రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

తమిళనాడు

ఈ బంధం ఏనాటిదో !

ఆసుపత్రిలో కోమాలో ఉన్న రోగి ఎవరి పిలుపుకైనా స్పందించి కోలుకుంటే అద్భుతమని వైద్యులు చెప్పే సన్నివేశాన్ని మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో ఇదే తరహా సంఘటన తమిళనాడులో జరిగింది. తనకు పాఠాలు చెప్పిన గురువుల పిలుపు విని అరుణ్‌ పాండియన్‌ (17) అనే విద్యార్థి కోమా నుంచి బయటకొచ్చాడు.

వివరాల్లోకెళితే తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని మిన్నత్తూర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ పాండియన్‌ గంధర్వ కోట్టై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ప్రతిరోజూ గ్రామం నుంచి పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తుంటాడు.

జూలై 17వ తేదీ పాఠశాల ముగిశాక బస్టాప్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఆ విద్యార్థి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. నాడీ స్పందన తక్కువగా ఉండటంతో తంజావూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా పాండియన్‌ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆక్సిజన్‌ తొలగిస్తే మరణిస్తాడని వైద్యులు చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

18వ తేదీన పాండియన్‌ను చూడటానికి పాఠశాల ఉపాధ్యాయులు మణికంఠన్‌, సోమసుందరం ఆసుపత్రికి వచ్చారు. వారిలో సోమసుందరం ఐసియులో ఉన్న విద్యార్థి చెవిలో ‘తమ్ముడూ కళ్ళు తెరిచి చూడు.. ఎవరు వచ్చారో చూడు’ అంటూ పలుమార్లు చెప్పారు. ఆ మాటలు విన్న కొద్దిసేపటికే పాండియన్‌ కళ్ళు కదిలాయి. కాళ్ళు, చేతుల్లో చలనం వచ్చింది. ఉపాధ్యాయులు ధైర్యం చెబుతూ మాట్లాడుతూనే ఉండటంతో పది నిమిషాల్లో విద్యార్థి స్పృహలోకి వచ్చాడు. ఈ సంఘటన చూసి ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని ఘటనలు వైద్య శాస్త్రం కన్నా మమతానురాగాలే గొప్పవని గుర్తు చేస్తుంటాయి. ఆ గురుశిష్యుల అనుబంధం ఏనాటిదో.

ఢిల్లీ

త్వరలో కొత్త వంద రూపాయల నోటు

ఊదా రంగులో కొత్త రూ.100 నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అందు బాటులోకి తేనుంది. అయితే కొత్తనోటు వచ్చిన ప్పటికీ ఇప్పటివరకు చలామణిలో ఉన్న ఇతర రూ. 100 సిరీస్‌ నోట్లన్నీ చెల్లుబాటవుతాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో త్వరలోనే కొత్త రూ. 100 నోటు రానుంది. ఈ నోటును బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకురానున్నామని ఆర్‌బిఐ తెలిపింది. ఈ నోటుకు వెనకాల ‘రాణి కీ వవ్‌’ చిత్రం ఉంటుంది. గుజరాత్‌లోని సబర్మతి నది తీరప్రాంతంలో ఈ ప్రసిద్ధ కట్టడం ఉంది.

ప్రస్తుతమున్న రూ.100 నోటు కంటే ఇది చిన్నది కావడం గమనార్హం. నోటుకు ముందువైపు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం, అశోక స్థూపం ముద్ర, వాటర్‌ మార్క్‌లు, నోటు సంఖ్యలు ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటికే ఆర్‌బిఐ కొత్త రూ.10, రూ.50, రూ.500 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ

మూక హత్యలకు కళ్లెం

మూక హత్యల్ని అరికట్టడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, తవార్‌ చంద్‌ గెహ్లాట్‌తో మంత్రివర్గ బందం ఏర్పాటైంది. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అధ్యక్షతన నలుగురు అధికారులతో మరో ఉన్నతస్థాయి బృందాన్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూక హత్యలకు కళ్లెం వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ బందం రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ప్యానల్‌కు నాలుగు వారాల్లో ప్రతిపాదనలు అందిస్తుంది. కేంద్ర మంత్రులు వాటిని పరిశీలించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటారు.

కర్ణాటక

లక్ష్మీవర మతికి కారణమేంటి ?

లక్ష్మీవర తీర్థ స్వామీజీ అనుమానాస్పదంగా కను మూయడం వెనుక దాగున్న వాస్తవాలు తేల్చడంలో ప్రత్యేక పోలీసు బృందాలు అడుగు ముందుకేస్తున్నాయి. ఆ నిగూఢత తెలుసుకోవడానికి సామాన్యుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. నిత్యం సందడిగా కనిపించే ఉడుపి మఠాల ప్రాంగణాల్లో ప్రస్తుతం మౌనం రాజ్యమేలుతోంది. ఏ ఇద్దరూ కలిసి వీధుల్లో నిర్భయంగా మాట్లాడుకోవడానికి జంకే పరిస్థితి.

అనుమానాస్పదంగా మతి చెందిన శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ పోస్టుమార్టం రిపోర్టులు నేడో రేపో పోలీసులకు అందనున్నాయి. ఇప్పటికే నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. శిరూరు మూల మఠంలో విచారణకు అత్యంత కీలకంగా మారిన నిఘా కెమెరాల నుంచి సందేశాలు క్రోడీకరించే డివిఆర్‌ అదశ్యం కావటంపై పోలీసులు మరింత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నిఘా కెమెరాలో నిక్షిప్తమైన చిత్రాలకు ఆధారం డివిఆర్‌ కావటంతో భక్తులతో పాటు స్థానికుల్లో విభిన్న కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తీర్థవర స్వామీజీనే మరణానికి ముందు నిఘా కెమెరాలు తొలగించారన్న అభిప్రాయాల్ని మఠానికి చెందిన కొందరు సభ్యులు వ్యక్తం చేయటం గమనార్హం.

మహారాష్ట్ర

వణికిపోతున్న ఛోక్సీ

తనపై ఉన్న బెయిల్‌ రహిత వారెంట్ల (ఎన్‌బిడబ్ల్యూ)ను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాం నిందితుడు, గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ ఛోక్సీ న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని బంధువు ఛోక్సీలు కలసి పిఎన్‌బిని రూ.13,400 కోట్ల మేర మోసగించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగదు అక్రమ చలామణి నియంత్రణ చట్టం (పిఎంఎల్‌ఏ) న్యాయస్థానం గత మార్చి, జూలైలో ఛోక్సీపై బెయిలుకు వీలులేని వారెంట్లను జారీ చేసింది. వాటిని రద్దు చేయాలని కోరుతూ ఛోక్సీ తాజాగా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ‘సంస్థ నడిచే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. రుణదాతలకు చెల్లింపులు చేయలేదు. దీంతో వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. నన్ను స్వదేశానికి తీసుకొస్తే వారంతా నాపై మూకుమ్మడి దాడులకు పాల్పడతారు. ప్రస్తుతం దేశంలో ఇదే ధోరణి కొనసాగుతోంది.

ఒకవేళ నన్ను జైల్లో పెట్టినా అక్కడి సిబ్బంది, శిక్ష అనుభవిస్తున్నవారు కూడా నాపై దాడి చేయవచ్చు. నాకు ప్రాణహాని లేకపోలేదు. కాబట్టి నాపై ఉన్న బెయిల్‌ రహిత వారెంట్లను రద్దు చేయండి’ అని ఛోక్సీ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నాడు.

దీనిపై జూలై 23న విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎం.ఎస్‌. అజామి ఈ విషయంపై అభిప్రాయాన్ని చెప్పాలని ఈడిని కోరారు. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేశారు. భారత్‌కు వస్తే తనపై దాడి చేస్తారని వణికిపోతున్న మెహుల్‌ ఛోక్సీ అభ్యర్థన విషయంలో తీర్పు ఎలా రానుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.

కేరళ

శబరిమలపై కూడా సెక్యులర్‌ కన్ను

కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలంటే 41 రోజుల ఉపవాస దీక్ష చేపట్టాలనడం అసాధ్యమైన నిబంధనను విధించడమే నని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రుతుస్రావమయ్యే వయసులో ఉన్న స్త్రీలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తూ చట్టం ద్వారా విధించలేని నిషేధాన్ని దీక్ష పేరుతో విధించడం కిందకే ఇది వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

10-50 ఏళ్ళ వయసున్న బాలికలు, మహిళలకు ఆలయ దర్శనాన్ని నిషేధిస్తూ శబరిమల దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారత యువ న్యాయవాదుల సంఘం, తదితర పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం జూలై 19న తదుపరి విచారణను చేపట్టింది. దేవస్థానం తరపు న్యాయవాది అభిషేక్‌ సంఘ్వి వాదనలు వినిపిస్తూ ‘ఏ కుల, మతానికి చెందినవారైనా అయ్యప్ప ఆలయాన్ని సందర్శించు కోవచ్చు. కేవలం 10-50 ఏళ్ళ వయసు బాలికలు, మహిళలు 41 రోజుల దీక్షను చేపట్టలేరన్న కారణంతోనే వారిని దర్శనానికి నిరాకరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ దేవుడిపై ఉన్న నమ్మకం, భక్తి వల్లే భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. దర్శనానికి ముందు 41 రోజుల దీక్షను చేపట్టాలనడం అసాధ్యమైన నిబంధనను విధించడమే. ఒకరకంగా ఇది చట్టం ద్వారా విధించలేని నిషేధాన్ని దీక్ష రూపంలో విధించడమే నని వ్యాఖ్యానించింది. రుతుస్రావమయ్యే వయసులో ఉన్న మహిళలకు దర్శనాన్ని నిరాకరిస్తున్న ఆలయం బహుశా ప్రపంచంలో ఇదొక్కటే కావచ్చని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

రుతుస్రావం ఏ వయసులో వస్తుందో…ఏ వయసులో నిలిచిపోతుందో చెప్పలేమని, అలాంట ప్పుడు ఈ నిబంధనలో హేతుబద్దత ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించింది. శబరిమల దేవస్థాన నిర్ణయం అసంబద్దమని, తమకు ఇష్టమైన మతా చారాలను అనుసరించడం ప్రజల ప్రాథమిక హక్కు అని, పురుషులతో సమానంగా మహిళలూ ఆలయాల్లోకి ప్రవేశించి పూజలు చేసుకోవచ్చని, అది వారి రాజ్యాంగ హక్కు అని విచారణ సందర్భంగా జూలై 18న ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

దేశవ్యాప్తంగా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తున్న నక్సల్స్‌ వ్యవస్థకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జూలై 19న భóద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు పోలీసులు, ప్రత్యేక కార్యదళం పోలీసులు దంతేవాడలో 18వ తేదీ నుంచి గాలింపు ప్రక్రియ చేపట్టారు. బీజాపూర్‌-దంతేదాడ సరిహద్దుల్లో తిమినార్‌, పూసనార్‌ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టగా 19వ తేదీ ఉదయం ఆరుగంటల సమయంలో భీకర పోరు చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు పారిపోయారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *