మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

ఒకప్పుడు తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు చైనా చొచ్చుకురావడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. నిర్లిప్త ధోరణిని వదిలి ఇప్పటికైనా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన మాల్దీవులను రక్షించేందుకు భారత్‌ ప్రయత్నించాలి. వడ్డీ లేని అప్పులను ఇవ్వడం ద్వారా చైనా అప్పుల ఊబి నుండి బయటపడేందుకు ఆ దేశానికి సహకరించాలి. అలాగే మాల్దీవులలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు, ఆ దేశంతో సత్సంబంధాల మెరుగుదలకూ ప్రయత్నించాలి.

దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, మాల్దీవులలో ప్రభుత్వాలు మారిపోయాయి. నిరంకుశ అబ్దుల్లా యామీన్‌ అబ్దుల్‌ గయుమ్‌కు మాల్దీవ్‌ ప్రజలు వీడ్కోలు పలికారు. విపక్షాల సంకీర్ణ కూటమి మాల్దీవు డెమొక్రాటిక్‌ పార్టీ (ఎండిపి) నాయకుడు ఇబ్రహిం మహమ్మద్‌ సోలిహ్‌ నేతత్వంలో ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ కూటమి మొత్తం పోలైన 89.22శాతం ఓట్లలో 58.1శాతం ఓట్లు కైవసం చేసుకుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు బయటకు రావడంతో ఓటింగ్‌ సమయాన్ని మూడు గంటలు పెంచవలసివచ్చింది.

భారత భూభాగం నుండి 700 కిలోమీటర్ల దూరాన హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప సమూహం భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 2013 నుండి ఈ ద్వీపకల్ప దేశం చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. అప్పటి వరకు మాల్దీవ్‌ అనుసరిస్తువచ్చిన ‘భారత్‌ కే ప్రాధాన్యం’ అనే విధానానికి స్వస్తి చెప్పిన యామీన్‌ పిడివాద ఇస్లాంకి మద్దతు తెలపడమేకాక చైనా బెల్ట్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌లో చేరేందుకు అంగీకరించారు. దీనితో తన ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును కోల్పోవడమే కాక మాల్దీవ్‌లు పీకలోతు అప్పుల్లో కూరుకు పోయాయి. మాల్దీవ్‌లు క్రమంగా ప్రజాస్వామ్య విలువలకు దూరం కావడమే కాకుండా ఫిబ్రవరిలో యామీన్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పూర్తిగా నిరంకుశ పాలనలోకి వెళ్లిపోయింది. పార్లమెంట్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోయాయి. మాజీ అధ్యక్షుడిని తీవ్రవాద ఆరోపణలపై జైల్లో పెట్టారు. ఈ అకృత్యాలను ప్రశ్నించిన సుప్రీంకోర్ట్‌ న్యాయమూర్తులు కూడా కటకటాల పాలయ్యారు. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్ప కూలడం, యామీన్‌ నిరంకుశ పాలకుడిగా అవతరించడం పట్ల భారత్‌ ఆందోళన చెందింది. పరిపాలన వ్యవస్థపై పట్టు బిగించిన యామీన్‌ చివరికి ప్రతిపక్షనేతలు ఎవరూ ఎన్నికల్లో పాల్గొన కుండా ఎన్నిక కమిషన్‌ ద్వారా నిషేధం విధించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మాల్దీవులలో ఎన్నికలు జరగడం, అందులో యామీన్‌ చిత్తుగా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించాయి.

ఎన్నికల ఫలితాలు రావడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఫిబ్రవరి నుంచి మాల్దీవ్‌లతో దౌత్య సంబంధాలు క్షీణించాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేసి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని కోరడంతో ఆగ్రహించిన మాల్దీవ్‌ పాలకులు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పారు. లాము, అడ్డుల్లో ఉంచిన భారతీయ వాయుసేనకు చెందిన అధునాతన హెలికాప్టర్లను వెంటనే ఉపసంహరించు కోవాలని జూన్‌లో మాల్దీవ్‌లు కోరింది. అంతేకాదు 26 మంది నావికాదళ సిబ్బంది వీసాలను పొడిగించడానికి కూడా నిరాకరించింది. మాల్దీవ్‌ల్లో ఉద్యోగాలు లభించినా ఫిబ్రవరి నుంచి అక్కడి ప్రభుత్వం భారతీయులకు వర్క్‌ పర్మిట్‌లు జారీ చేయడం లేదు. అప్పుడే చైనాతో బెల్ట్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి దారులు వేస్తూ యామీన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మాల్దీవ్‌, చైనాల మధ్య స్నేహసంబంధాలను తెలుపుతూ యామీన్‌ ప్రభుత్వం పెద్దయెత్తున సంబరాలు కూడా నిర్వహించింది. మాల్దీవ్‌లలో రాజ్యాంగ సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పుడు సైనిక జోక్యం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్‌ ప్రయత్నించకూడదని చైనా అధికారిక పత్రిక ది గ్లోబల్‌ టైమ్స్‌ హెచ్చరించింది. వెంటనే మాల్దీవ్‌లలో తమ ప్రయోజనాలు కాపాడు కునేందుకంటూ తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన 11 నౌకలను ప్రవేశపెట్టింది. 2011 వరకు మాల్దీవ్‌లలో కనీసం దౌత్య కార్యాలయం కూడా లేని చైనా హఠాత్తుగా మాల్దీవ్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేకాక వ్యూహాత్మక మైన వాణిజ్య మార్గాలను పూర్తిగా చేజిక్కించుకోవడం ద్వారా భారత్‌ను దిగ్బంధం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇలా తన ప్రాబల్యాన్ని తగ్గించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు, పొరుగున ఉన్న దేశాల్లో జోక్యం కూడా భారత్‌కు ఆందోళన కలిగించాయి. విపక్షానికి చెందిన నేతలను నిర్బంధించడం వంటి యామీన్‌ చర్యలు భారత్‌కు అసంతృప్తిని కలిగించాయి. చాలాకాలంగా మాల్దీవ్‌లకు రక్షణ కవచాన్ని అందిస్తున్న భారత్‌ రాజ్యాంగ సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశంలో సైనిక జోక్యం చేసుకోవాలని ప్రయత్నించలేదు. ఓపికగా వేచి చూసింది. ఈ సహనం ఫలితాలను చూపిస్తోంది. మాల్దీవ్‌లలో భారత్‌ అనుకూల నాయకత్వం మళ్ళీ అధికారం చేపట్టింది.

ఎన్నికల ఫలితాలను మాల్దీవ్‌ ఎన్నికల సంఘం ప్రకటించకుండానే భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మాల్దీవులలో మూడవ సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రాధమిక సమాచారం ప్రకారం ఇబ్రహీం సాలిహ్‌ ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఈ విజయానికి మహమ్మద్‌ సోలిహ్‌కు శుభాకాంక్షలు తెలుపు తున్నాము. ఎన్నికల ఫలితాలను ఆ దేశపు ఎన్నికల సంఘం త్వరగా ప్రకటిస్తుందని భావిస్తున్నాము. ఈ ఎన్నిక మాల్దీవ్‌లలో ప్రజాస్వామ్య శక్తుల విజయాన్నే కాక ప్రజస్వామ్యం, చట్టబద్ధతల పట్ల దేశ ప్రజానీకపు శ్రద్ధను కూడా తెలుపుతుంది. ‘పొరుగువారితో సఖ్యం’ అనే మా విధానాన్ని అనుసరించి మాల్దీవ్‌లతో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము’ అని తన ప్రకటనలో పేర్కొంది. యామీన్‌ పరాజయంతో కంగుతున్న చైనా ఆలస్యంగా ప్రతిస్పందించింది. ‘మాల్దీవ్‌ ప్రభుత్వం తమ విధానాన్ని కొనసాగిస్తూ ఇక్కడ చైనా కార్యకలాపాలకు తగిన వాతావరణాన్ని, పరిస్థితులను సృష్టిస్తుందని భావిస్తున్నాం’ అంటూ తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇటీవల శ్రీలంక, మలేసియాల్లో జరిగిన ఎన్నికల మాదిరిగానే మాల్దీవ్‌ ఎన్నికల్లో కూడా చైనా అప్పుల ఊబి ప్రధాన ఎన్నికల అంశం అయింది. చైనాతో సంబంధాలను పెట్టుకున్న కొద్ది కాలంలోనే శ్రీలంక, మలేసియా, మాల్దీవ్‌లు అప్పుల ఊబిలో కూరుకు పోయాయి. పెట్టుబడులు వచ్చిపడుతున్నా, వాటితోపాటు పెద్దయెత్తున చైనా పర్యాటకులు, కార్మికులు ఆ దేశాలను ముంచెత్తడం స్థానికంగా అసంతృప్తికి, ఆందోళనకు కారణమైంది. మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, వాణిజ్య రంగాల్లో పెరుగు తున్న చైనా పట్టు చివరికి తమను అప్పుల ఊబిలోకి దింపుతుందని విధాన నిర్ణేతలు సందేహాలు వ్యక్తం చేశారు. చైనాతో ఒప్పందాలను సమీక్షించడం, భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడం వంటి ఎన్నికల హామీలతో మహమ్మద్‌ విజయం సాధించారు.

యామీన్‌ పరాజయంతో భారత్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నా, చైనా పట్టు నుండి తప్పించుకోవడం మాల్దీవ్‌లకు కష్టమైన పనే. ఇలాగే చైనా పెట్టు బడులను సమీక్షిస్తామని చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆ పని చేయలేకపోగా కీలకమైన హంబంటోట పోర్ట్‌ను 99 సంవత్సరాలకుగాను చైనాకు లీజుకిచ్చారు. మరోవైపు మలేసియా మాత్రం చైనా పెట్టుబడుల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగింది. ప్రధానిగా తిరిగి పగ్గాలు చేపట్టిన మహతిర్‌ మహమ్మద్‌ 22 బిలియన్‌ డాలర్ల విలువచేసే చైనా ప్రాజెక్టులను రద్దు చేయడమేకాక చైనాకు రాయితీలు ఇచ్చిన నజీబ్‌ ప్రభుత్వంపై విచారణకు ఆదేశించారు. మలేసియా అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోకుండా మహతిర్‌ కాపాడగలిగారు. అయితే చైనాతో బలమైన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తామని ప్రకటించారు.

పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన మాల్దీవ్‌లు 1.3 బిలియన్‌ డాలర్ల అప్పు చైనా నుండి తీసుకుంది. ఈ మొత్తం ఆ దేశపు స్థూల జాతీయా దాయంలో 25 శాతం. అలాగే మొత్తం విదేశీ అప్పుల్లో 70 శాతం. దేశపు ఎక్కువభాగం ఆదాయం చైనా అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. జనావాసం లేని ఫెధూ ఫినోలు దీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 50 ఏళ్లకు చైనాకు లీజుకు ఇచ్చింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మూలంగా మాల్దీవ్‌ ఇప్పుడు పూర్తిగా చైనా చేతిలో చిక్కుకుంది. చైనా అప్పుల వల్ల తిప్పలు తప్పవని గ్రహించినప్పటికీ ఏ దేశమూ పూర్తిగా చైనాతో తెగతెంపులు చేసుకునే స్థితిలో లేదు.

బలహీనమైన సామాజిక, రాజకీయ వ్యవస్థలు కలిగిన చిన్న దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టడం కష్టమేనని చాలామంది భావించారు. కానీ ఇటీవల మాల్దీవ్‌లలో జరిగిన ఎన్నికలు ఆ సందేహాలను కొంతవరకు దూరం చేశాయి. నిరంకుశ పాలనను పక్కనపెట్టి ప్రజాస్వామ్య యుతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడంలో మాల్దీవ్‌ ప్రజానీకం చూపిన ఆసక్తి, శ్రద్ధ అందరి దృష్టిని ఆకర్షించింది.

మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వాన్ని కూడా బుట్టలో వేసుకునేందుకు అప్పుడే చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ‘మార్కెట్‌ సూత్రాలకు అనుగు ణంగా, మాల్దీవ్‌ సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, కంపెనీలు స్థాపించాలని చైనా భావిస్తోంది’ అంటూ కొత్త పాత అందుకుంది. ఆ విధంగా కొత్త ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. శ్రీలంకలో రాజపక్సే హయాంలో విపరీతంగా చైనా పెట్టుబడులు పెరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం కావడాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ సందేహాలను తొలగించే దిశలో ఇటీవల సిరిసేనకు చైనా 2 బిలియన్‌ డాలర్ల నిధులు అందజేసింది. వాటిని తమకు తోచిన ప్రాజెక్ట్‌లలో వాడుకోవలసిందిగా ఉదారంగా ప్రకటించింది. అంతేకాదు సిరిసేన నియోజకవర్గమైన పోలోన్నరువలో దక్షిణాసియాలోనే అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని నిర్మించి ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. చైనా ఇచ్చిన ఈ తాయిలాలతో సంతోషపడిపోయిన సిరిసేన దేశంలో ప్రజానీక మందరికి ఇళ్లు నిర్మించే పనిని చైనాకు అప్పగించారు. ఇలా బహుమతులు, తాయిలాలతో ప్రభుత్వాలను లొంగదీసుకోవడం, మంచి చేసుకోవడంలో చైనా మంచి ప్రావీణ్యత సాధించింది. మాల్దీవ్‌లలో కూడా యామీన్‌ తన పరాజయాన్ని ఇప్పటివరకు అంగీకరించకపోవడం చూస్తే అధికార బదలాయింపు సజావుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

ఒకప్పుడు తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు చైనా చొచ్చుకురావడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. నిర్లిప్త ధోరణిని వదిలి ఇప్పటికైనా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన మాల్దీవులను బయటకు తెచ్చేందుకు భారత్‌ ప్రయత్నించాలి. వడ్డీ లేని అప్పులను ఇవ్వడం ద్వారా చైనా అప్పుల ఊబి నుండి బయటపడేందుకు ఆ దేశానికి సహకరించాలి. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు సహాయం అందించాలి. సౌదీ అరేబియాలోని పిడివాద ముస్లిం సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్న యామీన్‌ ప్రభుత్వం వహాబీ/సలాఫి పంథాలకు తమ దేశంలో ప్రోత్సాహమిచ్చారు. దీనివల్ల విదేశీ శక్తుల ప్రాబల్యం ఎక్కువైంది. మాల్దీవ్‌ సైన్యంపై పాకిస్తాన్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మాల్దీవ్‌ల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని తృష్టిలో పెట్టుకుంటే అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినడం, చైనా జోక్యం పెరగడం వంటివి మొత్తం ఈ ప్రాంతపు శాంతికి, భద్రతకు ముప్పు. కనుక భారత్‌ మరింత చురుకుగా వ్యవహరించి మాల్దీవ్‌లతో సత్సంబంధాలను మెరుగుపరుచు కునేందుకు ప్రయత్నించాలి.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *