యువ కథానాయకుల వివాదాస్పద ప్రకటనలు

యువ కథానాయకుల వివాదాస్పద ప్రకటనలు

చలనచిత్రసీమ చాలా చిత్రమైంది! సినిమా విడుదలకు ఓ రోజు ముందే నిర్మాతలు సూపర్‌ డూపర్‌ హిట్‌, స్మాషింగ్‌ హిట్‌, ఎపిక్‌ హిట్‌ వంటి పోస్టర్స్‌ను పబ్లిసిటీ కోసం సిద్ధం చేసి పెట్టుకుంటారు. ప్రేక్షకాదరణతో నిమిత్తం లేకుండా వాటిని సినిమా విడుదలైన మర్నాడే వాడేస్తుంటారు. ఇక స్టార్‌ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలైతే, అంతకు ముందు తొలిరోజు వసూళ్లను దృష్టిలో పెట్టుకుని దానిని మించి తమ సినిమాకు ఓపెనింగ్స్‌ వచ్చాయని ఊదరకొడుతుంటారు. ఇందులో చాలా వరకూ అవాస్తవాలే అని ఆడియెన్స్‌కు తెలుసు. ఇక ఫిల్మ్‌ట్రేడ్‌ వర్గాలు అసలు వీటిని లెక్కలోకే తీసుకోవు. ఇదంతా పబ్లిసిటీలో బాగమే అని భావిస్తాయి. కానీ సాధారణ ప్రేక్షకులు, సోషల్‌ మీడియాను అంతగా ఫాలో కాని వారు మాత్రం క్రేజీ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకునో లేదా ఏదో ఒక సినిమా చూడాలి కదా! అనో సదరు సినిమాలను చూస్తుంటారు. సినిమా ఫ్లాప్‌ అయిందని తెలిసినా మరికొందరు నిర్మాతలైతే, తమ రాబోయే చిత్రానికి ఉపయోగపడుతుందనో లేదా దింపుడు కళ్లెం ఆశ లాగానో అవసరానికి మించి పబ్లిసిటీ చేస్తారు. హీరోలు సైతం సక్సెస్‌ మీట్‌లో తమ సినిమా అదిరిపోయిందంటూ జబ్బలు చరుచుకుంటారు. అయితే… సినిమా మీద అతి ప్రేమ, విజయం పట్ల అతి నమ్మకం ఒక్కోసారి వారిని నకారాత్మక ఫలితాన్ని అంగీకరించకుండా చేస్తుంటుంది. ఆ ప్రభావంతో చేసే ప్రకటనలు వివాదాలకు దారితీస్తుంటాయి. అయితే ఇలా చేసే ప్రకటనలు కూడా రెండు రకాలుగా ఉంటున్నాయి. యువ కథానాయకులు చేసే ఈ ప్రకటనలు ఇటు సాధారణ ప్రేక్షకుడిని, అటు దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఉదాహరణకు ఇటీవల విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్‌’ అనే సినిమాలోని బూతులు వినలేక చాలా మంది చెవులు మూసుకున్నారు. అదే మాటను థియేటర్‌ బయట కూడా చెప్పారు. కానీ ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన సదరు హీరో కమ్‌ ప్రొడ్యూసర్స్‌కు ఈ విమర్శలు రుచించలేదు. తమ చిత్రాన్ని కావాలని చంపేస్తున్నారంటూ రెచ్చి పోయారు. విమర్శకులను దుర్భాషలాడుతూ, సోషల్‌ మీడియా వేదికగా బూతు పురాణం లంకించు కున్నారు. డబ్బులు పెట్టి సినిమా చూసినవాడు తన భావాలను చెప్పడం కూడా తప్పే అన్నట్టుగా మారి పోయింది పరిస్థితి. అయితే… సదరు హీరోగారికి తన చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధించిందో నాలుగు రోజులు ఓపిక పడితే తెలిసిపోతుంది.

మరికొందరు కథానాయకులు ఎంచక్కా తమకు రావాల్సిన పారితోషికాన్ని తీసుకుని, సినిమాలో నటించి, అది ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి తమ బాధను, ఆక్రోశాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. ఇటీవల అల్లు శిరీష్‌ అదే పని చేశారు. ‘ఏబీసీడీ’ సినిమాలో నటించి, దాని సక్సెస్‌ మీట్‌లోనూ మాట్లాడి, ఆ తర్వాత తన సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ ట్విట్టర్‌లో సన్నాయి నొక్కులు నొక్కాడు. చిత్రమేమంటే అటు ‘ఫలక్‌నుమా దాస్‌’, ఇటు ‘ఏబీసీడీ’ రెండూ మలయాళ రీమేక్సే. వీటిని తెలుగు వారికి నచ్చే విధంగా తెరకెక్కించ డంలో దర్శకులు విఫలమయ్యారన్నదీ వాస్తవమే! కానీ నచ్చలేదన్న ప్రేక్షకుల్ని, విమర్శించి ‘ఫలక్‌నుమా దాస్‌’ హీరో ఎలాంటి తప్పు చేశాడో, ‘ఏబీసీడీ’ సినిమా థియేటర్లలో ఉండగానే ఇది ఆశించిన స్థాయిలో లేదని ప్రకటించి శిరీష్‌కూడా అలాంటి తప్పే చేశాడు.

అయితే.. తన సినిమా ఫ్లాప్‌ అయిందని నిజాయితీగా ఒప్పుకున్న హీరోని తప్పు పట్టడం ఎంత వరకూ కరెక్ట్‌ అనే సందేహంకూడా కొందరికి వస్తుంది. కోట్లు ఖర్చు చేసి సినిమా తీసిన నిర్మాత ఏదో రకంగా తన డబ్బులు వెనక్కి రావాలని కోరుకుంటాడు. అలానే దానిని కొనుక్కున్న బయ్యర్‌ నాలుగు వారాలు సినిమా థియేటర్లలో ఆడాలని ఆశిస్తాడు. కానీ హీరోలు విడుదలైన వెంటనే ఇలా స్పందించడంతో వచ్చే నాలుగు డబ్బులు రావన్నది వారి వాదన. ఇదే పరిస్థితి రామ్‌ చరణ్‌ ‘వినయ విధేయ రామ’ సినిమా సమయంలో చేశాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యిందని విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రకటించాడు. ఇక విజయ్‌ దేవరకొండ అయితే… తనదైన స్టైలో తన సినిమా ‘ఏ మంత్రం వేశావే’ను నా ఐదేళ్ల నాటి బ్యాక్‌లాగ్‌ అంటూ డిజోన్‌ చేసుకున్నాడు. ఆమధ్య ‘మిఠాయి’ సినిమా విడుదల కాగానే నటుడు రాహుల్‌ రామకృష్ణ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక నాని అయితే… ఆ మధ్య ‘కృష్ణార్జున యుద్ధం’ సూపర్‌హిట్‌ అంటూ ఓ ప్రైవేట్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ చేసిన ప్రచారాన్ని కామెడీగా తప్పుపట్టాడు. ‘సూపర్‌ హిట్‌ కాలేదు… కనీసం ఆడలేదు’ అని చెప్పేశాడు. ఇలా హీరోలు చేసే ప్రకటనల వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లడం ఖాయం. దానికి బదులు ఇలా తమ అసంతృప్తిని బయటపెట్టే కంటే సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలకు పారితోషికంలో కొంత వెనక్కి ఇస్తే బాగుంటుందేమో! అలానే తమ సినిమా కొని నష్టపోయిన బయ్యర్లను ఆదుకుంటే మంచిది. నిజానికి ఒక సినిమా తీసిన తర్వాత ఫలితాన్ని ప్రేక్షకులకు వదిలి ముందుకు వెళ్లిపోవడం అన్నింటి కంటే ఉత్తమం. అన్ని కోట్లు వసూలు చేసింది, ఇన్ని కోట్లు వసూలు చేసిందని ఊదరగొట్టడానికి, ఫ్లాప్‌ సినిమాను సైతం సక్సెస్‌ మూవీలా ప్రమోట్‌ చేసుకోవడానికి ప్రయత్నించకుండా, ప్రేక్షకుల తిరస్కారాన్ని గౌరవంగా స్వీకరించడానికి మన హీరోలు, దర్శక నిర్మాతలు మానసికంగా సిద్ధపడితే… చిత్రసీమకు దానితోపాటు ప్రేక్షకులకు మనశ్శాంతిగా ఉంటుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *