గురి కుదిరింది !

గురి కుదిరింది !

భారత షూటింగ్‌కు మంచిరోజులొచ్చాయి. ఖేలో ఇండియా పుణ్యమా అని మన యువ షూటర్లు ప్రపంచ రికార్డుల మోత మోగిస్తూ టోక్యో ఒలింపిక్స్‌కి బెర్త్‌లు ఖాయం చేసుకుంటూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

మ్యూనిచ్‌ వేదికగా ముగిసిన 2019 ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత షూటర్లు రికార్డుల వర్షం కురిపించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌లో రాహీ సర్నోబట్‌ మొత్తం 37 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో టోక్యో ఒలింపి క్స్‌లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. ఆసియా క్రీడల 25 మీటర్ల షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన భారత తొలిమహిళగా చరిత్ర సష్టించిన రాహీ ప్రపంచకప్‌ షూటింగ్‌లో సైతం సత్తా చాటింది.

ఖేలో ఇండియా పథకం ద్వారా వెలుగులోకి వచ్చిన సౌరవ్‌ చౌదరి 16 ఏళ్ల చిరుప్రాయంలోనే ఏషియాడ్‌ స్వర్ణ విజేతగా చరిత్ర సష్టించాడు. ఇండోనేషియాలోని పాలెమ్‌బాంగ్‌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల షూటింగ్‌ 10 మీటర్ల ఏర్‌ పిస్టల్‌ విభాగంలో బంగారు పతకం సాధించాడు. 240.7 పాయింట్లతో ఆసియాక్రీడల విజేతగా నిలిచాడు. అంతేకాదు.. ఆసియా క్రీడల షూటింగ్‌ చరిత్రలో బంగారు పతకం సాధించిన భారత ఐదో షూటర్‌గా సౌరవ్‌ రికార్డుల్లో చేరాడు. మ్యూనిచ్‌ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచకప్‌ షూటింగ్‌ పురుషుల 10 మీటర్ల ఏర్‌ పిస్టల్‌లో సైతం సౌరవ్‌ చౌదరి మొత్తం 246.3 పాయింట్లు సాధించి.. ప్రపంచ సీనియర్‌, జూనియర్‌ రికార్డులను తిరగరాశాడు.

ఆసియా క్రీడల్లో మాత్రమే కాదు.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో సైతం అంచనాలకు మించి రాణించిన భారత టీనేజ్‌ షూటర్లలో హర్యానాకు చెందిన అనీశ్‌ భాన్‌వాలే, మను బాకర్‌ ముందుగా కనిపిస్తారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదిక ముగిసిన 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ పురుషుల 25 మీటర్ల పిస్టల్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ విభాగంలో అనీశ్‌ కేవలం 15 ఏళ్లకే బంగారు పతకం సాధించాడు. 2017 ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ పోటీలలో రెండు చొప్పున స్వర్ణ, రజత పతకాలు సాధించిన అరుదైన రికార్డు అనీశ్‌కు మాత్రమే సొంతం.

గోల్డ్‌కోస్ట్‌ వేదికగా గత ఏడాది ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన మనుబాకర్‌కు 16 ఏళ్లే. హర్యానాలోని జాజ్జర్‌ జిల్లా గోరియా గ్రామంలో జన్మించిన మనుకు బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. బాక్సింగ్‌, టెన్నిస్‌, స్కేటింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో పతకాలు సాధించిన మను..ఆ తర్వాత షూటింగ్‌ వైపు తన దష్టిని మళ్లించింది. గాడల్‌జరాలో ముగిసిన ప్రపంచ షూటింగ్‌ పోటీల టీమ్‌, వ్యక్తిగత విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా భారత సీనియర్‌ షూటింగ్‌ జట్టులోకి దూసుకొచ్చింది.

కేంద్ర మాజీ క్రీడల మంత్రి, బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకంతోనే భారత షూటింగ్‌లో సరికొత్త శకం ప్రారంభమయ్యింది. భారత షూటర్లకు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉందని రాజ్యవర్థన్‌ చాటి చెప్పాడు.

ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో రాజ్యవర్థన్‌సింగ్‌ రజత వర్థనుడుగా మారితే.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ పురుషుల 10 మీటర్ల ఏయిర్‌ రైఫిల్‌ విభాగంలో అభినవ్‌ బింద్రా ఏకంగా స్వర్ణ పతకం సాధించి భారత షూటింగ్‌ ప్రతిష్టను బంగారు స్థాయికి తీసుకెళ్లాడు. హైదరాబాద్‌ నుంచి భారత షూటింగ్‌లోకి దూసుకొచ్చిన గగన్‌ నారంగ్‌ సైతం మన దేశ షూటింగ్‌ ఖ్యాతిని ఎంతగానో పెంచాడు.

భారత మహిళా షూటర్లు సైతం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. నాటితరంలో అంజలీ భాగవత్‌ దేశానికి గర్వకారణంగా నిలిస్తే నేటితరంలో రాహీ సర్నోబట్‌, హీనా సిద్ధు, అపూర్వీ చండీలా, మనూబాకర్‌ లాంటి మెరుపు షూటర్లు బంగారు గురితో గోల్డెన్‌ షూటర్లుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

మెక్సికోలో గతేడాది ముగిసిన 2018 ప్రపంచకప్‌ సీనియర్‌ షూటింగ్‌లో భారత టీనేజ్‌ షూటర్‌ మనుబాకర్‌ జంట స్వర్ణాలతో సంచలనం సష్టించింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే సీనియర్‌ ప్రపంచకప్‌లో బంగారు పతకం సాధించిన భారత తొలి షూటర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించింది. 10 మీటర్ల ఏర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మను మిక్సిడ్‌ విభాగంలో ప్రకాశ్‌తో జంటగా మరో బంగారు పతకం అందుకొంది. ఈమె షూటింగ్‌ నేర్చుకోడం మొదలు పెట్టిన రెండేళ్లకే ప్రపంచ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం విశేషం. తిరువనంతపురం వేదికగా గత ఏడాది ముగిసిన 61వ జాతీయ సీనియర్‌ షూటింగ్‌ పోటీల్లో సీనియర్‌ చాంపియన్‌ హీనా సిద్ధును కంగు తినిపించడం ద్వారా అంతర్జాతీయ షూటర్‌గా గుర్తింపు సంపాదించింది. జాతీయ షూటింగ్‌లో మను తొమ్మిది స్వర్ణాలతో సహా మొత్తం 15 పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది.

వీరంతా ఇదే జోరు కొనసాగిస్తే టోక్యో ఒలింపిక్స్‌లో సైతం బంగారు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు!

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *