వైయస్‌ఆర్‌ను స్మరింపచేసిన ‘యాత్ర’

వైయస్‌ఆర్‌ను స్మరింపచేసిన ‘యాత్ర’

కాంగ్రెస్‌ పార్టీలో రాణించడం అంటే వైకుంఠపాళి ఆట ఆడటం లాంటిది! పైకి తీసుకెళ్లే నిచ్చెనలే కాదు… ఆ పక్కనే తోటి నేతలే పాముల్లా కాటేసి, కిందకి తోసేస్తుంటారు. సర్కస్‌ను తలపించే ఆ పార్టీలో నెగ్గుకురావాలంటే పాలిట్రిక్స్‌ ప్లే చేయాల్సిందే. ఒకానొక సమయంలో నలుగురిలో నారాయణ అనిపించుకున్న వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలను చేతికి అందుకుని, తనదైన ముద్ర వేశారు. ఆ క్రమంలో చేసిందే పాదయాత్ర. అదే ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన విజయయాత్రకు సోపానమైంది. ఆ పాదయాత్ర నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యాత్ర’. గతంలో ‘పాఠశాల, ఆనందోబ్రహ్మా’ చిత్రాలను రూపొందించిన మహి వి రాఘవ ఈ సినిమాను తెరకెక్కించారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.

సావిత్రి, ఎన్టీయార్‌ బయోపిక్స్‌ తెరకెక్కిన నేపథ్యంలో ‘యాత్ర’ కూడా రావడం చర్చనీయాంశ మైంది. అయితే… ముందు ఇద్దరికీ సినిమా నేపథ్యం ఉండటం వల్ల వారి చిత్రాలను చూడటానికి జనం ఆసక్తిని చూపిస్తారు కానీ రాజకీయ నేత బయోపిక్‌ను చూడటానికి ప్రేక్షకులు ముందుకొస్తారా అనే సందేహం కొంత లేకపోలేదు. కానీ చేసిన ప్రయత్నంలో లోపం లేకుండా, నిజాయితీతో మహి వి రాఘవ ఈ సినిమా రూపొందించారు. మమ్ముట్టిని వైయస్‌ఆర్‌ పాత్రకు ఎంపిక చేయడంలోనే దర్శకుడి అభిరుచి ఏమిటనేది తెలిసి పోయింది. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి (బాహుబలి -2 ఫేమ్‌), సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, వైయస్‌ఆర్‌ ఆత్మగా చెప్పుకునే కె.వి.పి. రామచంద్రరావుగా రావు రమేశ్‌ నటించారు. వై.యస్‌.ఆర్‌. ఒకసారి మాట ఇస్తే ఇక వెనుదిరిగి చూసుకోరనే అంశంతోనే సినిమా మొదలవుతుంది. గౌరు చరితారెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ నిమిత్తం వైయస్‌ఆర్‌ను సాయం కోరడం, ఆమె కుటుంబం గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్నా, ఇంటికొచ్చి సాయం కోరిన మహిళకు బాసటగా నిలవాలనుకున్న వైయస్‌ఆర్‌ కృతనిశ్చయాన్ని తొలిసన్నివేశంలోనే ఎస్టాబ్లిష్‌ చేశాడు దర్శకుడు. తన వారికోసం, ఇచ్చిన మాట కోసం వైయస్‌ఆర్‌ ఎంతవరకైనా వెళతారనే అభిప్రాయాన్ని సాధారణ ప్రేక్షకుడిలోనూ కలిగించాడు. అక్కడ నుండీ అధిష్ఠానంతో రాజశేఖర్‌ రెడ్డి జరిపిన పోరు, తీసుకున్న ఒంటరి నిర్ణయాలు, స్నేహం కోసం పదవులను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడటం వంటి అంశాలను చూపించారు. అలానే కేవలం పదవుల కోసం రాజకీయాలు చేయడం కాకుండా, ప్రజలకోసం ఏదైనా చేస్తేనే వారు తనను విశ్వసిస్తారనే నమ్మకం రాజశేఖర్‌ రెడ్డికి కలిగిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పును చక్కగా తెరపై ఆవిష్కరించారు. పేరుకు ఇది పాదయాత్రకు సంబంధించిన సినిమానే అయినా… వైయస్‌ఆర్‌ ఆశయమైన ముఖ్యమంత్రి పీఠం ఆయన పాదాక్రాంతం ఎలా అయ్యిందన్నదే ఇందులో ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఆ పదవిని పొందడానికి ఆయన కొన్ని సందర్భాలలో తనలోని ఆవేశకావేశాలను ఎలా తగ్గించుకున్నారనేదీ బాగానే చూపించారు. తన వారికి మాత్రమే కాకుండా, తన దగ్గర ఉండే వారికీ సమాన ప్రాధాన్యం రాజశేఖర్‌రెడ్డి ఎలా ఇచ్చేవారో తెలిపారు. దాంతో ‘యాత్ర’ సినిమా ఓ మహానేత, ఓ మహా మనిషి జీవితగాథగా మారిపోయింది. సీతారామ శాస్త్రి, పెంచలదాసు రాసిన పాటలు, కె కృష్ణ కుమార్‌ సమకూర్చిన సంగీతం, సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. మమ్ముట్టి.. రాజశేఖర్‌ రెడ్డిలా అభినయించకుండా తనదైన పంథాలో ఆ పాత్రను పోషించారు. దాంతో మరింత నిండుతనం వచ్చింది. అలానే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పడం కూడా అభినందించదగ్గదే.

సహజంగా బయోపిక్‌ అంటే ఓ మనిషిలోని బలం, బలహీనత రెండూ చూపగలగాలి. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో అదే చేశారు. కానీ ఎన్టీయార్‌, వైయస్‌ఆర్‌ బయోపిక్స్‌ దగ్గరకు వచ్చేసరికీ రాజకీయాలు ఇందులో మిళితం కావడం, ప్రజలను ఆకట్టుకుని, తద్వారా వారి అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలని అనుకోవడంతో ఆయా వ్యక్తులలోని మంచిని మాత్రమే తెరకెక్కించారు. దాంతో ఈ రెండు సినిమాలు అత్యధికుల ఆదరణ పొందే ఆస్కారాన్ని కోల్పోయాయి. ఎన్టీయార్‌ బయోపిక్‌ ఆయన అభిమానులను సైతం మెప్పించ లేకపోయింది. దానితో పోల్చితే ‘యాత్ర’ ఎంతో మెరుగైన సినిమా. వైయస్‌ఆర్‌ చేపట్టిన పథకాలు బడుగు, బలహీన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వాటిని తీసుకు రావడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అనేది సినిమాలో స్పష్టంగా చూపించారు. ఆయా సన్నివేశాల చిత్రీకరణ కూడా హృదయానికి హత్తుకునేలా ఉండటంతో లబ్ధిదారుల కళ్లలో నీళ్లు తెప్పించేలా చేశాడు దర్శకుడు. అలానే చంద్రబాబు గొంతునూ ఓ సమయంలో సందర్భానుసారంగా వినిపింపచేసి, జగన్‌ అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు.

రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాను తీశామని దర్శక నిర్మాతలు ఎంత చెప్పినా, ఎన్నికల ముందు వచ్చిన ఈ ‘యాత్ర’ వైయస్‌ఆర్‌ అభిమానుల గుండెలను కచ్చితంగా తట్టిలేపుతుంది. ఆ విషయంలో వారు కృతకృత్యులయ్యారు. ఇక కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుందనేది వేచి చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *