హిందూ ముఖ్యమంత్రి రాగలడా ?

హిందూ ముఖ్యమంత్రి రాగలడా ?

ఇంటర్‌నెట్‌లో అన్నీ దొరుకుతాయి. ఏ నియోజకవర్గం వివరాలైనా కావాలంటే దాని పేరు, మీకు ఏ సంవత్సరం వివరాలు కావాలో ఆ సంవత్సరం గూగుల్‌ సెర్చ్‌లో టైప్‌ చేస్తే వివరాలు దొంతరలు దొంతరలుగా వచ్చేస్తాయి. మొత్తం ఓటర్లెందరు ? అందులో మహిళలెందరు ? పురుషులెందరు ? ఏ సంవత్సరం, ఏ పార్టీకి, ఎన్ని ఓట్లు వచ్చాయి ? సమీప ప్రత్యర్థికి పడ్డ ఓట్లెన్ని ? ఇలా అన్ని వివరాలూ దొరుకుతాయి.

మరి మీరెప్పుడైనా జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వివరాలకు సంబంధించి గూగుల్‌ సెర్చ్‌ చేశారా ? చేస్తే మీకు అన్నీ షాకులే తగులుతాయి. మొదటి షాక్‌ – కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మీకు జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ వివరాలేవీ కనిపించవు. రెండో షాక్‌ – దీని కోసం మీరు జమ్మూ కశ్మీర్‌ ఎలక్టరల్‌ కమిషన్‌లో వెతకాలి. మూడో షాక్‌ – అందులోనూ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లెందరు ? వంటి వివరాలు ఉండవు. గెలిచిన వారికి వచ్చిన ఓట్లు, సమీప ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు మాత్రం దొరుకుతాయి. జమ్మూ, కశ్మీర్‌ నియోజకవర్గాల వివరాలు అంతా గుప్పెట మూసినట్టే కనిపించీ కనిపించకుండా, తెలిసీ, తెలియకుండా ఉంటాయి.

ఇలా ఎందుకు జరుగుతుంది ? దాచాల్సింది ఉంటేనే దాపరికం వస్తుంది. జమ్మూ కశ్మీర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. జమ్మూ కశ్మీర్‌లో గత ఏడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా హిందూ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు ? ప్రతిసారీ ముఖ్యమంత్రి కేవలం కశ్మీర్‌ లోయ నుంచే ఎందుకు ఎంపికవుతారు ? జమ్మూ నుంచి ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఓటర్ల సంఖ్య, నియోజకవర్గాల ఏర్పాటు, వాటిలో ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే దొరుకుతుంది. అందుకే ఆ వివరాలేవీ ఇంటర్‌నెట్‌లోనూ దొరకవు.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దేశమంతటా 1951లో జనాభా లెక్కలు జరిగాయి. ఈ లెక్కలు జమ్మూ కశ్మీర్‌లో జరగలేదు. అప్పటి ముఖ్యమంత్రి షేఖ్‌ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్‌కు మినహాయింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆయన శ్రీనగర్‌లో కూర్చుని నియోజకవర్గాలెన్ని ఉండాలో నిర్ణయించాడు. రాష్ట్రానికి వంద నియోజకవర్గా లుండాలన్నాడు. వీటిలో 24 ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌కి ప్రాతినిథ్యం వహిస్తాయన్నాడు. అవి ప్రస్తుతం ఖాళీగా ఉంటాయన్నాడు. మిగిలిన 76 సీట్లలో ఆయన నలభై రెండు కశ్మీర్‌ లోయకు అని నిర్ణయించాడు. జమ్మూకు 30 సీట్లు అన్నాడు. మిగిలిన నాలుగు సీట్లు లడాఖ్‌కి అని చెప్పాడు. అధికారులు కూర్చుని చర్చించలేదు, క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలు చూడలేదు. షేఖ్‌ సాహిబ్‌ పుర్రెకు పుట్టిన బుద్ధి ఆధారంగా నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఆయన ఏకపక్షంగా జమ్మూలో నియోజకవర్గంలో సగటున యాభై వేల ఓటర్లుండాలని, కశ్మీర్‌లో నలభై వేలకు ఒక సీటు ఉండాలని నిర్ధారించేశాడు. వీటికి ఢిల్లీలో కూర్చున్న జవహర్‌లాల్‌ నెహ్రూ గుడ్డిగా ఆమోదం తెలిపేశారు. ఇలా 1951లో కుట్ర జరిగింది. ఆరోజే తక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు ఉన్న కశ్మీర్‌ లోయ నుంచి మాత్రమే ముఖ్యమంత్రి ఎంపికయ్యేలా నిర్ణయం అయిపోయింది. ఆధిపత్యమంతా ముస్లిం జనాధిక్య కశ్మీర్‌ లోయకు మాత్రమే పరిమితం. జమ్మూ కేవలం కట్టు బానిసగా బతకాల్సిందేనని షేక్‌ అబ్దుల్లా శాసనం రాసేశాడు.

ఆ కుట్ర ఇన్నాళ్లుగా సాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ మద్దతుతో, కుహనా సెక్యులరిస్టుల కల్లబొల్లి కన్నీటి కథలతో ఈ రాజ్యాంగేతర శక్తి చేసిన రాజ్యాంగ కుట్ర ఇప్పుడు కోతి పుండు బ్రహ్మరాక్షసి అయి కూర్చుంది. జమ్మూ విస్తీర్ణం 26,293 చ.కి.మీ.. కశ్మీర్‌ లోయ విస్తీర్ణం 15,948 చ.కి.మీ.. జమ్మూలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,50,096. కశ్మీర్‌ లోయ ఓటర్ల సంఖ్య 28,83,950. జమ్మూకి 37 సీట్లు, కశ్మీర్‌కి 46 సీట్లు. అంటే ఎక్కువ మంది ఓటర్లుండీ జమ్మూకు తక్కువ సీట్లున్నాయి. కశ్మీర్‌కు ఎక్కువ సీట్లున్నాయి. జమ్మూలో సగటున ఒక అసెంబ్లీ స్థానానికి ఓటర్ల సంఖ్య 66,521 కాగా కశ్మీర్‌ లోయలో 49,728 ఉంది. ఉదాహరణకి జమ్మూ నగరంలోని దక్షిణ భాగంలోని గాంధీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,66,132. ఆ తరువాత అతి పెద్ద నియోజకవర్గం జమ్మూ వెస్ట్‌. అందులో 1,51,311 మంది ఓటర్లున్నారు. రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లోని బాటమాలూ మూడో స్థానంలో ఉంది. అందులో 1,20,198 మంది ఓటర్లున్నారు. కశ్మీర్‌ లోయలోని గురేజ నియోకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 17,554 మాత్రమే. పెద్ద నియోజకవర్గాలు ఎక్కువగా జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. నిజానికి కశ్మీర్‌ లోయతో సమానంగా ఓటర్ల సంఖ్య ఉంటే కనీసం మరో పది పన్నెండు స్థానాలు జమ్మూ ఖాతాలో ఉండాలి. అప్పుడు జమ్మూ నుంచి కూడా ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వీలుంటుంది.

హిందూ మెజారిటీ బీహార్‌కు అబ్దుల్‌ గఫూర్‌ ముఖ్యమంత్రి కాగలరు. హిందూ జనాధిక్య అసొంకి అన్వరా తైమూర్‌ ముఖ్యమంత్రి కాగలరు. హిందూ మెజారిటీ మహారాష్ట్రకు అబ్దుల్‌ రహమాన్‌ అంతులే ముఖ్యమంత్రి కాగలరు. హిందూ మెజారిటీ పుదుచ్చేరికి ఎం. ఫారూఖ్‌ ముఖ్యమంత్రి కాగలరు. కేరళకి సిహెచ్‌ మహ్మద్‌ కోయా ముఖ్యమంత్రి కాగలరు. హిందూ మెజారిటీ రాజస్థాన్‌లో బర్కతుల్లా ఖాన్‌ ముఖ్యమంత్రి కాగలరు. కానీ ముస్లిం మెజారిటీ జమ్మూ కశ్మీర్‌లో హిందువు ముఖ్యమంత్రి కాలేదు.

నియోజకవర్గాల ఏర్పాటు నుంచి ఓటర్ల సంఖ్య దాకా అన్నింటా ముస్లిం జనాధిక్య కశ్మీర్‌ లోయకు మాత్రమే లాభం కలిగేలా మొదటి నుంచీ కుట్ర జరుగుతోంది. ఈ నియోజకవర్గాల అసమతౌల్యాన్ని సరిచేయాలని, జమ్మూకి న్యాయం చేయాలని అనుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మిగతా దేశంలో 2024లో నియోజకవర్గాల పునర్వవస్థీకరణ జరుగుతుంది. కానీ జమ్మూ కశ్మీర్‌లో ఆ పనిని చేయాలంటే 2036 వరకూ ఆగాల్సిందే!!

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *