రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగాలున్నా ప్రకటనలేవి !

ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మరోవైపు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు వేలాదిగా ఉన్నా ప్రకటనలివ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) దినేష్‌కుమార్‌ ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా తదనుగుణంగా పురోగతి మాత్రం కనపడటం లేదు. ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు 42 ఏళ్ళకు వయోపరిమితిని గత ఏడాది డిసెంబరులో పెంచినా నియామకాల ప్రకటన జాడ మాత్రం కనిపించడంలేదు. ఉద్యోగ ప్రకటనలు వెలువడడంలో జాప్యం జరిగేకొద్దీ వయోపరిమితి పరంగా అనేకమంది అనర్హులు కానున్నారు. ఈ పరిణామాలు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రాథమిక అంచనా ప్రకారం 125 గ్రూప్‌-1 పోస్టులు, 775 గ్రూప్‌-2 పోస్టులు, 190 గ్రూప్‌-3 పోస్టులు, 500 గ్రూప్‌-4 పోస్టులు ఉన్నాయి. ఇవికాక పోలీసుశాఖలో 10 వేలు, వైద్య ఆరోగ్యశాఖలో 6 వేల 300, ఇతర శాఖల్లో 5 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులు ఇంకా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి భర్తీ చేయాల్సిన సంఖ్య ఖరారు కానుంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఒ) పరిశీలనలో గత కొద్దిరోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నట్లుగానూ, ఈ భర్తీపై అధికారికంగా నిర్ణయం తీసుకునేందుకు మరికొంతకాలం వేచిచూద్దామన్న ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లుగానూ తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీగురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. అన్నీ రాజకీయం చేయడం తగదేమో. ముఖ్యమంత్రి దీనిపై త్వరగా దృష్టి సారిస్తారని ఆశిద్దాం.

జమ్ముకశ్మీర్‌

కాల్పుల విరమణను ఎత్తేసిన కేంద్రం

జమ్ముకశ్మీర్‌లో ముష్కర మూకలకు కళ్ళెం వేసేందుకు అవసరమైన చర్యలను వీలైనంత త్వరగా తీసుకోవాలని భద్రతా సంస్థలకు కేంద్ర హోంశాఖ సూచించింది. పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్క రించుకుని నెలరోజులపాటు కాల్పులపై విధించిన విరమణను ఎత్తేసింది. రాష్ట్రంలో ఎలాంటి హింస, విధ్వంసకర వాతావరణం నెలకొనకుండా చూడటానికి తాము చేస్తున్న కృషిని కొనసాగిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘శాంతిని కోరుకునే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదులను ఏకాకిని చేయాలి, దారి తప్పిన వారిని శాంతి మార్గంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలి’ అని ఆయన వివరించారు. శాంతిని ప్రేమించే ప్రజల అభీష్టం మేరకే నెలరోజులపాటు కాల్పుల విరమణను విధించామని, దీన్ని భద్రతా బలగాలు పాటించాయని కొనియాడారు. పౌరులు, సైనిక సదుపాయాలపై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నా మన జవాన్లు అసమాన నిగ్రహాన్ని ప్రదర్శించారని ప్రశంసలు కురిపించారు. పాక్‌ పిరికిపంద చర్యల వల్ల ఎందరో అమాయకులు ఉగ్రవాద ఊబిలో దిగి తమ ప్రాణాలను కోల్పోతున్నా రన్నారు. ఇకనైనా పాక్‌ తన కపట నాటకాలకు స్వస్తి పలికి ఉగ్రవాదులకు ఊతమివ్వకుండా పరిపాలనపై దృష్టిని సారించి ప్రజల మన్ననలను పొందాలని హితవు పలికారు.

కర్ణాటక

‘లింగాయత’ మత గుర్తింపుకు తిరస్కారం

ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిపాదించిన ‘లింగాయత’ మత గుర్తింపు అసాధ్యమంటూ ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. కర్ణాటకలో ఈ ప్రతిపాదన రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లింగాయతులను అల్పసంఖ్యాక మతస్థులుగా గుర్తించలేమని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది. 12వ శతాబ్దపు సంఘసంస్కర్త బసవేశ్వరుడి అసలుసిసలైన అనుయాయులం మేమేనని, మమ్మల్ని ప్రత్యేక మతస్థులుగా గుర్తించాలన్న లింగాయతుల వాదనల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పై సిఫార్సులను ఎన్నికలకు ముందు కేంద్రం ముందుంచింది. ఎన్నికలకు ముందు సిద్ధరామయ్య సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి అప్పట్లో మిశ్రమ స్పందన లభించింది. దీనిపై కేంద్రంతో తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించరాదని, మరోమారు లింగాయతులకు అల్పసంఖ్యాక గుర్తింపు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయరాదని కూడా రాష్ట్రప్రభుత్వం తీర్మానించినట్లు విశ్వసనీయ సమాచారం.

కేరళ

తొలగిన నిఫా భయం

గత కొద్దిరోజులుగా కేరళ రాష్ట్రాన్ని వణికించిన నిఫా వైరస్‌ క్రమంగా అంతమొందడంతో ఆ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో పర్యటించాలనుకుంటున్న పర్యాటక ప్రేమికులకు ఈ వార్త నిజంగా సంతోషకరమేనని చెప్పుకోవచ్చు.

ఇటీవల నిఫా వైరస్‌ ప్రబలిన నేపథ్యంలో కేరళలో పర్యటించవద్దంటూ మే 24న ప్రభుత్వం జారీ చేసిన అప్రమత్త సలహాను జూన్‌ 11న ఉపసంహరించుకుంది. గత 21 రోజులుగా ఎవరికీ కొత్తగా వైరస్‌ సోకలేదని, వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చిందని కేరళ ఆరోగ్య కార్యదర్శి రాజీవ్‌ సదానందన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలను కూడా జూన్‌ 12 నుంచి ప్రారంభిం చారు. నిఫా వైరస్‌ భయం తొలగిపోవడంతో ఇప్పటివరకు భయభ్రాంతులైన కేరళ ప్రజలు ప్రభుత్వ అప్రమత్త చర్యలను ప్రశంసిస్తున్నారు.

దిల్లీ

రెండంకెల వృద్ధే లక్ష్యమన్న ప్రధాని

దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్ళ డమే ప్రభుత్వం ముందున్న సవాల్‌ అని, దీనికోసం అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టనున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జూన్‌ 17న దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి అయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవ ఉపన్యాసంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక రంగం ఆరోగ్యకరమైన రీతిలో 7.7 శాతం వృద్ధిని సాధించిందని, దీనిని రెండంకెలకు చేర్చడమే మిగిలి ఉందని చెప్పారు. 2022 నాటికి సరికొత్త భారతావనిని తీర్చిదిద్దడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు అవసరమవుతాయన్నారు. దేశాభివృద్ధిలో చరిత్రాత్మక మార్పులను తెచ్చేందుకు పాలకమండలి ఒక వేదికగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛభారత్‌, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రులతో వేసిన ఉపబృందాలు, ఉప సంఘాలు కీలక భూమిక పోషించి, విధానాల రూపకల్పనకు దోహదపడ్డాయని కొనియాడారు. ఈ బృందాలు చేసిన సిఫార్సుల్ని వివిధ మంత్రిత్వ శాఖలు అమల్లోకి తెస్తున్నాయని చెప్పారు. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలనే ప్రతిపాదనపై సమగ్ర చర్చ అవసరమని మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలవల్ల ఖర్చు తగ్గుతుందని, వనరుల సమర్థ వినియోగానికి వీలుంటుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక నివాసాలు, వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులను వాడాలని రాష్ట్రాలను కోరారు. ఎపి విభజన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఈ సమావేశంలో ప్రధాని హామీ ఇచ్చినట్లు నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

మహారాష్ట్ర

దీర్ఘకాలిక సెలవుపై కొచ్చర్‌

ఐసిఐసిఐ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందాకొచ్చర్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళనున్నారు. వీడియోకాన్‌ గ్రూప్‌కు రుణాలు మంజూరు చేయడంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆమె సెలవులోనే ఉంటారని జూన్‌ 18న సమావేశమైన బోర్డు వెల్లడించింది. కార్పొరేట్‌ పాలన అత్యున్నత ప్రమాణాల మేరకు విచారణ పూర్తయ్యే వరకు సెలవుపై వెళ్ళాలని చందాకొచ్చర్‌ నిర్ణయించి నట్లు ఎక్స్ఛేంజ్‌లకు బ్యాంక్‌ సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయానికి బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంకు బీమా వ్యాపార విభాగం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ సిఇఒ, ఎండిగా ఉన్న సందీప్‌ బక్షిని ఐసిఐసిఐ బ్యాంక్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వాహక అధికారి) గా అయిదేళ్ళ కాలానికి నియమించారు. జూన్‌ 19న ఆయన బాధ్యతలను చేపట్టారు. బ్యాంకు అన్ని వ్యాపారాలు, కార్పొరేట్‌ కార్యకలాపాలను ఆయన నిర్వహిస్తారు. అయితే సిఇఒ, ఎండిగా కొచ్చర్‌ కొనసాగుతారు. ఆమె సెలవులో ఉన్నందున బోర్డుకు సిఒఒ నివేదించాల్సి ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్‌ బోర్డులోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా కొచ్చర్‌ సెలవులో ఉన్నందున బక్షికి నివేదించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.ఎస్‌.కన్నన్‌ను ఐసిఐసిఐ ప్రెడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. ఇందుకు నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం. చందా కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్‌. శ్రీకృష్ణ నేతృత్వంలో అంతర్గత కమిటీని ఐసిఐసిఐ బ్యాంక్‌ గత నెలలో నియమించిన సంగతి తెలిసిందే.

బిహార్‌

మద్య నిషేధంతో మంచి పరిణామాలు

మద్యపాన నిషేధం విధించిన తర్వాత బిహారులో ప్రజలు ఖరీదైన వస్త్రాలమీద ఖర్చు పెట్టడం ఎక్కువైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తేనె, జున్ను స్వీకరించే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. మద్యనిషేధం విధించిన తొలి ఆరు నెలల కాలంలో ఖరీదైన చీరల కొనుగోళ్ళు 1,751 శాతం, తేనె 380 శాతం, జున్ను 200 శాతం పెరిగినట్లు ఆసియా అభివృద్ధి పరిశోధనా సంస్థ (ఎడిఆర్‌ఐ) నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. మద్యనిషేధ అనంతర పరిణామాలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎడిఆర్‌ఐతో పాటు అభివృద్ధి నిర్వహణ సంస్థ (డిఎంఐ)కీ బాధ్యతలను అప్పగించింది. ఒకప్పుడు మద్యంపై ఎడాపెడా ఖర్చు చేసిన జనం ఇప్పుడు ఆ మొత్తాలతో తమ తమ స్థాయిని బట్టి కొత్తకొత్త వస్తువులను సమకూర్చు కుంటున్నారు. బిహారులో 2016లో మద్యనిషేధం విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ మహిళల నుంచి పదేపదే అందిన అభ్యర్థనల నేపథ్యంలో అక్కడ మద్యనిషేధం ప్రకటించారు. అనంతరం అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై నిర్వహించిన అధ్యయన నివేదికను ఆర్థిక సర్వే రిపోర్టుకు అనుసంధానించి బిహారు శాసనసభలో ప్రవేశ పెట్టిన విషయం గమనార్హం. గతంలో దేశం లోని మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా మద్య నిషేధాన్ని అమలుచేసినా తదనంతరం రాబడిపై మోజుతో నిషేధాన్ని ఎత్తేశారు. 2016 బిహారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కూటమి విజయం సాధించడానికి మద్యనిషేధం హామీ ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్‌

హైటెక్‌ మోసగాళ్ళ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ నియామక పరీక్షలో హైటెక్‌ పరికరాలతో కాపీ కొట్టడం, తమకు బదులుగా మరొకరిని పంపడం లాంటి మోసాల్లో అభ్యర్థులకు సహకరించిన 19 మంది హైటెక్‌ మోసగాళ్ళను పోలీసులు జూన్‌ 18న అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిది మందిని అలహాబాద్‌లో, 11 మందిని గోరఖ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 41,520 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 860 కేంద్రాల్లో రెండు రోజులపాటు ఈ పరీక్షను నిర్వహించారు.

దీనిలో కాపీ కొట్టేవారిపై పోలీసుల ప్రత్యేక కార్యదళం (ఎస్‌టిఎఫ్‌) ప్రత్యేకదృష్టి పెట్టినట్లు ఐజి అమితాబ్‌ యాశ్‌ తెలిపారు. పట్టుబడినవారిలో కొందరి దగ్గరనుంచి బ్లూటూత్‌ ఆధారంగా పనిచేసే స్పై మైక్రోఫోన్లు, వినికిడి సాధనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *