు గుప్పించడం పట్ల ఇతర మంత్రులు, సీనియర్‌ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్తుకు ఇది మంచిది కాదని చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యక్తి అయిన సీఎస్‌ ఎల్‌.వి.ని రాజ్యాంగేతర శక్తి అనడం సమంజసం కాదని, ఈ వైఖరి ఇతర ఐఎఎస్‌ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులలో పార్టీ పట్ల అసంతృప్తిని రగుల్చుతుందని లోలోన మథనపడుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఫలితాల వరకు వేచి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఘర్షణ వైఖరి పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *