‘మీతోనే ఉంటాను సాబ్‌..’

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

‘రావోయ్‌ కలిసి క్రికెట్‌ ఆడుకుందాం’ అడిగాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర మిశ్రా. ఎందుకంటే తన బాడీగార్డ్‌కి క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో అతనికి తెలుసు. ముంబాయి ఇండియన్స్‌ అతని ఫేవరేట్‌ టీమ్‌. సచిన్‌ అంటే ప్రాణం.

‘సర్‌ మనిద్దరిలో ఒకరే ఆడగలం. మీరు ఆడితే నేను కాపలాగా నిలబడతాను. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత’ అని ఆ పోలీసు కానిస్టేబుల్‌ జవాబిచ్చాడు. అతని పేరు జావేద్‌ అహ్మద్‌ దార్‌.

ఏళ్ల తరబడి జావేద్‌ దార్‌, శైలేంద్ర మిశ్రాలు రెండు శరీరాలు.. ఒక్క ఆత్మ.. అయిపోయారు. మిశ్రా తల్లిదండ్రులను జావేద్‌ దార్‌ ‘మమ్మీ, పాపా’ అనే పిలిచేవాడు. మిశ్రా ఎక్కడ, ఏ ఆపరేషన్‌లో ఉన్నాడో తెలుసుకునేందుకు ఆయన తల్లిదండ్రులు ఫోన్‌ చేసేది జావేద్‌ దార్‌కే.

మిశ్రా ఎన్నో సార్లు ‘జావేద్‌ కావాలంటే నిన్ను సురక్షితమైన ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాను. ఉగ్రవాదులతో నిరంతరం పోరాడటంలో నీకు భద్రత లేకుండా పోతోంది. నా ప్రాణానికి ఎలాగో ప్రమాదం ఉంది. నీకేమీ కాకుండా నిన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాను’ అనేవాడు. ‘నహీ సాబ్‌.. మీతోటే ఉంటాను’ ఇదే జావేద్‌ దార్‌ జవాబు.

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసే ఆపరేషన్లలో మిశ్రా ముందుంటే, మిశ్రాను వెన్నంటి ఆయన ప్రాణానికి తన ప్రాణం అడ్డుగా నిలబడ్డాడు జావేద్‌ దార్‌.

2016 ఏప్రిల్‌లో షోపియాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఉగ్రవాదులు నసీర్‌ పండిత్‌, వసీమ్‌ మల్లాలు దాగున్నారని పోలీసులకు తెలిసింది. శైలేంద్ర మిశ్రా వారిని పట్టుకునేందుకు వెళ్లాడు.

ముంబాయి ఇండియన్స్‌ జెండాను చేతపుచ్చుకున్న జావేద్‌ దార్

‘జావేద్‌ దయచేసి ఈ ఆపరేషన్‌లో నువ్వు ఉండొద్దు. నీది షోపియాన్‌. నిన్ను ఉగ్రవాదులు గుర్తు పడతారు. నీ ప్రాణాలకు ప్రమాదం’ అన్నాడు మిశ్రా. కానీ దార్‌ ఒప్పుకోలేదు. మిశ్రాను వెన్నంటే నిలిచాడు. ఎన్‌కౌంటర్‌ జరిగింది జావేద్‌ దార్‌ సొంత ఊళ్లో. ఆ ఊళ్లో అందరూ అతడిని గుర్తు పడతారు. అయినా అతడు ప్రాణాలకు లెక్కచేయ కుండా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు.

ఈ ఏడాది జూన్‌ 6న జావేద్‌ దార్‌ మిశ్రాను సెలవు అడిగాడు. ‘నా తల్లిదండ్రులు హజ్‌ యాత్రకు వెళ్తున్నారు. నేను ఊరికి వెళ్లి వారిని తీసుకొస్తాను. శ్రీనగర్‌లో విమానం ఎక్కిస్తాను. సెలవు కావాలి’

‘జావేద్‌ నువ్వు షోపియాన్‌కు వెళ్లడం ప్రమాదం. నీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదులు ఏమైనా చేయవచ్చు. దయచేసి షోపియాన్‌కు వెళ్లకు. నేను సెలవు ఇవ్వను’ అన్నాడు శైలేంద్ర మిశ్రా. తల్లిదండ్రులను ఇక్కడికి రప్పిద్దాం అన్నాడాయన.

కానీ జావేద్‌ దార్‌ బ్రతిమాలాడు. బలవంత పెట్టాడు. చివరికి సెలవు మంజూరైంది. ‘సరే కూర్చో కలిసి భోజనం చేద్దాం’ అన్నాడు శైలేంద్ర మిశ్రా. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అదే జావేద్‌ లాస్ట్‌ సప్పర్‌ అన్న సంగతి ఎవరికీ తెలియదు.

జావేద్‌ తన అబ్బా జాన్‌, అమ్మీ జాన్‌ కోసం కొన్ని బహుమతులు కొనుక్కున్నాడు. షోపియాన్‌కి బయలుదేరాడు. మధ్య దారిలోనే మాటు వేసిన ఉగ్రవాదులు అతడిని అపహరించుకుపోయారు. ఒక రోజంతా విపరీతంగా గాలించినా జావేద్‌ ఆచూకీ దొరకలేదు. జూన్‌ 7న ప్రాణం లేని జావేద్‌ దార్‌ దొరికాడు. అతని సొంత ఊరు దగ్గరి అడవిలో. ఛాతీపై నాలుగు తూటా గాయాలున్నాయి.

‘మీ నాన్నను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను తల్లీ. నువ్వేం భయపడకు. నేనున్నాను’ అంటూ శైలేంద్ర మిశ్రా అంతకు ముందు రోజే జావేద్‌ కూతురికి మాట ఇచ్చాడు. బతుకంతా జావేద్‌ దార్‌ శైలేంద్ర మిశ్రా ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేశాడు. కానీ తాను మాత్రం జావేద్‌ ప్రాణాలను కాపాడలేకపోయానన్న వేదన మిశ్రాను కలచివేసింది. గుండెలు పిండేసినట్టయింది.

దార్‌ చనిపోయాడని తెలిసిన కొన్ని నిమిషాలకే మిశ్రా ఫేప్‌బుక్‌ ప్రొఫైల్‌ మారిపోయింది. దల్‌ సరస్సు వద్ద తాను నిలబడి ఫోన్‌లో మాట్లాడుతూంటే, వెనుక డేగ కళ్లతో ఆయన్ను కాపాడుకుంటున్న జావేద్‌ దార్‌ నిలుచున్న ఫోటోను ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌గా మార్చుకున్నాడు.

‘చనిపోయింది కానిస్టేబుల్‌ జావేద్‌ దార్‌ కాదు. నా తమ్ముడు జావేద్‌ దార్‌’ అంటాడు శైలేంద్ర మిశ్రా.

కశ్మీర్‌ లోయలో పాకిస్తాన్‌ సరఫరా చేసే తుపాకులతో, ఇస్లాం పేరిట ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక్కో ఉగ్రవాదినీ సవాలు చేసేందుకు ఒక్కో జావేద్‌ దార్‌ ఉన్నాడు. త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేసేందుకు, ఉగ్రవాదులతో పోరాడుతున్న పోలీసులతో పాటు భుజం కలిపి, కదం కలిపి నడిచే జావేద్‌ దార్‌లు ఎందరెందరో ఉన్నారు. వాళ్ల వల్లే ఉగ్రవాదుల గురించిన సమాచారం దొరుకుతోంది. వారి వల్లే ఉగ్రవాదులను భద్రతాదళాలు ఖతం చేయగలుగుతున్నాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ దేశం కోసం జావేద్‌ దార్‌ వంటి వారు పనిచేస్తున్నారు. ఇలాంటి జావేద్‌ దార్‌ల కథలు, గాథలు మిగతా భారతదేశానికి తెలియటం లేదు. తెలియ నివ్వడం లేదు. కానీ ఈ మాయోపాయాల పరదాలను ఛేదించి మరీ కశ్మీర్‌ లోయలోని జావేద్‌ దార్‌లవంటి వారి కథ తెలుసుకోవడం మన కర్తవ్యం.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *