కేంద్రం ఇవ్వందే భారీ బడ్జెట్‌ సాధ్యమా?

కేంద్రం ఇవ్వందే భారీ బడ్జెట్‌ సాధ్యమా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ అనేక తాయిలాలతో 2 లక్షల 26 వేల 177 కోట్లతో భారీ బడ్జెట్‌ను ఫిబ్రవరి 5 న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గంటకు పైగా బడ్జెట్‌ ప్రసంగం చేసి అనేక అతిశయోక్తులు పలికారు. పనిలో పనిగా ‘విభజన వల్ల నష్ట పోయాము, కేంద్రం ఎలాంటి సహాయం అందిచ లేదు’ అని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోతే ఇంతటి భారీ బడ్జెట్‌కు రూపకల్పన ఏలా చేయగలిగారు?

ఈ బడ్జెట్‌ను చూసిన వారెవరైనా బాబు కేంద్రంపై చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేయగలరు. మొదటి నుంచి అనుకరణలో ముందుండే చంద్రబాబు ఈ సారికూడా అదే పునరావతం చేశారు. అక్కడ మోదీ ప్రవేశపెట్టిన పథకాలనూ, ఇక్కడ ప్రతిపక్ష నేత ప్రకటించిన పథకాలనూ కాపీ కొట్టి వాటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇక్కడ ఒకవైపు కష్టాల్లో ఉన్నాం ఆదుకోండని అడుగుతూనే వేల కోట్ల రూపాయల ప్రజాకర్షక పథకాలను ప్రారంభిస్తున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రైతులకు రుణమాఫీ ఎలా చేయగలిగింది? స్వయం సహాయక సంఘాల సభ్యులకు పసుపు కుంకుమ పథకం కింద వేల కోట్ల రూపాయలు ఎలా అందిచగలిగింది? పెన్షన్లను 10 రెట్లు ఎలా పెంచగలిగింది? వీటన్నిటికి కేంద్ర సహాయ సహాకారాలు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా ఎలా చేయగలుగుతోంది? అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర పథకాలనే తమవిగా చెప్పుకుంటూ..

బాబు రాబోయే ఎన్నికల సందర్భంగా కేంద్ర పథకాలనే తమ పథకాలుగా చెప్పు కుంటున్నారు. ఈ బడ్జెట్‌లో వాటికి కేటాయింపులు కూడా జరిపారు.

– రైతులకు 6 వేలు పెట్టుబడి సాయం అందించే ‘పీఎం-కిసాన్‌’ కేంద్ర పథకానికి పసుపుపచ్చ రంగు వేసి ఇది తమ పథకమే అని ప్రజలను మోసం చేయడానికి బాబు యంత్రాంగం సిద్ధం అయ్యింది. కేంద్రం అందించే 6 వేలకు ఈ బడ్జెట్‌లో మరో నాలుగు వేలు జతచేసి దానికి అన్నదాత సుఖీభవ పేరుతో తమ పథకంగా ప్రచారం చేసుకుంటోంది.

– ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దేశంలోనే అత్యధికంగా ఇళ్లను ఏపీకి కేంద్రం కేటాయించింది. ఆ ఇళ్లకు కూడా ఎన్టీఆర్‌ గహాలుగా నామకరణం చేసి బాబు మనువడు దేవాన్షు పేరుమీద కాలనీలు కట్టిస్తున్నారు. ఈ పథకానికి కూడా 5 వందల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటా యించారు. కేంద్రం ఇవ్వందే ఇవి రాష్ట్రానికి ఎలా వచ్చాయి ? కానీ కేంద్రం ఏమీచేయలేదని బాబు విమర్శించడం, దానికి ఆయన పెంపుడు పత్రికలు వంతపాడటం ప్రజలు చూస్తూనే ఉన్నారు.

దేశంలోని ప్రజలందరికీ కేంద్రం బీమా ప్రవేశపెట్టింది. దానిని అసంఘటిత రంగ కార్మికులతోపాటు అన్నివర్గాలకు ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని చంద్రన్న బీమాగా ప్రచారం చేసుకుంటూ ఈ బడ్జెట్‌లో 354 కోట్లు కేటాయించడం విశేషం. కేంద్రం ఇవ్వకుండా ఇది ఎలా చేయగలిగారు?

– ఏపీలో వెనుకబడిన జిల్లాలైన నాలుగు రాయలసీమ, మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంటు రూపంలో 1050 కోట్ల రూపాయలును కేంద్రం అందించింది. బాబు యంత్రాంగం వాటిని వేరే అవసరాలకు మరల్చి ఈ ప్రాంతాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విష ప్రచారం చేస్తున్నారు.

– రాజధాని ప్రాంతం నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలను తమ అనుయాయుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి బాబు అప్పగించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో సెక్రటేరియట్‌, అసెంబ్లీ భవనాలు వంటి ప్రభుత్వ భవనాలు నిర్మించి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు చూపిస్తున్నప్పటికీ ఈ తాత్కాలిక భవనాలు వర్షం నీటిని లోపలకి రానివ్వకుండా ఆపలేకపోతున్నాయి. అయితే రాజధాని నిర్మాణం, భూముల సేకరణ కోసం ఈ బడ్జెట్‌లో 226 కోట్లు, పోయిన బడ్జెట్‌లో 166 కోట్లు కేటాయించారు. మరి కేంద్రం ఇవ్వకపోతే వీరు అన్ని కోట్లు ఎక్కడినుండి తెచ్చి ఖర్చుపెట్టగలరు?

– కడపలో స్టీలు ప్లాంటు విషయంలో కూడా ఖనిజ లభ్యత, ఆర్థికంగా ఇది ఎంతవరకూ లాభదాయకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ విషయాలను కేంద్రం అనేకమార్లు స్పష్టం చేసింది. కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిచేయాల్సిన ఫార్మాలిటీల గురించి పట్టించుకోకుండా కేంద్రం ఈ ప్రాజెక్టుకు మోకాలడ్డిందంటూ పదేపదే విషప్రచారం చేస్తున్నారు. కేంద్రం చేయకపోయినా మేం చేస్తాం అంటూ ఏకంగా టెంటు లేపి శంకుస్థాపన సైతం చేసేశారు. కాని కడప స్టీల్‌ ప్లాంట్‌కంటూ ప్రత్యేక నిధులేమీ ఈ బడ్జెట్‌లో కేటాయించకపోవడం గమనార్హం. ఇండస్ట్రీస్‌ & కామర్స్‌ విభాగంలో 4114 కోట్లు కేటాయించినట్లుగా ఉన్నప్పటికీ ఇది స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఏమాత్రం సరిపోదు. కేంద్రం ఇవ్వకపోయినా తామే నిర్మిస్తామంటూ చెపుతున్న ముఖ్యమంత్రి బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా ఎలా నిర్మించగలరో ఈ బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పనేలేదు.

– విశాఖ రైల్వే జోన్‌ విషయంలో ఒడిశా రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అది ముందుకు పడటంలేదు. విశాఖ జోన్‌ను కోరుతున్న చాలా ప్రాంతాలు ఒడిశాకు చెందినవి ఉండటంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాని బాబు అసలు విషయాన్ని దాచి, కేంద్రం విశాఖ జోన్‌కు మోకాలడ్డు తోందంటూ అబద్ధాలు చెపుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వమే అనేక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతో రాష్ట్రంలో అనేక పథకాలను అమలు పరుస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, జాతీయ సామాజిక సహాయ పథకం ద్వారా పింఛన్లు, ఆహార భద్రతా చట్టం ద్వారా రేషన్‌లో బియ్యం, ఇతర ఆహార దినుసులు; పేదలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లను వంటి పథకాలను కేంద్రమే అందిస్తోంది. రాష్ట్రానికి అనేక జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. వీటి ద్వారా వేగంగా రోడ్ల అభివద్ధి జరుగుతోంది. మౌలిక సదుపాయాల రంగంలో కూడా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్టుల ప్రాధాన్యతలను అనుసరించి కేటా యింపులు జరుపుతోంది. కానీ వీటి గురించి రాష్ట్ర నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు.

20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 4.8 లక్షల కోట్లతో, ఐటీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక 2.34 లక్షల కోట్లతో బడ్జెట్లను ప్రవేశ పెట్టాయి. వీటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ చాలా ఎక్కువగా ఉంది. గొప్పల కోసం 2.26 కోట్ల బడ్జెట్‌ను ఏపీ ప్రవేశ పెట్టడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయగలదు. ఏపీ ముఖ్యమంత్రి తన హయాంలో రాష్ట్రం గొప్పగా అభివద్ధి చెందిందని చెప్పుకోడానికి గణాంకాలను ఎక్కువ చేసి చూపుతున్నారు.

ఒక వైపు రెవెన్యూలోటు ఉందని చెబుతూనే 25 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశాం అని ప్రకటించారు. 94 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల ఓట్ల కోసం వారికి పసుపు కుంకుమ నిధులంటూ 5700 కోట్ల రూపాయలను అందించారు. ఇవి 57 లక్షలమందికి మాత్రమే సరిపోతాయి. మరి మిగతావారి సంగతి ఏటేమిటనేది బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదు.

వద్ధుల, వికలాంగుల, వితంతువుల ఫించన్లను పది రెట్లు పెంచారు. ఇంత లోటు ఉన్న పరిస్థితిలో వీరందరికీ భవిష్యత్తులో ప్రకటించిన స్థాయిలో పెన్షన్లకు ఎలా అందిస్తారనేది సమాధానం అందని ప్రశ్నగానే మిగిలిపోతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివద్ధి పనిలో కేంద్రం సాయం ఖచ్చితంగా ఉంది. ఈ విషయం బాబుకు కూడా తెలుసు కాని వారి పార్టీ అస్థిత్వం కోసం మోదీ చరిష్మాను దిగజార్చాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు హర్షించరని భావించి కాంగ్రెసు పార్టీ పెద్దలను పార్టీలో చేర్చుకుంటున్నారు. నిన్న కోట్ల కుటుంబం, మొన్న కిశోర్‌ చంద్రదేవ్‌ ఇలా ఒక్కొక్కరుగా పసుపు కండువా కప్పుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోలేరని భావించటం అమాయకత్వమే.

బడ్జెట్‌లో బడాయిలు

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ఈ ఐదేళ్లలో ఎన్నో చేశామని, లోటు ఉన్న రాష్ట్రంలో ఇన్ని చేయగలమని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. పూర్తి కాని పనులను కూడా పూర్తి చేశామని చెప్పారు.

– ‘అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రజా రాజధాని అమరావతిని నిర్మిస్తామని మనం కలగన్నామా?’ అన్నారు. ఇంతవరకూ రాజధాని లేఅవుట్‌ ఫైనలే కాలేదు. నిర్మించినట్లుగా ఆయన ఎందుకు భావించారు?

– అమరావతి నిర్మాణానికి 28,074 మంది భూయజమానులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వటానికి ముందుకు వస్తారని, 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా?’ అన్నారు. మరి అంతమంది ఇచ్చిన భూములను ఏం చేశారు? ఇప్పటివరకూ లేఅవుట్‌ ఎందుకు ఫైనల్‌ చేయలేకపోయారు? అంతమంది ఇచ్చిన విరాళాలను లెక్కల్లో ఎందుకు చూపటం లేదు?

– ‘ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం డ్యామ్‌ శరవేగంగా పూర్తి అవుతుందని మనం ఊహించామా?’ అన్నారు. డ్యామ్‌ పూర్తి ఎక్కడ అయింది? కేంద్రం ఇచ్చిన 7 వేల కోట్లకు సరిపడా పనులే ఇంతవరకు సాగలేదు. ఇంకా వాల్‌ నిర్మాణమే పూర్తిగా కాలేదు. గేట్లు పెట్టడానికి వీలయిన నిర్మాణాలు ఇంకా ప్రారంభమే కాలేదు. ఇవన్నీ పూర్తి కాకుండా డ్యామ్‌ పూర్తయిందని మంత్రి ఎలా మాట్లాడుతారు?

– ‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని ఊహించామా?’ అన్నారు. అసలు విమానాశ్రయాల అభివృద్ధి రాష్ట్ర పరిధిలోనిది కాదు. కేంద్ర పరిధిలోనిది. లోటులో ఉన్నామని చెప్పుకునే ఏ రాష్ట్రమూ కేంద్ర పరిధిలోని అంశాలపై డబ్బు ఖర్చుపెట్టదు. మరి మూడు విమానాశ్రయాలు కేంద్రం ఇవ్వకుండా ఎలా అభివృద్ధి చేయగలిగారు? ఇటీవల మోదీ కూడా ఈ మూడు విమానాశ్రయాల గురించి చెపుతూ కేంద్రం ఇచ్చిందని చెప్పటం గమనార్హం.

ఇటువంటివే అనేక అతిశయోక్తులు బడ్జెట్‌ ప్రసంగంలో దొర్లాయి.

మంత్రి వీటిని శాసనసభ సాక్షిగా మాట్లాడుతూ ప్రజలకు అబద్ధాలు చెప్పటం కాదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *