త్రీ ఇడియట్స్‌

త్రీ ఇడియట్స్‌

పరీక్ష హాల్లోంచి నిర్లిప్తంగా బయటికి చూస్తోంది వినీల. నిర్మలాకాశాన్ని చూసి ఆమె ఈర్ష్య పడింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎంత బాగుందో, అనిపించిందామెకు. ఆమె మనసులోని బరువును నిదర్శిస్తున్నట్టు నిండు కుండలు మోసుకెళ్తున్నారు కొందరు స్త్రీలు. వాళ్లు, ఊరి బయట ఉన్న తన కాలేజీకి దగ్గర ఉన్న పల్లెల వాళ్లు. ఎండాకాలమంటే తనకి పరీక్షల కాలం. వాళ్లకేమో నీటి ఎద్దడి కాలం. ఏటేటా వాళ్లు ఈ పని చేస్తూంటారు. పాపం, ఎంత కష్టపడుతున్నారో! వాళ్లు పడేది ఓ రకమైన కష్టమైతే తను పడేది మరొక రకం.

*   *   *

తను చిన్నప్పటి నుండి ఓ పుస్తకాల పురుగు. అందులోనూ ఆ పుస్తకం ఆశయాలకి సంబంధిస్తే మరీ ప్రాణం. ఆ ఊపులో చాలామంది మహాను భావుల గురించి చదివి, వాళ్ల ఆశయాలను తనలో ఇనుమడించుకుంది. రాజారామ మోహనరాయ్‌, మహాత్మాగాంధీ, ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌, ఆచార్య వినోబాభావే వంటి గొప్ప వారి ఆశయాత్మ పూనింది గనుక తను చదివిన చదువు సార్థకం చేయడం కోసం దేశం కోసం పాటు పడదామని అనుకుంది. కానీ, ఆమె తల్లిదండ్రులు పడనిస్తారా! లేదే. సగటు మనుషుల్లా ఆమె అమెరికా వెళ్లి డాలర్లలో సంపాదించి వారికి పుత్రికోత్సాహాన్ని కలిగిస్తుందని ఆశపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆమె ఆశయం గురించి విన్న తరువాత కూడా ఎలా ఇలా ఉన్నారో అని!

ఎవరెలా ఉన్నా వినీల స్థిరమైన బుద్ధిగల అమ్మాయి. నదులలో మైక్రో ఆనకట్టలు కట్టాలన్నా, భూకంపాన్ని అధిగమించే కట్టడాలు కట్టాలన్నా, ఆఖరుకి కుళాయి ద్వారా మంచినీళ్లు సరఫరా చేయడానికైనా, చేయూతనిచ్చేది సివిల్‌ ఇంజనీరింగే కదా! అందుకే, ముందస్తు ఆలోచనతో ఆమె సివిల్‌ ఇంజనీరింగ్‌ని ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకూ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంది కూడా! తన తల్లిదండ్రులు తనని అల్లారుముద్దుగా పెంచారు సరే, అందుకనీ ఆశయాన్ని దూరం చేసుకోవాలా? ఎంత బాగా చదువుకున్నా ఈ సందిగ్ధం ఆమెను సలుపుతోంది. ఏం చేయాలో తోచని దుస్థితి.. బెల్‌ మ్రోగడంతో మళ్లీ పరీక్ష హాల్లోకి వచ్చింది వినీల మనస్సు. కుండలు మోసే వాళ్లని వేరే గదుల్లోంచి తన స్నేహితురాళ్లైన ఆశయ, మహిజ చూసి, తమ తమ బాధ్యతలని నెమరు వేసుకున్నారని ఆమె గుర్తించలేదు.

*   *   *

”అప్పుడే అయిపోయిందా?” అని ఆశ్చర్యంగా అడిగారు ఇన్విజిలేటర్‌. ఆశయ తన సమాధాన పత్రం అప్పజెప్పుతూ, ”ఈ లోగా నేను వెళ్తానంటే వెళ్లనివ్వరని…”, నవ్వుతూ జవాబిచ్చింది. ”అదేమిటమ్మా! ఇదివరలో నువ్వెప్పుడూ ఆఖరు నిమిషం దాకా పేపర్ల మీద పేపర్లు తీసుకుని, పరీక్షలో నిమగ్నమయ్యేదానివి కదా!” అన్నారు ఇన్విజిలేటర్‌.

”లేదు సార్‌, భవిష్యత్తులో ఏ దారిలో వెళ్లాలో తెలుసుకున్నాను. ఆ ఆనందంతో వెళ్లిపోతున్నాను” అని ఆశయ నిష్క్రమించింది.

*   *   *

”అమ్మా, నాకు చాలా కష్టమైన పేపర్‌ బాగా వ్రాశాను” సంతోషంగా ఇంటికొచ్చి ప్రకటించింది మహిజ. ”పోనీలేవే, దేవుడు దయ చూపాడు” అంది ఆమె తల్లి. ”దేవుడు మంచి స్నేహితురాళ్లని ఇచ్చి దయ చూపాడు” అనీ, ”నా ఫ్రెండ్స్‌ వినీల, ఆశయ లేరూ.. వాళ్లు భలే బాగా చదువుతారని నీకు తెలుసుకదా! వాళ్లు వారం రోజులుగా ఈ పేపర్‌ నా చేత చదివించీ, చదివించీ.. అదరగొట్టేలా రాయించారు. ఆ గొప్పదనం వాళ్లదే” అంది. ”మీ నాన్నే ఉంటే…” అని చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది ఆమె తల్లి. ”దేవుడి లెక్కలు దేవుడివే! జరిగిన దాన్ని మరచిపోలేము. కానీ ఆయన దయామయుడమ్మా! అందుకే, నాన్నని తీసుకుని వెళ్లే ఉద్దేశం ఉన్నా, నా చదువు చివరి సంవత్సరంలో తీసుకుని వెళ్లాడు. తమ్ముడు ఈ సంవత్సరం ఇంటరుకొచ్చేపాటికి, నా చదువు పూర్తయ్యేలా చేశాడు. నేను సంపాదిస్తాను గనుక, మనిల్లు మనకుంది గనుక, వాడి చదువుకి ఎటువంటి లోటూ ఉండదు. నేను ఇంటర్నల్స్‌లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్న సబ్జెక్ట్‌లో నాకు శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు ఫ్రెండ్స్‌ దొరికారు. దేవుడు కష్టం కలిగించినా దాన్ని అధిగమించడానికి దారి కూడా చూపించాడు. ఇంకేం కావాలమ్మా?” అంది తల్లి బుగ్గలు పీకుతూ. ”ఏమిటో, దీనికి బాధొచ్చినా, సంతోషమొచ్చినా పట్టలేం కదా!” అనుకుంది తల్లి.

”నువ్వో పెద్ద ఆఫీసర్‌ కావాలని కలలుగనే దానివి కదా! మరి సివిల్స్‌ ప్రయత్నిస్తావా?” అని మహిజను అడిగితే, ”ఓ.. ఆ ఆశయం సంగతా? నా ఆశయం నువ్వనుకున్నట్టు కాదు… రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో గెలిచి, ప్రభుత్వ అధికారిణిని కావాలని.. సివిల్స్‌ రాస్తే ఐఏఎస్‌ వస్తుందో లేదో కదమ్మా! వచ్చినా ఏ రాష్ట్రానికి వేస్తారో తెలియదు కదమ్మా! అందుకే సివిల్స్‌ వద్దు… గ్రూప్‌-1 పరీక్షలు ఎప్పుడు పెడితే అప్పుడు చూద్దాం. అప్పుడు మన రాష్ట్ర ప్రజలకే సేవలు చేసుకోవచ్చు. ఈ లోగా ఓ ప్రైవేటు ఉద్యోగం చూసుకుంటా” అని గెంతుకుంటూ ఇల్లంతా తిరిగింది మహిజ. ”అవునోసే, మీ ఫ్రెండ్స్‌ నీ బ్రాంచ్‌ కాదు కదా, మరి స్పెషలైజేషన్‌ పేపర్‌ ఎలా చెప్పారూ?” అడిగిందామె. ”అదా, వాళ్లు త్రీ ఇడియట్స్‌ సినిమాలో అమీర్‌ఖాన్‌ లాంటి వాళ్లు. అన్ని సబ్జెక్ట్స్‌లోను వాళ్లకి పాండిత్యముంది… చూస్తూ ఉండు, ఓ రోజు వాళ్ల గురించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎడిసన్‌… ఆ రేంజ్‌లో వింటావు.” ముగించింది ఆశయ. ”ఇది చెప్పేది నిజమో, కాదో.. దేవుడా నువ్వే దీన్ని కాపాడు” అని మనసులోనే దణ్ణం పెట్టుకుంది మహిజ తల్లి.

*   *   *

”గోడలతో మాట్లాడే అలవాటు నాకు లేదు. బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావేమిటి? ఎలా చివరి పరీక్షలో ఫెయిల్‌ అయ్యావు? అందులోనూ బండి సున్నా ! ఆఖరి సంవత్సరం అంటే అంత లోకువా?” అని తన పాటికి తను ఆశయని తిడుతోంది వాళ్లమ్మ. ఇటు ఎటువంటి చలనమూ లేదు. ”ఆశయా, చెవుడా ఏం? నిమ్మకు నీరెత్తినట్టు, నోరు మెదపవేమే? ఇంత చదువూ వెలగబెట్టి ఈ యేడు తప్పావేమిటీ?” అని కొనసాగించింది. ”నాకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందిగా” అని నెమ్మదిగా అంది ఆశయ. ”నాకు బుర్ర లేదను కుంటున్నావా? బీటెక్‌ పాస్‌ అయితేనే ఉద్యోగమని నాకు తెలియదా?” కోపంగా అంది వాళ్లమ్మ. ”మరి మీరు నన్ను ఉద్యోగం చేయనిచ్చేవారా?” అడిగింది ఆశయ. ”ఓసీ ఈ అనుమానం వల్ల పరీక్ష పోయిందా? ముందరే అడిగుంటే నీ ఉద్యోగానికి గండం లేదని చెప్పుండేదాన్నిగా!” అంది వాళ్లమ్మ. ”మరి ఈ పెళ్లి ఏమిటి?” అడిగింది ఆశయ గుర్రుగా చూస్తూ. ”ఇంకా కుదరలేదుగా!” అంది వాళ్లమ్మ, చాలా చిన్న విషయాన్ని తీసి పారేస్తున్నట్టు. పుండు మీద కారం జల్లినట్టు అనిపించింది ఆశయకి. ఉక్రోషంతో మండిపడింది. ”అంటే, కుదిరితే, మెడ వంచి పీటల మీద కూర్చోబెట్టెయ్యడమే! మీ కూతురికి ఓ మనసుంటుందనీ, దానిలో కొన్ని కోరికలుంటా యని ఆలోచించరా? అన్యాయం కదమ్మా! నేను చదువుకుని, ఉద్యోగం చేసి, స్వతంత్రంగా బతికి, ఏవో ఆశయాలు సాధిద్దామనుకున్నాను. మీరేమో నన్ను బానిసని చేద్దామనుకుంటున్నారు. అందుకే, ఫెయిల్‌ అవడానికి నిశ్చయించాను” చెప్పింది ఆశయ. ”పెళ్లైనంత మాత్రాన బానిసలవుతారా? తప్పు తప్పు.. నా సంగతే తీసుకో! మీ నాన్న నన్ను పువ్వుల్లో పెట్టి ..” అని ఇంకా ఏదో చెప్పబోతే, ఆమెను ఆపి ”కూడూ, గూడూ, గుడ్డ మాత్రమే సరిపోవమ్మా జీవితాన్ని వెళ్లబుచ్చడానికి. ఓ సంతోషం, ఆనందం ఉన్నాయా నీ జీవితంలో? నీకు సంగీతమంటే ఇష్టం కదా! నాన్నకి ఇష్టం లేదని కూనిరాగాలు కూడా మానేశావ్‌. నేను చెడు తిరుగుళ్లు తిరగను. అలాగని నా చిన్న చిన్న సరదాలు మరొకళ్ల ఇష్టానికి అంకితం చెయ్యలేను” అని నిక్కచ్చిగా చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

*   *   *

కొన్నాళ్లకి వినీల, ఆశయ కలిసి తమ పరీక్షల ఫలితాల వైఫల్యాన్ని చర్చించుకున్నారు. ఆశయ గోడు విన్న వినీల, ”సేమ్‌ పించ్‌. నేను కూడా ఢాం”, అని ప్రకటించింది. ఆశ్చర్యపోయిన ఆశయ కేసి నవ్వుతూ చూసి, ”నాదీ స్వయంకతమే! నేను దేశసేవ చెయ్యాలని సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతూంటే, మా వాళ్లు నన్ను యూఎస్‌ తరిమేద్దామని చూశారు. అందుకే ప్రశ్నపత్రాన్ని రాసిచ్చేశా!” అంది వినీల. ”నేనైతే కోరా కాగజ్‌. నా జీవితాన్ని నేను స్వర్ణాక్ష రాలతో లిఖించుకోవాలంటే ఈ పరీక్షలో ఖాళీ పేపర్‌ ఇవ్వక తప్పలేదు. స్వతంత్రంగా బతికి, నలుగురు ఆడవాళ్లకి మేలు చేసి, వాళ్లు మరికొంతమందికి మేలు చేసేలా చేస్తే, ఈ జన్మ ధన్యమైనట్టే!” అంది ఆశయ. ”ఎస్‌! నేను దేశసేవ చెయ్యాలనుకుంటున్నా. నువ్వేమో ఆడవాళ్లకి మేలు చెయ్యాలనుకుంటున్నావు. మనమిద్దరం కలిసి ఆడవాళ్లకు సేవచేసి, అలా దేశసేవ చేద్దామా?” ఉత్సాహంగా అడిగింది వినీల. ”ఓ వావ్‌.. నాకు ఈ ఆలోచన రానేలేదు సుమా! ఓకే. కానీ ఏం చేద్దాం?” అడిగింది ఆశయ. కాసేపు ఆలోచనలో పడి, భ్రుకుటి ముడి పెట్టి ”దొరికింది. ఐడియా దొరికింది. మన కాలేజీ దగ్గర ఉండే చెరువులో నీళ్లు పట్టి, కుండలను నెత్తిమీద పెట్టుకుని వెళ్తారే, ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్లు… ఆ లేడీస్‌ కోసం ఏమైనా చేద్దామా?” అడిగింది వినీల. ”వండర్‌ఫుల్‌ వినీ, వై నాట్‌? ముందు మనం ప్లాన్స్‌ గీసుకుని, ఆ తరువాత మిగిలిన విషయాలు-అంటే ఫండింగ్‌, పర్మిట్లు, వగైరా-చూసుకోవచ్చు. ఏమంటావ్‌?” అడిగింది ఆశయ. ఇద్దరూ ఆనందంగా హై-ఫై ఇచ్చుకున్నారు.

*   *   *

వారిద్దరూ ఓ ఆరు నెలలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత, ఆ చెరువు నుండి పల్లెలకి నీరు సరఫరా చేసే పని సాధ్యమవుతుందని తేలింది. ‘స్వదేశ్‌’ సినిమాలో చూపినట్లు తక్కువ ఖర్చుతో వసతులు చేసుకోవచ్చు. మరి డబ్బులు ఎలా? అయినా, అంత పెట్టుబడి ఎవరు పెడతారు? తమకు తల్లిదండ్రులు అయిష్టంగానైనా తిండయితే పెడుతున్నారు గానీ, పెట్టుబడి ఎందుకు పెడతారు? అక్కడా ఇక్కడా బ్యాంకు రుణాల కోసం ప్రయత్నిస్తే మొండిచెయ్యి ఎదురైంది. ”అన్ని గ్యారంటీలూ చూపించి, మమ్మల్ని నమ్మించిన వాళ్లే మాకు పంగనామాలు పెట్టి విదేశాలు చెక్కేస్తుంటే, తాడూ- బొంగరం లేని మిమ్మల్ని ఎలా నమ్మగలం?” అనే జవాబులేని ప్రశ్న షరా మామూలైపోయింది.

అలా ఒక ఏడాది గడిచాక వాళ్లకి ‘స్టార్టప్‌ ఇండియా’ అనే ప్రభుత్వ పథకం గురించి తెలిసింది. ఉత్సాహంగా నిబంధనలన్నీ చదివారు వాళ్లిద్దరూ. ”మీకు కొత్త ఆలోచనలుంటే వాటిని సాకారం చేయడానికి మేం సహకరిస్తాం… ఆహాఁ” అని వినీల. ”మీ సంస్థ పెట్టి ఏడు సంవత్సరాలు దాటలేదు కదా… అంటే మనం ఒక సంస్థ పెట్టాలన్న మాట” అంది ఆశయ. ఇలా చదువుతూ ఒక చోటుకొచ్చి గతుక్కుమన్నారు ఇద్దరూ. ”లాభార్జనకి ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయా? ఇదేమిటి? మనం సేవ చేద్దామనుకుంటే, వీళ్లు లాభాల గురించి అడుగుతున్నారు! చచ్చాం, ఇది వీలయ్యే పని కాదు. ప్చ్‌’, అని పెదవి విరిచింది వినీల. కొన్నాళ్లు ఇలాగే గడిచిపోయాయి.

*   *   *

రాష్ట్ర గ్రూప్‌-1 ప్రకటన వచ్చింది. మిత్ర ధర్మాన్ని అనుసరించి వినీల, ఆశయ మహిజను ప్రోత్సహించారు. వాళ్ల ఆశలకు తగ్గట్టే ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యింది. ఆమె అటు శిక్షణకి వెళ్లగానే, మళ్లీ వీళ్లిద్దరూ సంఘసేవ ఎలా చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. మామూలు పద్ధతిలో చేసే ఆలోచనలు పని చెయ్యడం లేదు కదా అని మరోవిధంగా ప్రయత్నిద్దామనుకుని, వాళ్లు పల్లెలలో మంచినీటి సరఫరా మీద ఉన్న వార్తలు, పరిశోధనా పత్రాలు, ప్రపంచ బ్యాంకు బ్లాగు వగైరాలు చదవ సాగారు. అప్పుడు ఒక పద్ధతి గురించి అవగాహన ఏర్పడింది వాళ్లకి.

*   *   *

ఆ తరువాత, కొన్ని నెలలపాటు ఆ పల్లె ప్రజలకు నీటి వనరులు ఎలా తగ్గిపోతున్నాయో, వాటిని సంరక్షించుకోవడం ఎంత ముఖ్యమో, నీరు లోతులలో తప్ప దొరకకపోవడానికి కారణాలు చెప్పి క్రమేపి వాళ్లని మానసికంగా తయారుచేశారు. ప్రొద్దున్నే పల్లెకు వచ్చి, ఇల్లిల్లూ తిరిగి ప్రజలలో జాగృతిని కలిగించారు. ఆ తరువాత ప్రజలతో కలిసి పంచాయతీ సభ్యులను కలిసి, ప్రజలు మంచినీటి సరఫరాకి బాధ్యత వహిస్తారని- అంటే కాపు కాసి, ఆ నీటిని వ్యర్థమవకుండా చూస్తారని- చెరువు నుండి ఊరికి వచ్చే పైపులు కాలుష్యాన్ని కలిగించకుండా దఢమైనవే వాడతారని చెప్పారు. ”మరి విద్యుత్‌ సంగతో?” అడిగారు పెద్దలు. అప్పుడు ఆశయ ముందుకొచ్చి, ”సౌర విద్యుత్‌ వాడదామండీ. దీనివల్ల ఊరికి రెండు ఉపయోగాలుంటాయి. ఒకటి, ఈ రకమైన విద్యుత్‌ వాడితే, ప్రభుత్వం వారు రాయితీ ఇస్తారు. రెండు, ఊరి అవసరాలకి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ని ఆ విభాగం వారు కొనుగోలు చేసి, ఊరికి డబ్బిస్తారు. పైగా, ఊళ్లో ఎక్కువ సేపు విద్యుత్‌ ఉంటుంది. దాని వల్ల బోలెడు లాభాలుంటాయి. ఇది ఒక సామాజిక పెట్టుబడి అన్నమాట” అంది, తనకు తన సబ్జెక్ట్‌ మీద ఉన్న పట్టుతో. ”సరే, మేం డబ్బులు కేటాయిస్తాం కానీ బాధ్యత అంతా మీదే! సకాలంలో పూర్తి చెయ్యాల్సిన బాధ్యత కూడా” అన్నారు అధ్యక్షులు.

*   *   *

సామూహిక శ్రమదానంతో పని చురుకుగా సాగింది. కొనుగోలు చేసే స్వేచ్ఛ వీళ్లకి ఉంది గనుక మంచి నాణ్యత గల పరికరాలని ఎంచుకున్నారు. నిధులు సకాలంలో అందేలా మహిజ సహాయ పడింది. మొత్తానికి అనుకున్న పని.. అనుకున్న గడువుకంటే ముందుగానే పూర్తయ్యింది. ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాక, ఒక శుభదినాన, ఊళ్లో అందరికంటే పెద్దావిడ చేత సరఫరాను ప్రారంభం చేయించారు వాళ్లు. కరతాళ ధ్వనుల మధ్య అందరూ ఈ అమ్మాయిల కషిని మెచ్చు కున్నారు.

*   *   *

ఒక ఏడాది తరువాత, సామాజిక సేవకు గానూ.. వినీల, ఆశయలకు పురస్కారం, వారికి సహాయం చేసినందుకు మహిజకి మెచ్చుకోలు లభించాయి. పురస్కారాన్ని ప్రదానం చేస్తూ, ”మన మధ్య ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఒక ఎడిసన్‌ ఉన్నారంటే అది అతిశయోక్తికాదు” అన్నారు ప్రదాత. దాన్ని అందుకుంటూ వాళ్లు వినమ్రంగా ”మేం చేసింది వాళ్ల బాధ్యతని ఊరి వాళ్లకు గుర్తు చెయ్యడమే” అన్నారు.

– డా|| చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *