రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

గంటల వ్యవధిలోనే భూగర్భ వంతెనల నిర్మాణాలు

ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పట్టేది. ఆ దారి మొత్తం మూసి వేసేవారు. రైళ్ళ రాకపోకలన్నీ ఆగిపోయేవి. పట్టాలకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయేవి. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా చోటుచేసుకునేవి. అందుకే ఇన్నేళ్ళుగా పెద్దగా వాటి నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. వీటన్నింటికీ వాల్తేరు రైల్వే డివిజన్‌ చెక్‌ పెట్టింది. అటు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడకుండా, ఇటు రైల్వే గేట్ల ఊసేలేకుండా ‘కట్‌ అండ్‌ కవర్‌’ విధానాన్ని తీసుకొచ్చింది. భూగర్భ వంతెనల్ని కేవలం గంటల వ్యవధిలోనే నిర్మిస్తోంది. ఒక్కో భూగర్భ వంతెన నిర్మాణానికి రూ. 2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇలా రెండున్నరేళ్ళుగా 46 వంతెనల్ని నిర్మించారు. టెండర్ల దగ్గర నుంచి పనులు పూర్తయ్యే వరకు ఎఫ్‌ఓబీ నిర్మాణాల్ని 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని వాల్తేరు డివిజన్‌ తాజా లక్ష్యంగా పెట్టుకుంది. విజయనగరం రైల్వేస్టేషన్‌ నుంచి దీనికి శ్రీకారం చుడుతున్నారు.

భూగర్భ వంతెనల నిర్మాణానికి ముందుగా క్రేన్లు, ప్రొక్లెయిన్ల సాయంతో పట్టాలకు అటు ఇటుగా ఉన్న మట్టిని తొలగిస్తారు. మట్టి తీస్తున్న సమయంలోనూ రైళ్ళ రాకపోకల్ని అనుమతిస్తారు. పట్టాల కింద మట్టిని తీసేటప్పుడు మాత్రం రాకపోకల్ని ఆపుతారు. అనంతరం క్రేన్లతో పట్టాలు తొలగిస్తారు. మట్టి తొలగించిన తర్వాత క్రేన్ల సాయంతో సిమెంటు బ్లాకుల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్తారు. అవి పడిపోకుండా ఇసుక బస్తాల్ని పెడుతూ వస్తారు. బ్లాక్‌లను పేర్చడం అయిపోగానే ఖాళీలు లేకుండా సరిచేసి నిమిషాల వ్యవధిలో మట్టిని పూర్తిగా కప్పేస్తారు. వంతెన పొడవును బట్టి 10 నుంచి 20 భాగాలుగా చేసి చతురస్రాకార బ్లాకుల్ని ముందే నిర్మించి పెట్టుకుంటారు. మార్గం ఎత్తు 10 అడుగులు ఉంటుంది. సిమెంటు బ్లాకుల మీద తిరిగి పట్టాల్ని పెట్టి ఇరువైపులా గట్లు బలీయంగా ఉండేలా చేస్తారు. ఇదంతా రెండు లైన్లున్న చోట 3.30 గంటలు, 4 లైన్లు ఉన్నచోట 4.30 గంటలతో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

ఈ భూగర్బ వంతెనల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా వాల్తేరు రైల్వే డివిజన్‌ నిలుస్తోంది. రైల్వే డిఆర్‌ఎం ఎం.ఎస్‌. మాథుర్‌ ఈ నిర్మాణాలపై మాట్లాడుతూ రైల్వే ఇంజనీర్లు, అధికారుల సత్తాకు ఇది నిదర్శనమన్నారు. ప్రయాణాలకు ఆటంకాలు రాకుండా వీటిని నిర్మించాలనే రైల్వే బోర్డు పిలుపును తాము ఛాలెంజ్‌గా తీసుకుని చేశామని, ఇప్పుడు దేశంలోని ఇతర డివిజన్లూ ఈ సాంకేతికతను అమలుచేసే పనిలో ఉన్నాయని తెలిపారు.

తమిళనాడు

ప్రాణాలు తీసిన ఫుబోర్డు ప్రయాణం

రైల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఏర్పాటు చేసిన కాంక్రీట్‌ కంచె తగిలి నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై శివారులో జూలై 24న చోటు చేసుకొంది. చెన్నై బీచ్‌ నుంచి కాంచీపురం జిల్లా తిరుమాల్పూర్‌ వెళ్ళే సబర్బన్‌ రైలు ఉదయం 8.25 గంటలకు సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ నాల్గో ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చింది. 3, 4వ ప్లాట్‌ఫామ్‌ల మధ్య కాంక్రీట్‌ కంచె ఉండటాన్ని ఫుట్‌బోర్డులోని ప్రయాణికులు గమనించలేదు. అది బలంగా తగలడంతో ఫుట్‌బోర్డులోని తొమ్మిది మంది ప్రయాణికులు వరుసగా కిందపడి పోయారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలును నిలిపివేశారు. రైల్వే భద్రతాదళం, రైల్వే పోలీసులు అంబులెన్స్‌లతో అక్కడికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు.

మహారాష్ట్ర

రగులుతున్న రిజర్వేషన్ల చిచ్చు

మరాఠా కోటా కోసం ఔరంగాబాద్‌కు చెందిన ప్రమోద్‌జైసింగ్‌ హరే(35) అనే వ్యక్తి జూలై 29వ తేదీ రాత్రి పొద్దుపోయాక కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు మహారాష్ట్రలో వెల్లువెత్తాయి. రిజర్వేషన్‌ డిమాండ్‌కు మద్దతుగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రమోద్‌జైసింగ్‌ ముందుగానే ఓ సందేశాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టాడు. అదే సందేశాన్ని వాట్సప్‌ ద్వారా కూడా అందరికీ పంపాడు. ‘ఓ మరాఠా వ్యక్తి ఈ రోజు వెళ్ళిపోతున్నాడు… రిజర్వేషన్‌ కోసం ఏమైనా చేయండి’ అంటూ ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నాడు. ఆత్మహత్య వంటి పిచ్చిపనుల జోలికి వెళ్ళవద్దంటూ తామంతా సలహా ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని జైసింగ్‌ మిత్రులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా పుణెకు సమీపంలోని ఛకన్‌ పట్టణంలో మరాఠా రిజర్వేషన్‌ కోసం జరుగుతున్న ఉద్యమంలో జూలై 30న పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనా కారులు రాళ్ళు విసరడం, ప్రభుత్వ, ప్రయివేటు బస్సులకు నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వారిని నిలువరించేందుకు యత్నించిన కొందరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు క్రమక్రమంగా హింసాత్మ కంగా మారుతోండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారాన్ని సాధించాలన్న దిశగా కార్యాచరణను వేగవంతం చేస్తోంది.

అసోం

పౌరసత్వ జగడం

అసోంలో ఎంతో ఆసక్తి రేకెత్తించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)కు సంబంధించిన రెండో, తుది ముసాయిదా జూలై 30న ప్రచురితమైంది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తులకుగాను 2.89 కోట్ల మందికి చోటు దక్కింది. 40 లక్షల మందికి చోటు దక్కలేదు. వారి పౌరసత్వ ¬దాపై వ్యాఖ్యా నించేందుకు కేంద్రం నిరాకరించడంతో వారి భవితపై అయోమయం నెలకొంది. అయితే ఇప్పటి కిప్పుడు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇది ముసాయిదా జాబితాయేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇచ్చాయి. అభ్యంతరాల దాఖలుకు అవకాశం ఇస్తామని తెలిపాయి. ఎన్‌ఆర్‌సీ విడుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు జారీ చేశారు.

అసలైన భారతీయ పౌరులను గుర్తించడానికి ఎన్‌ఆర్‌సీపై కసరత్తును అసోం చేపట్టింది. 1971 మార్చి 24 తర్వాత వలస వచ్చిన వారిని గుర్తించడం దీని ఉద్దేశం. 1951 తర్వాత ఎన్‌ఆర్‌సీలో మార్పులు చేర్పులు చేస్తున్న మొదటి రాష్ట్రం అసోం. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేష్‌, ఎన్‌ఆర్‌సీ సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ఇది భారత్‌కు, అసోంకు చారిత్రాత్మకమైన రోజని, ఈ స్థాయిలో కసరత్తు ఎన్నడూ జరగలేదని, ఇది సుప్రీం కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగిన న్యాయ ప్రక్రియ అని వారు పేర్కొన్నారు.

40.07 లక్షల మంది దరఖాస్తుదారులను ఇందులో చేర్చకపోవడానికి కారణాలను బహిరంగ పర్చబోమన్నారు. వాటిని వ్యక్తిగతంగా తెలియ జేస్తామని, ఎన్‌ఆర్‌సీ కేంద్రాల ద్వారా కూడా తెలుసుకో వచ్చన్నారు. ‘డి’ (అనుమానాస్పద) ఓటర్లు, డి ఓటర్ల వారసులు, విదేశీ ట్రైబ్యునళ్ళలో పెండింగ్‌ లో ఉన్న నివేదనలు, వాటిని దాఖలుచేసిన వారి వారసులను ఈ ముసాయిదాలో చేర్చలేదు. వారి అర్హత అంశాన్ని సుప్రీంకోర్టు నిలుపుదలలో ఉంచింది.

ఎన్‌ఆర్‌సీ తుది ముసాయిదా వెల్లడిపై అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ ‘చరిత్రాత్మకమైన ఈ రోజు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో, భారత రిజిస్ట్రార్‌ జనరల్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సహకారంతో తాజా ముసాయిదాను ప్రచురించామన్నారు. నిజమైన భారతీయ పౌరులకు క్లెయిములు, అభ్యంతరాల దాఖలుకు అవకాశం దక్కుతుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయవద్దని కోరారు.

ఉత్తరప్రదేశ్‌

వర్ష బీభత్సానికి 70 మంది బలి

ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సానికి 70 మంది మృత్యువాత పడ్డారు. పలు ప్రాంతాల్లో ఇంకా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో జూలై 29వ తేదీ కురిసిన వర్షాలకు 12 మంది మరణించారు. మరోవైపు ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. జూలై 26 నుంచి యూపీలో కురుస్తున్న భారీ వర్షాలకు 70 మంది మృత్యువాత పడగా మరో 77 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో రెండు మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తు తున్నారు. యమున ఉప్పొంగుతోండటంతో ఢిల్లీ లోని పాత బ్యారేజీపై రాకపోకలను నిలిపివేశారు.

హర్యానా సిఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ యమునానగర్‌లో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ వర్షాలు, వరదలవల్ల కిన్నార్‌ కైలాస్‌ యాత్రను రద్దుచేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బీహార్‌ రాజధాని పట్నాలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని తాజా వర్షాలు కళ్ళకుకట్టాయి. మోకాళ్ళలోతు నీళ్లలో నిలబడి సాయం చేయండంటూ రోగులు అభ్యర్థిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.

ఢిల్లీ

చిన్నారుల ఆకలి మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో రెండు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆకలితో మృత్యువాత పడ్డారు. చిన్నారులను వారి తల్లి మరో వ్యక్తి సాయంతో జూలై 24 మధ్యాహ్నం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారి మరణాల గురించి ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ప్రాథమిక శవపరీక్షలో ఆకలితో అలమటించడం లేదా పోషకాహార లోపం కారణంగా తలెత్తిన సమస్యలతో చిన్నారులు చనిపోయినట్లు వెల్లడైంది. చిన్నారులు ఉంటున్న ప్రదేశాన్ని ఫోరెన్సిక్‌ బృందం సందర్శిం చింది. విరేచనాలైనప్పుడు ఉపయోగించే ఔషధ సీసాలు, మాత్రలు వారికి లభ్యమయ్యాయి. బాలికల తండ్రి సాధారణ కూలీ అని, తల్లి మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై మెజిస్టేరియల్‌ విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిిసోడియా వెల్లడించారు.

చిన్నారుల ఆకలి మరణాల దుర్ఘటనపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మారుమూల గ్రామాల్లోని ఆకలి చావుల సంగతేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా మన దేశంలో ఇలాంటి ఆకలిచావుల సంఘటనలు చోటు చేసుకొంటోండటం నిజంగా బాధాకర పరిణామమే.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *