రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం

రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టి పెడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల జిమ్మిక్కులనే చేస్తోంది. పట్టణ పేదలు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న అన్న క్యాంటీన్లు ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రావడంతో పేద ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాల్లో 38 పురపాలక, నగరపాలక సంస్థల్లో తొలివిడతగా వంద క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించి కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ ప్రాంతాల్లోని పేదలతో మాట్లాడి ఈ సంక్షేమ పథకంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

రెండో విడతలో మరో 103 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 42 క్యాంటీన్లలో ముందస్తు నిర్వహణ (ట్రయిల్‌ రన్‌)ను జూలై 8వ తేదీన నిర్వహించారు. ఈ క్యాంటీన్లలో పేద ప్రజలకు మూడు పూటలా ఆహారం లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలను చేపట్టింది.

శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరంలో 2, విశాఖపట్నంలో 22, తూర్పుగోదావరిలో 6, పశ్చిమగోదావరిలో 9, కృష్ణాలో 11, గుంటూరులో 16, ప్రకాశంలో 4, నెల్లూరులో 4, చిత్తూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 5 క్యాంటీన్లు ప్రారంభ మయ్యాయి.

ఇప్పటికే ఈ తరహా క్యాంటీన్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతూ పేద ప్రజల కడుపులను నింపుతున్న సంగతి తెలిసిందే. ప్రారంభదశలో కొన్ని ఒడిదుడుకులు తప్పకున్నా మున్ముందు ఈ క్యాంటీన్లు సత్ఫలితాలనిచ్చి ప్రజల మెప్పును పొందగలవని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా కోట్లాది రూపాయల వ్యయంతో నడవనున్న ఈ సబ్సిడీ క్యాంటీన్లు వచ్చే ఎన్నికల్లో అధికారపక్షమైన టిడిపికి ఏ విధంగా లబ్ది చేకూర్చగలవో తెలుసుకోవా లంటే మరికొంతకాలం వేచిచూడక తప్పదు.

ఢిల్లీ

నిందితులకు మరణదండనే సరి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులకు మరణ దండనే సరైందంటూ ఈ నెల 9న సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా పునరుద్ఘాటించింది. గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలంటూ ముగ్గురు దోషులు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. వారి అభ్యర్థనకు ప్రాతిపదిక లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దోషులు ముకేశ్‌ (31), పవన్‌ గుప్తా (24), వినయ్‌ శర్మ (25) చూపిస్తున్న కారణాలను ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వారు అప్పీళ్ళు దాఖలు చేసినప్పుడు ఇచ్చిన తీర్పునే పరిగణలోకి తీసుకున్నామని ధర్మాసనం చెప్పింది. మరోసారి సమీక్షించేందుకు వారి అభ్యర్థనల్లో కొత్త ప్రాతిపదికలేవీ కనపడలేదని చెప్పింది. నిబంధనల ప్రకారం తీర్పులో దోషం ఉందన్న ప్రాతిపదికపైనే క్రిమినల్‌ విచారణ ప్రక్రియను మరోసారి అనుమతించాల్సి ఉంటుందని, ఈ అభ్యర్థనల్లో అటువంటిది ఉన్నట్లు పిటిషనర్లు చూపించలేక పోయారని ధర్మాసనం స్పష్టం చేసింది. విదేశాల్లో మరణ దండన రద్దు మనకు ప్రాతిపదిక కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతిస్తూ అందరికీ న్యాయం జరిగింది కానీ తమ ఆవేదన ఇంతటితో ముగియలేదని, దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసి నిర్భయకు న్యాయం చేయాలన్నారు.

కర్ణాటక

ఎంటెక్‌ విద్యార్థికి గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌

బెంగళూరులోని ఐఐటిలో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదువుతున్న ఆదిత్య పలివాల్‌ (22) అనే విద్యార్థికి గూగుల్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్లు లేఖ పంపింది. ముంబయికి చెందిన ఆదిత్య బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తూనే గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కంప్యూటర్‌ భాష కోడింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. వివిధ దేశాలకు చెందిన ఆరు వేల మంది పరీక్ష రాయగా 50 మంది చివరి రౌండ్‌కి చేరుకున్నారు. వారికి కృత్రిమ మేధస్సు, సాంకేతిక పరిశోధన అంశాలపై మరోమారు పరీక్ష నిర్వహించగా ఆదిత్య ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ నెల 16న ఆదిత్య ఉద్యోగానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఆచార్యుల నుంచి లభించిన ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లు ఆదిత్య పేర్కొన్నాడు. కష్టపడి చదివే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయికి చేరుకోగలరని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. రూ.1.2 కోట్ల వేతనంతో తమ అబ్బాయికి గూగుల్‌ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేయడంపై ఆదిత్య తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ అబ్బాయి కష్టపడి చదువుతాడని, ఇంత మంచి అవకావం రావడం ఆనందంగా ఉందన్నారు.

రాజస్థాన్‌

కాంగ్రెస్‌ను ‘బెయిల్‌ గాడీ’ గా అభివర్ణించిన మోది

కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది అగ్రనేతలు, మాజీ మంత్రులు బెయిల్‌పై ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోది పేర్కొన్నారు. జూలై 7న రాజస్థాన్‌లోని జైపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల లబ్దిదారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని ‘బెయిల్‌ గాడీ’ (బెయిలు బండి)గా పిలుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన మెరుపుదాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ సైన్యం సామర్థ్యాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించిందని మోది పేర్కొన్నారు. తద్వారా కాంగ్రెస్‌ పాపం చేసిందన్నారు. ఈ తరహా రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలను అనుసరించే పార్టీలు ఆ రీతిలో సాగొచ్చు కాని బిజెపి సర్కారు మాత్రం దేశ రక్షణ, ఆత్మగౌరవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళేందుకు కట్టుబడి ఉందన్నారు. దేశం నేడు కీలక దశలో ఉందని చెప్పారు. ప్రజల సహకారంతో హామీలను నెరవేరుస్తామన్నారు. బిజెపి పేరు వినగానే కొందరు కలవర పడుతుంటారన్నారు. మోది లేదా వసుంధరా రాజే (రాజస్థాన్‌ ముఖ్యమంత్రి) పేరు వినగానే కొందరికి జ్వరాలు వస్తుంటాయని అలాంటి వారు ఈ తరహా సభలను ద్వేషిస్తారని ఎద్దేవా చేశారు. అయితే వీటి ద్వారానే సామాన్యులు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుంటారని, తద్వారా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ సర్కారు శిలాఫలకాలకే పరిమిత మైందని, బిజెపి ప్రభుత్వం మాత్రం అభివృద్ధికే కట్టుబడి ఉందని తెలిపారు. బార్మేర్‌ వంటి చమురు శుద్ధి కర్మాగారం వంటివి తమ హయాంలోనే ముందడుగు వేశాయని చెప్పారు. గత నాలుగేళ్ళలో పేదలు, రైతులు, మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందన్నారు. రాజపుత్ర పాలకుడు మహారాణా ప్రతాప్‌, జాట్‌ రాజు సుర్జామల్‌, కవయిత్రి మీరాబాయ్‌ వంటి రాజస్థానీ దిగ్గజాల పేర్లను ఈ సభలో మోది ప్రస్తావించారు. ‘అద్భుతమైన కోటలు, ఇసుక తిన్నెలు, రంగురంగుల తలపాగాలు, యాసలే’ ఈ రాష్ట్ర ప్రత్యేకత అని ఆయన కొనియాడారు. మరోవైపు ఈ సభలో ఎలాంటి నిరసనలకు అవకాశం లేకుండా నల్ల దుస్తులు ధరించిన వారిని, నల్ల వస్త్రం కలిగి ఉన్నవారిని అనుమతించలేదు. అనుమానాస్పదంగా కనిపించిన 60 మందిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

బిహార్‌

మోదితోనే నితీశ్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో కలసి ప్రయాణం చేసేందుకే నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జెడియు నిర్ణయించింది. రానున్న ఎన్నికల్లో కూడా బిజెపితో కలసి పోటీ చేస్తామని ఆ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకూ ఆ పార్టీ మద్దతు తెలిపింది. ఈ అంశంలో ఏకాభిప్రాయ సాధనకు మిగతా పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. జూలై 8న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాలు చేసింది. పౌరసత్వ సవరణ బిల్లుపై మాత్రం జెడియు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాక్‌లకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, క్రైస్తవులకు ఆరేళ్ళు భారత్‌లో నివాసముంటే పౌరసత్వం ఇవ్వాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సహా అన్ని రాజకీయాంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ సిఎం నితీశ్‌కుమార్‌కు జెడియు అప్పగించింది. సీట్ల పంపకాలపై బిజెపి ప్రతిపాదన చేశాక ఓ నిర్ణయానికి వద్దామని నితీశ్‌ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి పేర్కొన్నారు. ఒకదశలో లాలూ కూటమితో జతకట్టాలని నితీశ్‌ భావించినా తదనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత మోదితో జతకడితేనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కూడా మంచి విజయాలను సాధించగలదన్న అభిప్రాయానికి వచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

కేరళ

స్వామి సంపద ప్రదర్శనపై అభ్యంతరం

కేరళలోని పద్మనాభస్వామి ఆలయానికి చెందిన విలువైన సంపదను మ్యూజియంలో ప్రదర్శించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ట్రావన్‌కోర్‌ రాచకుటుంబ సభ్యుడు ఆదిత్యవర్మ వ్యతిరేకించారు. దేవుడి సంపదతో ‘వ్యాపారం’ చేయడానికి తాను సమ్మతించబోనని స్పష్టం చేశారు. శతాబ్దాలనాటి ఈ ఆలయం లోగడ ట్రావన్‌కోర్‌ రాజకుటుంబం నిర్వహణలో ఉండేది. ఆలయంలో దశాబ్దాలుగా మూతపడ్డ సెల్లార్‌లను 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచారు. అందులో బంగారం, వెండి ఆభరణాలు, నాణేలు, విలువైన రాళ్ళు పొదిగిన కిరీటాలు తదితర అమూల్య సంపద బయటపడింది. ఈ సంపద విలువ రూ. లక్ష కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ సంపదను ప్రదర్శించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేద్దామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఆదిత్యవర్మను సంప్రదించాయి. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పినట్లు వివరించారు. సంపదను ఆలయ ప్రాంగణం వెలుపలికి తరలించరాదన్నది తమ అభిప్రాయమన్నారు. ఎంపిక చేసిన నగల త్రీడీ చిత్రాలను ప్రదర్శించడానికి తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. ఆలయ సంపదతోపాటు ఇతర అంశాలు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల వాటి తరలింపుపై ఏ నిర్ణయమూ తీసుకోరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలను సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షిస్తోంది.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *