విడాకులు

విడాకులు

”యథాప్రకారం సిద్ధిరస్తు” అన్నట్లు ప్రతిరోజు లాగే ఆరోజూ టిఫిన్‌ తినేసి లంచ్‌బాక్సులతో పిల్లలు కాలేజీకి, కొడుకు షాపుకి, కోడలు ఆఫీసుకి వెళ్లిపోయారు.

”ఇంకా ఎప్పుడు నాకు టిఫిన్‌ పెట్టేది? కడుపులో ఎలుకలు పరుగెడ్తున్నాయి.” అన్నట్లు వంటగదివైపు ఆకలి చూపులు విసిరాడు విశ్వనాథం.

వస్తున్నా… తెస్తున్నా… అన్నట్లు మందహాసం చేస్తూ భర్త ముందు టిఫిన్‌ ప్లేటు, మంచినీళ్ల గ్లాసు పెట్టింది శారద.

ప్లేటులోకి చూసిన విశ్వనాథం కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలోకి విసుగు వరదలా తోసుకొచ్చింది.

”నీకెన్నిసార్లు చెప్పాను శారదా.. నాకీవయసులో గారెలూ, వడలూ వంటివి అరగట్లేదని.. చక్కగా ఇడ్లీలో, దోసెలో వెయ్యచ్చు గదా” అన్నాడు చిరాకుని గొంతులో అదిమిపెట్టి.

”వెయ్యచ్చు.. ఎందుకు వెయ్యకూడదూ.. ఇడ్లీలో దోసెలో వేస్తే మొత్తం మీరూ, నేను మాత్రమే తినాలి. మిగతా వాళ్లకు పనికిరావు. అసలే మోకాళ్ల నొప్పులు, నీరసంతో పని చెయ్యలేకపోతున్నాను. ఇక వాళ్లకొకరకం చాకిరీ ఎక్కడ చెయ్యను…? ఈ పూటకి ఇవి తినండి ప్లీజ్‌…” అన్నది శారద, ”ఉఫ్‌”మని నిట్టూర్చి కుర్చీలో కూలబడుతూ.

భార్యవైపు జాలిగా చూస్తూ ”నిన్నంత చాకిరీ ఎవరు చెయ్యమన్నారు? హాయిగా వంటమనిషిని పెట్టుకోమంటే వినవు.” అన్నాడు విశ్వనాథం, అల్లం చట్నీతో గారెలు తింటూ, కరకరలాడుతూ కమ్మగా ఉన్నాయని మనసులో అనుకుంటూ.

”ఆఁ ఆఁ ఆ వైభోగమూ అనుభవించాముగా రెండేళ్లు… సమయానికి రాక కొన్నాళ్లూ… వచ్చినా ఆమెగారు చేసినవి మీకెవరికీ నచ్చక మరికొన్నాళ్లూ ఎన్ని అవస్థలు పడ్డామో మీకు తెలియనిదా?” అన్నది శారద ఆయింట్‌ మెంట్‌ మోకాళ్లకు రాసుకుంటూ.

”ఇంతకీ నువ్వు టిఫిన్‌ తిన్నావా…?” ఖాళీ ప్లేటు సింకులో వేసివస్తూ అడిగాడు విశ్వనాథం.

”ఎక్కడా? ఇంకా పని తెమలందే?”

”అయ్యో.. పాపిష్టి వాణ్ణి. నువ్వు తిన్నావో లేదో అని అడగకుండానే నేను తినేశాను. వెధవ ఆకలి. జ్ఞానాన్ని చంపేస్తుంది. ఉండు.. నీకు నేను తెస్తాను” అంటూ వంటగదిలోకి వెళ్లబోయాడు.

”ఎటూ ఈ చేతులు కడుక్కోవాలిగా… నేను తెచ్చుకుంటాలెండి.”

”వద్దు. నువ్వు లేవకు.. కాసేపు రెస్ట్‌ తీసుకో. నేను నీకు నోట్లో పెడతాను.

”చాల్లే ఊరుకోండి. మీ సరసం!”

”సరసమా నీ మొహమా…? సరసమాడుకున్నట్లే ఉంది మన సంబడం.. ఇంట్లో ఎవరూ లేరు కదా.. మాట్లాడకుండా తిను”.

”చిన్నపిల్లకు పెట్టినట్లు భర్త తనకు కొసరి కొసరి తిన్పిస్తుంటే కళ్లు చెమ్మగిల్లాయి శారదకు. అసంకల్పి తంగా ఆమె మనసు గతంలోకి పరుగుతీసింది.

****

”విశ్వనాథంగారి పచారీ షాపంటే ఆ ఊళ్లో చాలా ప్రసిద్ధి. సరుకుల నాణ్యతకు, సరసమైన ధరలకు పెట్టిందిపేరు ఆ షాపు.

ప్యాకింగుకు నలుగురూ, గుమాస్తాలు నలుగురూ.. తండ్రీ, కొడుకూ ఇంతమంది పనిచేసినా ఉదయం పది గంటల నుండి, రాత్రి తొమ్మిది గంటల వరకూ ఊపిరాడని వ్యాపారం వాళ్లది.

విశ్వనాథానికి ఒక్కగానొక్క కొడుకు భాస్కర్‌. తన వ్యాపారంలోకి కొడుకునూ దించడం ఆయనకి ఇష్టంలేదు. అతణ్ణి బాగా చదివించి మంచి ఉద్యోగస్తుణ్ణి చెయ్యాలని ఆశపడేవాడు. ఆయనకు చదువంటే వల్లమాలిన అభిమానం. తాను ఉన్నత విద్యావంతుణ్ణి కావాలని కలలు కనేవాడు. కానీ ఆయన తండ్రి అనారోగ్యం వలన విశ్వనాథానికి చిన్న వయసులోనే వ్యాపారం చూసుకోవాల్సిన బాధ్యత భుజానికెక్కింది. కొడుకు విషయంలోనూ ఆయన ఆశలు ఆడియాశలే అయ్యాయి.

మోకాళ్ల పర్వతం ఎక్కినంత భారంగా పదో తరగతి దాటాడు భాస్కర్‌. ఇక ఇంటర్మీడియట్‌ అతని సహనానికి సరిహద్దు పెట్టింది. అందువల్ల ఇకనుంచీ తానూ షాపుకు వస్తాననీ, వ్యాపారం నేర్చుకుంటాననీ తండ్రిని అడిగాడు భాస్కర్‌.

కానీ, విశ్వనాథం ”ఇంకా ప్రయత్నించూ, ఇంకా ప్రయత్నించూ” అంటూ మళ్లీ మళ్లీ పరీక్షకు కట్టించేవాడు. కానీ ఫలితం ఎప్పుడూ గుండ్రం గానే ఉండేది.

ఆఖరికి భాస్కర్‌ ‘చదువు’ అనే బ్రహ్మపదార్థం తన ఒంటికి సరిపడదని గ్రహించాడు. అందువల్ల పుస్తకాలను అటక ఎక్కించి బేవార్సు స్నేహితులను మస్తకంపైకెక్కించుకోవడం ప్రారంభించాడు.

అప్పుడు విశ్వనాథం ఆలోచనలో పడ్డాడు. ఇంకా తాను ఉపేక్షిస్తే కొడుకు రెంటికీ చెడిన రేవడి అయిపోతాడని భయపడి భాస్కర్‌కి వ్యాపార అక్షరాభ్యాసం చేశాడు.

అతి తొందరలోనే భాస్కర్‌ వ్యాపారంలో మనీప్లాంట్‌లా అల్లుకుపోయాడు.

భాస్కర్‌ మంచివాడేగానీ తొందరపాటు మనిషి. పొగరుబోతుతనం కూడా కాస్త ఎక్కువే. గుమాస్తాలను అనవసరంగా విసుక్కోవడం, మహిళా ఉద్యోగులను చిన్నచూపు చూడటం లాంటివి విశ్వనాథానికి నచ్చవు. కొడుకుని మార్చాలని ఎంతగా ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయాడు ఆయన. కానీ, భాస్కర్‌కు తల్లిదండ్రులంటే చాలాప్రేమ. ఒక్కరోజు కూడా వాళ్లకు దూరంగా ఉండేవాడు కాదు.

నల్లేరుపై బండిలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుక్కి పెళ్లి వయస్సు వచ్చిందనీ, చక్కని అమ్మాయిని కోడలిగా తెచ్చుకుని మనవడు, మనవరాలితో అచ్చట్లూ ముచ్చట్లూ తీర్చుకోవాలనీ శారదలో తహతహ మొదలైంది. భాస్కర్‌కు త్వరగా పెళ్లి చేసేద్దామని విశ్వనాథాన్ని పోరుపెట్టడం మొదలుపెట్టింది.

ఆయనకూ అటువంటి ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయిగా.. అందువల్ల మంచి సంబంధం ఉంటే చెప్పమంటూ తెలిసినవారినీ, మ్యారేజి బ్యూరోలనూ అడగసాగాడు.

పెళ్లిచూపులూ, సంప్రదింపులూ లాంటి శ్రమలు ఎవరికీ లేకుండా ”నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను.” అంటూ బాంబు పేల్చినట్లు ఇందుమతిని తల్లిదండ్రులకు చూపించాడు భాస్కర్‌.

ఆమెను చూసిన విశ్వనాథం, శారదలు విస్తు పోయారు. అటువంటి కురూపిని తమ పుత్రరత్నం ఎలా ప్రేమించాడో వీళ్లకు అర్థంకాలేదు. అందుకే అంటారేమో ”తాను వలచింది రంభ.. తాను మునిగింది గంగ” అని అనుకుంటారని.

అంతకంటే విచిత్రం ఏమిటంటే ఇందుమతి రెండు పోస్టు గ్రాడ్యుయేషన్లు చేసిన విద్యావంతురాలు. ఆ చదువుల సరస్వతి తమ మొద్దబ్బాయిని ఎలా ఇష్టపడిందో ఎంత ఆలోచించినా వీళ్లకు అంతు పట్టలేదు.

కోడలి చదువుచూసి ఆనందపడాలో.. ఆమె అనాకారితనం చూసి విచారించాలో విశ్వనాథం, శారదలకు తెలియడంలేదు. ”మనిషి ఎలా ఉంటే ఏముందిలే.. మనసు మంచిదైతే అంతేచాలు..” అనుకుంటూ సరిపెట్టుకున్నారు.

ఏది ఏమైనా వైభవంగా పెళ్లి జరిగిపోయింది. కోడలు కాపురానికి వచ్చింది.

రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో సభ్యుల సంఖ్య పెరిగిందే కానీ, తమ మధ్య మమతల బంధం అల్లుకోవడం లేదని విశ్వనాథం, శారదలకు అన్పించసాగింది. ఇందుమతి ఒక్కసారన్నా వాళ్లను మనసారా ”మామయ్యా, అత్తయ్యా” అంటూ పిల్చేది కాదు. ఎక్కువ సమయం తమ గదిలోనే గడపడం, బయటకు వచ్చినా అత్త మామలతో ముభావంగా ఉండడం చేసేది. వీళ్లు ఎంతగా కలుపు కోవాలని ప్రయత్నిస్తే అంతగా దూరమవటం వీళ్లను మరింత బాధపెట్టేది.

మనసులోని ఆవేదనను కొడుకుతో పంచుకుంటే అతను వీళ్లనే తప్పు పట్టేవాడు. అందువల్ల వీళ్ల వేదన అరణ్యరోధనే అయ్యేది.

వచ్చిన నెలరోజులకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది కొత్త కోడలు.

”మనకు మంచి వ్యాపారం ఉంది. సిరి సంపదలున్నాయి. నువ్వు కష్టపడి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు” అని విశ్వనాథం, శారదలు ఎంత చెప్పినా వినలేదు ఇందుమతి. పెద్ద పేరున్న ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజరుగా ఉద్యోగం సంపాదించింది.

ఉదయం ఎనిమిదింటికి నిద్రలేచి, గంటన్నర కాలాన్ని అలంకరణకు ఖర్చుచేసి, టిఫిన్‌ తిని, లంచ్‌బాక్స్‌ తీసుకుని వెళ్లిపోయేది. సాయంత్రం భర్తతో సినిమాలు.. షికార్లు..! షాపు బాధ్యత విశ్వనాథానికి, ఇంటిపని భారం మొత్తం శారదకు. అదేమని అడగడానికి వీలులేదు. వద్దని చెప్పడానికి ధైర్యం లేదు.

ఒక్కగానొక్క కొడుకు. కోడలితో పొరపొచ్చాలోస్తే వాళ్లకు కోపంవచ్చి అలిగి వేరే వెళ్లిపోతారేమోనని వీళ్లభయం. పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందేమోనని ఆవేదన.

ఇందుమతి పుట్టింటి వాళ్లకు మొరపెట్టుకుంటే.. ”మా అమ్మాయి అమాయకురాలు. దానిమీద లేనిపోని నిందలు వేస్తారా?” అంటూ వీళ్లమీదకే యుద్ధానికి వచ్చారు.

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని భావించి ఎన్ని కష్టాలు, కడగండ్లు దాపురించినా మౌనంగా భరించటం అలవాటు చేసుకున్నారు శారద, విశ్వనాథం.

రోజులు అలా గడుస్తుండగానే మనుమడు ప్రవీణ్‌, మనుమరాలు ప్రియాంక పుట్టడం, పెరగడం జరిగిపోయాయి. కనీసం పిల్లలను కూడా అత్తమామలకు చేరువకానివ్వలేదు ఇందుమతి.

ఇప్పుడు ప్రవీణ్‌ బీటెక్‌, ప్రియాంక ఇంటర్‌ చదువుతున్నారు. ప్రవీణ్‌ తండ్రిని మించినవాడు. ప్రియాంక తల్లినోట్లోంచి ఊడిపడింది.

”అమ్మగారూ.. అంట్లు తోమేశాను. నేను వెళ్తున్నాను. తలుపు వేసుకోండి” పనిమనిషి పిలవడంతో గతంలోంచి బయటపడింది శారద.

****

”నాన్నా… ఆ ఉమాపతికి పదివేలు చందా ఇచ్చావట.. ఎందుకు?” అడిగాడు భాస్కర్‌ తండ్రిని ఆ ఉదయం.

”వాళ్లు పక్కవీధిలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారటరా.. పుస్తక విజ్ఞానం చిన్నా, పెద్దా అందరికీ ఉపయోగపడుతుందని ఇచ్చాను.” అన్నాడు విశ్వనాథం షాపుకి బయలుదేరుతూ.

”ఆఁ ఎందుకు ఆ లైబ్రరీ…? ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదివి ఏడుస్తున్నారనీ? పదివేలు శుద్ధ దండగ” అంటూ వెళ్లిపోయాడు భాస్కర్‌.

విశ్వనాథానికి మనసు చివుక్కుమన్నది. నిన్నగాక మొన్న ఎవరో గుడి కడుతున్నామని వస్తే తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా కొడుకు వాళ్లకు యాభై వేలు చందా ఇచ్చాడు. ఆ వీధిలో అప్పటికే రెండు గుడులున్నాయి. మూడోది అవసరమా…? అన్ని చోట్లా ఉండే దేవుడు ఒక్కడే.. భక్తితో ధ్యానించడం అలవాటు చేసుకోవాలిగానీ గుళ్లు పెంచినంత మాత్రాన ఫలితముంటుందా…?

‘నాకు చెప్పకుండా అంతసొమ్ము దానం చేసి పైగా ఇప్పుడు నన్ను నిలదీస్తున్నాడు. ఇదంతా నా స్వార్జితం. నేనేమి చేసుకున్నా అడిగే హక్కు వీడికిలేదు.’ మనసులో అనుకుంటూ బాధపడ్డాడు విశ్వనాథం. అందుకు భాస్కర్‌ చేసిన గోల అంతా ఇంతా కాదు.

అలాగే అనేక విషయాల్లో తండ్రికీ కొడుక్కీ చుక్కెదురు. అత్తా కోడలూ తూర్పూ పడమర. ఇక మనుమడూ, మనుమరాలూ సరే సరి.. వండిపెట్టినవి శుభ్రంగా తినడం, హాయిగా వెళ్లిపోవడం.. ఇంట్లోనే ఉండే మామ్మా, తాతగార్లతో మాట్లాడటానికి వాళ్లకి ఒక్కక్షణం తీరిక దొరకదు. ఇంటిని వాళ్లొక ¬టల్‌ రూమ్‌లా భావిస్తుంటారు.

****

ఆ రోజు ఉదయం ప్రముఖ దినపత్రికల జిల్లా ఎడిషన్‌లలో ప్రచురితమైన ఒక వార్త ఆ ఊరిలో అనేకమందిని దిగ్భ్రాంతి పరిచింది.

”ప్రముఖ వ్యాపారి విశ్వనాథంగారు భార్యా సమేతంగా అదృశ్యమయ్యారు..” అన్న వార్త అది.

వెతుకులాటలు సాగుతున్నాయి.

అనుమానాలు, సందేహాలు పెరుగుతున్నాయి.

పరామర్శలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఎవరెంత గాలించినా, శోధించినా విశ్వనాథం, శారదల ఆచూకీ దొరకలేదు.

కొన్ని రోజులకు ఫ్రమ్‌ అడ్రస్‌ లేకుండా భాస్కర్‌కు ఉత్తరం ఒకటి వచ్చింది. ఆత్రంగా, ఆరాటంగా చదివాడు.

”నాన్నా భాస్కర్‌…

మమ్మల్ని క్షమించు. నీకు ఈ కష్టం కల్గించక తప్పలేదు. చిన్నప్పటి నుంచీ నువ్వెంత దుడుకుగా ప్రవర్తించినా, నిన్ను దండిస్తే ఎక్కడ మాకు నువ్వు దూరమయిపోతావోనని భయపడ్డామే గానీ, ఇలా మేమే నీకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు.”

”మాకు ఎంత కష్టం కల్గించినా నువ్వు మా బిడ్డవు. ఆ ప్రేమతోనే నీలో మార్పు తేవాలనీ, నీకు మంచి పరివర్తన కలగాలనీ అమ్మా, నేనూ అనేక ప్రయత్నాలు చేశాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాం. కానీ, ‘ఎలుకతోలు తెచ్చి ఎందాక ఉతికినా..’ అన్నట్లు నీలోనూ, నీ భార్యా పిల్లలలోనూ ఏమార్పూ రాలేదు. కానీ, మాలోనే పెద్ద మార్పు వచ్చింది. అదే.. ఒంట్లో ఓపిక, మనసులో ఓర్పు నశించటం.. ఎప్పటికైనా మంచిరోజులొస్తాయన్న ఆశ చచ్చిపోవటం…”

”దానికి కారణం నువ్వు సాగిస్తున్న మద్యపానం, నీ ఆదరణ అమితంగా పొందుతున్న దాని తోబుట్టువులు.. అంతకన్నా ఘోరం నీ అలవాట్లను ఖండించవలసిన నీ భార్య నీకు వత్తాసు పలకడం.. నిన్ను మందలిస్తున్న మాతో దెబ్బలాడటం…”

”రేపు నీ పిల్లలు ఎలా తయారవుతారో… ఆలోచించడానికే భయమేస్తోంది. బాధ కలుగు తోంది.”

”ఇంతకీ నీకు చెప్పవచ్చేదేమిటంటే.. అపాత్రదానం చేయటం నాకూ, మీ అమ్మకూ కూడా ఇష్టంలేదు. అర్థం కాలేదు కదూ.. వివరంగా చెబుతాను.”

”నా శ్రమ, కృషితో మీ తాతగారూ అదే నా తండ్రి ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేశాను. తాతయ్య నాకు ఇచ్చింది మన ఇల్లు మాత్రమే… మనకు మెయిన్‌ బజార్‌లో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ పూర్తిగా నా స్వార్జితం.”

”మామూలుగా అయితే రెండూ నీకే చెందు తాయి. కానీ, నువ్వు అపసవ్యంగా నడుస్తున్నావు. అడ్డదారులు తొక్కుతున్నావు. కాబట్టి మీ తాతయ్య ఇచ్చిన ఇల్లు మాత్రం నీ పిల్లల కోసం ఉంచి నా కష్టార్జితమైన కాంప్లెక్సును అమ్మేశాను.”

”ఆ డబ్బును ఒక వృద్ధాశ్రమానికి దానం చేశాను. అది వృద్ధాశ్రమం మాత్రమే కాదు. అనాథలను అక్కున చేర్చుకునే అనాథాశ్రమం కూడా…”

”ఇక జీవితాంతమూ మీ అమ్మా, నేనూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మేమూ అనాథలమే కనుక. ఎంత ఆస్తి ఉన్నా, అయినవారి ఆదరణ పొందలేనివారు అనాథలే కదా.. మా మరణానంతరం ఉత్తరక్రియలు కూడా వాళ్లే నిర్వహిస్తారు. (కన్న కొడుకే చెయ్యాలని మాకు సెంటిమెంటు లేదు.)

”ఇది ఒకరకంగా మన బంధానికి విడాకులు. మరోరకంగా చూస్తే ఇది మా వానప్రస్థం.”

”ఎంత ఆలోచించినా, మాకు ఈ మార్గం తప్ప మరోమార్గం గోచరించలేదు. గుండెను గట్టిపరచు కోవడానికీ, ఈ మార్గాన్ని అనుసరించడానికీ మాకు ఇంతకాలం పట్టింది.”

”బిడ్డలూ, మనుమలూ అంటూ అనుబంధాలు పెంచుకోవడానికి బాగుంటాయి. కానీ, తుంచు కోవడం అంత తేలికైన విషయం కాదని మా అనుభవం చెప్పింది.”

”లోకమంతా నా వాళ్లే…” అనుకోగలిగినవాడే కదా.. పరిపూర్ణ మానవుడు..! ఆ లక్ష్యం చేరుకోవాలనే మా ఈ ప్రయత్నం.”

”మా గురించి వెతకొద్దు. మమ్మల్ని వెనక్కు తీసుకురావాలనే ప్రయత్నం అసలు చేయవద్దు.”

”నీలో మంచి మార్పు రావాలనీ, మీ నలుగురూ సుఖసంతోషాలతో జీవించాలనీ ఆశిస్తూ, నీ మనసు నొప్పించినందుకు క్షమార్పణలు కోరుకుంటూ… మీ అమ్మా, నాన్న…!”

ఉత్తరం పూర్తిగా చదివిన భాస్కర్‌ బండరాయై పోయాడు.

– కోపూరి పుష్పాదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *