బీజేపీ సరికొత్త వ్యూహం..

బీజేపీ సరికొత్త వ్యూహం..

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా అవతరించిన భాజపా పలు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ ప్రధానంగా దక్షిణాదిన కాషాయ జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణను అందుకు కేంద్రంగా ఎంచుకున్నట్లు కూడా సంకేతాలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ఆలోచనలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. బయటకు ఎలాంటి ప్రకటనా చేయకున్నా అంతర్గత ఎజెండా మాత్రం ఇదే అన్నది సుస్పష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పక్కా ప్రణాళిక

ఒక రకంగా తెలంగాణ వేదికగా బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఆ కార్యాచరణ ఇప్పటికే మొదలైందంటు న్నారు. బలమైన నాయకులు, ఇతర పార్టీల్లో ముఖ్యులుగా కొనసాగుతున్న నేతలను పార్టీలో చేర్చుకునే పర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటిదాకా చూసింది ట్రైలర్‌ మాత్రమేనని ఇక మున్ముందు అసలు సినిమా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు బీజేపీ నాయకులు. అంటే తెలంగాణ మీదుగా దక్షిణ భారత దేశంలో బీజేపీకి బాటలు వేసే తంతు నిర్విఘ్నంగా సాగుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేసి దాన్ని అమలు చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అయితే నేరుగా జాతీయ నాయకత్వమే ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండటం రాజకీయాల్లో ఆసక్తికర చర్చను లేవనెత్తుతోంది. ఓవైపు సంస్థాగతంగా పార్టీని పటిష్టంగా చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి బలమైన నాయకత్వాన్ని చేర్చుకునే దిశగా భాజపా దూకుడు పెంచిందని చెబుతున్నారు.

బీజేపీయే ప్రత్యామ్నాయం

గత కర్ణాటక ఎన్నికల సమయంలోనే దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ఎంతగానో శ్రమించింది. అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్‌ వ్యూహంతో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. దీంతో ఈసారి తెలంగాణలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలని మొదటినుంచీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచింది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో కాషాయ పవనాలు వీస్తున్నాయని కమలనాథుల్లో ఆశలు చిగురించాయి. ఎందుకంటే నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలుపొంది.. ఆత్మరక్షణలో పడిన ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల నాటికి ఊహించని రీతిలో పుంజుకోవడం ఆశలను చిగురింపజేసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్న నినాదాన్ని బీజేపీ నేతలు బలంగా వినిపించారు. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే.. ఇతర పార్టీల్లోని నాయకులకు కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

అందరి చూపు అటువైపే..

తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో సరికొత్త హడావుడి ఉంటుందని బీజేపీ నేతల మధ్య చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అలాగే.. టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉనికి కోసం జాడలు వెతుక్కుంటున్న తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లూ ముఖ్యపాత్ర పోషించిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్‌ తదితరులు బీజేపీలో చేరారు. వాళ్లందరినీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాంమాధవ్‌.. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల నుంచీ బీజేపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అన్నిపార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. అయితే.. అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా కాషాయ కండువాలు కప్పు కున్నారు. ఆ చేరికలకు కొనసాగింపుగా తెలంగాణ నుంచి కూడా వలసలు మొదలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడతామని బీజేపీ జాతీయ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా నేడో, రేపో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఇటీవల హైదరా బాద్‌లో పర్యటించిన బీజేపీ నేత రాంమాధవ్‌తో నలుగురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకురాలు డీకే అరుణ నివాసంలో ఈ సమావేశం జరిగినట్లు చెప్పుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఈ భేటీ జరిగినట్లు, సందర్భాన్ని బట్టి వీరు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తెలంగాణకు చెందిన వివిధ పార్టీల్లోని అసంతృప్తి నేతలతో పాటు ప్రజాప్రతినిధులను కూడా చేర్చుకునేందుకు వీలుగా బీజేపీ సిద్ధంగా ఉంది. ఇక, వారంతా పార్టీలో చేరడమే తరువాయి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అధికారంలోకి రావడమే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించిన భాజపా జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను ఉదృతం చేయాలని సూచనలు ఇస్తోంది. తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు 20 శాతం అదనపు లక్ష్యాన్ని నిర్దేశించగా, తెలంగాణలో మాత్రం 40శాతం అదనపు సభ్యత్వ నమోదును లక్ష్యంగా నిర్దేశించారు. అంతేకాదు జాతీయ స్థాయిలో జూలై ఆరవ తేదీన ప్రారంభించబోతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలోనే శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించడం రాష్ట్రంపై ఆ పార్టీ ఎంతగా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.

కేంద్ర మంత్రుల పర్యటనలు

ఇక.. తమ లక్ష్య సాధనలో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి 15 రోజులకు ఒకరు చొప్పున కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏడాది వ్యవధిలో మొత్తం 52 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ కండువాలు కప్పే కార్యక్ర మంలో భాగంగా.. వివిధ పార్టీల నుంచి చేరే వారిని గుర్తించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు నియమించేందుకు నిర్ణయించారు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతాపార్టీ సరికొత్త వ్యూహాలతో ముందు కెళ్తుండటం, తెలంగాణ మీద గురి పెట్టడం రాజకీయంగా చర్చను లేవనెత్తుతోంది.

– సుజాత గోపగోని, 6302164068

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *