రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

డిజిపిగా ఠాకూర్‌

ఏపి నూతన డిజిపిగా నియమితులైన ఆర్పీ ఠాకూర్‌ జూన్‌ 30న మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాం ప్రవేశ్‌ ఠాకూర్‌ స్వస్థలం బిహార్‌. ఐఐటి కాన్పూర్‌లో ఈయన బీటెక్‌ పూర్తిచేశారు. గుంటూరు గ్రామీణ, సూర్యపేట, సత్తెనపల్లి, సబ్‌ డివిజన్‌లలో ఏఎప్పిగా విధులు నిర్వహించారు.

1992-2000 సంవత్సరాల మధ్య పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పిగా హైదరాబాద్‌ పశ్చిమజోన్‌ డిసిపిగా పనిచేశారు. డిఐజి ¬దాలో అనంతపురం రేంజ్‌లోనూ, సిఐఎస్‌ఎఫ్‌లోనూ బాధ్యతలను నిర్వర్తించారు. రాయలసీమ, వరంగల్‌ రీజియన్‌లకు ఐజిగా వ్యవహరించారు. 2011లో అదనపు డిజిపిగా పదోన్నతి పొందిన తర్వాత సాంకేతిక సేవల విభాగం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా శాంతి భద్రతల విభాగం అదనపు డిజిపిగా వ్యవహరించారు. 2002లో రాష్ట్రపతి నుంచి పోలీసు శౌర్య పతకం (పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ), 2003లో భారత పోలీసు పతకాన్ని అందుకున్నారు. 2016 నవంబరులో ఏసిబి డైరెక్టరు జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్‌ అక్కడ పని చేసిన ఏడాదిన్నర కాలంలోనే తనదైన ముద్రను వేయగలిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రాష్ట్రస్థాయి అధికారులను అనేక మందిని పట్టుకున్నారు. మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన అక్రమాస్తులను వెలికితీశారు. ప్రత్యేక న్యాయస్థానాల చట్టాన్ని అమలుచేసి ప్రభుత్వోద్యోగుల అక్రమాస్తులను రాష్ట్ర ప్రభుత్వ పరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఏపికి నూతన డిజిపి బరిలో ఠాకూర్‌, విజయవాడ పోలీసు కమిషనరు గౌతమ్‌ నవాంగ్‌లు ఉండగా చివరకు ఠాకూర్‌కే ఆ అవకాశం దక్కింది. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చే వారెవరూ పుష్పగుచ్ఛాలను తీసుకురావద్దని ఠాకూర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక చిన్న పువ్వు కాని, పండును కాని తీసుకొస్తే చాలని సూచించారు.

జమ్మూ కశ్మీర్‌

ప్రభుత్వ ఏర్పాటులో బిజెపి

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సిద్ధమవుతోందన్న సంకేతాలందుతున్నాయి. పిడిపిలోని తిరుగుబాటు శాసనసభ్యులు బిజెపితో చేతులు కలిపే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్‌లోనూ చీలిక తప్పకపోవచ్చని స్పష్టమవుతోండడంతో అమర్‌నాథ్‌ యాత్ర ముగిసే ఆగస్టు 26 తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బిజెపి నుంచి ముఖ్యమైన ప్రకటన వెలువడవచ్చు.

పిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో చీలిక వర్గాల మద్దతుతో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురావొచ్చు. మొత్తం 87 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 44 మంది మద్దతు అవసరం. బిజెపికి 25 మంది సభ్యులున్నారు. పిడిపిలో తిరుగుబాటు వర్గం మద్దతుతో పాటు ఆ పార్టీకి బద్ద శత్రువైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతును కూడా పరోక్షంగా పొంది, కాంగ్రెస్‌ చీలికవర్గ శాసనసభ్యుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే బిజెపి అంతర్గతంగా తెలుస్తోంది.

జూన్‌19న బిజెపి మద్దతు ఉపసంహరణతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రం గవర్నర్‌ పాలనలో ఉంది. ఈ మేరకు సెప్టెంబరు మొదటి వారంలోగా జమ్మూకశ్మీర్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

గుజరాత్‌

‘నోట్లు’ మింగినా దొరికిపోతారు

అవినీతి నిరూపణకు కొత్త కొత్త ప్రయోగాలు పుట్టుకొస్తున్నాయి. డిఎన్‌ఏ పరీక్షలతో ఉద్యోగుల అవినీతిని నిరూపించే విధంగా సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లో తొలిసారిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. గత మార్చి, మే నెలల్లో జరిగిన రెండు వేరు వేరు సంఘటనల్లో పశువైద్యుడు, అటవీ రేంజ్‌ అధికారి లంచాలు తీసుకున్నారు. వారు నోట్లను నమిలి మింగేయడంతో ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో తొలుత లాలాజల పరీక్షలు, అనంతరం డిఎన్‌ఏ పరీక్షలను నిర్వహించి ఆధారాలను సేకరించారు.

సిద్దాపూర్‌కు చెందిన పశువైద్యుడు మహేంద్ర సిన్హ్‌ చౌహాన్‌ నాలుగు గేదెలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి రూ.2000 లంచం తీసుకున్నాడు. అవినీతి అధికారులు రంగప్రవేశం చేయడంతో వారిని చూసి ఆ నోట్లను నమిలేసి ఆధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. అయితే అధికారులు అతికష్టం మీద వాటిని బయటకు లాగారు. మరో సంఘటనలో బనస్‌కాంత జిల్లా దంతివాడకు చెందిన అటవీశాఖ అధికారి చంద్రకాంత్‌ జోషి కలప రవాణాదారు నుంచి రూ.12 వేలు (రూ.2000 నోట్లు ఆరు) లంచంగా తీసుకున్నాడు. ఆయన కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులను చూసి నోట్లను మింగే ప్రయత్నం చేశాడు. అధికారులు వాటిని బయటకు లాగి ఆధారాల కోసం లాలాజల, డిఎన్‌ఏ పరీక్షలు చేయించారు. ఈ రెండు సంఘటనలతో ఇక ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇలాంటి ఎక్స్‌ట్రాలకు పాల్పడితే అడ్డంగా దొరికిపోక తప్పేట్టు లేదు.

పంజాబ్‌

మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు మరణశిక్ష !

మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసేవారికి మరణశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. జూలై 2న జరిగిన మంత్రిరవర్గ సమావేశంలో ఈ మేరకు సిఫార్సు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ మాదక ద్రవ్యాలు తరానికి తరాన్నే నాశనం చేస్తున్నందువల్ల వాటిని అమ్రంగా రవాణా చేసే స్మగ్లర్లకు కఠినమైన శిక్షలు అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్యపైనే మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ప్రతి రోజూ పర్యవేక్షించడానికి అదనపు ప్రధాన కార్యదర్శి (¬ం) ఎన్‌.ఎస్‌. కల్సి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా, ఆరోగ్య, సాంఘిక భద్రత శాఖల మంత్రులు సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైంది. ఇక ప్రతి వారం ఈ ఉపసంఘం సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తుంది. మత్తు పదార్థాల కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటంపై విమర్శలు వస్తోండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలువురు సామాజిక కార్యకర్తలు జూలై 1 నుంచి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్ర

ఐదుగురి ప్రాణాలు తీసిన వదంతులు

అపోహలు, వదంతుల వ్యాప్తి కారణంగా మహారాష్ట్రలో ఐదుగురు వ్యక్తులు బలయ్యారు. ధులే జిల్లాలోని రాయిన్‌పాడా గిరిజన గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్నారులను అపహరించే ముఠా సభ్యులుగా అనుమానిస్తూ ఐదుగురు వ్యక్తులను గ్రామంలోని ప్రజలు కొట్టి చంపారు. ఈ ప్రాంతంలో చిన్నారులను అపహరించే ముఠా సంచరిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై 1న రాయిన్‌పాడాలో ఓ సంత జరిగింది. ఆర్టీసీ బస్సులో మధ్యాహ్నం ఐదుగురు బాధితులు ఇక్కడకు వచ్చారు. వారిలో ఒకరు ఓ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండటం చూసి పిల్లలను అపహరించే ముఠాకు చెందినవారిగా భావించి కొందరు వారిని పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఈ విషయం గ్రామమంతా వ్యాపించింది. పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామస్థులు భవనం తలుపులు, కిటికీలను పగులగొట్టి కర్రలు, ఇనుప చువ్వలతో మూకుమ్మడిగా బాధితులపై దాడి చేశారు. దీంతో ఆ ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఒకరిని షోలాపూర్‌కు చెందిన దాదారావు భోస్లేగా గుర్తించారు. దాడితో సంబంధమున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఢిల్లీ

మూఢనమ్మకాలతో 11 మంది బలి

రాతి యుగం పోయి రాకెట్‌ యుగం వచ్చినా మనిషిలోని మూఢనమ్మకాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలు ఏదో మారుమూల పల్లెలో కొనసాగుతున్నాయంటే అదోరకం. కానీ దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి వాటిని జనం నమ్ముతున్నారంటే ఏమనుకోవాలి. జూలై 1న దేశ రాజధాని ఢిల్లీలో 11 మంది ప్రాణాలను బలిగొన్న మూఢనమ్మకాన్ని చూసి యావత్‌ దేశం నివ్వెరపోయింది.

జూలై 1వ తేదీన స్థానిక బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో విగతజీవులై కనిపించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు బాలురున్నారు. 10 మంది మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతుండగా ఓ వృద్ధురాలి మృతదేహం మాత్రం కింద కనిపించింది. వృద్దురాలు మినహా మిగతా మృతుల కళ్ళకు గంతలు ఉన్నాయి. ఈ సామూహిక మరణాలు హత్యలా లేక ఆత్మహత్యలా అన్న విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాకపోయినప్పటికీ మూఢనమ్మకమే వీరిని బలిగొన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన కొన్ని ప్రతులు ఈ మరణాల వెనుక మత విశ్వాసపరమైన కారణాలున్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మోక్షం పొందడం కోసం వారంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన నారాయణ్‌ దేవీ (77) తన కుమార్తె ప్రతిభ, కుమారులు భవ్నేశ్‌, లలిత్‌ భాటియాలతో కలసి ఉత్తర

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గల సంత్‌నగర్‌లో నివసిస్తున్నారు. 22 ఏళ్ళ క్రితమే వీరు ఢిల్లీకి వచ్చారు. ఇంటివద్ద భవ్నేశ్‌ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అక్కడికి కొంత దూరంలో లలిత్‌కు ఫ్లైవుడ్‌ వ్యాపార కేంద్రం ఉంది. రోజూ ఉదయం 6 గంటలకే దుకాణం తెరిచే భవ్నేశ్‌ జూలై 1న ఉదయం 7.30 అయినా తెరవకపోవడంతో పొరుగింటి వ్యక్తి వారి ఇంటికి వెళ్ళి చూడగా ఇంటి పైకప్పుకు మృతదేహాలు వేలాడుతున్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల ఇంట్లో పోలీసులు రెండు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రతులు కూడా లభించాయి. ‘మానవ దేహం తాత్కాలికమైంది. కళ్ళు, నోరు మూసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చు’ అని ఓ ప్రతిలో రాసి ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ’11 మంది కలసి ఈ సంప్రదాయాలను పాటిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది’ అని మరో ప్రతిలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రతుల్లోని సమాచారాన్ని బట్టి కేవలం మూఢనమ్మకంతోనే ఈ కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

–  మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *