ఇక్కడేదీ ఆ చరిష్మా..!

ఇక్కడేదీ ఆ చరిష్మా..!

భారతీయ జనతా పార్టీ..

భారతదేశంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న జాతీయ పార్టీ..

ఇప్పటివరకు 11 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది..

మరో ఐదేళ్లకు గానూ ప్రజల నుండి సాధారణ మెజారిటీకి మించి అసాధారణ స్థాయిలో సీట్లు, ఓట్లు పొందింది.

జాతీయవాదం నినాదంతో ప్రజల గుండెల్లో పదిల స్థానం సంపాదించుకుంది. దేశాన్ని అభివృద్ధి వైపు శీఘ్రంగా నడిపించే పార్టీగా ప్రజలు వజ్ర సమానంగా నమ్మారు..

దేశవ్యాప్తంగా ఎందరో మహామహులైన నాయ కుల బలం, కార్యకర్తల బలగం ఆ పార్టీ సొంతం.

ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు పార్టీలో సభ్యులుగా నమోదయ్యారు.

ఆ పార్టీ సారథ్యంలో జాతీయ స్థాయిలో అయోధ్య వంటి ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిన ఉద్యమాలు విజయవంతంగా నడిచాయి. ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో సొంతంగానూ, మరో 6 రాష్ట్రాల్లో భాజపా నేతృత్వం వహిస్తున్న ఎన్‌డిఎ అధికారంలో ఉంది..

గత ఐదేళ్లుగా కేంద్రంలో సొంతబలంతో అధికారంలో ఉంది..

మోదీ వంటి బలమైన, ప్రజలను తన మాటల గారడీతో సమ్మోహన పరిచే నాయకుని బలం ఉంది.

గడిచిన ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. పలు రకాల, అన్ని వర్గాలను స్పృశించే రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఎన్నికలలో చెప్పుకోదగిన ఇటువంటి పనులు ఎన్నో ఉన్నాయి.

అన్నిటికన్నా మిన్నగా భాజపా ఈ సంవత్సరం జరిగిన (2019) సార్వత్రిక ఎన్నికలలో ఇంతకు ముందుకన్నా ఎక్కువగా సొంత, మిత్రుల మెజారిటీతో అసాధారణ విజయం సొంతం చేసుకుని మరింత ఉత్సాహంతో ఉంది. ఎదురుగాలి వీస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్‌లో సైతం తన పదిలమైన స్థానానికి ఎటువంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. పశ్చిమ బెంగాల్‌లో సైతం తన సత్తా నిరూపించుకుంది.

ఇప్పటికి పార్టీకి లోక్‌సభలో సొంతంగా 303 మంది సభ్యులు, రాజ్యసభలో 100 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1354 మంది శాసనసభ్యులు ఉన్నారు. అంతకుమించి కిందిస్థాయిలో పార్టీ కోసం ప్రాణాలు సైతం అంకితం చేయగల వేల మంది కార్యకర్తల బలం, బలగం ఈ పార్టీ సొంతం.

అంతటి ఘన చరిత్ర, బలం, బలగం ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత 37 ఏళ్లుగా ఎటువంటి ప్రభావం చూపకపోవటం, పార్టీ తరపున ఎటువంటి ఘన చరిత్ర నమోదు కాకపోవడం ఒకింత విడ్డూరమే. రాష్ట్రంలో అనేక కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో ఎన్నోసార్లు పార్టీ కీలకపాత్ర పోషించినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో తనదంటూ ఒక ప్రభావం చూపకపోవటం, రాష్ట్రంలో ఒక స్టాండ్‌ గల పార్టీగా పేరు రాకపోవడం మరింత వింత. 2019 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అసాధారణ సత్తా చూపినప్పటికీ రాష్ట్రంలో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానమూ సంపాదించక చతికిల పడటం ఒకింత విస్మయం కలిగించే అంశమే.

పైగా గడిచిన అయిదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎన్నో చేసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలిపింది, అన్ని పర్యావరణ అనుమతులు లభించేలా చేసింది. 7 వేల కోట్ల నిధులిచ్చింది. భవ్యమైన రాజధాని నిర్మాణానికి 10 లక్షల కోట్ల నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. ప్రాథమిక స్థాయిలో 15 వందల కోట్లు సైతం ఇచ్చింది. ఎయిమ్స్‌ వంటి పరపతి గలిగిన అనేక కేంద్ర విద్యా సంస్థలు, పరిశ్రమలు, శిక్షణ సంస్థలను కేవలం నాలుగేళ్లలోనే రాష్ట్రానికి మంజూరు చేసి వాటి అభివృద్ధికి నిధులనూ శీఘ్రగతిన కేటాయించింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా తనకు వీలైనన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చి తనదైన స్థాయిలో కార్యకర్తలకు ఉత్సాహం అందించారు. ఎన్నికల పర్యటనలో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లలో ఇంతకు ముందెన్నడూ లేనంత అభివృద్ధి చేసి చూపిస్తామనీ హామీ ఇచ్చారు. అయినప్పటికీ పార్టీ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపక చతికిలపడటాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఏ ఒక్కరూ కనీస స్థాయిలో తమ నియోజకవర్గంలో తమ ప్రభావం చూపించలేకపోయారు. పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో ఏ ఒక్కరికీ డిపాజిట్‌ దక్కలేదు. రాష్ట్రంలో పార్టీకి శాసనసభ ఎన్నికలలో 0.84 శాతంతో 2,63,849 ఓట్లు రాగా, పార్లమెంట్‌ ఎన్నికలలో 0.96 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇది నిన్న గాక మొన్న వచ్చిన జనసేన పార్టీ, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ప్రజల నిరాదరణకు గురై నిర్వీర్యమైన కాంగ్రెస్‌ పార్టీలకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ కావడం అత్యంత విస్మయకరం. ప్రభావం చూపుతారనుకున్న రాష్ట్ర స్థాయి నాయకులు సైతం ఈ ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపించలేకపోవడం విడ్డూరం. పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీచేసిన వారిలో ఇద్దరికి మాత్రం 2 శాతానికి పైగా ఓట్లు పోలవగా, ఆరుగురికి 1 శాతంకు పైన ఓట్లు పోలయ్యాయి. మిగతా వారందరికి 1 శాతం కూడా ఓట్లు పడలేదు.

కారణాలు అనేకం

ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీ మనుగడ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానం సంపాదించలేకపోవటానికీ, గత ఐదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేసినప్పటికీ ఇప్పటి ఎన్నికలలో ఘోరంగా ఫలితాలు నమోదు కావటానికి కారణాలు అనేకం అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ప్రముఖ నాయకుని కొరత

ఏ సంస్థ, వ్యవస్థ కైనా మూలస్తంభం ఎవరో ఒక ప్రముఖ వ్యక్తే అవుతారు. రాజకీయ పార్టీ కూడా దానికి మినహాయింపు కాదు. ఈ సూత్రం ప్రాంతీయ పార్టీల నుండి భాజపా, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలకూ వర్తిస్తుంది. కాంగ్రెస్‌లో ముఖ్యంగా నెహ్రూ కుటుంబం ప్రముఖ పాత్ర వహిస్తే భాజపాలో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌, అద్వానీ, ప్రస్తుతం నరేంద్రమోదీ చెప్పుకోదగ్గ వ్యక్తులుగా ఉన్నారు. అలాగే జాతీయ పార్టీలయినప్పటికీ రాష్ట్రాలలో అధికారంలోకి రావాలన్నా, దానిని నిలబెట్టుకోవా లన్నా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాభిమానం పొందిన వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన కృషే సగం కారణం అవుతుంది. పార్టీ ఘన చరిత్ర మిగతా సగం మాత్రమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌లు, రాజస్థాన్‌లో సింధియాలు, మధ్యప్రదేశ్‌లో ఉమాభారతి, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఒక శర్వానంద సోనోవాల్‌, ఒక మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌, అలాగే దక్షిణాదిన కర్నాటకలో యడ్యూరప్ప వంటి ప్రజాభిమానం పొందిన నాయకుల ప్రభావం ఆయా రాష్ట్రాలలో పార్టీ అధికారంలోకి రావడానికి సగం కారణం అవుతుంది. ఈ ప్రముఖ వ్యక్తులు పార్టీని అధికారం లోకి తేవడానికి బాధ్యతనంతా తమ నెత్తిన వేసుకుని తమ సొంత పార్టీ అన్నంత అంకితభావంతో పనిచేస్తారు. అలా చేసిన చోట్ల మాత్రమే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనూ, మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఇటువంటి ప్రముఖ వ్యక్తుల నాయకత్వం కరువైన విషయం స్పష్టంతా తెలుస్తోంది. తెలంగాణలో ఆలె నరేంద్ర, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, ప్రస్తుతం డా.లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి వంటి కాస్త మెరుగైన, అంకితమైన నాయకుల బలం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అటువంటివారు మచ్చుకైనా కనబడరు. గత 37 ఏళ్లుగా తెలుగుదేశంకు మిత్రపక్షంగా వ్యవహరించడం, అదే వ్యూహాత్మకం అని అప్పటి నాయకులు భావించడం ఇంతటి దుస్థితికి కారణం అని పరిశీలకులు కుండబద్దలు కొడుతున్నారు. ఇకనైనా పార్టీ, నాయకులు ఎదగాలంటే అటువంటి తప్పులు జరగకూడదనీ స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలలో పార్టీ రాష్ట్ర బాధ్యులు, ముఖ్య నాయకులందరూ వారి స్థాయిలో బాగానే కష్టపడ్డారన్న మాట వినిపిస్తోంది. వీరి కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం గత రెండేళ్ల నుండి భాజపా అప్పటి అధికార పార్టీ చేసిన అత్యంత దుష్ప్రచారానికి గురికావటం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ దుష్ప్రచారం గురించి, అది చేయబోయే నష్టం గురించి పార్టీ నాయకత్వం ముందుగానే ఒక అంచనాకు రాలేకపోవడం అసలు లోపం అనీ అంటున్నారు. తాము చేసిన అభివృద్ధి పనుల మీద, తమ బలమైన నాయకుడు మోదీపైనే వారు నమ్మకం పెట్టుకున్నారనీ, కానీ చివరకు దుష్ప్రచారం బాగా దెబ్బతీసిందని అంటున్నారు.

తగిన ప్రణాళిక లేమి

రాష్ట్రంలో 2017 నుండే పార్టీకి మిత్రపక్షమైన టీడీపీ నుండి ఇబ్బందులు ఎదురుకావడం ప్రారంభించాయి. ఆ తరువాత 2018 జనవరిలో ఆ పార్టీ ఎన్‌డిఎ నుండి బయటికి వచ్చి తమకు భాజపా శత్రుపక్షం అనే సంకేతాలను స్పష్టంగా పంపింది. అప్పటినుండి ఎన్నికల సమయానికి కనీసం సంవత్సరం 4 నెలల సమయం ఉన్నది. ఆనాడే పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లుగా నాయకుల ప్రకటనలు వెలువడ్డాయి. కొందరు నాయకులు తాము ఎన్నికలలో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపనున్నట్లు, అధికారం తమదే అన్నట్లుగా అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రకటనలు (ప్రగల్భాలు అనవచ్చేమో) గుప్పించారు. కానీ అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించ లేకపోవడం విచారకరం. ఎన్నికలకు సమాయత్తం కావాలంటే ముందుగా జిల్లా ఇంచార్జిలను నియమించాలి, వారికి పార్టీ చేస్తున్న, చేసిన అభివృద్ధి పనుల గురించి జిల్లాల్లో గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించటానికి తగిన నిధులను కేటాయించాలి. అంతకుమించి అవతలిపక్షం పార్టీ పట్ల చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రకటనలు సైతం వెలువడాలి. ఇవేవీ ప్రణాళికాబద్ధంగా జరగలేదని కొందరు నాయకులంటున్నారు. చివరకు అభ్యర్థులను కూడా చివరి నిమిషంలో ప్రకటించారని, అప్పుడు నిధులను ఇచ్చారని, అయితే ప్రచారం ప్రభావం చూపేవిధంగా నిర్వహించడానికి తగిన సమయం లేకపోయిందని వారంటున్నారు. కేంద్రనాయకులైన మోదీ, అమిత్‌షా తదితరులు పర్యటించినప్పటికి జరగాల్సిన ఆలస్యం జరిగిపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఎత్తుగడల లోపం

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికల రణరంగంలో నిలుచున్న జనసేన పార్టీ ఊహించని విధంగా భాజపా ఓట్లను చీల్చింది. అంతకుముందు పార్టీకి సంస్థాగతంగా ఉన్న ఓట్లలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ ఓట్లను జనసేన చీల్చింది. అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టి దానికి తగిన ఎత్తుగడ వేయగలిగిన స్థానిక నాయకత్వం పార్టీకి కరువైంది. అలాగే పార్టీ వైకాపాకు లోపాయికారీ మద్దతు ఇచ్చిందన్న ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీనిని ఖండించే ప్రకటనలు కూడా పార్టీ నుండి వెలువడ లేదు. దాంతో ఓటర్లలో వైకాపాకు వేస్తే భాజపాకు వేసినట్లే అనే భావన వచ్చిందని, సంస్థాగత ఓట్లు సైతం వైకాపాకు మరలాయని అంటున్నారు. భాజపా ఓట్లు తగ్గటానికి అదీ ఓ కారణమనీ అంటున్నారు. అన్నింటికీ మించి ఎన్నికలలో చివరి నిముషంలో పోటీ తెదేపా, వైకాపాల మధ్య కేంద్రీకృతమైంది. ఈ పరిస్థితిని తిప్పికొట్టి ఓటర్లను తమవైపు తిప్పుకునేవిధంగా ప్రచారంలో చివరి నిముషం వరకు భాజపా అభ్యర్థులు తమ ప్రచారం ప్రభావవంతంగా కొనసాగించ లేకపోయారు. చివరికి భాజపా ఓట్లను రాబట్టుకునే విషయంలో పూర్తిగా కుప్పకూలక తప్పలేదు.

అయితే ఈ సారైనా పార్టీ అన్ని నియోజక వర్గాలలో సొంతంగా పోటీ చేయడం విశేషం. ఇది భవిష్యత్తులో పార్టీ కార్తకర్తల గణం పెరగడానికి దోహదం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ పార్టీకి ఒడుదుడుకులు సహజం. వాటిని తట్టుకుని నిలబడటమే పార్టీ సమర్థతకు మూలం. రాబోయే ఐదేళ్లలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి, తమ లోపాలను సరిచేసుకుని, తగిన ప్రణాళికతో ముందుకెళితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తగిన ప్రభావం చూపే స్థాయికి పార్టీ ఎదగ గలగడం పెద్ద సమస్యేమీ కాదంటున్నారు. తెదేపా కుప్పకూలిన చోట భాజపా భర్తీ కావాలనీ, అందుకు ఇదే తగిన సమయం అనీ అంటున్నారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *