విశ్వరూపము : విశ్వారంభము : ఆదిశక్తి అర్థనారీశ్వరి

విశ్వరూపము : విశ్వారంభము : ఆదిశక్తి అర్థనారీశ్వరి

ఇటువంటి నక్షత్ర నంచారానికి గర్భకుహరమైన విశ్వంయొక్క సమష్టి దృశ్యం ఏమిటి?

ఆకాశ శూన్యంలో ఎన్ని నక్షత్రాలున్నాయో సంపూర్ణంగా వాటి సంఖ్య మనకు తెలియక పోయినప్పటికీ ఆ మొత్తం సంఖ్యయొక్క భ్రమణం కలసినప్పుడు, ముందు చెప్పిన విషయాలనుబట్టి, ఒక విశ్వవలయం ఏర్పడుతుందనుకోవాలి. నక్షత్రాల విశ్వసమూహం గుండ్రంగా కనుపిస్తుంది. విశ్వ సమూహపు అంచుల్లో సంచరించే నక్షత్రాల ఆకర్షణ సీమల సరిహద్దులు కలిపి భావిస్తే ఆఖండవిశ్వం చిత్రం మనోనేత్రంలో గోళాకారంలో గోచరిస్తుంది.

అసలు నక్షత్రాలు ఎందుచేత మండుతున్నాయి అనే విషయాన్ని సునిశితంగా చర్చించవలసిన అవసరం స్థలాంతరంలో ఉందికాబట్టి ప్రస్తుతం అది వదలి వేద్దాము.

ఈ నక్షత్రాలకు పూర్వం సృష్ట్యాదిలో విశ్వారంభంలో యేది ఉండేది? అంటే విశ్వం ఎట్లా పుట్టింది? ఎందులో నుంచి పుట్టింది? అనే ఆదిమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి, బుద్ధి స్పష్టిలో వికసించిన నాటినుంచి అఖండ ప్రయత్నాలు జరిగాయి.

ఋగ్వేదకాలంలోనో అంతకు ముందో అంకురించి, ఉపనిషత్తుల్లోనూ, షడ్దర్శనాది ప్రఫుల్ల శాస్త్ర సీమల్లోనూ ఆ విచారమే ప్రవహించింది; భారతదేశాన్ని యా వద్భూ గోళంలోనూ జ్ఞానదేవతకు జగదేక పీఠం చేసింది.

”ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

ఎవ్వనియందుడిందు పరమేశ్వరు డెవ్వడు మూల కారణం

బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు?”

అనేవి, విశ్వంయొక్క మూల స్తంభాల్లాంటి ప్రశ్నలు కదా. మూల కారణం బెవ్వడు? అనే విశ్వ వివేచనతో దిదృక్షులు సృష్టి మూలాన్ని చూడటానికి తపించి తపించి చెప్పిన ”యద్వాచానభ్యుదితం, యచ్ఛ్రోత్రేణ నశ్రుణోతి” ఇత్యాది ఉపనిషద్వాకాలు వారి ప్రబల ప్రయత్నాల్ని సూచిస్తున్నాయి; మరొక ప్రక్క ప్రయత్న వైఫల్యాన్ని కూడా సూచిస్తున్నాయి.

”న ఇతి న ఇతి” – ఇదికాదు ఇదికాదు, అనే పరిశోధన జరుపగలిగారు కానీ ఇదమిత్థమని చెప్పలేకపోయారు. చివరకు ”కలడు కలం డనెడు వాడు కలడో, లేదో” అన్నారు. ఎవరో ఎరుగమనే తాత్పర్యం. కానీ ‘ఆ మూల కారణం’ యొక్క రూపాంతరాలను సృష్టిలో అంతటా చూస్తున్నాము. రూపగుణ రహితమైన ఆ మూల కారణం మన భౌతిక ఇంద్రియాలకు అతీతమైనది. ఈ సత్యాల్నే ఈనాటి శాస్త్ర విజ్ఞానమూ, తత్త్వ విచారమూ పునరుద్ఘాటిస్తున్నాయి.

ఇక నా కధాక్రమానికి తిరిగి వస్తే- నక్షత్రాలు అణువుల్లోంచి ఉద్భవించాయనీ, అణువులు ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్లు, అనే విద్యుచ్ఛక్తి కణాల్నుంచి పుట్టాయనీ ఇంతకు క్రితం చెప్పాను. ఎలెక్ట్రాన్లు స్త్రీ ముఖమూ, ప్రోటాన్లు పురుష ముఖము. మామూలుగా విద్యుచ్ఛక్తి, ఒక రాగితీగెలో నుంచో లేక ఏదో అటువంటి ఒక వస్తువులో నుంచో ప్రవహించేటప్పుడు ప్రవాహం యొక్క పురోగమన ముఖం స్త్రీ ముఖమనీ, వెనుక ముఖం పురుష ముఖమనీ తెలుసుకోవాలి. విద్యుత్సవాహంలోని ఈ రెండు ముఖాల ధర్మాలనే, అణువులోని ఎలెక్ట్రానులు, ప్రోటాన్లు నిర్వర్తిస్తాయి. అయస్కాంత శక్తికి కూడా విద్యుత్తుకులాగే పై రెండు ముఖాలూ వున్నాయి, ఆ రెండు ముఖాలూ అట్లాగే ప్రవర్తిస్తాయి. ఈ సందర్భంలో విద్యుత్తుయొక్క రూపాంతరమే అయస్కాంత శక్తి అనీ, విద్యుత్‌, అయస్కాంత, ఉష్ణ, కాంతి ఇత్యాది శక్తులన్నీ ఒకేశక్తి యొక్క రూపాంతరాలనీ తెలుసుకోవాలి. విశ్వంలో శక్తి అంతా ఒకటే. అదే అనేక దశల్లో, అనేక రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. విద్యుత్తే మామూలు ఇనుప ముక్కను అయస్కాంతంగా చేస్తుంది. విద్యుత్తే వేడిగామారి, వంట గదుల్లోనూ, అనేక దైనిక సందర్భాల్లోనూ మనకు ఉపకరిస్తూ ఉంది. విద్యుత్తే వేడి అయిన తర్వాత ఇంకా తీవ్రమైన వేడి అయి వెలుతురుగా మారి, విద్యుద్దీపాల రూపంగా మన ఇండ్లను తేజోవంతం చేస్తూఉంది. ఇక- ఇట్లాంటి విద్యుచ్ఛక్తి యొక్క విభిన్నమయిన ఆ రెండు ముఖాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. కానీ ఆ రెండు ముఖాల్లోనూ స్త్రీ ముఖాన్ని స్త్రీ ముఖానికి సమీపంగా తీసుకువస్తే ఆ రెండూ సధర్మ ముఖాలు కాబట్టి దూరంగా తొలగిపోతాయి. కానీ విధర్మ ముఖాలను అంటే స్త్రీ ముఖాన్నీ పురుష ముఖాన్నీ చేరువకు తెచ్చినప్పుడు అవి చటుక్కున ఆకర్షించుకుని కలుస్తాయి. ఈ దృశ్యమే అణువులో గోచరిస్తూ ఉంది. విధర్మ ముఖాలైన ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్లు పరస్పరా కర్షణచేత ఒకదానికొకటి అంటి పెట్టుకొని ఉంటాయి. గోపాలకృష్ణుని చుట్టూ రాసక్రీడ సలిపే గోపికల్లా ప్రోటాన్లు కేంద్రంగా ఉంటే ఎలెక్ట్రాన్లు నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. విశ్వసృష్టిలో ఈ ద్విత్వము లేక స్త్రీ పురుష భావము ప్రధాన సూత్రంగా సర్వత్రా గోచరిస్తుంది. అది ఆణువుల్లో నుంచి, ఆరంభించిందన్నమాట!

సృష్టికి పూర్వం విశ్వశూన్యంలో ఈ శక్తి ముఖద్వయం అయిన ఎలెక్ట్రాన్లు వారికి ప్రోటాన్లు అనే రెండు కణాలుగా కాకుండా అవిభక్తంగా అర్థనారీశ్వర స్వరూపంగా (అంటే ఏకంగా) ఉండి ఉండాలి. అప్పుడు విశ్వశూన్యం ఎట్లా ఉండేదో, ఆ అర్థనారీశ్వర అవిభక్త శక్తి ఎట్లా ఉండేదో, దురూహ్యము.

”లోకంబులు, లోకేశులు, లోకస్థులు దేగిన తుది నలోకంబగు పేంజీకటి కవ్వల నేకాకృతి నతని”ని గురించి ఊహించటం కష్టమే. ఆ శక్తి శూన్యంలో ఎట్లా ఉండేదో? ఎంతకాలం అట్లా ఉందో? ఎందుకు ఉందో? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి మూలమేమిటో? ఇది అసాధ్యమైన విచారణ.

ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్ల జననం

కానీ ప్రాచీన భారతీయ మేధస్సు ఈ ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చింది. నక్షత్రాలు ఎట్లా ఉద్భవించాయి? విశ్వమెట్లా ప్రారంభించింది? అనే ప్రశ్నలకు అధునిక శాస్త్ర విజ్ఞానం ఏ విధంగా విచారించి సమాధానం ఇస్తుందో అట్లాగే ఆ పద్ధతుల్లోనే అంటే బుద్ధి ప్రభావంతోటి సునిశిత విచారం కొనసాగించి, ప్రాచీన భారతీయ మేధస్సుపై ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఆధునిక విజ్ఞానంలో వాటికి కారణాలు దొరకవు. శూన్యంలో శక్తి ఉండేది అనే నా ఊహను అటుంచి, అధునాతన శాస్త్రాన్ని తీసుకుంటే విశ్వోదయ కాలంలో మొదట శూన్యంలో ఒక విచిత్ర వాయువు నిండి ఉండేది అంటారు. ఆ వాయువుకు ముందు ఏమి ఉండేదో ఈ వాయువు ఎట్లా వచ్చిందో వారుచెప్పలేదు. కాని ఆ వాయువు మాత్రం తొంభయి రెండు అని ఇంతకు ముందు చెప్పిన మూల పదార్థాల యొక్క ఆవిరి అని అన్నారు. మూల పదార్థాల ఆవిరి అంటే – రాగి ఒక మూల పదార్థం. ఆ రాగి విపరీతమైన ఉష్ణోగ్రతలో ద్రవీభవిస్తుంది. ఉష్ణోగ్రత ఇంకా హెచ్చితే రాగి ద్రవం అవిరిగా మారుతుంది. కానీ ఘనపదార్థమైన రాగి ఆవిరిగా మారాలంటే ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ఊహించండి. సూర్యుడు మొదలైన మండే గోళాల్లో ఉష్ణోగ్రతలు ఊహించరాని స్థాయిల్లో ఉండి, రాగి, ఇనుము, వెండి, నికెలు, సోడియం మొదలైన మూలపదార్థాలు రూపొందికూడా ఉండవనీ, వాటికి కారణభూతమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లుగా విడిపోయి ఉంటాయనీ తెలుసుకోవాలి. కానీ ముందు చెప్పిన వాయువు ఇట్లాంటి మూల పదార్థాలకు మూలమైన ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్ల దశకాదు. ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్లు కలసి అణువులుగా రూపొంది ఉన్న దశ. అట్లాంటి అపార అణు సముద్రమే నేటి శాస్త్రజ్ఞులు చెప్పే శూన్యంలో మొదట ఉన్న వాయువు.

కాని మొదట ఉన్నది శక్తి అని మనం ఇంకా ఒక దశముందు నుంచీ ప్రారంభించవచ్చును. అణువులోని ఎలాక్ట్రాన్లు, ప్రోటాన్లు విద్యుచ్ఛక్తే కాబట్టి ఆది శక్తిని విద్యుచ్ఛక్తిగానే అర్థం చేసుకోవడంలో తప్పుండదని నా అభిప్రాయం. ఆ ఆదిశక్తికి విద్యుచ్ఛక్తి స్వభావ ప్రవృత్తులే ఉంటాయనుకోవచ్చును. (అందులో ద్వైముఖ్యంకూడా) ఆనాడు శూన్యంలో అంతా ఒకే శక్తి ఉండేది. కనుక దాని ధర్మాన్ననుసరించి దానికి రెండే ముఖాలుండేవి; ఒక ముఖం ఒక చివర మరొక ముఖం మరో చివర. స్త్రీ ముఖం స్వభావానుగుణంగా పురుష ముఖాన్ని చేరటానికి ప్రయత్నించేది. ముఖాలు చేరి ఒక చివర ఉండేవి గనుక శక్తి అవిభక్త అవటంచేత స్త్రీ ముఖం, పురుష ముఖం కోసం ముందుకు పోయేసరికి పురుష ముఖం వెనక్కి లాగబడి వెనక్కి పోయేది. ఈ ప్రయత్న ఫలితంగా శక్తి పరిభ్రమణం కలిగి ఉండాలి.

పరిభ్రమణం మూలంగా శక్తి వ్యయం అవుతుంది. అందుచేత ఉష్ణోగ్రత తగ్గుతూంది. ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉండగా తర్వాత దశలో పురుష ముఖాలు స్త్రీ ముఖాలు విభాగం అయిపోయి ఉండాలి. మరి; స్త్రీ ముఖమే పురుష ముఖం కోసం ఎందుకు ముందుకు పోతూఉంది అంటే, అణువులలో పురుషముఖం (ప్రోటాన్స్‌) మధ్య స్థిరంగా ఉండగా స్త్రీ ముఖం (ఎలెక్ట్రాన్‌) దానిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఎట్లాగంటే ఆదిశక్తిలోని స్త్రీ ముఖమే స్వయంగా పురుషముఖం కోసం పోవడంచేత ఏర్పడిన పరిభ్రమణం కనుకనే ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత పురుష ముఖమూ, స్త్రీ ముఖమూ విడిపోగా పురుష ముఖం స్వయంగా పరిభ్రమించలేదు. కనుక పురుష ముఖం ఆగిపోయి క్రమంగా భ్రమణం తగ్గి పోయి, తర్వాత దశలో స్థిరంగా నిలచిపోయింది. స్త్రీ ముఖం మొదటి నుంచీ స్వయంగానే ఆకర్షణ ధర్మంలో ప్రారంభించి తిరుగుతూనే ఉంది. కనుక తర్వాత కూడా తిరుగుతూనే ఉంది. పురుష ముఖం స్థిరంగా తటస్థంగా ఉంది.

కపిల మహర్షి తన సాంఖ్య సిద్ధాంతంలో పురుషుడు తటస్థంగా ఉంటే స్త్రీయైన ప్రకృతి స్వయం పూర్వకంగా ప్రవర్తించి సృష్టి సంసారాన్ని విస్తరింప జేస్తుందని ప్రతిపాదించాడు.

–  గుంటూరు శేషేంద్రశర్మ

ఇతర పుస్తకాల వివరాలకు :

Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com ,
9441070985 , 7702964402

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *